క్వీన్ ఎలిజబెత్ చారిత్రక వారసత్వంపై ఆఫ్రికాలో భిన్నాభిప్రాయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నోమ్సా మసేకో
- హోదా, బీబీసీ న్యూస్, జొహెనెస్‌బర్గ్
క్వీన్ ఎలిజబెత్ II మరణం పట్ల ప్రపంచ నేతల నుంచీ, ప్రజల నుంచీ ఏకరీతిలో పెద్ద ఎత్తున హృదయపూర్వక నివాళులు, విచారాలు వెల్లువెత్తాయి.
ఒకప్పుడు బ్రిటన్ వలస పాలనలో ఉన్న దేశాలు.. రాణి జ్ఞాపకాలను బాహాటంగా గౌరవించాయి. ఇంకొన్ని దేశాలు రాణి తమ దేశాలను సందర్శించినప్పటి ఫొటోలను షేర్ చేశాయి.
కానీ రాణి ఎలిజబెత్‌ను శ్లాఘించటం సర్వత్రా ఏకగ్రీవంగా లేదు. ఆమె మరణం కొందరికి రక్తసిక్త వలస పాలన చరిత్రను తిరిగి రాజేసింది. ఆదివాసీ ప్రజల మీద అకృత్యాలు, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి విగ్రహాలు, కళాఖండాల దోపిడీ, దక్షిణాఫ్రికా నుంచి ఇండియా నుంచి బంగారం, వజ్రాల దొంగతనం, బానిసత్వం, అణచివేత.. అన్నీ గుర్తుతెస్తున్నాయి.
రాణి ఎలిజబెత్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, ప్రపంచమంతటా చాలా మంది ఆమెను గుర్తుపెట్టుకుంటారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అభివర్ణించారు. అయితే.. రాణి మరణం పట్ల సంతాపం పాటించే వారిలో తాము ఉండబోమని ప్రతిపక్ష ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) చెప్పింది.
''ప్రపంచమంతటా బ్రిటన్, ఆమె కుటుంబం పాల్పడిన నేరాలను రాణిగా 70 ఏళ్ల పాలనా కాలంలో ఆమె ఎన్నడూ గుర్తించలేదు. నిజానికి అకృత్యాలను గర్వంగా నిలబెట్టారామె'' అని దేశంలో మూడో అతి పెద్ద పార్టీ అయిన ఈఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో విమర్శించింది.
''మాకు ఆమె మరణం.. ఈ దేశంలో, ఆఫ్రికా చరిత్రలో ఓ అతి విషాద కాలాన్ని గుర్తుతెస్తుంది'' అని పేర్కొంది.
సోషల్ మీడియాలో విమర్శకులు మరో అడుగు ముందుకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
నైజీరియాలో జన్మించిన అమెరికా ప్రొఫెసర్ ఉజు అన్య.. రాణి మరణానికి కొద్ది గంటల ముందు పోస్టు చేసిన ట్వీట్లు వాడి చర్చను రేకెత్తించాయి.
ఒక ట్వీట్‌ను తన నిబంధనలు అతిక్రమిస్తోందంటూ ట్విటర్ తొలగించింది. రెండో ట్వీట్‌లో.. ''నా కుటుంబం సగాన్ని ఊచకోత కోసి, నిరాశ్రయులు చేసిన జాతిహననాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వానికి పర్యవేక్షకురాలిగా ఉన్న ఓ సామ్రాజ్ఞి పట్ల నేను ఏవగింపు తప్ప ఇంకేమైనా వ్యక్తీకరించాలని ఎవరైనా ఆశించినట్లయితే.. వారు అలా ఆశిస్తూనే ఉండొచ్చు'' అని రాశారు.
ఆమె ట్వీట్ 1960ల నాటి బియాఫ్రాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆనాడు.. స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ బియాఫ్రా వేర్పాటువాదులను దిగ్బంధించి, ఆకలితో అలమటించేలా చేసి, చివరికి అణచివేసిన నైజారియా ప్రభుత్వానికి.. బ్రిటన్ ప్రభుత్వం మద్దతిచ్చి, ఆయుధాలను సమకూర్చింది.
అయితే.. ఆమె ట్వీట్‌కు ఒక యూజర్ @ParrenEssential బదులిస్తూ.. నైజీరియన్లు ఇలా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. ''మన సంస్కృతికి, మన దేశానికి మీరు తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు'' అన్నారు.
ఒక వ్యక్తిని సదరు వ్యక్తి మరణ సమయంలో విమర్శించటం ''ఆఫ్రికా సంస్కృతి కాదు'' అని ఇంకొందరు స్పందించారు.
దక్షిణాఫ్రికాలో 1905లో తవ్వకాల్లో దొరికిన 'స్టార్ ఆఫ్ ఆఫ్రికా' వజ్రం ఇప్పుడు బ్రిటిష్ కిరీట ఆభరణాల్లో ఉంది. దానిని తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లతో కూడా పలు పోస్టులు.. రాణి చనిపోయిన రోజు కనిపించాయి.
ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం ఆ వజ్రాన్ని కొనుగోలు చేసి తన విధేయతకు చిహ్నంగా బ్రిటిష్ రాచ కుటుంబానికి అందించింది. సామ్రాజ్ఙ లేదా చక్రవర్తి పట్టాభిషేక సమయంలో చేతపట్టుకునే రాజదండంలో పొదిగిన అతి పెద్ద వజ్రం ఇది.
