Cost of living-బ్రిటన్‌లో ఆకలి కేకలు: ‘నేను భోజనం మానేస్తేనే నా రెండేళ్ల కూతురు కడుపునిండా తినగలదు’

ఫ్రిజ్‌లోకి చూస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మనీష్ పాండే, రేచల్ స్టోన్‌హౌస్
    • హోదా, బీబీసీ న్యూస్‌‌బీట్ ప్రతినిధులు

'నేను సాధారణంగా ఒక చిప్స్ ప్యాకెట్‌తో కడుపు నింపుకొంటున్నాను. అలా చేయకపోతే మా పాపకు తిండి ఉండదు'

తాషా తన జీవిత భాగస్వామి, రెండేళ్ల చిన్నారితో కలిసి నివసిస్తున్నారు. ఆమె ఫుల్ టైం జాబ్ చేస్తున్నా జీవన వ్యయం కారణంగా ఇంకా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఆమె తన ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునేటప్పటికి సాధారణంగా ఆలస్యమవుతుంది. అప్పటికి తినడానికి కూడా ఏమీ ఉండదు. దీంతో ఆమె తన చిన్నారి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.

'మా పాప ఇంకా చాలా చిన్నది. ఆమెకు పోషకాహారం అవసరం'.

'మా పాప కోసం నా శాయశక్తులా పాటుపడుతున్నానని నేను అనుకుంటుంటాను. కానీ, నేను వైఫల్యం చెందుతున్నాననీ అనిపిస్తుంది' అని 'రేడియో 1 న్యూస్ బీట్'తో అన్నారు బ్రిటన్‌లోని డెర్బీలో నివసించే పాతికేళ్ల తాషా.

పెట్రోలు, ఆహార ధరల పెరుగుదల కారణంగా గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వేగంగా ఈఏడాది ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

'నా కుటుంబానికి చేదోడుగా ఉండాలనే నేను మళ్లీ పనిలో చేరాను' అన్నారు తాషా.

తాషా
ఫొటో క్యాప్షన్, తాషా

బ్రిటన్‌లో 'యూత్ హోమ్‌లెస్‌నెస్ చారిటీ సెంటర్ పాయింట్' సర్వేలో పాల్గొన్న 2 వేల మందిలో 177 మంది తరచూ పస్తులుంటున్నట్లు చెప్పారు. వీరంతా 16 నుంచి 25 ఏళ్ల లోపు వారు. తమ కుటుంబంలో ఇంకెవరికైనా ఆకలి లేకుండా చూసేందుకు వీరు భోజనం త్యాగం చేస్తున్నారు.

'వరుసగా 3 రోజులుగా ఆకలితో గడిపాను' అని వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన జహ్రా చెప్పారు.

'ఆ రెండు రాత్రులు నాకు ఇంకా గుర్తున్నాయి. అర్ధరాత్రి నిద్ర లేచి ఆకలితో ఏడ్చేదాన్ని. ఆ చిమ్మచీకటిలో లైట్ కూడా వేసుకునేదాన్ని కాను' అని ఆ బాధాకర అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, పొలాల్లో బాంబులు పడుతున్నా, పంట కోతలు సాగిస్తున్న యుక్రెయిన్ కర్షకులు

సర్వేలో పాల్గొన్న 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులైన 2000 మందిలో 265 మంది గత 12 నెలల్లో తాము అనేకసార్లు ఆకలితోనే పడుకున్నామని చెప్పారు.

తాము ఫుడ్ బ్యాంకులపై ఆధారపడ్డామని 207 మంది చెప్పారు.

ఇన్ని ఇబ్బందుల్లోనూ తనకు ఇతరుల నుంచి సాయం అందిందని జహ్రా చెప్పారు.

జేడ్
ఫొటో క్యాప్షన్, జేడ్

23 ఏళ్ల జేడ్ కూడా ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఆమెకు ఏడేళ్లు, మూడేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లండన్‌లో వారుంటున్న ప్రాంతంలోని చర్చి, చుట్టూ ఉన్నవారి నుంచి కూడా సహాయం అందిందని ఆమె తెలిపారు.

వాళ్లంతా లేకపోయి ఉంటే తాను ఆకలితోనే గడపాల్సి వచ్చేదని ఆమె అన్నారు.

ఇంట్లో గ్యాస్, కరెంటుకు కూడా ఇబ్బందులు పడేదాన్నని.. తన చుట్టూ ఉన్నవారే ఆదుకుంటున్నారని ఆమె చెప్పారు.

తిండికోసం కుటుంబసభ్యులపై కానీ, స్నేహితులపై కానీ ఆధారపడుతున్నట్లు 333 మంది ఈ సర్వేలో చెప్పారు.

అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు పనిచేసే సిటీ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థలో జేడ్, ఆమె స్నేహితురాలు రూత్ పనిచేస్తున్నారు.

ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి ఏం అవసరం ఉందో తెలుసుకుంటుంటామని రూత్ చెప్పారు.

కొంతమంది ఇళ్లలో ఫర్నిచర్ ఉండదు, మరికొందరు ఇళ్లలో కప్‌బోర్డులలో ఏ వస్తువులూ ఉండవు అని రూత్ తెలిపారు.

మూడు ఉద్యోగాలు చేస్తున్న జేడ్ తన జీతంలో కొంత మొత్తాన్ని ఇతరుల కోసమూ ఖర్చు చేస్తుంటారు.

సహాయం పొందుతున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Ruth

'అది 20 పౌండ్లో, 30 పౌండ్లో కావొచ్చు. ఎవరైనా యంగ్ పేరెంట్ తమ పిల్లలకు డైపర్లు కొనడానికో, వైప్స్ కొనడానికో డబ్బుల్లేకపోతే సాయం చేయడానికి పనికొస్తుంది' అంటారు జేడ్.

నిత్యవసరాలు కొనుగోలు చేసి అవసరమైన వారి ఇంటికి అందజేస్తామని రూత్ చెప్పారు.

'సమతులాహారం ఎక్కువ కాలం అందకపోతే దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయి. శరీర వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది' అని సెంటర్ పాయింట్‌ సంస్థకు చెందిన సీనియర్ డైటీషియన్ హెథర్ ప్యాటర్సన్ చెప్పారు.

'రోగ నిరోధక శక్తికి ఇలాంటి పరీక్ష ఎదురుకారాదు. ఇలాంటి జీవనం ఏమాత్రం సరైంది కాదు' అన్నారాయన.

వీడియో క్యాప్షన్, పక్షుల ఆకలి తీర్చడానికే పంటలు పండిస్తున్న రైతు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)