కాపుల రిజర్వేషన్.. ఎన్ని మలుపులు తిరిగింది, ఇప్పుడెక్కడుంది

- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్ర ప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసిన నేపథ్యంలో.. అందులో సగం - అంటే 5 శాతం కోటా కాపులకు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. తాజా ప్రకటన అనేక చర్చలకు దారి తీసింది. ఇంతకుముందున్న రిజర్వేషన్ విధానానికి భిన్నంగా సామాజిక వివక్ష, వెనుకబాటు ప్రాతిపదిక కాకుండా ఆర్థిక ప్రాతిపదికన కేంద్రం కల్పించాలని సంకల్పించిన రిజర్వేషన్లను మళ్లీ కుల ప్రాతిపదికన అమలు చేయడం సాధ్యమవుతుందా అనే చర్చతో పాటు కాపుల రిజర్వేషన్లపై అన్ని రకాల చర్చలు మళ్లీ వేదికనెక్కాయి.
ఇంతకీ కాపుల రిజర్వేషన్ల అంశం బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు ఏయే మలుపులు తీసుకుంటూ వచ్చిందో.. ఇవాళ ఎక్కడుందో చూద్దాం.
కాపు రిజర్వేషన్ డిమాండ్ దశాబ్దాలుగా బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో కాపులకు వెనుకబడిన తరగుతుల (బీసీ) కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించిన బిల్లులో సైతం కాపు రిజర్వేషన్ చరిత్రను స్థూలంగా వివరించింది.
దాని ప్రకారం.. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాపులను వెనుకబడిన కులంగా 1915లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రా ప్రాంతపు వెనుకబడిన తరగతుల జాబితాలో కాపులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, facebook
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో
1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల జాబితానే స్వల్ప మార్పులతో ఆమోదించారు. అప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి.
1956 నవంబర్ 1వ తేదీన.. తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు.. ఆంధ్ర రాష్ట్ర వెనుకబడిన కులాల జాబితాతో పాటు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల జాబితా కూడా కొనసాగింది. దానివల్ల వెనుకబడిన తరగతులకు సంబంధించి రెండు జాబితాలు ఉన్నాయి.
అయితే.. 1956లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితా నుంచి కాపులను తొలగించింది.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1961లో ఒక ఉత్తర్వు ద్వారా కాపులను మళ్లీ వెనుకబడిన తరగతి కింద గుర్తించేందుకు ప్రయత్నించగా ఆ జీఓను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు కొట్టివేసింది.
అప్పటి నుంచీ కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 27 శాతంగా ఉన్న కాపు ఉపకులాలు ఎన్నికల రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉండటంతో కాపు ఉద్యమం రాజకీయంగా కూడా కీలకంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యమం
1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడినపుడు.. బీసీలతో పాటు కాపులు కూడా ఆ పార్టీ వైపు వచ్చారనే విశ్లేషణలు ఉన్నాయి. అంతకుముందు జనతాపార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీలో చేరారు. 1985లో ఎన్‌టీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.
అదే కాలంలో కాపులు ఒక రాజకీయ శక్తిగా బలపడే ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. వంగవీటి మోహన రంగా కాపునాడు ఏర్పాటు చేశారు. 1988లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన ముద్రగడ కాపునాడుతో కలిశారు. ఏలూరు, విజయవాడల్లో కాపునాడు బహిరంగ సభలు నిర్వహించారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ ఆ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు.
ఈ పరిణామాల్లో 1994లో కాపు రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉధృతమైంది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాపులను బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే కాపులను బీసీలుగా గుర్తించటానికి సరైన ప్రాతిపదిక చూపలేదంటూ ఆ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు.. ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న కాపులు రాజకీయంగా కీలకమయ్యారు. రిజర్వేషన్లు కల్పించటానికి కృషి చేస్తామని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ హామీలు ఇస్తూనే వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 2009 ఎన్నికలకు ముందు సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించాలన్న కాపుల ఆకాంక్షను ఆ పార్టీ నెరవేరుస్తుందన్న అంచనాలు ఎన్నికల్లో పెద్దగా ఫలించలేదు. అనంతర కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
అయితే.. చిరంజీవి సోదరుడు, మరో ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేయాలంటూ ముద్రగడ నేతృత్వంలో 2016 జనవరి చివర్లో కాపు ఐక్య గర్జన రూపంలో ఉధృతంగా ఉద్యమించారు. అది హింసాత్మకంగా మారింది.

