విశాఖలో వివాహిత మిస్సింగ్ కేసు: ‘నాన్నా నేను బతికే ఉన్నాను.. రవితో నాకు పెళ్లయిపోయింది’
విశాఖ ఆర్కేబీచ్‌లో గల్లంతయ్యారని భావించిన వివాహిత సాయిప్రియ తన తండ్రికి పంపిన వాట్సప్ వాయిస్ మెసేజులు ఇవి.
ఈ మేసేజులు పంపడానికి 2 రోజుల ముందు, అంటే జూలై 25న సాయిప్రియ, శ్రీనివాసరావుల పెళ్లి రోజు. ఆ రోజు సాయంత్రం విశాఖ NAD కొత్తరోడ్డు నుంచి ఆర్కే బీచ్‌కు భార్యభర్తలు వచ్చారు.
కొద్దిసేపు గడిపి, ఇంటికి తిరిగి వెళ్దామనుకునేసరికి సాయి ప్రియ కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటారని భావించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
సాయిప్రియ మిస్సింగ్ కేసుకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు వివరాలు వెల్లడించారు.
పోలీసులు ఏం చెప్పారంటే..
విశాఖ NADకి చెందిన సాయిప్రియ, విజయవాడకు చెందిన శ్రీనివాసరావులకు 2020 జూలై 25న పెళ్లయ్యంది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పని చేస్తుంటారు.
జులై 25, పెళ్లి రోజని ఆర్కే బీచ్ కి వెళ్తే...అక్కడ తన భార్య కనిపించడం లేదని శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు.
సాయిప్రియ సముద్రపు నీటిలో కొట్టుకుపోయారేమో అని కోస్ట్‌గార్డ్ సిబ్బంది హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లతో ఆర్కే బీచ్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే గాలింపు చర్యలు కొనసాగుతుండగానే సాయిప్రియ నెల్లూరులో ఉందని తెలియచేస్తూ తనకు ఫోన్ సమాచారం అందిందని డిప్యూటీ మేయర్ శ్రీధర్ తెలిపారు.
దీంతో సాయిప్రియ ప్రాణాలతో ఉందని తల్లిదండ్రులు, భర్త ఊపిరి పీల్చుకున్నారు. జూలై 27, సాయంత్రం 7.30 గంటలకు సాయిప్రియ తన తండ్రికి వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యారు. తాను బెంగళూరులో ప్రియుడు రవిని పెళ్లి చేసుకున్నానని, తన కోసం వెతకొద్దని చెప్తూ వాయిస్ మెసేజ్ ను, తన మెడలో తాళిబొట్టు ఉన్న ఒక ఫోటోను కూడా వాట్సాప్‌లో పంపించారు. వాటిని సాయిప్రియ తల్లిదండ్రులు విశాఖ త్రీ టౌన్ పోలీసులకు అందచేశారు.
తండ్రికి పంపించిన వాట్సాప్ ఆడియో మెసేజ్‌లలో ఏముంది?
"నాన్నా నేను సాయిని మాట్లాడుతున్నాను. నేను ఏం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. రవి దగ్గరే ఉన్నాను. అతనితో నాకు పెళ్లి కూడా అయిపోయింది. నన్నేమీ రవి బలవంతం చేసి తీసుకురాలేదు. దయచేసి మా గురించి వెతకొద్దు నాన్నా... ప్లీజ్ నాన్న... నీకు పుణ్యం ఉంటుంది. ఇక పరుగెత్తే ఓపిక నాకు లేదు. ఇక చావైనా, బతుకైనా వీడితోనే నేను ఉంటాను. ప్లీజ్ నాన్న అస్సలు మమ్మల్ని వెతక్కొద్దు నాన్నా. రవితోనే. నాకు బతకాలని ఉంది. చావాలన్న ఉద్దేశం లేదు. మా ఇద్దరం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం నాన్నా. ఇప్పుడు మీరు సపోజ్ వస్తే , నేను చచ్చిపోతాను. ఇద్దరం కలిసే సచ్చిపోతాం. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేం. ప్లీజ్ నాన్నా మమ్మల్ని వెతక్కొద్దు. అంటీ వాళ్లకి కూడా ఇందులో సంబంధం లేదు నాన్నా. వాళ్లని ఏం అనొద్దు. నాన్న నేను బతకాలని అనుకుంటున్నాను నాన్నా, నాకు చావాలనే ఉద్దేశం లేదు నాన్నా, ప్లీజ్ నాన్నా, నన్ను వెతక్కొద్దు. గవర్నమెంట్ వాళ్లందరికి కూడా నేను సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు నాన్నా." అంటూ సాయి ప్రియ తన తండ్రికి వాట్సాప్ మెసేజ్ పంపించారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


