ఫరీద్‌కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరవింద్ చాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ సంస్థానానికి సంబంధించిన ఆస్తుల వివాదాన్ని సుప్రీం కోర్టు గత వారం పరిష్కరించింది.
ఫరీద్‌కోట్ సంస్థానం చివరి మహారాజు 'రాజా హరీందర్ సింగ్ బ్రార్'. ఆయనకు పంజాబ్, దిల్లీ, హరియాణాల్లో రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. వీటికి సంబంధించి గత 33 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. వివాదాస్పద ఆస్తుల్లో కోటలు, భవనాలు, వేలాది ఎకరాల భూములు, ఏరోడ్రోమ్‌లు, జ్యూయెలరీ, వింటేజ్ కార్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల నగదు ఉంది.
ఈ సంస్థానానికి చెందిన ఆస్తుల్ని సుప్రీం కోర్టు, రాజా హరీందర్ సింగ్ బ్రార్ ఇద్దరు కుమార్తెలకు మంజూరు చేసింది.
ఈ ఆస్తుల వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకునేముందు, ఫరీద్‌కోట్ సంస్థానం మొత్తం ఆస్తుల గురించి తెలుసుకుందాం.
ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ. 20,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో మషోబ్రా, సిమ్లాలలోని ప్లాట్లతో పాటు దిల్లీలోని కోపర్నికస్ రోడ్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫరీద్‌కోట్ హౌజ్, అక్కడే డిప్లోమాటిక్ ఎన్‌క్లేవ్-1లో 1.5 ఎకరాల్లో ఉన్న ఫరీద్‌కోట్ భవనం, ఓక్లాలోని ఇండస్ట్రియల్ ప్లాట్, రివెరా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
ఇవే కాకుండా చండీగఢ్‌లోని సెక్టార్ 17లో హోటల్ ప్లాట్, ఫరీద్‌కోట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాజ్ మహల్, అక్కడే మరో 10 ఎకరాల్లో ఉన్న ముబారక్ కోట, చండీగఢ్‌లోని 5 ఎకరాల సూరజ్‌ఘర్ ఖిలా కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, BHART BHUSHAN/BBC
మహారాజా హరీందర్ సింగ్ ఎవరు?
రాజా హరీందర్ సింగ్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ సంస్థానాదీశుడు. 1948లో భారత ప్రభుత్వంతో ఒప్పందం తర్వాత ఈ సంస్థానాన్ని ఆయన భారత్‌లో విలీనం చేశారు. భారత్‌లో కలిపిన సంస్థానాల ఆస్తుల యాజమాన్యం రాజులకే ఉండేది.
ఫరీద్‌కోట్ సంస్థాన ఆస్తుల గురించి పంజాబ్‌లో నివసించిన చరిత్రకారుడు హర్జేశ్వర్ పాల్ సింగ్, బీబీసీతో మాట్లాడారు. ''ఫరీద్‌కోట్ రాజా రైల్వే, ఆసుపత్రులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఫరీద్‌కోట్ సంస్థానం ఎప్పుడూ బ్రిటిష్ వారితో కలిసి ఉందనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. వారికి బ్రిటిష్ వారితో ఒప్పందాలు ఉండేవి. 1845లో మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం జరిగినప్పుడు అప్పటి ఫరీద్‌కోట్ రాజా పహార్ సింగ్, బ్రిటీషర్లకు మద్దతు ఇచ్చారు'' అని చెప్పారు.
రాజా హరీందర్ సింగ్ సోదరుని మనవడు అమరీందర్ సింగ్ కూడా బీబీసీతో మాట్లాడారు. ఆ కాలం నాటి విషయాలను సరైన కోణంలో చూడాలని ఆయన బీబీసీతో అన్నారు.
''ఆ సమయంలో సంస్థానాలను రాజులే రక్షించుకోవాల్సి ఉండేది. బ్రిటిష్ లేదా మహారాజా రంజిత్ సింగ్... ఇలా ఈ ఇద్దరిలో ఒకరిని రాజా పహార్ సింగ్‌కు ఎంచుకోవాల్సి వచ్చింది. ఆయన బ్రిటిషర్లను ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుందని భావించారు. ఆ సమయంలో చాలా సంస్థానాలు ఇలాగే చేశాయి'' అని అమరీందర్ సింగ్ చెప్పారు.
