అమెజాన్ కార్చిచ్చు: 'మీ డబ్బు మాకొద్దు... ఆ డబ్బుతో యూరప్‌లోనే అడవులు పెంచుకోండి' - జీ7 సాయంపై బ్రెజిల్

ఫొటో సోర్స్, EPA
అమెజాన్ వర్షారణ్యాల్లో మంటల నియంత్రణకు సహాయం అందిస్తామన్న జీ7 ప్రతిపాదనను తిరస్కరిస్తామని బ్రెజిల్ చెప్పింది.
అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు 2.2 కోట్ల డాలర్లను జీ7 సహాయంగా విడుదల చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ సోమవారం చెప్పారు.
ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఏడు దేశాల ఈ కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలు. ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ పట్టణంలో జీ7 శిఖరాగ్ర సదస్సుకు మేక్రాన్ ఆతిథ్యం ఇచ్చారు. సదస్సు సోమవారం ముగిసింది.
నిధులు వెంటనే బ్రెజిల్‌కు అందుబాటులో ఉంచుతామని మేక్రాన్ తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా మంటలార్పేందుకు మరిన్ని విమానాల ఏర్పాటు కోసం వినియోగించాలన్నారు. బ్రెజిల్‌కు ఫ్రాన్స్ సైనిక సహాయం కూడా అందిస్తుందని చెప్పారు.
బ్రెజిల్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎర్నోస్టో అరావుజో స్పందిస్తూ- అడవుల నిర్మూలనను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందం పరిధిలో అవసరమైన అంతర్జాతీయ వ్యవస్థలు ఉన్నాయని, కొత్త ఏర్పాట్లు అక్కర్లేదని వ్యాఖ్యానించారు.
అమెజాన్ అడవుల్లో మంటలు అదుపులోనే ఉన్నాయని రక్షణశాఖ మంత్రి ఫెర్నాండో అజెవెడో ఇ సిల్వా తెలిపారు.
బ్రెజిల్‌ను ఫ్రాన్స్ ఒక 'కాలనీ'గా చూస్తోందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆరోపించారు.

ఫొటో సోర్స్, Reuters
జీ7 సహాయ ప్రతిపాదనపై బొల్సోనారో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒనిక్స్ లోరెంజోని స్పందిస్తూ- "నిధులు ఇస్తామన్నందుకు ధన్యవాదాలు, కానీ ఆ నిధులు యూరప్‌లో అడవులను తిరిగి పెంచేందుకే ఎక్కువ అవసరమేమో" అన్నారు. 'గ్లోబో' వార్తా వెబ్‌సైట్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేక్రాన్ ఆ చర్చిలో ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు"
"ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్వదేశంలో ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన ఒక చర్చిలో అగ్ని ప్రమాదాన్ని ముందస్తుగా పసిగట్టలేకపోయారు. ఆయన మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకొంటున్నారు" అని లోరెంజోని ఎద్దేవా చేశారు.
ఏప్రిల్లో పారిస్‌లోని 850 ఏళ్ల నాటి నాట్రడామ్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ మాట అన్నారు.
అమెజాన్ లాంటి స్థానిక అడవులను ఎలా రక్షించుకోవాలనేది ఏ దేశానికైనా బ్రెజిల్ చెప్పగలదని లోరెంజోని తెలిపారు.
నిజమైన పర్యావరణ సమస్యలను ఒక సంక్షోభంగా చిత్రీకరించి, అమెజాన్ అడవులపై బాహ్య నియంత్రణకు యంత్రాంగాన్ని తేవడానికి దీనిని సాకుగా చూపే యత్నాలు జరుగుతున్నాయని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, REUTERS/Ueslei Marcelino
అమెజాన్‌లో రికార్డు సంఖ్యలో వ్యాపించిన కార్చిచ్చుల నియంత్రణకు తమ ప్రభుత్వానికి తగినన్ని వనరులు లేవని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ఇంతకుముందు చెప్పారు.
