జ్ఞాన్‌వాపి కేసు: ముస్లింల పిటిషన్ కొట్టేసిన కోర్టు.. పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందువుల పిటిషన్ విచారణ కొనసాగించాలని ఆదేశం

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
కాశీలో వివాదాస్పదంగా ఉన్న జ్ఞానవాపి మసీదు మీద దాఖలైన పిటీషన్‌లో జిల్లా కోర్టు నేడు తీర్పు ఇచ్చింది.
జ్ఞానవాపి మసీదులో శృంగార గౌరీకి పూజలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌లో విచారణ కొనసాగించాలంటూ న్యాయమూర్తి ఏకే విశ్వేష్ ఆదేశాలు జారీ చేశారు.
బాబ్రీ మసీదుకు వేసిన తాళాన్ని 1986లోతెరిచినప్పుడు, ఆ తరువాత రామమందిర నిర్మాణం డిమాండ్ ఊపందుకున్నప్పుడు కాశీ, మథురల సంగతేమిటన్న ప్రశ్న కూడా తెర ముందుకు వచ్చింది.
విచారణ ఆపేలా ఆదేశించాలంటూ ముస్లింలు వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
జ్ఞానవాపి మాదిరిగానే మథుర కేసు కూడా కోర్టులో ఉంది.
మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో మసీదు కట్టారనే ఆరోపణలో నమోదైన కేసును విచారించాలని కోర్టు ఆదేశించింది.
ఇక, కాశీ విశ్వనాథ ఆలయం కేసు విషయానికి వస్తే, కింది కోర్టు ఆదేశాలతో సర్వే నిర్వహించిన తరువాత జ్ఞాన్‌వాపి మసీదులోని వాజుఖానాలో కొంత భాగాన్ని సీల్ చేశారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ మసీదులో ప్రార్థనలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, ARRANGED
ఇప్పుడున్న కేసు ఏంటి?
జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరి, ఇంకా ఇతర దేవతలను దర్శించుకుని పూజలు చేసుకోవడానికి అనుమతించాలని దిల్లీకి చెందిన రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు గత ఏడాది ఆగస్ట్‌లో ఒక పిటిషన్ కోర్టుకు సమర్పించారు.
ప్లాట్ నంబర్ 9130లో ఆ దేవతామూర్తులు ఉన్నాయని వారణాసిలోని దిగువ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో పిటిషనర్లు పేర్కొన్నారు.
దీనిపై సర్వే చేయాలని కోర్టు దాదాపు 8 నెలల తరువాత 2022 ఏప్రిల్ 8న ఆదేశించింది. సర్వే చేస్తున్నప్పుడు దాన్నంతా వీడియో తీయాలని కూడా సూచించింది.
ఈ నిర్ణయాన్ని కొన్ని సాంకేతిక కారణాల ప్రాతిపదికన మస్జీద్ ఇంజామియా హైకోర్టులో సవాలు చేశారు. దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది.
సర్వే చేస్తున్నప్పుడు మసీదులోని వాజుఖానాలో శివలింగం లభించిందనే వాదనలు ముందుకు రావడంతో కోర్టు మసీదును సీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ తరువాత విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు మసీదులో ప్రార్థనలకు అనుమతించింది కానీ, వాజుఖానాను మాత్రం మూసే ఉంచింది.
నిజానికి, నవరాత్రి వేడుకలప్పుడు శృంగారగౌరిని ఏడాదికోసారి పూజిస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పుడు నిత్య పూజల కోసం అనుమతి కోరుతున్నారు.

అయితే, ఆ పూజా స్థలం ఉన్నది మసీదుకు పశ్చిమాన ఉన్న గోడ వెలుపలే కదా, మరి లోపలికి వచ్చి సర్వే చేయాల్సిన అవసరం ఏంటని ముస్లింల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
ఈ కేసులో స్పెషల్ కోర్టు సెప్టెంబర్ 12న తీర్పు ప్రకటించాల్సి ఉంది.
అయితే, కాశీ విశ్వనాథ్ - జ్ఞాన్‌వాపి మసీదు వివాదానికి సంబంధించి నిజానికి ఇదే మొదటి కేసు కాదు. ఈ మసీదును నిర్మించిన స్థలం కాశీ విశ్వనాథుడి ఆలయానిదని, కాబట్టి ఆక్కడి నుంచి మసీదును తొలగించి భూమిని హిందువులకు అప్పగించాలని కోరుతూ 1991లోనే అంజుమన్ ఇంతెజామియా మస్జీద్ లాయర్ అభయ్ యాదవ్ బీబీసీ ప్రతినిధి అనంత్ ఝనానేకు చెప్పారు.
ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
ఎప్పటి నుంచీ వివాదం...
స్థానిక ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ మసీదు విషయంలో మొదటి వివాదం 1809లోనే వచ్చింది. అది మత ఘర్షణలకు దారి తీసింది. ఆ తరువాత 1936లో కూడా ఓ కేసు నమోదైంది. ఆ మరుసటి ఏడాది దిగవ కోర్టు, ఆ తరువాత హైక్రోటు కూడా మసీదు స్థలం వక్ఫ్ ఆస్తి అని తమ తీర్పులో ప్రకటించాచియ.
ఈ మసీదు లోపల సర్వే చేయాలని 1996లో కూడా సోహన్ లాల్ ఆర్య అనే వ్యక్తి బనారస్ కోర్టులో పిటిషన్ వేశారు.
ఇప్పుడు కొత్తగా పిటిషన్ వేసిన అయిదుగురిలో బనారస్‌కు చెందిన లక్ష్మీదేవి ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా కప్ 2022: హస్రంగ చెలరేగిపోవడంతో ఓడిపోయిన పాకిస్తాన్, ఆరోసారి చాంపియన్‌షిప్ గెలిచిన శ్రీలంక
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












