Europe drying rivers: యూరప్‌లో నదులు అంతరించిపోతాయా? నదులు ఎందుకు వరుసగా ఇలా ఎండిపోతున్నాయి, నీటి కోసం ఏం చేయాలి?

నీటి ఎద్దడి

ఫొటో సోర్స్, Arpad Kurucz/Anadolu Agency/Getty Images

    • రచయిత, పాల్ హాకెన్స్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల నడుమ యూరప్‌ నదుల్లోని నీరు ఊహించని స్థాయిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రాబోయే విపత్తుకు ఇది సంకేతమా?

జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో పుట్టిన డాన్యూబ్ నది 2,898 కి.మీ. దూరం ప్రయాణించి రొమేనియా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో కలుస్తుంది. ఈ నదీ తీరం వెంబడి చాలా నగరాలు, పట్టణాలు కనిపిస్తాయి. అలాంటి చిన్న పట్టణాల్లో రొమేనియాలోని జిమినిసియా ఒకటి. బల్గేరియా సరిహ్దుల్లో ఇది కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు జల మార్గాలపైనే ప్రధానంగా ఆధారపడుతుంటారు.

అయితే, ఈ ఏడాది ముందెన్నడూ చూడని నీటి ఎద్దడి, రికార్డు స్థాయి ఉస్ణోగ్రతల నడుమ ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించిన డాన్యూబ్ నది అడుగంటింది. దీంతో నదిపైనే ఆధారపడి జీవించే జిమినిసియా నౌకాశ్రయ కార్మికులు, రైతులు, నౌకా నిర్మాణ సిబ్బంది, రెస్టారెంట్ల యజమానులు, తదితర ప్రజల మనుగడ ప్రమాదంలో పడింది.

నీటి మట్టం ఇంత కనిష్ఠానికి పడిపోవడాన్ని ముందెన్నడూ ఇక్కడి ప్రజలు చూడలేదు. నదికి అడుగున ఉండే మట్టి కూడా కనిపిస్తోంది. తీరం వెంబడి చనిపోయి కనిపిస్తున్న నత్తలు.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతున్నాయి.

వేసవిలో సాధారణంగా కనిపించే నీటి మట్టంలో సగానికి ప్రస్తుతం డాన్యూబ్ పడిపోయింది. దీంతో డజన్ల కొద్ది రవాణా నౌకలు జిమినిసియా నౌకాశ్రయంలో అలా ఎదురుచూస్తూ ఉండిపోయాయి. నదిలో నీటి మట్టం పెరిగితేనే ఇవి ముందుకు వెళ్లడానికి వీలుపడుతుంది. అప్పుడప్పుడు పడే వర్షం నీటిని ఒడిసిపట్టి ఇంట్లో అవసరాల కోసం ప్రజలు వాడుకుంటున్నారు. డాన్యూబ్ నీటిని తాగు నీటి అవసరాలకు మాత్రమే ఉంచుకుంటున్నారు. నది ఎండిపోవడంతో కొత్తగా కనిపిస్తున్న మట్టితో నిండిన బీచ్‌లపై పిల్లలు ఆడుకుంటున్నారు.

నీటి ఎద్దడి

ఫొటో సోర్స్, Arpad Kurucz/Anadolu Agency/Getty Images

డాన్యూబ్‌ నదీ మధ్య ప్రాంతంలో కొన్నిచోట్ల అత్యవసర సేవల సిబ్బంది గొయ్యిలు కూడా తవ్వుతున్నారు. నది లోతు పెంచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలా చేస్తే నౌకలు ముందుకు వెళ్లేందుకు వీలుపడుతుందని నిపుణుల అంచనా. యుక్రెయిన్ నుంచి వచ్చే ఆహార ధాన్యాలు యూరప్ సహా భిన్న ప్రాంతాలకు చేరుకోవాలంటే నల్ల సముద్రం మీదుగా ప్రయణించాలి. అయితే, ఇక్కడి చాలా నౌకాశ్రయాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. దీంతో డాన్యూబ్ నది యుక్రెయిన్ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతోంది. అయితే, ఇప్పుడు నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నౌకలు ముందుకు కదలడం లేదు.

