జనరల్ కేటగిరీ పేదలకు రిజర్వేషన్లు: దేశంలో 91 శాతం మంది పేదలేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అగ్ర కులాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కోటా అమలులోకి ఎలా వస్తుంది? ఆటంకాలను ఎలా అధిగమిస్తుంది? ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఇది కేవలం ఎన్నికల రాజకీయమా? అనే ప్రశ్నలు అలా ఉంచితే.. అసలు ఈ నిర్ణయం.. ఈ రిజర్వేషన్లు వర్తింపచేయటానికి నిర్ణయించిన అర్హతలు ఎంతవరకూ సమంజసం అన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. వార్షిక ఆదాయం రూ. 8,00,000 - అంటే నెల వారీ ఆదాయం రూ. 66,666 - రోజుకు రూ. 2,222 లోపు ఆదాయం గల వారు.. ఐదెకరాల లోపు పొలం, వెయ్యి గజాల లోపు నివాస స్థలం, 200 గజాల లోపు విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారు.. ఆర్థికంగా బలహీనులని - అంటే పేదలు అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పేదరికం మీద అధికారిక అంచనా ఎలా వేస్తున్నారు?
అంతర్జాతీయ స్థాయిలో నిర్వచనాలు, లెక్కల సంగతి పక్కన పెడితే.. దేశంలో పేదరికానికి అధికారిక నిర్వచనం, అంచనాల మీద కూడా చాలా చర్చ జరుగుతూనే ఉంది. అయితే..
టెండూల్కర్ కమిటీ లెక్క ప్రకారం పేదరికం..
- 2009లో సురేష్ టెండూల్కర్ కమిటీ దేశంలో గ్రామీణ దారిద్ర్య రేఖ నెలకు రూ. 447 గానూ, పట్టణ దారిద్ర్యరేఖ నెలకు రూ. 579 గానూ లెక్కవేసింది.
ప్రణాళికా సంఘం లెక్క ప్రకారం పేదరికం..
మారుతున్న ధరలకు అనుగుణంగా పేదరికాన్ని లెక్కవేయటానికి టెండూల్కర్ కమిటీ సూచించిన పద్ధతి ప్రకారం.. ప్రణాళికా సంఘం 2011లో సుప్రీంకోర్టుకు ఒక నివేదన సమర్పించింది.
- పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రోజుకు రూ. 33, గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రూ. 27కు మించి ఉన్న వారిని పేదలుగా గుర్తించబోం అన్నది ఆ నివేదన సారాంశం.
రంగరాజన్ లెక్క ప్రకారం పేదరికం..
దీనిపై విమర్శలు రావటంతో ప్రణాళికా సంఘం.. పేదరికం లెక్కలను పనఃపరిశీలించటానికి సి.రంగరాజన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ.. 2015లో సమర్పించిన నివేదిక ప్రకారం..
- గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 తలసరి వినియోగం, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47 తలసరి వినియోగం దారిద్ర్యరేఖ.
ఈ లెక్కల ప్రకారం చూస్తే.. పట్టణ ప్రాంతాల్లోనే వార్షిక తలసరి వినియోగం రూ. 17,155 మించిన వారిని పేదలుగా పరిగణించరు.
మరి.. వార్షిక ఆదాయం రూ. 8,00,000 వరకూ ఉన్న వారిని ప్రభుత్వం పేదలుగా ఎలా పరిగణిస్తోంది? అని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో 'కనీస వేతనాలు' ఏం చెప్తున్నాయి?
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2018 సెప్టెంబర్‌లో సవరించిన కనీస వేతనాల ప్రకారం.. వ్యవసాయ రంగంలో పనిచేసే వారిలో.. నైపుణ్యం లేని వారికి రోజు వారీ వేతనం గరిష్టంగా రూ. 355 గానూ.. అత్యంత నైపుణ్యం ఉన్న వారికి గరిష్టంగా రూ. 467 గానూ ఉన్నాయి.
అంటే.. సంవత్సరంలో 365 రోజులూ పనిచేసినా అత్యంత నైపుణ్యమున్న వ్యవసాయ కూలీ వార్షిక ఆదాయం రూ. 1,75,455 మాత్రమే. మరోవైపు.. ఏడో కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫారసు ప్రకారం దేశంలో కనీస వేతనం నెలకు రూ. 18,000 గా ఉంది. అంటే వార్షిక కనీస వేతనం రూ. 2,16,000.
