బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే: రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?

- రచయిత, బ్రజేశ్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ 'ఎక్స్‌ప్రెస్ వే'ను జులై 16న ప్రారంభించారు.
ప్రధాని ప్రారంభించిన అయిదు రోజులకే ఆ రోడ్డు అనేక చోట్ల పాడైంది.
రోడ్డు ప్రారంభించిన తరువాత పడిన తొలి వర్షానికి అది అనేక చోట్ల దెబ్బతిని, గోతులు పడి, పగుళ్లు ఏర్పడడంతో ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
అయితే, ఇవన్నీ చిన్నచిన్న సమస్యలేనని.. తొందర్లోనే మరమ్మతులు చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
ఈ రోడ్డును ఉత్తర్ ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మించింది.
ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ఉత్తర్ ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ మీడియా సలహాదారు దుర్గేశ్ ఉపాధ్యాయ్ 'బీబీసీ'తో మాట్లాడారు. రోడ్డు నిర్మాణం పూర్తయిందని.. అయితే, అక్కడక్కడా స్వల్పంగా పనులు పెండింగులో ఉన్నాయని చెప్పారు.
అయితే, రూ. 15,000 కోట్లతో 296 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నాణ్యతకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది?
ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల మీదుగా వెళ్తుంది. చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పుర్, జలౌన్, ఔరేయా, ఇటావాల మీదుగా ఈ మార్గం సాగుతుంది.
ఈ ఎక్స్‌ప్రెస్ వే ఇటావాలోని కుద్రైల్ వద్ద 'ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వే'తో కలుస్తుంది.
'బీబీసీ' బృందం 'బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే'పై ప్రయాణించింది. ఆ రోడ్డు ఎలా ఉందో పరిశీలించింది.. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ 'ఎక్స్‌ప్రెస్ వే'కు సంబంధించి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు వాస్తవమా కాదా అని పరిశీలించింది.
వర్షం కారణంగా ఎక్స్‌ప్రెస్ వే బాగా దెబ్బతింది. రోడ్డుపై అనేక చోట్ల పగుళ్లు కనిపించాయి. కొన్నిచోట్ల రోడ్డుపై ఉన్న వంతెనలు కూడా పాడయ్యాయి. మరికొన్ని చోట్ల ఒక లేన్ మాత్రం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది, మిగతా లేన్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
కుద్రైల్ వద్ద కూడా టోల్ ప్లాజా పనులు ఇంకా పూర్తికాలేదు. ఎక్స్‌ప్రెస్ వేపై కొద్ది దూరం ప్రయాణించిన తరువాత ట్రాఫిక్ అంతా ఒక లేన్‌లోకే డైవర్ట్ అయింది. మిగతా లేన్ల పనులు ఇంకా పూర్తి కాకపోవడమే దానికి కారణం. ఆ లేన్‌లో రోడ్డు పని, వంతెన పని కూడా ఇంకా జరుగుతోంది.
వర్షం నీరు రోడ్డుపై నిలవకుండా ఏర్పాటుచేసిన సిమెంటు పలకలు వర్షాలకు కొట్టుకుపోయాయి. వాటికి ఆధారంగా వేసిన ఇనుప బీమ్‌లు కొన్ని చోట్ల కుంగిపోగా మరికొన్ని చోట్ల పైకి కనిపిస్తున్నాయి.

ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో నివసిస్తున్న వారు ఏం చెబుతున్నారు?
జలోన్ జిల్లాలో ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో నివసించే భగవాన్ దాస్‌తో 'బీబీసీ' బృందం మాట్లాడింది. తనను తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకొన్న ఆయన ఈ రోడ్డు నిర్మాణంలో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
''రోడ్లు పాడయ్యేటంత భారీ వర్షం ఏమీ కురవలేదు. పొలాలన్నీ పొడిగానే ఉన్నాయి. కానీ, ఎక్స్‌ప్రెస్ వే మాత్రం పాడయిపోయింది. ప్రధానితో ప్రారంభింపజేయడానికి ప్రభుత్వం హడావుడిగా పనులు చేయడమే దీనికి కారణం'' అన్నారు భగవాన్ దాస్.
జలోన్ జిల్లాకే చెందిన లక్ష్మణ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. రోడ్లపై గుంతలు కప్పేక్రమంలో కనస్ట్రక్షన్ కంపెనీ అక్కడి రోడ్లు శిథిలాలను వేరే చోట్ల పడేయడంతో ఇబ్బందులొచ్చాయన్నారు.