ఫొటో సోర్స్, facebook
తిరస్కరించిన కేంద్రం
ఈ పరిణామాలతో రాష్ట్ర బీసీ కమిషన్ (మంజునాథ కమిషన్)ను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ కమిషన్ నివేదిక మేరకు కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు బీసీ - ఎఫ్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2017 డిసెంబర్‌లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.
''సామాజిక, ఆర్థిక, విద్య వెనుకబాటుతనాన్ని, ప్రభుత్వ సర్వీసులలో వారి జనాభా దామాషాకు సరిపడినంతగా ప్రాతినిధ్యం లేకపోవటాన్ని దృష్టిలో ఉంచుకుని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కొరకు వెనుకబడిన తరగతుల్లో చేర్చాలన్న వారి డిమాండ్‌ను జాగ్రత్తగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సలహా మీద ఆధారపడి.. రాజకీయ రిజర్వేషను లేకుండా విద్యా సంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ సర్వీసులలో నియామకాల్లో రిజర్వేషన్ల కొరకు కాపులను వెనుకబడిన తరగతుల కేటగిరీలో చేర్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితాభిప్రాయానికి వచ్చింది'' అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలైతే రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 55 శాతానికి పెరుగుతాయి. ఈ కోటాను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలంటూ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది.
కానీ.. కాపు రిజర్వేషన్లు కలిపితే రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వాటా సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటిపోతోందని చెప్తూ కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో బిల్లును తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిణామాలతో కాపు రిజర్వేషన్ విషయం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇది మరోసారి రాజకీయ ప్రాధాన్యమున్న అంశంగా మారింది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా.. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతం పరిమితికి అదనంగా ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించింది.
ఈ 10 శాతం రిజర్వేషన్‌లోనే కాపులకు 5 శాతం కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మిగతా ఐదు శాతం కోటాను జనరల్ కేటగిరీలోని ఇతరులకు కేటాయించాలన్నది ప్రణాళిక. దీనికి సంబంధించిన విధివిధానాలను సమగ్రంగా చర్చించి అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను నిర్దేశించారు.
అయితే.. ఈసారైనా కాపు రిజర్వేషన్లు అమలవుతాయా? అది ఎంతరవకూ సాధ్యం? అమలుకు ఉన్న సవాళ్లు ఏమిటి? అన్నవి సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు.

ఫొటో సోర్స్, facebook
బీసీలకు అభ్యంతరం లేదు: ఆర్.కృష్ణయ్య
"మేము కాపులను బీసీ జాబితాలో చేర్చవద్దని అంటున్నాం. ఇప్పుడు అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. ఆ కోటాలో సగం(5 శాతం) కాపులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల బీసీలకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక, ఈ రిజర్వేషన్ అమలు సాధ్యాసాధ్యాల విషయానికొస్తే, అసలు అగ్రకులాలకు రిజర్వేషన్ ఇవ్వడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే, రిజర్వేషన్లు కల్పించడం అనేది పేదరిక నిర్మూలన పథకం కాదు కదా" అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు.

చంద్రబాబు 2017లోనూ ఇలాగే చెప్పారు: ముద్రగడ
తమకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు స్పష్టత వచ్చినప్పుడే తాను పూర్తి స్థాయిలో స్పందిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
తాజా పరిణామం గురించి ఆయన బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ.. "ఒక్క అడుగు వేసినట్లుగా అనిపిస్తోంది కానీ, అందులో ఏమాత్రం క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2017లోనూ ఇలాగే చెప్పారు. అసెంబ్లీలో బిల్లును పాస్ చేశామని, దాంతో తమ పని పూర్తైందని అన్నారు. కానీ, ఈ రోజు వరకూ అందులో పురోగతి లేదు. ప్రభుత్వం ఇలాంటి మాటలు చెప్పగానే సరిపోదు. చట్టబద్ధంగా మాకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు స్పష్టత వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో స్పందిస్తాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిర్ణయం కోర్టులో నిలవదు
కాపులకు జనరల్ కేటగిరీ కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోర్టులో నిలవదని అమరావతి హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్య ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
"కాపులను వెనుకబడిన తరగతి కింద గుర్తిస్తూ 2017లో ఇదే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పుడు అదే ప్రభుత్వం వారికి జనరల్ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అంటే, అప్పుడు వాళ్లు వెనుకబడిన వారన్న ప్రభుత్వమే, ఇప్పుడు తన వైఖరి మార్చుకుని వారు జనరల్ కేటగిరీకి చెందినవారు అంటోంది. కాబట్టి, దీన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వ తాజా నిర్ణయం అమలయ్యే పరిస్థితి ఉండదు" అని సత్యప్రసాద్ వివరించారు.
"మీకు నచ్చినట్లుగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ, కొత్తగా రిజర్వేషన్ కల్పించాలంటే ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ విచారణ చేసి సిఫారసు చేస్తే రిజర్వేషన్లు ఇవ్వవచ్చని సుప్పీంకోర్టు చెప్పింది" అని ఆయన గుర్తు చేశారు.
ఉన్న రిజర్వేషన్లను తొలగించాలన్నా, కమిటీ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సత్యప్రసాద్ చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాపుల ఓట్ల కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయంగా కనిపిస్తోంది తప్ప చట్టపరంగా అమలయ్యే నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