అమరీందర్ సింగ్ వృత్తిరీత్యా బ్యాంకర్. తన బాల్యం అంతా ఫరీద్‌కోట్ కోట ఎదురుగా ఉన్న భవనంలో గడిచిందని ఆయన అన్నారు.
''కోట ఎదురుగా ఉన్న ప్యాలెస్‌లో మా తాత నివసించేవారు. ఇది దాదాపు నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో కొంత భాగాన్ని కుటుంబం విక్రయించింది. ఇప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్తుంటా'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, GBBC
మహారాజా హరీందర్ సింగ్ కుటుంబ సభ్యులు ఎవరు?
ఫరీద్‌కోట్ మహారాజా బ్రిజేందర్ సింగ్, 1918లో మరణించారు. ఆయన భార్య మహారాణి మోహిందర్ కౌర్, 15 మార్చి 1991లో చనిపోయారు. వారికి ఇద్దరు కుమారులు... హరీందర్ సింగ్, మంజీత్ ఇందర్ సింగ్.
రాజా హరీందర్ సింగ్ 1915 జనవరి 29న జన్మించారు. 1989 అక్టోబర్ 16న మరణించారు. హరీందర్ సింగ్ భార్య రాణి నరీందర్ కౌర్ 1986 ఏప్రిల్ 19న కన్నుమూశారు. వీరికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు కుమార్తెలు కాగా ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు హర్‌మోహిందర్ సింగ్ 1981 అక్టోబర్ 13న చనిపోయారు. రాజా హరీందర్ సింగ్ కుమార్తెలు ప్రిన్సెస్ అమృత్ కౌర్, మహారాణి దీపేందర్ కౌర్, ప్రిన్సెస్ మహీప్ ఇందర్ కౌర్.
దీపేందర్ కౌర్‌కు జై చంద్ మహతాబ్ అనే కుమారుడు, నిశా ఖేర్ అనే కుమార్తె ఉన్నారు.
రాజా హరీందర్ సింగ్ తమ్ముడు మంజిత్ ఇందర్ సింగ్‌కు భరత్ ఇందర్ సింగ్ అనే కుమారుడు, ప్రిన్సెస్ దెవిందర్ కౌర్ అనే కుమార్తె ఉన్నారు.
భరత్ ఇందర్ కౌర్ కుమారుడు అమరీందర్ సింగ్. ప్రిన్సెస్ దెవిందర్ కౌర్ కుమార్తె ప్రిన్సెస్ హర్‌మిందర్ కౌర్.
మహారాజా హరీందర్ సింగ్, వీలునామా రాశారా?
రాజా హరీందర్ సింగ్ రాసినట్లు మొత్తం మూడు వీలునామాలు బయటికొచ్చాయి. 1950లో తొలి వీలునామా రాశారు. ఈ వీలునామాలో కొన్ని బ్యాంకు డిపాజిట్లు... రోహ్‌తక్ రోడ్, దిల్లీలోని నాలుగు ప్లాట్ల గురించి ప్రస్తావించారు. ఈ ఆస్తిని ముగ్గురు కుమార్తెలకు సమానంగా ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశారు.
1952లో రెండో వీలునామా రాశారు. ఇందులో మొదటి వీలునామా ప్రకారం కొన్ని ఆస్తుల గురించి పేర్కొన్నారు. అయితే, ఈ వీలునామాలో తన పెద్ద కుమార్తె, ప్రిన్సెస్ అమృత్ కౌర్‌కు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు. వీలునామాలో పేర్కొన్న ఆస్తిని మిగతా ఇద్దరు కుమార్తెలు ప్రిన్సెస్ దీపేందర్ కౌర్, ప్రిన్సెస్ మహీప్ ఇందర్ కౌర్‌లకు సమానంగా పంచాలని ఆయన ఆదేశించారు.

ప్రిన్సెస్ అమృత్ కౌర్‌కు ఆస్తి ఎందుకు ఇవ్వలేదు?
రెండో వీలునామా ప్రకారం... తన పెద్ద కుమార్తె అమృత్ కౌర్‌కు తన ఆస్తిని ఇవ్వడం, రాజా హరీందర్ సింగ్‌కు ఇష్టం లేదు. ''అమృత్‌కౌర్, తన తండ్రికి ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన ఆస్తిని ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఉంటారు'' అని కోర్టు పేర్కొంది.