రోడ్డు నాణ్యతపై విపక్షాల ప్రశ్నలు
'బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే' నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
దీనిపై విచారణ చేపట్టాలని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌లు డిమాండ్ చేస్తున్నాయి.
''బీజేపీ చెబుతున్న తాజా అభివృద్ధికి సంబంధించిన శిథిలాలు ఇవి. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేపై కనిపిస్తున్న ఈ పగుళ్లు బీజేపీ అవినీతికి సాక్ష్యాలు'' అంటూ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'బీజేపీ చేస్తున్న అభివృద్ధిలో నాణ్యత ఇదీ.. పెద్దపెద్దవాళ్లు వచ్చి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. కానీ, వారం రోజుల్లోనే దానిపై భారీ అవినీతి గోతులు బయటపడ్డాయి. దీనిపై రన్‌వే నిర్మించకపోవడం మంచిదైంది'' అని ఆయన మరో ట్వీట్‌లో విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎక్స్‌ప్రెస్ వేపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడం, హడావుడిగా ప్రారంభించడంపై ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తోంది.
''బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అనేది అవినీతికి మోడల్. నాలుగు రోజుల కిందట ప్రారంభించిన ఈ రోడ్ డివైడర్లు అప్పుడే పగిలిపోయాయి. కొన్నిచోట్ల రోడ్ పాడైపోయింది. ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్మించిన ఈ రహదారి వల్ల భవిష్యత్‌లో యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి బృందం పరిశీలనలో తేలింది'' అంటూ యూపీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన వరుణ్ గాంధీ కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వే నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
నిర్మాణంలో అవినీతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
'రూ. 15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజలు కూడా వర్షాలకు తట్టుకుని నిలవకపోతే దాని నాణ్యతపై కచ్చితంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నిర్మాణ కంపెనీ, ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీర్లకు వెంటనే సమన్లు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి'' అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఎక్స్‌ప్రెస్ వే వెంబడి కనీస సదుపాయాలు లేవు..
ఈ రోడ్ నిర్మించిన 'ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అధారిటీ'(యూపీఈఐడీఏ) వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మార్గంలో నాలుగు రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు, 14 మేజర్ రోడ్ బ్రిడ్జ్‌లు, 6 టోల్ ప్లాజాలు, 7 ర్యాంప్ ప్లాజాలు, 286 మైనర్ బ్రిడ్జ్‌లు నిర్మించాల్సి ఉంది.
కానీ, చాలాచోట్ల వంతెనల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. టోల్ ప్లాజాలు కూడా ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి.
చాలాచోట్ల మైలు రాళ్లు కూడా వేయలేదు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. సీసీ టీవీల ఏర్పాటు కూడా పూర్తికాలేదు.
అయితే, పనులు పూర్తికాకపోయినా సీసీ కెమేరాలు ఉన్నాయంటూ బోర్డులు మాత్రం కనిపించాయి.
చిత్రకూట్ నుంచి ఇటావాకు వస్తుంటే.. దారిలో ఒక్క పెట్రోలు బంకు కానీ టాయిలెట్ కానీ ఎక్స్‌ప్రెస్ వేపై కనిపించలేదు.
ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన చోట మాత్రం లైట్ ఉంది. అక్కడ రోడ్‌పై మార్కింగ్ కూడా చేస్తున్నారు. డివైడర్, రోడ్ అంచున మెటల్ బీమ్‌లు ఏర్పాటుచేశారు. మిగతా చోట్ల మాత్రం ఇలాంటి పనులేవీ పూర్తిచేయలేదు.
ఇవన్నీ త్వరలోనే పూర్తవుతాయని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.

రైతులు టోల్ చెల్లించాలా?
ఇటావాకు చెందిన మోహిత్ యాదవ్ ఒక వెల్డింగ్ షాప్ నడుపుతున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. 'దీపం కిందే చీకటి అనే సామెత ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు అతికినట్లు సరిపోతుంది. ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైన చోటే గుంత ఉంది. ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన గ్రామం దగ్గర రోడ్డు పూర్తిగా పాడైంది' అన్నారాయన.
ఈ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణం ఆర్థికంగా భారం కానుందని మోహిత్ అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ అదనంగా ఈ ఎక్స్‌ప్రెస్ వే పై టోల్ చార్జీలు చెల్లించడం రైతులకు భారమవుతుందని ఆయన అన్నారు.
''సైకిల్ కూడా లేనివారికి ఈ ఎక్స్‌ప్రెస్ వేతో ఏం లాభం? దీనిపై టోల్ భారం తప్పించుకోవడానికి ప్రజలు అదనంగా 2 గంటలు ప్రయాణిస్తారేమో కానీ దీనిపై మాత్రం వెళ్లరు. ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలి.. ఆ తరువాత ఎక్స్‌ప్రెస్ వే వంటివి నిర్మించొచ్చు. ప్రభుత్వం ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది.. కానీ, బయట కంపెనీలు వచ్చి వ్యాపారాలు చేస్తుంటాయి, ఇక్కడి ప్రజల బతుకులు మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి'' అన్నారు మోహిత్.