దక్షిణ రొమేనియాలో తాగు నీటికి డాన్యూబ్ నదే ఆధారం. అయితే, ఇక్కడ వందల కొద్దీ గ్రామాలు ప్రస్తుతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సాగు నీటి వనరులను కూడా తాగు నీటి కోసం మళ్లిస్తున్నారు. దీంతో యూరప్‌కు ఆహారాన్ని అందించే మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయాలు లాంటి పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు పర్యటకులను తీసుకువచ్చే రవాణా నౌకలు ఇప్పుడు మొత్తంగా నిలిచిపోయాయి. 2022 మొదటి ఆరు నెలల్లో రొమేనియా జల విద్యుత్ కేంద్రం హైడ్రోఎలెక్రీసియా సాధారణం కంటే మూడో వంతు తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. యూరప్‌లో గోదుమలను ఎక్కువగా పండించే దేశాల్లో రొమేనియా ఒకటి. అయితే, నీటి ఎటి ఎద్దడి వల్ల దాదాపు 20 శాతం పంటను నష్టపోయామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. యుక్రెయిన్ ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుకోకుండా రష్యా అడ్డుకుంటున్న నేపథ్యంలో రొమేనియా ఎగుమతులు కీలకంగా మారనున్నాయి.

నీటి ఎద్దడి

ఫొటో సోర్స్, Andrei Pungovschi/AFP/Getty Images

‘‘డాన్యూబ్ వెంబడి నగరాలపై నీటి ఎద్దడి, వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ప్రభావం నదీ పరివాహక ప్రాంతాలపై ఉండే వారిపై పడుతోంది’’అని ద డాన్యూబ్: ఏ జర్నీ అప్‌రివర్ ఫ్రమ్ ద బ్లాక్ సీ టు బ్లాక్ ఫారెస్ట్ పుస్తక రచయిత నిక్ థ్రోప్ అన్నారు.

యూరప్‌లో మూడింట రెండొంతుల ప్రాంతాలు ప్రస్తుతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గత 500 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు లేవని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి భూమి వేడెక్కడమే ప్రధాన కారణమని వారు అంటున్నారు. లియోర్ నుంచి రైన్ వరకు చాలా నదులపై హీట్‌వేవ్ తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీంతో యూరప్ ఆహార సరఫరా, వాణిజ్యం, తాగునీరు, విద్యుత్, పర్యావరణం ప్రభావితం అవుతున్నాయి. ఇలాంటి విపరీత వేసవిలు దీర్ఘ కాలం కొనసాగితే, కొన్ని నదులు ఇక ఎప్పటికీ కోలుకోలేవని పరిశోధకులు చెబుతున్నారు.

రైన్ నదీ తీరం వెంబడి బొగ్గు, చమురు, ఇతర వస్తువులను తీసుకెళ్లే నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

జులై నాటికి ఇటలీలోని ‘‘పో’’ నదిలో నీటి మట్టం విపరీతంగా పడిపోవడంతో ప్రభుత్వం అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఉత్తర ఇటలీలో అయితే, భారీగా పంట పొలాలు నీరులేక ఎండిపోతూ కనిపిస్తున్నాయి.

ఫ్రాన్స్‌లో రోన్, గరోన్ నదులు వేడెక్కడంతో వీటిలోని నీరు అణువిద్యుత్ రియాక్టర్లను చల్ల బరిచేందుకు ఉపయోగపడటం లేదు. దీంతో చాలా విద్యుత్ కేంద్రాలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. చాలా పెద్ద నదుల ఉప నదుల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

నీటి ఎద్దడి

ఫొటో సోర్స్, Daniel Mihailescu/AFP/Getty Images

ఈ ఏడాది ఆగస్టులో ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిజబెత్ బోర్న్ మాట్లాడుతూ.. దేశం ముందెన్నడూ చూడని తీవ్రమైన నీటి ఎద్దడి ముంగిట ఉందని హెచ్చరించారు. లోయిర్, డోబ్స్, డార్డోనే, గారోన్‌లాంటి నదులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ వందల మున్సిపాలిటీలకు ట్రక్కులతో నీటిని సరఫరా చేయాల్సి ఉంటోంది.