అంటే.. పట్టణ దారిద్ర్యరేఖ లెక్క ప్రకారం వార్షిక తలసరి వినియోగం రూ. 17,155 తో పోలిస్తే.. వీరెవరూ పేదల కిందకు రారు.
ఆ లెక్కన రూ. 8,00,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని పేదలుగా పరిగణించేటట్లయితే.. కనీస వేతనాలను కూడా అదే స్థాయిలో నిర్ణయించాలి కదా అన్నది విమర్శకుల ప్రశ్న.
ఇక దేశంలో పనిచేస్తున్న వారిలో 82 శాతం మంది మహిళలు, 92 శాతం మంది పురుషుల నెల వారీ ఆర్జన రూ. 10,000 లోపే ఉందని అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఇండియా 2018 నివేదిక చెప్తోంది.
అంతేకాదు.. క్రెడిట్-సుసీ వార్షిక ప్రపంచ సంపద నివేదిక 2018 ప్రకారం.. భారతదేశంలో 91 శాతం మంది వ్యక్తిగత సంపద 10,000 డాలర్ల (2019 జనవరి 9వ తేదీ లెక్క ప్రకారం రూ.7,01,350) లోపే ఉంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఈ లెక్కను పరిగణలోకి తీసుకుంటే దేశ జనాభాలో కనీసం 91 శాతం మంది పేదలే అవుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదాయ పన్ను వసూళ్లు ఏం చెప్తున్నాయి?
దేశంలో వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలు దాటితే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను వసూలు చేస్తోంది. వార్షికంగా రూ. 2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ ఉన్న ఆదాయం మీద ఐదు శాతం (5 శాతం మినహాయింపు పోను) పన్ను వసూలు చేస్తోంది. అదే రూ. 5,00,000 నుంచి రూ. 10 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉంటే 20 శాతం పన్ను వసూలు చేస్తోంది.
అంటే.. వార్షిక ఆదాయం రూ. 8,00,000 ఉన్న ఒక వ్యక్తి.. ఎటువంటి పన్ను రాయితీలూ లేకపోతే సంవత్సరానికి (రూ. 5 లక్షల మీద 5 శాతం పన్ను, ఆపై రూ. 3 లక్షల మీద 20 శాతం చొప్పున) రూ. 72,500 ఆదాయ పన్ను కింద చెల్లించాలి.
వార్షిక ఆదాయం రూ. 8,00,000 లోపు ఉన్న వారిని పేదలుగా పరిగణించేటట్లయితే.. ఆ మొత్తం లోపు ఉన్న వారి నుంచి ఆదాయ పన్ను ఎలా వసూలు చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే.. పేదల నుంచి ఏటా వేలాది రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నట్లేకదా అని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓబీసీ క్రీమీ లేయర్ ఎంత?
ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)ల్లో 'వెనుకబాటు నుంచి బయటపడిన' వారికి రిజర్వేషన్లు మినహాయించటం 1993లోనే అమలులోకి వచ్చింది. ఆ మినహాయింపు కోసం 'ఆర్థిక ప్రగతి'నే ప్రాతిపదికగా చేసుకున్నారు.
1993లో ఈ క్రీమీ లేయర్ విధానాన్ని అమలులోకి తెచ్చినపుడు.. వార్షిక ఆదాయం రూ. 1 లక్షకు మించిన ఓబీసీలు రిజర్వేషన్‌కు అనర్హులు. అనంతరం 2004లో ఈ ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు, 2008లో రూ. 4.5 లక్షలకు, 2013లో రూ. 6 లక్షలకు పెంచారు. 2017 సెప్టెంబర్‌లో ఈ క్రీమీ లేయర్ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అంటే.. వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించవు. మరో రకంగా చూస్తే.. ఈ ఆదాయ పరిమితి దాటిన ఓబీసీలను అగ్రకులాలుగానే పరిగణిస్తున్నట్లు భావించవచ్చు.
