జార్ఖండ్‌: ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

చనిపోయిన మోనిక

ఫొటో సోర్స్, Anand Dutta/BBC

    • రచయిత, ఆనంద్ దత్త
    • హోదా, బీబీసీ కోసం

జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల మోనిక, రెండు నెలల గర్భవతి. తన తొలి బిడ్డ కోసం ఆమె ఎదురు చూస్తోంది.

కానీ ఆ ఎదురు చూపులు ఈ నెల 15న ఆగిపోయాయి. లోన్ రికవరీ ఏజెంట్లు కారుతో తొక్కించడంతో ఆమె చనిపోయింది. ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి మోనిక తండ్రి రుణం తీసుకున్నారు.

లోను తీర్చలేదంటూ ట్రాక్టర్‌ను జప్తు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు వచ్చారు. అప్పుడు వారిని అడ్డుకునేందుకు మోనిక ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఆమె మీదకు కారు ఎక్కించారు.

మోనిక తండ్రి పేరు మితిలేశ్ కుమార్ మెహతా. హజారీబాగ్ జిల్లాలోని సిజువా గ్రామంలో వీరి కుటుంబం నివసిస్తోంది.

'2018లో మహీంద్రా ఫైనాన్స్ నుంచి లోను తీసుకుని ట్రాక్టర్ కొన్నాను. ఆ తరువాత 44 కిస్తీలు కట్టాను. కొద్ది రోజుల కిందట మిగిలిన 6 వాయిదాలు అంటే లక్షా 20వేల రూపాయలు కట్టేందుకు వెళ్లాను. కానీ డబ్బులు కట్టించుకునేందుకు కంపెనీ ఒప్పుకోలేదు.

ఇప్పుడు లక్షా 30వేల రూపాయలు కట్టాలని కంపెనీ వాళ్లు చెప్పారు. 10వేల రూపాయలు లేక పోవడంతో మిగిలిన వాయిదాలు కట్టలేక పోయాను' అని మితిలేశ్ కుమార్ తెలిపారు.

ఆ తరువాత ఈ నెల 15న ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు మహీంద్రా ఫైనాన్స్ తరపున లోన్ రికవరీ ఏజెంట్లు మితిలేశ్ ఇంటికి వచ్చారు. ట్రాక్టర్ తీసుకు పోకుండా మితిలేశ్, ఆయన కుమార్తె మోనిక అడ్డుకున్నారు.

ఆ ఘర్షణలో లోన్ రికవరీ ఏజెంట్లలో ఒకరు మోనిక మీదకు కారును ఎక్కించారు. 'కింద పడిన మోనికను మరొకసారి కారుతో తొక్కించి ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు' అని మితిలేశ్ వెల్లడించారు.

హజారీబాగ్‌లోని మహీంద్రా ఫైనాన్స్ ఆఫీసు

ఫొటో సోర్స్, Anand Dutta/BBC

ఫొటో క్యాప్షన్, హజారీబాగ్‌లోని మహీంద్రా ఫైనాన్స్ ఆఫీసు

ఇచాక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ధనంజయ్ సింగ్ ఈ కేసును విచారిస్తున్నారు. చనిపోయిన మోనిక తండ్రి మితిలేశ్ ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.

ఘటన జరిగిన తరువాత మోనిక భర్త తరపు బంధువులు, కుటుంబ సభ్యులు, ఇతర స్థానిక నేతలు సిజువాకు భారీ సంఖ్యలో వచ్చారు.

శనివారం(17న) మితిలేశ్ ఇంటి దగ్గరకు మేం వెళ్లేసరికి అక్కడ చాలా మంది ప్రజలు గుమిగూడి ఉన్నారు. కొందరు జర్నలిస్టులు కూడా కనిపించారు. మరి కాస్త ముందుకు పోగానే మోనిక తల్లి రేఖా దేవి ఎడుపు వినిపిస్తోంది. కాసేపటి తరువాత ఏడుపు శబ్దం ఆగిపోయింది. కానీ కళ్ల వెంబడి నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి.

మోనికా చెల్లి మనీషా కుమారి తల్లిని ఓదార్చుతోంది. అప్పుడప్పుడు తను కూడా ఏడుస్తోంది. రేఖా దేవి దగ్గర ఆమె సోదరీమణులు కూడా కూర్చొని ఉన్నారు. వారు కూడా ఏడుస్తూ అప్పుడప్పుడు తమ సోదరి కన్నీళ్లు తుడుస్తున్నారు.