‘‘ఈ ఏడాది నీటి ఎద్దడి తీవ్రత అసాధారణంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులకు మనం అలవాటు పడాల్సి ఉంటుందేమో’’అని జర్మనీకి చెందిన హెల్మోల్ట్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ (యూఎఫ్‌జడ్)కు చెందిన కార్స్‌టెన్ రింక్ అని అన్నారు.

‘‘నేడు యూరప్‌లో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. ఏటా ఇది మరింత తీవ్రం అవుతోంది. నీటి మట్టం పెరుగుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు’’అని రింక్ చెప్పారు. గత నాలుగైదు ఏళ్లుగా వేసవిలో ఇలాంటి నీటి ఎద్దడి వల్ల భూగర్భ జల వనరులు పూర్తిగా అడుగంటాయని, మరోవైపు హిమానీనదాలు కూడా వేగంగా కరిగిపోతున్నాయని ఆయన వివరించారు.

‘‘ఈ ఏడాది పరిస్థితి ఎందుకు అంత తీవ్రంగా కనిపిస్తోందంటే.. బవారియా నుంచి నల్ల సముద్రం వరకు డాన్యూబ్ తీరం మొత్తంగా నదిలో నీటి నిల్వలు పడిపోయాయి’’అని వియన్నాలోని యూనివర్సిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన థామస్ హెయిన్ వ్యాఖ్యానించారు. ఈ నదీ బేసిన్‌లో 19 దేశాల పరిధిలోని 8,00,000 చ.కి.మీ. ప్రాంతం ఉంది. యూరప్ భూభాగంలోని పది శాతం ప్రాంతాలకు ఇదే ఆధారం. ‘‘ఈ నది మొత్తం తీవ్రంగా ప్రభావం అవుతోంది. ఏదో రెండు ప్రాంతాల మధ్య నీటి ప్రవాహం తగ్గితే మనం పరిష్కరించొచ్చు. నది మొత్తం ఇలా ఉంటే ఎలా?’’అని థామస్ వ్యాఖ్యానించారు.

నీటి ఎద్దడి

ఫొటో సోర్స్, Thierry Monasse/Getty Images

సెర్బియాలోని రెండో అతిపెద్ద నగరం నోవిసాడ్ దగ్గ డాన్యూబ్ ప్రవాహం చాలా నెమ్మదిగా ఉంది. దీంతో ప్రజలు నీటిలో అటూఇటూ నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి తాము ముందెన్నడూ చూడలేదని ఇక్కడి వృద్ధులు కూడా వివరిస్తున్నారు. నౌకలు, పడవలు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. ముందెన్నడూ కనిపించని దీవులు నది మధ్యలో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అత్యవసర స్థితి ప్రకటించాలని నోవిసాడ్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన డజన్లకొద్దీ నౌకలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. కొన్ని నౌకల్లో పేలుడు పదార్థాల అవశేషాలు కూడా ఉన్నాయి.

యూరప్ వాణిజ్యంపైనా నీటి ఎద్దడి ప్రభావం చూస్తోంది. యూరప్‌లో జీవించే ఒక్కొక్కరికి ఏడాదికి ఒక టన్ను చొప్పున వస్తువుల రవాణా ఈ జల మార్గాలపై నుంచి వెళ్తుంది. మరోవైపు 80 బిలియన్ డాలర్ల (రూ.6,33,281 కోట్లు) వాణిజ్యానికి ఇక్కడి జల మార్గాలే ఆధారం.