మూడేళ్ల తర్వాత లండన్‌లో ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌ను మహారాజా తయారు చేశారు. అందులో తన పెద్ద కుమార్తెకు 25 ఏళ్లు పూర్తయ్యేవరకు లేదా ఆమె తన భర్త నుంచి చట్టబద్ధంగా విడిపోయేవరకు ఆస్తిలో వాటా దక్కదు అని పేర్కొన్నారు. రెండో వీలునామాకు భిన్నంగా ఈ మూడో వీలునామాలో ఆమెను పూర్తిగా ఆస్తి నుంచి దూరం చేయలేదు.

ఫొటో సోర్స్, AMARINDER SINGH
మూడో వీలునామా కారణంగా వివాదాలు
రాజా హరీందర్ సింగ్, 1989లో మరణించారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా నిర్వహించే భోగ్ కార్యక్రమం సమయంలో ఈ మూడో వీలునామా బయటకు వచ్చింది. ఈ వీలునామాను 1982 జూన్ 1న రాసినట్లు చెబుతారు.
ఈ మూడో వీలునామాను పెద్ద కుమార్తె అమృత్ కౌర్‌కు ఇచ్చారని చెబుతారు. ఈ వీలునామా రాయడాని కంటే ముందు ఆయన కుమారుడు చనిపోయారని అంటారు.
సంస్థాన ఆస్తులన్నింటినీ మహారావల్ ఖేవాజీ ట్రస్టు సంరక్షిస్తుందని ఈ మూడో వీలునామాలో రాశారు. ట్రస్టీలుగా మహారాజా ఇద్దరు కుమార్తెలు ప్రిన్సెస్ దీపేందర్ కౌర్, ప్రిన్సెస్ మహీప్ ఇందర్ కౌర్‌లతో పాటు మహారాణి మోహిందర్ కౌర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉంటారని అందులో పేర్కొన్నారు.
ఈ మూడో వీలునామాను కోర్టులో సవాలు చేశారు.
ఫరీద్‌కోట్ సంస్థానం మహారాజా హరీందర్ సింగ్ తమ్ముడు మంజిత్ ఇందర్ సింగ్, సివిల్ కోర్టులో ఈ మూడో వీలునామాను సవాలు చేశారు. హరీందర్ సింగ్ కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆస్తిపై తనకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ కోర్టుకు వెళ్లారు.
అదే సమయంలో మూడో వీలునామా ప్రకారం, ప్రిన్సెస్ అమృత్ కౌర్‌కు ఆస్తిలో ఎలాంటి వాటా దక్కలేదు. దీంతో ఆమె కూడా సివిల్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తన తండ్రి ఆస్తిలో మూడింట ఒక వంతు తనకు దక్కాలంటూ ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
కోర్టు విచారణల్లో మహారావల్ ఖెవాజీ ట్రస్టు కూడా భాగమైంది. 1993లో ప్రిన్సెస్ అమృత్ కౌర్, మూడో వీలునామా చెల్లదని చెప్పాలంటూ కోర్టులో డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దిగువ కోర్టు ఏం చెప్పింది?
2013లో దిగువ కోర్టు ఈ రెండు కేసులను కొట్టేసింది. మూడో వీలునామాను ఫోర్జరీ చేసినట్లు అనేక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని కోర్టు పేర్కొంది. అలాగే తనకు ఆస్తిపై హక్కు ఉందని మంజిత్ ఇందర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
మహారాణి దీపేంద్ర కౌర్‌తో పాటు ప్రిన్సెస్ అమృత్ కౌర్‌కు కూడా ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది.
మహారాజా హరీందర్ సింగ్ మూడో కుమార్తె, ప్రిన్సెస్ మహీప్ ఇందర్ కౌర్, 2001లో చనిపోయారు. ఆమె అవివాహిత. అలాగే ట్రస్టు గుర్తింపును కూడా కోర్టు రద్దు చేసింది.
దిగువ కోర్టు తీర్పును ప్రిన్సెస్ దీపేందర్ కౌర్, మహారావల్ ఖెవాజీ ట్రస్టు, ఇందర్ సింగ్ సవాలు చేశారు. అయిదేళ్ల తర్వాత 2018లో ఈ కేసును విచారించిన కోర్టు, దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ వ్యవహారం పంజాబ్ హరియాణా హైకోర్టుకు చేరింది. ఆ హైకోర్టు కూడా మూడో వీలునామాను నకిలీ పత్రంగా పేర్కొంది. మంజీత్ ఇందర్ సింగ్ వాదనకు కూడా ఎలాంటి అర్హత లేదని తేల్చి చెప్పింది.

