క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?

ఫొటో సోర్స్, Getty Images
క్వీన్ ఎలిజబెత్ 2 పార్థివ దేహాన్ని బల్మోరల్ కోట నుంచి ఎడిన్‌బరాకు తరలిస్తున్నారు. ఆమె అంత్యక్రియలు సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో జరుగనున్నాయి.
ప్రజల సందర్శనార్థం క్వీన్ పార్థివ దేహాన్ని ఎడిన్‌బరాతో పాటు లండన్‌లో ఉంచుతారు. ఈ సమయంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు ప్రజలను అనుమతిస్తారు.
కింగ్ చార్లెస్ 3 యూకేలోని నాలుగు దేశాల పర్యటనను ప్రారంభిస్తారు.
రాణి అంత్యక్రియలు ముగిసేవరకు రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇదీ..

ఆదివారం, 11 సెప్టెంబర్
బల్మోరల్ కోటలోని బాల్‌రూమ్ నుంచి క్వీన్ శవపేటికను సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తరలించారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు క్వీన్ పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం బల్మోరల్ కోట నుంచి బయల్దేరింది. 160 కి.మీ పైగా దూరంలో ఉన్న ఎడిన్‌బరాకు రోడ్డు మార్గంలో నెమ్మదిగా ఆ వాహనం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం 6 గంటల పాటు సాగుతుంది.
ఎడిన్‌బరాలో క్వీన్ అధికారిక నివాసం హోలీరూడ్‌హౌజ్‌లోని థ్రోన్ రూమ్‌లో ఆమె శవపేటికను ఉంచుతారు.
బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్, కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శితో సమావేశం అవుతారు. తన సారథ్యంలోని దేశాల హైకమిషనర్లకు ప్యాలెస్‌లోని బో రూమ్‌లో కింగ్ ఆతిథ్యం ఇస్తారు.

సోమవారం, 12 సెప్టెంబర్
కింగ్ చార్లెస్ 3 సోమవారం ఉదయం వెస్ట్‌మినిస్టర్ హాల్‌ను సందర్శిస్తారు. అక్కడే రాణికి సంతాపాన్ని తెలియజేయడానికి పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం అవుతాయి.
తర్వాత క్వీన్ కన్సొర్ట్ కామిలాతో కలిసి కింగ్ చార్లెస్ 3 విమానంలో ఎడిన్‌బరాకు ప్రయాణిస్తారు. ఆపరేషన్ స్ప్రింగ్ టైడ్‌లో భాగంగా కింగ్ చేసే తొలి పర్యటన ఇది. కింగ్ హోదాలో యూకేలోని నాలుగు దేశాల్లో చార్లెస్ పర్యటిస్తారు. ఈ పర్యటన కోడ్ నేమ్ 'ఆపరేషన్ స్ప్రింగ్ టైడ్'.
మధ్యాహ్నం క్వీన్ పార్థివదేహాన్ని ఊరేగింపుగా సెయింట్ గిల్స్ క్యాథడ్రల్‌కు తీసుకెళ్తారు. ఈ కార్యక్రమంలో కింగ్‌తో పాటు రాజ కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
24 గంటల పాటు క్వీన్ శవపేటికను అక్కడే ఉంచుతారు. ప్రజలు నివాళులు అర్పించేందుకు అనుమతిస్తారు.
తర్వాత కింగ్, హోలీరూడ్‌కు తిరిగొస్తారు. అక్కడ స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్‌తో భేటీ అవుతారు. క్వీన్ కన్సొర్ట్ కామిలాతో కలిసి స్కాటిష్ పార్లమెంట్ ప్రవేశపెట్టే సంతాప తీర్మానాన్ని స్వీకరిస్తారు.
సాయంత్రం కింగ్ చార్లెస్, రాజ కుటుంబ సభ్యులతో కలిసి సెయింట్ గిల్స్ క్యాథడ్రల్‌లో జాగారం చేస్తారు.