మోనిక తల్లి రేఖా దేవి, చెల్లెలు మనీషా కుమారి

ఫొటో సోర్స్, Anand Dutta/BBC

ఫొటో క్యాప్షన్, మోనిక తల్లి రేఖా దేవి, చెల్లెలు మనీషా కుమారి

'2018లో పాత ట్రాక్టర్ ఇచ్చి కొత్త ట్రాక్టర్ తీసుకున్నా. అప్పుడు సరిపడా డబ్బులు లేకపోవడంతో మహీంద్రా ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకోవాల్సి వచ్చింది. నెలకు 14,300 రూపాయల చొప్పున 44 వాయిదాలు కట్టాలని కంపెనీ నిర్ణయించింది.

నేను దాదాపుగా అన్ని కిస్తీలు కట్టాను. కానీ కరోనా లాక్‌డౌన్ వల్ల కొన్ని వాయిదాలు కట్టలేక పోయాను. అందువల్ల వాయిదాల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది.

ఈ మధ్యలో మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వాళ్లు డబ్బులు కట్టాలంటూ వేధించసాగారు. ఆ తరువాత కంపెనీ వాళ్లతో మాట్లాడగా చివరకు లక్షా 20వేల రూపాయలు కట్టేందుకు సెటిల్‌మెంట్ చేశారు.

ఆ డబ్బును తీసుకొని ఈ ఏడాది జులై 18న హజారీబాగ్‌లోని మహీంద్రా ఫైనాన్స్ కంపెనీకి వెళ్లాను. కానీ లక్షా 20వేలకు బదులు లక్షా 30వేల రూపాయలు కట్టాలంటూ కంపెనీ వాళ్లు చెప్పారు.

లక్షా 20వేలు కట్టాలనే కదా సెటిల్‌మెంట్‌లో చెప్పారు. ఇప్పుడు ఎందుకు అదనంగా 10వేల రూపాయలు అడుగుతున్నారని నేను ప్రశ్నించా. కానీ అందుకు కంపెనీ ఉద్యోగులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

అప్పుడు అదనంగా కట్టడానికి నా దగ్గర 10వేల రూపాయలు లేవు. దాంతో ఉన్న డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంతలో వ్యవసాయ పనుల కోసం ఉన్న డబ్బులో కొంత ఖర్చు అయిపోయింది.

ఆ తరువాత మళ్లీ కంపెనీ వాళ్లు ఫోన్ చేయడం ప్రారంభించారు. ఇంటికి కూడా వచ్చే వాళ్లు. అలా ఈ నెల 14న రోషన్ సింగ్ అనే ఏజెంట్ ఇంటికి వచ్చారు. ఈ నెల 22న మిగిలిన డబ్బును అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు ఒప్పందం కుదిరింది. కానీ ఆ మరుసటి రోజే అంటే 15వ తేదీన తన మనుషులతో రోషన్ సింగ్ మళ్లీ ఇంటికి వచ్చారు.

వారు నా ట్రాక్టర్ తీసుకొని పోయేందుకు ప్రయత్నించారు. అప్పుడు నేను పొలంలో పని చేస్తున్నా. నా కూతురు మోనిక ఇంటి దగ్గర ఉంది. ట్రాక్టర్ తీసుకు పోవద్దంటూ వారిని వేడుకుంది. కానీ వారు వినకుండా ట్రాక్టర్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఇంతలో మోనిక చేను దగ్గరకు వచ్చి నాకు విషయం చెప్పింది. మేం ఇద్దరం బైకు మీద ట్రాక్టర్ తీసుకెళ్తున్న ఏంజెట్‌ను వెంబడించాం. దారిలో అడ్డుకుని ఏంజెట్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ వారు మా మీద అరవడం మొదలు పెట్టారు.

మర్యాదగా పక్కకు తప్పుకోండి, లేదంటే తొక్కించేస్తాం అంటూ కారులోని ఏజెంట్లు బెదిరించారు. మా అమ్మాయి వారి దారికి అలాగే అడ్డుగా నిలబడి ఉంది. వారు తన మీదకు కారును ఎక్కించారు.

గాయపడిన మా అమ్మాయిన తీసుకొని వెంటనే హజారీబాగ్‌ ఆసుపత్రికి వెళ్లాను. వారు రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు తీసుకెళ్లమన్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే మా అమ్మాయి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు' అని మోనిక తండ్రి మితిలేశ్ బీబీసీకి జరిగిన విషయాన్ని వివరించారు.