ఫొటో సోర్స్, AMARINDER SINGH
సుప్రీం కోర్టు నిర్ణయం ఏంటి?
30 ఏళ్లుగా సాగుతోన్న ఈ వివాదంపై తుదితీర్పును ప్రకటిస్తూ, రాజా హరీందర్ సింగ్ బ్రార్ ఆస్తిపై జీవించి ఉన్న ఇద్దరు కుమార్తెలకు హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తెలిపింది.
భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ యు.యు లలిత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, ఈ ఏడాది జులై నెలలో ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. పంజాబ్ హరియాణా హైకోర్టు నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సంస్థాన ఆస్తుల బాధ్యతలు చూసుకుంటోన్న ట్రస్టును తక్షణమే రద్దు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

వీలునామాను తిరగ రాసినట్లు ఎలా గుర్తించారు?
రాజా హరీందర్ సింగ్ పెద్ద కుమార్తె, ప్రిన్సెస్ అమృత్ కౌర్ ఈ వివాదంలో ప్రైవేట్ ఫోరెన్సిక్ నిపుణులు జెస్సీ ఆనంద్ సహాయాన్ని తీసుకున్నారు. వీలునామాలో ఏదో తేడా ఉన్నట్లు అమృత్ కౌర్ వెంటనే గ్రహించారని జెస్సీచెప్పారు.
''అన్ని కోణాల్లో మేం ఆ వీలునామాను పరిశీలించాం. మహారాజా బాగా చదువుకున్నవారు. ఆయన చేతిరాత చాలా అందంగా ఉంటుంది. ఇదొక్కటే కాదు, ఆ వీలునామాలో చాలా అక్షర దోషాలు ఉన్నాయి. ఆయన సంతకం కూడా వేరేలా ఉంది. వీలునామాను తయారు చేయడం కోసం చాలా టైప్‌రైటర్లను ఉపయోగించారు'' అని ఆమె చెప్పారు.

మహారాజా సోదరుని కుటుంబానికి ఆస్తిలో వాటా దక్కుతుందా?
హరీందర్ సింగ్ సోదరుడి కుటుంబానికి ఆస్తిలో నాలుగో వంతు వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాజు కుమారుడు జీవించి లేకపోవడం వల్ల సోదరునికి, ఆస్తిపై హక్కు ఉంటుందని ఆయన కుటుంబం వాదించింది. ఈ వాదనను హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. కానీ, మహారాణి మోహిందర్ కౌర్ వీలునామా మేరకు సుప్రీంకోర్టు ఆ కుటుంబానికి ఆస్తిలో వాటా ఇచ్చింది.
1989లో మహారాజా హరీందర్ సింగ్ మరణించే సమయంలో ఆయన తల్లి మహారాణి మోహిందర్ కౌర్ జీవించి ఉన్నారు.
అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. 'మొత్తం ఆస్తుల్లో నాలుగింట ఒక వంతు మాకు లభించింది' అని చెప్పారు.

ఫొటో సోర్స్, BHART BHUSHAN/BBC
ఇప్పుడు ఏం జరుగనుంది? కోర్టు వివాదం ముగిసినట్లేనా?
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుటుంబం, ఆస్తుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఒక మార్గం ఏంటంటే... కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఎవరు ఏ ఆస్తిని తీసుకుంటారో చర్చించుకోవాలి. అలా కాకుంటే, కోర్టు స్వయంగా ఆస్తిని విభజించి వాటాలు అప్పగిస్తుంది. అయితే, దీన్ని తేల్చడానికి కోర్టుకు కూడా చాలా సమయం పడుతుందని అమరీందర్ సింగ్ చెప్పారు.
ఇక్కడితో ఈ న్యాయ పోరాటం ముగుస్తుందా? దీని గురించి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... ''కుటుంబ కలహాలు ముగిసిపోయాయి. కానీ, ఈ న్యాయపోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే మాకు చాలా ఆస్తులున్నాయి. వాటిలో చాలావరకు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కింగ్ చార్లెస్ 3: ఆయనకున్న 12 భవనాల్లో ఏది రాజనివాసం కాబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- యూరప్‌లో నదులు అంతరించిపోతాయా? నదులు ఎందుకు వరుసగా ఇలా ఎండిపోతున్నాయి, నీటి కోసం ఏం చేయాలి?
- మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












