రూ.5.8 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం: ప్రధాని మోదీ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో 85 పైసలు అక్రమార్కుల చేతుల్లోకే వెళ్తోందని కాంగ్రెస్‌కు చెందిన ప్రధానమంత్రే (రాజీవ్ గాంధీ) గతంలో స్వయంగా వ్యాఖ్యానించారనీ, అయినా ఆ అవినీతిని అరికట్టే దిశగా కాంగ్రెస్ ప్రయత్నించిన దాఖలాలు లేవని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారని 'సాక్షి' తెలిపింది.
తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో 85 శాతం అవినీతికి అడ్డుకట్ట వేసిందనీ, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.5.8 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిందని మోదీ చెప్పారు.
తాను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో 15వ ప్రవాస భారతీయుల దినోత్సవాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐలే విదేశాల్లో భారత్‌కు ప్రచారకర్తలనీ, దేశ సామర్థ్యాలకు వారే ప్రతీకలని మోదీ ప్రశంసించారు.
భారత్ మారదన్న భావనను తమ ప్రభుత్వం తొలగించిందనీ, తాము మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగన్నాథ్ ప్రసంగిస్తూ- నైపుణ్య భారతం, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి తదితర పథకాలతో మోదీ భారత్‌లో మార్పు తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మోదీ, శుద్ధ ఇంధనాన్ని వాడేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడంలో ముందున్నారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఫిబ్రవరిలోగా రైతుల ఖాతాల్లో రూ.8 వేల కోట్లు జమ చేస్తాం: ఏపీ మంత్రి సోమిరెడ్డి
రైతులకు ఫిబ్రవరి నెలలోపు రుణ విమోచన చేస్తామని, 4వ విడత, 5వ విడత రుణమాఫీతో పాటు 10 శాతం వడ్డీని కలిపి రూ.8 వేల కోట్లను ఫిబ్రవరి నెలాఖరుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారని ఈనాడు తెలిపింది.
బడ్జెట్‌లో రూ.4 వేల కోట్ల నిధులను కేటాయించామని, మిగిలిన రూ.4 వేల కోట్లను వివిధ మార్గాల్లో సమీకరించి రైతులను రుణాల నుంచి విముక్తులను చేస్తామని ఆయన చెప్పారు.
రుణమాఫీ పథకంలో రైతులకు రూ.1.5 లక్షల చొప్పున రూ.15,147 కోట్లు, రూ.50 వేలు లోపు రూ.4,482 కోట్లను(23.76 లక్షల మందికి) చెల్లించామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు.
గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంగళవారం మంత్రి సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సూక్ష్మ సేద్యానికి కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1400 కోట్లు కేటాయించి రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిందన్నారు.
తిత్లీ, పెథాయ్ తుపాన్లతో నష్టపోయిన వారికి రూ.3,300 కోట్ల పెట్టుబడి రాయితీని చెల్లించామని ఆయన వెల్లడించారు. రైతు బంధు పథకం తరహాలో ఆర్థిక సాయం చేయనున్నామన్నారు.
ఒకరిద్దరు తమకు రుణమాఫీ అమలు కాలేదని చెప్పగా, అర్జీలు ఇస్తే ఉన్నతాధికారులకు పంపి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇక జనవరి నుంచి డిసెంబరే ఆర్థిక సంవత్సరం!
ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌గా పరగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, వ్యవసాయంతో అనుసంధానం చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నమస్తే తెలంగాణ రాసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది.
నీతి ఆయోగ్‌లో ముఖ్యమంత్రులతో సమావేశంలో భాగంగా జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. వ్యవసాయ ఆదాయం ఎంతో ముఖ్యమైన భారత్ లాంటి దేశాల్లో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు.
జూన్‌లో వర్షాకాలం వస్తుంది. కానీ రాష్ట్రాలు వివిధ పథకాలు, వ్యయాలను అక్టోబర్‌కుగానీ మొదలుపెట్టలేకపోతున్నాయి. దీని వల్ల సగం ఏడాది మాత్రమే పథకాల అమలు జరుగుతోంది. అందుకే రెండేళ్ల కిందటే ఆర్థిక సంవత్సరాన్ని జనవరి 1నే మొదలయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆర్థిక సంవత్సరాన్ని మార్చడానికి గల కారణాలు, వివిధ పంటలు, వ్యాపారాలపై దాని ప్రభావం, పన్నుల వ్యవస్థలో మార్పుల్లాంటి వివిధ అంశాలపై నివేదికను తయారు చేసి కేంద్రానికి అందజేసింది.

ఫొటో సోర్స్, Reuters
కేరళ వరద సాయానికి రూ.3.26 కోట్ల చెల్లని చెక్కులు
నిరుడు కేరళలో సంభవించిన భీకర వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం చేయడానికి పలువురు పంపిన చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) లలో రూ.3.26 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ అయ్యాయని నమస్తే తెలంగాణ తెలిపింది.
మంగళవారం కేరళ అసెంబ్లీలో ఎమ్మెల్యే నెల్లిక్‌కున్ను అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమాధానమిస్తూ- బౌన్స్ అయిన చెక్కులు, డీడీలు కలిపి మొత్తం 395 వరకు ఉన్నాయని చెప్పారు.
వరదలు సంభవించినప్పుడు నవంబర్ నాటికి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2,797.67 కోట్ల విరాళాలు వచ్చాయని, అందులో రూ.2,537.22 కోట్ల చెక్కులు, నగదు, డీడీల రూపంలో అందాయని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే నెల్లిక్‌కున్ను అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కొంత మంది తాము విరాళాలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం కోసమే చెల్లని చెక్కులను, డీడీలను పంపినట్లు తెలుస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- శబరిమల: అయ్యప్ప గుడిలోకి మహిళలు అడుగుపెట్టడం చరిత్రలో ఇప్పుడే జరిగిందా?
- మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ తెరలకు అతుక్కుపోతుంటే ఏం చేయాలి
- ఈవీఎం హ్యాకింగ్: 2014 లోక్‌సభ ఎన్నికలు రిగ్గయ్యాయంటూ ‘అమెరికా సైబర్ నిపుణుడి’ ఆరోపణ.. ఖండించిన ఈసీ
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