జీ7 సహాయ ప్రతిపాదనపై స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌పీస్ పెదవి విరిచింది.
అమెజాన్ అడవుల దహనం ఒక పర్యావరణ విధ్వంసమని, దీని తీవ్రత, దీనిని నియంత్రించాల్సిన అత్యవసర పరిస్థితిని బట్టి చూస్తే జీ7 ప్రతిపాదించిన సహాయం సరిపోదని గ్రీన్‌పీస్ ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది.
అమెజాన్ వర్షారణ్యాల పరిరక్షణకు 50 లక్షల డాలర్లు ఇస్తానని ప్రఖ్యాత హాలీవుడు నటుడు లియోనార్డో డికాప్రియో సోమవారం ప్రకటించారు.
అటవీశాస్త్రంలో అంతర్జాతీయ నిపుణుడు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకోసిస్టమ్ సైన్స్ ప్రొఫెసర్ యద్వీందర్ మల్హి బీబీసీతో మాట్లాడుతూ- బ్రెజిల్‌లో రాజకీయ ప్రాధాన్యాలు మారాల్సి ఉందని, ఈ మార్పే అత్యంత ప్రధానమైనదని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఏడాది బ్రెజిల్ పర్యావరణ సంస్థకు నిధుల్లో 95 శాతం కోత విధించారని, దీంతో వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన అనేక చర్యలకు విఘాతం కలుగుతోందని ఆయన ప్రస్తావించారు.
అమెజాన్ అడవులు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నప్పటికీ అధిక భాగం బ్రెజిల్ పరిధిలోనే ఉన్నాయి.
మేక్రాన్‌పై కొంత కాలంగా విమర్శలు చేస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో- అమెజాన్ ప్రాంతంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్హేతుక దాడులు చేస్తున్నారని, మేక్రాన్ ఆయన ఉద్దేశాలను జీ7 మాటున దాస్తున్నారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, AFP
ఐరోపా దేశాలపై బొల్సొనారో ఆరోపణ ఏమిటి?
బ్రెజిల్ సహజ వనరులపై నియంత్రణ కోసం యూరోపియన్ దేశాలు చాలా కాలంగా యత్నిస్తున్నాయని అధ్యక్షుడు బొల్సొనారో చెబుతున్నారు.
అమెజాన్ అడవుల పరిరక్షణ అనేది అమెజాన్ ప్రాంతంలో పాదం మోపాలనే ఐరోపా యత్నాలకు ఒక ముసుగు మాత్రమేనని ఆయన ఆరోపిస్తున్నారు.
జులై 6న మీడియా సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ జర్నలిస్టుల ప్రశ్నలకు బొల్సొనారో సమాధానమిస్తూ- "వక్రబుద్ధి ఉన్న ప్రతి ఒక్కడూ కామించే కన్యలా అయిపోయింది బ్రెజిల్ పరిస్థితి" అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
అమెజాన్ బ్రెజిల్‌ది కాదనే భావన యూరోపియన్లలో ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
బ్రెజిల్‌కు ఈ దేశాలు నిధులు పంపేది సాయం చేసేందుకు కాదని, బ్రెజిల్ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకొనేందుకేనని ఆయన గత వారం ఆరోపించారు.
బ్రెజిల్ అటవీ ప్రాంతంలో గ్రీష్మంలో కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. బ్రెజిల్ అంతరిక్ష సంస్థ శాటిలైట్ డేటాను బట్టి చూస్తే - ఈ ఏడాది కార్చిచ్చులు 80 శాతం పెరిగాయి.
అమెజాన్‌లో మంటలను ఆర్పేందుకు, పర్యావరణ నేరాలను అరికట్టేందుకు 44 వేల మంది సైనికులను రంగంలోకి దించినట్లు బ్రెజిల్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- నా హిందీని బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే... రహస్యాన్ని వెల్లడించిన మోదీ
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- పాక్ అధీనంలోని కశ్మీర్లో 'స్వాతంత్ర్యం' ఎంత?
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