మోనిక కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, Anand Dutta/BBC

'మోనిక నా పెద్ద కూతురు. పోయిన ఏడాదే పెళ్లి చేశాం. పెళ్లి కాక ముందు తనే అన్ని పనులు చూసుకునేది. మనవడో మనవరాలో పుడుతుందని మేం ఎదురు చూస్తున్నాం. కానీ ఆ కంపెనీ వాళ్లు నా కూతుర్ని చంపేశారు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం' అంటూ మోనిక తల్లి రేఖా దేవి అన్నారు.

ఆమె మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తూనే ఉన్నారు.

నలుగురు పిల్లల్లో మోనిక పెద్దది. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఒక చెల్లి ఉన్నారు.

మోనిక భర్త కుల్దీప్

ఫొటో సోర్స్, Anand Dutta/BBC

ఫొటో క్యాప్షన్, మోనిక భర్త కుల్దీప్

పోయిన ఏడాది మే 24న మోనికకు పెళ్లి అయింది. ఆమె భర్త కుల్దీప్ ట్రక్కు నడుపుతుంటారు.

'ఆ ఘటన జరిగిన రోజు తను నాతో వీడియో కాల్ మాట్లాడింది. అక్కడ ఎన్ని రోజులు ఉంటావని అడిగాను. త్వరలోనే ఇంటికి వస్తాను అని చెప్పింది' ఈ మాటలు చెబుతున్నప్పుడు కుల్దీప్ మధ్యలో ఆగిపోయారు.

కాసేపు మౌనంగా ఉన్న తరువాత మళ్లీ చెప్పడం ప్రారంభించారు... 'మాకు పుట్టబోయే బిడ్డ గురించి రోజూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మా బిడ్డను రాంచీలో చదివించాలని ఇద్దరం అనుకున్నాం. డాక్టర్ లేదా ఇంజినీర్‌ను చేయాలని నిర్ణయించుకున్నాం' అని కుల్దీప్ అన్నారు.

ఈ ఘటన మీద మహీంద్రా కంపెనీ స్పందించింది.

'హజారీబాగ్‌ ఘటన మమ్మల్ని ఎంతగానో కదలించింది. ఈ కేసును అన్ని కోణాల్లో మేం విచారిస్తాం. థర్డ్ పార్టీకి చెందిన లోన్ రికవరీ ఏజెంట్లను ఉపయోగించే పద్ధతిని రివ్యూ చేస్తాం. విచారణకు సంబంధించి అధికారులకు మేం అన్నిరకాలుగా సహకరిస్తాం. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి మేం అండగా ఉంటాం' అని మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ డాక్టర్ అనీశ్ షా ట్వీట్ చేశారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ ఘటన మీద విచారం వ్యక్తం చేశారు.

కానీ ఇప్పటి వరకు మహీంద్రా కంపెనీ తరపున తనను ఎవరూ సంప్రదించలేదని మితిలేశ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

'ఇటువంటి వాటికి సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి ప్రకారం బలవంతంగా లోన్లు రివకరీ చేయడానికి మనుషులను పంపకూడదు. ఒకవేళ వాయిదాలు కట్టనప్పుడు వాహనాన్ని జప్తు చేయాలనుకుంటే ముందుగా నోటీసు ఇవ్వాలి' అని జార్ఖండ్ హై కోర్టు న్యాయవాది సోనాల్ తివారీ తెలిపారు.

'దేశంలో 10వేల మందికిపైగా రుణ ఎగవేతదారులు ఉన్నట్లు పార్లమెంటులో ప్రభుత్వం చెప్పింది. మరి ఇంతవరకు వారిలో ఎంతమందిని పట్టుకుని జైలులో పెట్టారు? వారి నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు?' అని వ్యవసాయరంగ నిపుణుడు దేవేందర్ శర్మ ప్రశ్నించారు.

'కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కార్పొరేట్ల ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్లను పంపినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? గత అయిదేళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కానీ రైతులను మాత్రం ఇలా ఎందుకు వేధిస్తున్నారు? ఇలాంటి వివక్ష పూరితమైన చర్యల వలనే వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోంది' అని దేవేందర్ శర్మ అన్నారు.

కానీ ఇలా బలవంతంగా లోన్లు రికవరీ చేయడమన్నది ఇదే తొలిసారి కాదు. అలాగే ఇదే ఆఖరు కూడా కాకపోవచ్చు.

వీడియో క్యాప్షన్, తొలిసారిగా దిల్లీ ప్రభుత్వం డీటీసీ బస్సుల్లో 11 మంది మహిళా డ్రైవర్లను నియమించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)