'ఎక్స్‌ప్రెస్' వేగానికి బ్రేకులు వేస్తున్న పశువులు
గడువుకు ముందు ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తోంది.
మూడేళ్లలో నిర్మిస్తామని చెప్పిన ఈ ప్రాజెక్టును 28 నెలలలోనే పూర్తి చేశామంటున్నారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే వల్ల వాహనాల వేగం పెరగడమే కాదు ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి వేగం కూడా ఊపందుకుంటుందని ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించినప్పుడు తన ప్రసంగంలో చెప్పారు.
ఈ రోడ్‌పైకి పశువులు రాకుండా చర్యలు చేపడతామనీ ప్రభుత్వం చెప్పింది. కానీ, ఎక్స్‌ప్రెస్ వేపై పశువులు మందలుమందలుగా తిరుగుతుండడం, కుక్కలు గుంపులుగా తిరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా సాగాల్సిన దుస్థితి.
చిత్రకూట్‌లోని గోండా గ్రామం నుంచి ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమవుతోంది. అక్కడి ప్రజలు దీనిపై సంతృప్తి కనబరుస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన అస్లామ్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ కొత్తగా వేసిన ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉందన్నారు.
ఇంకా కొన్ని చోట్ల పనులు జరుగుతున్నప్పటికీ దానివల్ల ఇబ్బందేమీ లేదని, క్రమంగా మొత్తం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ వే వల్ల గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గోండా గ్రామ పెద్ద రామ్ మిలన్ అన్నారు.
బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి వలసలు పోయేవారని.. ఈ మార్గం వల్ల ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తే స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అన్నారు. అప్పుడు వలసలు కూడా ఆగిపోతాయని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి చంద్రిక ప్రసాద్ ఉపాధ్యాయ కూడా యోగి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వల్ల బుందేల్‌ఖండ్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఈ ప్రాంతానికి జీవ రేఖ కానుందన్నారు.
చిత్రకూట్ వంటివి పర్యటకంగా అభివృద్ధి చెందడానికీ ఇది అవకాశమిస్తుందని చెప్పారు. ఇక్కడి నుంచి వలసలు ఆగిపోయి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చే రోజులు రానున్నాయనీ ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, పెట్రోలు, డీజిల్ ధరలు.. టోల్ చార్జీల గురించి ఆయన్ను ప్రశ్నించగా వాటన్నిటినీ భరించగలిగేవారు దీనిపై ప్రయాణిస్తారని చెప్పారు.
ఇలాంటి మార్గాలు నిర్మించిన ప్రతి చోటా టోల్ వసూలు చేస్తుంటారని చెప్పారు.

ఎక్స్‌ప్రెస్ వేపై జరుగుతున్న దుమారం నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. చిన్నచిన్న సమస్యలున్నా అవన్నీ సర్దుకుంటాయంటోంది.
గడువు కంటే 8 నెలల ముందే ప్రాజెక్టు పూర్తయిందని యూపీఈఐడీఏ మీడియా అడ్వయిజర్ దుర్గేశ్ ఉపాధ్యాయ అన్నారు.
నాణ్యత లోపాలపై ఆయన్ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. జలోన్ జిల్లాలో 195వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై నీరు చేరడం వల్ల గుంతలు ఏర్పడ్డాయని, మిగతా చోట్ల అలాంటిదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
లోపాలను వెంటనే సవరించారని, ప్రాజెక్టు దాదాపుగా పూర్తయిందని.. అక్కడక్కడా చిన్నచిన్న పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అవన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
ఎక్స్‌ప్రెస్ వే వెంబడి సౌకర్యాల కల్పన విషయంపైనా ప్రభుత్వం శ్రద్ధపెట్టిందని, త్వరలోనే ఆ పనులు పూర్తవుతాయని అన్నారు. అయితే, ఇవన్నీ ఎప్పటిలోగా పూర్తవుతాయనేది మాత్రం ఆయన చెప్పలేదు.
ఈ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టత కోసం బీబీసీ మరికొందరు ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..
- రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా... హాలీవుడ్ రైటర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