రైన్ నదీ తీరంలోనూ ఇసుక మేటలు పెద్దయెత్తున కనిపిస్తున్నాయి. దీంతో జర్మనీలోని రూర్ లోయలోని నగరాల నుంచి బొగ్గు, డీజిల్, వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం కష్టం అవుతోంది. నీటి ఎద్దడి వల్ల ఆర్థిక నష్టంతోపాటు ఇంకా చాలా సమస్యలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గ్యాస్, చమురు సరఫరాలపై రష్యా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రైన్ నుంచి వచ్చే బొగ్గు, ఇంధనం కీలకంగా మారనున్నాయి. చల్లని నీరు అందుబాటులో లేక ఫ్రాన్స్‌లో జల విద్యుత్ కేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో ఇప్పటికే ఫ్రాన్స్‌లో విద్యుత్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇక్క ఒక మెగా వాట్ అవర్‌కు 900 యూరోలు (రూ.72,513) చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ధరతో పోలిస్తే, ఇది పది రెట్లు ఎక్కువ.

వీడియో క్యాప్షన్, కరవు కారణంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో చైనా

నదుల్లో నీరు తగ్గిపోవడంతో నీరు ప్రవాహ వేగం మందగిస్తుందని, మరోవైపు నీటిలో లవణీయత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువవుతాయని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్ యూనివర్సిటీ ఎకాలజిస్టు గాబ్రియేల్ సింగర్ చెప్పారు. ఈ పరిస్థితులు చాలా నదీ జలచరాలకు ముప్పుగా పరిణమిస్తాయని వివరించారు. ముఖ్యంగా డాన్యూబ్ సాల్మన్, బార్బెల్, యూరోపియన్ గ్రేలింగ్ లాంటి జీవుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.

ఉష్ణోగ్రతలు పెరగడంతో నీటిలో నాచు కూడా పెరుగుతుందని, ఇది నీటి ఆరోగ్యానికే ముప్పుని సింగర్ వివరించారు. ‘‘జర్మనీలోని చాలా నదుల్లో ఇదే జరిగింది. మోసెల్, నెక్కర్‌లతోపాటు ఆడెర్ నదిలోనూ గత ఆగస్టులో వంద మెట్రిక్ టన్నుల మృతిచెందిన చేపలు నదిపై తేలుతూ కనిపించాయి’’అని ఆయన తెలిపారు.

పెద్దపెద్ద నదుల్లో నీటి మట్టం పడిపోవడంపై వార్తలు వస్తున్నప్పటికీ, చిన్ననదులే ఎక్కువ ప్రభావితం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘‘కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతున్నాయి. వాటిలో నేడు ఒక్క చుక్క నీరు కూడా లేదు. దీని వల్ల నదిలో వైవిధ్యం మొత్తం దెబ్బతింటుంది. తర్వాత నీరు వచ్చినా ఇక్కడ జీవులు కనిపించకపోవచ్చు’’అని రింక్ చెప్పారు.

నదుల వెంబడి భారీగా నిర్మిస్తున్న భవనాలు, డ్యామ్‌లు, కాలుష్యం, మురుగు నీరు, వ్యవసాయం నుంచి వచ్చే నీరు కూడా నదులపై ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా హీట్ వేవ్‌లు, నీటి మట్టం తగ్గిపోవడం, వరదలు లాంటి ముప్పులకు నదిని అనువుగా ఇవి మార్చేస్తున్నాయని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఐదు వేల ఏళ్ల కింద నిర్మించిన డ్రైనేజీ కాల్వలే కాపాడాయంటున్న నిపుణులు

‘‘మన నదులన్నీ ముప్పుల ముంగిట ఉన్నాయి’’అని సింగర్ అంచనా వేశారు. ‘‘ఇక్కడ డాన్యూబ్ దిగువన నీటి ఎద్దడి కనిపిస్తుంటే, డాన్యూబ్ ఎగువన ముఖ్యంగా జర్మనీ, ఆస్ట్రేలియాల్లో గత జులై వరదలు వచ్చాయి. వీటికి కారణం.. నీటిలో మార్పులకు అనుగుణంగా ప్రవాహాన్ని నది నియంత్రించలేకపోవడమే. ప్రకృతిలో సహసిద్ధమైన వ్యవస్థలు ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తూ ముప్పులను నియంత్రిస్తాయి. కానీ, నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదు’’అని ఆయన వివరించారు.