అయితే.. చాలా మంది ఆ వజ్రాన్ని 'దొంగిలించార'ని చెప్తారు. దాని అసలు యజమానులు దక్షిణాఫ్రికా ప్రజలనే అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ వజ్రం విలువ 40 కోట్ల డాలర్ల విలువ ఉంటుందని, దీనితో 75,000 మంది దక్షిణాఫ్రికా విద్యార్థులకు ఉన్నత విద్య ఖర్చులు వస్తాయని @Qban_Linx అనే యూజర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో కూడా ఇలాంటి డిమాండ్లు వినిపించాయి. రాణి ఎలిజబెత్ మరణించిన తర్వాత 'కోహినూర్' హ్యాష్‌ట్యాగ్ వేగంగా ట్రెండయింది. ఈ వజ్రం పొదిగిన రాచ కిరీటాన్ని.. రాజు మూడో చార్లెస్ భార్య అయిన రాణి ధరిస్తారని చెప్తున్నారు.
అలాగే.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారి అస్తికలను తిరిగి ఇచ్చేలా రాణి తన అధికారాన్ని ఉపయోగించి ప్రభావితం చేసి ఉండాల్సిందని ఇంకొందరు విమర్శకులు వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కెన్యాలో 19వ శతాబ్దంలో నాంది తిరుగుబాటుకు సారథ్యం వహించిన కొయిటాలెల్ సమోయి, 1835లో బ్రిటన్ బలగాల చేతుల్లో చనిపోయిన దక్షిణాఫ్రికా ఖోసా రాజ్యపు రాజు హిన్స్‌స్టా కాఖావులా వంటి వీరుల తలలను నరికి ట్రోఫీలుగా బ్రిటన్ తీసుకెళ్లారు. ఆ తలలను తిరిగి ఇవ్వాలని కెన్యన్లు, దక్షిణాఫ్రికావాసులు డిమాండ్ చేస్తున్నారు.
మౌమౌ తిరుగుబాటు సమయంలో కెన్యన్లను కిరాతకంగా హతమార్చటాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆ తిరుగుబాటులో 81 సంవత్సరాల కిందట 17 ఏళ్ల వయసు కుర్రాడిగా చేరిన గిటు వా కాహెన్గేరి.. అప్పుడు బ్రిటిష్ బలగాలు ఒక శిబిరంలో తనను నిర్బంధించి, తిండి పెట్టకుండా మాడ్చిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.
''వాళ్లు నా జన్మహక్కైన నా భూమిని ఆక్రమించుకున్నారు. కానీ రాణి కోసం మేం సంతాపం పాటిస్తున్నాం. ఎందుకంటే ఆమె ఒక వ్యక్తి. ఒక మనిషి. మనిషి చనిపోవటం మాకు విచారం కలిగిస్తుంది'' అని ఆయన రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రాణి ఎలిజబెత్ 'నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతీక' అని అభివర్ణించిన కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా.. నాలుగు రోజులు జాతీయ సంతాపం ప్రకటించారు. దీనిమీద కొందరు కెన్యన్లు తీవ్రం మండిపడ్డారు.
బోత్సవానా మాజీ అధ్యక్షుడు ఇయాన్ ఖామా.. రాణి ఎలిజబెత్ మరణం తీరని లోటని, ఆమె చరిత్రను సమర్థించారు.
''వలసవాదాన్ని మేం గుర్తుపెట్టుకోవాలని కోరుకునే అంశం కాదు. అది చీకటి యుగం. ఆ చరిత్రకు రాణి ఎలిజబెత్ వారసులయ్యారు కానీ దాని రూపకర్త కాదు... అయితే ఆమె బయటకు వచ్చినపుడు.. వలసవాదం వల్ల జరిగిన చేటుకు మరమ్మతు చేయటానికి వచ్చినట్లుగా వచ్చారు. తాము మీకన్నా అధికులము కాదని, మీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, దేశాలుగా అభివృద్ధి చెందటానికి సాయం చేయాలని కోరుకుంటున్నామని ఆమె చూపారు'' అని ఆయన పేర్కొన్నారు.
''చీకటి గతం నుంచి కొత్త శకాన్ని తెచ్చిన'' వ్యక్తిగా ఆఫ్రికా ఖండం ఆమెను చూడాలని వ్యాఖ్యానించారు.
బ్రిటిష్ సామ్రాజ్యం పేరుతో పాల్పడిన నేరాలకు రాణి ఎలిజబెత్ ఎన్నడూ క్షమాపణ చెప్పలేదని చాలా మంది అన్నారు. అయితే.. ఆమె భారతదేశంలో జలియన్‌వాలా బాగ్ ఊచకోత వంటి 'దుఃఖభరితమైన, కష్టమైన ఉదంతాలను అంగీకరించారు.
1919లో అమృత్‌సర్ వద్ద జలియన్ వాలా బాగ్‌లో సమావేశమైన నిరసనకారులు బయటకు వెళ్లకుండా దిగ్బంధించిన బ్రిటిష్ జనరల్.. వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 1997లో భారత పర్యటన సందర్భంగా రాణి ఎలిజబెత్.. జలియన్‌వాలా బాగ్ వద్ద ఘటనాస్థలిని సందర్శించారు.
దానికన్నా ముందుగా నాటి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. అందులో ఇలా అన్నారు: ''చరిత్రను తిరగరాయలేం. అది మరోలా ఉంటే బాగుంటుందని మనం ఎంతగా కోరుకున్నా సరే. అందులో విచారంతో పాటు, సంతోష సందర్భాలు కూడా ఉంటాయి. విచారం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. సంతోషం నుంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి.''
ఇవి కూడా చదవండి:
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
- క్వీన్ ఎలిజబెత్-2: రాణి ఉన్న చోట నవ్వుల జల్లులే
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- కింగ్ చార్లెస్ 3: ఫొటోల్లో బ్రిటన్ రాజు జీవితం
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