మంగళవారం, 13 సెప్టెంబర్
యూకేలోని నాలుగు దేశాల యాత్రను క్వీన్ కామిలాతో కలిసి కింగ్ కొనసాగిస్తారు. మంగళవారం నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ను వారు సందర్శిస్తారు. అక్కడి నుంచి హిల్స్‌బరో కోటకు వెళ్తారు. నార్తర్న్ ఐర్లాండ్‌తో రాణి ఎలిజబెత్ 2కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రదర్శించే ఎగ్జిబిషన్‌కు వారు హాజరవుతారు.
తర్వాత నార్తర్న్ ఐర్లాండ్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ క్రిస్ హీథోన్ హ్యారిస్‌తో పాటు ఇతర నాయకులను కింగ్ కలుస్తారు. నార్తర్న్ ఐర్లాండ్ అసెంబ్లీ ప్రవేశపెట్టే సంతాప సందేశాన్ని ఆయన అందుకుంటారు.
మత పెద్దలతో సమావేశం అనంతరం సెయింట్ ఆన్నె క్యాథడ్రల్ ప్రార్థనల్లో కామిలాతో కలిసి కింగ్ పాల్గొంటారు. తర్వాత లండన్‌కు తిరుగు పయనం అవుతారు.
మరోవైపు స్కాట్లాండ్‌లోని సెయింట్ గిల్స్ క్యాథడ్రల్ నుంచి మధ్యాహ్నం క్వీన్ శవపేటికను ఎడిన్‌బరా విమానాశ్రయానికి తరలిస్తారు. అక్కడి నుంచి విమానం, ఆర్‌ఏఎఫ్ నార్ట్‌హాల్ట్‌కు బయలుదేరుతుంది. క్వీన్‌తో ప్రిన్సెస్ ఆన్నె వెళ్తారు.
రాత్రి 11:30 గంటలకు విమానం లండన్‌కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
అక్కడి నుంచి బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు క్వీన్ శవపేటికను తరలిస్తారు. తర్వాత బో రూమ్‌లో ఉంచుతారు.

బుధవారం, 14 సెప్టెంబర్
బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు క్వీన్ పార్థివ దేహాన్ని చేర్చుతారు.
ఈ సమయంలో మిలిటరీ కవాతు నిర్వహిస్తుంది. రాజ కుటుంబ సభ్యులు వెంట నడుస్తారు. లండన్ వీధుల గుండా రాణి శవపేటికను తరలిస్తున్నప్పుడు ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు చూడటం కోసం రాయల్ పార్కుల్లో పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.
వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు చేరాక క్యాటఫాక్ అని పిలిచే ఎత్తైన ప్లాట్‌ఫామ్‌పై శవపేటికను ఉంచుతారు. దానిపై రాజరికపు గుర్తులైన ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, ఆర్బ్, సెప్టెర్‌లను పెడతారు.
ఈ ప్లాట్‌ఫామ్ చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత ఉంటుంది. ఇక్కడ ప్రజల్ని, రాణిని చూసేందుకు అనుమతిస్తారు.

గురువారం, 15 సెప్టెంబర్
క్వీన్ అంతిమ యాత్ర కోసం ఉదయం 6:30 నుంచి 9:30 వరకు రిహార్సల్స్ చేస్తారు.
క్వీన్ పార్థివదేహాన్ని న్యూ ప్యాలెస్ యార్డ్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే, అక్కడి నుంచి వెల్లింగ్టన్ ఆర్చ్‌కు యాత్రగా తీసుకెళ్తారు.
ఇక్కడే నాలుగు రోజుల పాటు క్వీన్ పార్థివ దేహాన్ని ఉంచుతారు.
ఇక్కడ లక్షలాది మంది ప్రజలు, రాణికి తుది వీడ్కోలు పలుకుతారు. రాణిని చూసేందుకు, నివాళులు అర్పించేందుకు ప్రజల్ని అనుమతిస్తారు. ప్రజలు ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలో అనే అంశానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
కింగ్ చార్లెస్ 3 కూడా వేల్స్‌ను సందర్శించే అవకాశం ఉంది.

సోమవారం, 19 సెప్టెంబర్
వెస్ట్‌మినిస్టర్ అబేలో మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారిక లాంఛనాలతో క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతల్ని ఈ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తారు.
యూకే సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో కూడా ప్రసారం చేస్తారు.

ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