‘‘మనం చాలా నీటిని కోల్పోతున్నాం. ఎందుకంటే సిమెంట్‌తో సీల్ చేసిన భూమి నీటిని పీల్చుకోలేదు. నీటి ఎద్దడి తర్వాత కురిసే వాన నీటిని కూడా భూమి తీసుకోలేకపోతోంది. వేగంగా కదిలే నదుల్లోని నీరు భూగర్భానికి వెళ్లడంలేదు’’అని వియన్నా యూనివర్సిటీలో లిమ్నాలజిస్టు క్రిస్టియన్ గ్రీబ్లెర్ అన్నారు.

నదుల మధ్యలో తవ్వడంతో పరిస్థితి మెరుగుపడటానికి బదులుగా.. ఇంకా తీవ్రం అవుతుందని సింగర్, బ్రీబ్లెర్ అంటున్నారు.

‘‘భూతాపాన్ని తగ్గించే దిశగా దీర్ఘ కాలంలో చర్యలు తీసుకోవాలి. ముందు నీటిని పీల్చుకునే వెట్‌ల్యాండ్‌ల పరిరక్షణ, కొత్తవి ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి’’అని వారు సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పొలాల్లో బాంబులు పడుతున్నా, పంట కోతలు సాగిస్తున్న యుక్రెయిన్ కర్షకులు

ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని సింగర్ అన్నారు. గత ఏడాది మురా, ద్రావా, డాన్యూబ్ నది బేసిన్లలోని దాదాపు పది లక్షల హెట్టార్ల భూమిని బయోస్పిరిక్ రిజర్వుగా యునెస్కో ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

యూరప్‌లోనే అతిపెద్ద వెట్‌ల్యాండ్ డాన్యూబ్ డెల్టా.. 1988 నుంచి అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో ఉంది. అయినప్పటికీ, నేడు ఈ ప్రాంతాన్ని విపరీత వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. ఈ డెల్టా పరిధిలోని మంచినీటి స్ప్రింగ్‌లు గత ఆగస్టులో ఎండిపోయాయి. దీంతో రొమేనియా అటవీ గుర్రాల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇక్కడి స్ప్రింగ్‌లలో మళ్లీ నీరు ఉబికి వచ్చేలా చేసేందుకు అధికారులు పెద్దపెద్ద గొయ్యిలు తవ్వారు. దీంతో గుర్రాలు తాగేందు కొంత నీరు అందుబాటులోకి వచ్చింది.

‘‘వర్షాలు లేనప్పుడు కూడా నదిలో నీటి ప్రవహానికి కారణమయ్యే హిమానీనదాలు ఇప్పటికీ ఉండటం నిజంగా అదృష్టం లాంటిదే’’అని హెయిన్ అన్నారు. అయితే, మరో 30ఏళ్లలో అవి కూడా అంతరించిపోయే ముప్పుందని అంచనాలు చెబుతున్నాయని ఆయన హెచ్చరించారు.

ఇలాంటి విపరీత పరిస్థితులను తట్టుకునేలా డాన్యూబ్ బేసిన్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుందని యూరోపియన్ యూనియన్ స్ట్రాటజీ ఫర్ ద డాన్యూబ్ రీజియన్ కోఆర్డినేటర్ రాబర్ట్ లీక్టెనెర్ అన్నారు. ‘‘ఈ ముప్పులను మనం తగ్గించాలి. అదే సమయంలో మారుతున్న పరిస్థితులకు మనం కూడా అలవాటు పడాలి’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)