ఇప్పుడు అగ్రకులాల్లో రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించటం ద్వారా.. ఆ ఆదాయం లోపు వారిని ఓబీసీల హోదాకు సమానంగా పరిగణిస్తున్నట్లు భావించవచ్చునని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులు, వెనుకబడిన కులాల వారికి.. సామాజికంగా, విద్యా పరంగా వెనుకబాటు ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్లకు ఆయా వర్గాల వారి ఆర్థిక పరిస్థితి ప్రాతిపదిక కాదు.
అటువంటిది.. సామాజికంగా, విద్యా పరంగా ముందున్న అగ్రకులాల వారికి కేవలం ఆర్థిక ప్రాతిపదిక మీద, అదికూడా రూ. 8 లక్షల అధిక ఆదాయ పరిమితితో.. నిమ్న, వెనుకబడిన వర్గాల వారితో పాటు రిజర్వేషన్లు కల్పించటం రిజర్వేషన్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పార్లమెంటు వేదికగా పలువురు ఎంపీలు లోక్‌సభలో జరిగిన చర్చలో తమ వాదన వినిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అగ్రకులాల జనాభా ఎంత?
ప్రస్తుతం దేశంలో కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు అందుబాటులో లేవు. నిజానికి.. బ్రిటిష్ పాలనలో 1872 నుంచే దేశంలో జనాభా లెక్కలతో పాటు కులాల వారీ గణాంకాలనూ సేకరించటం ప్రారంభించారు. కులాల వారీ జనాభా లెక్కలు 1931 వరకూ కొనసాగాయి.
భారత స్వాతంత్ర్యానంతరం.. 1951 జనాభా లెక్కల నుంచీ ఎస్‌సీ, ఎస్‌టీల గణాంకాలను సేకరించటం కొనసాగింది.
2011 కులాల వారీగా చేసిన జనాభా లెక్కల ప్రకారం దేశంలో 16.2 శాతం మంది ఎస్‌సీ జనాభా, 8.2 శాతం ఎస్‌టీ జనాభా ఉన్నారు. కానీ ఓబీసీ గణాంకాలను వెల్లడించలేదు.
ఓబీసీ జనాభా గురించి ఇప్పటివరకూ కచ్చితమైన లెక్కలు లేవు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన మండల్ కమిషన్.. దేశంలో ఓబీసీ జనాభా 52 శాతం మంది అని 1931 జనాభా లెక్కల ప్రకారం అంచనా వేసింది.
అయితే, 2000లో నిర్వహించిన సర్వే ఓబీసీ జనాభా 35 శాతంగా పేర్కొంది. ఐతే.. 2007లో జాతీయ నమూనా సర్వే (నేషనల్ శాంపిల్ సర్వే) దేశంలో ఓబీసీ జనాభా 40.94 శాతంగా అంచనా వేసింది. దీంతో ఓబీసీ జనాభా సంఖ్యపై వాదవివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఓబీసీ జనాభాను సమగ్రంగా లెక్కించి.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల దామాషా పెంచాలన్న డిమాండ్లూ ఉన్నాయి.
మరోవైపు 2007 శాంపిల్ సర్వే.. దేశంలో 40.94 శాతం మంది ఓబీసీలు, 19.59 శాతం మంది ఎస్‌సీలు, 8.63 శాతం మంది ఎస్‌టీలు ఉన్నారని అంచనా వేసింది. ఆ లెక్కన చూస్తే.. మిగతా 30.80 శాతం మంది ఇతరుల కేటగిరిలోకి వస్తారు. అంటే దేశంలో సుమారు 30 శాతం మంది ప్రజలను అగ్రకులాలు లేదా జనరల్ కోటా వర్గంగా పరిగణించవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలావుంటే.. 2021 జనాభా లెక్కల్లో ఓబీసీ గణాంకాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు తీరు ఎలా ఉంది?
దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సీలకు 15 శాతం, ఎస్‌టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే.. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది లబ్ధిపొందారన్న గణాంకాలేవీ ప్రభుత్వం వద్ద లేవు.
కానీ, యూనిఫాం రిసోర్స్ లొకేటర్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఏ, బీ, సీ (సఫాయి కార్మికులు సహా) ఉద్యోగులు 2016 జనవరి ఒకటో తేదీ నాటికి మొత్తం 32,58,663 మందిగా ఉండగా.. వారిలో ఎస్‌సీలు 17.49 శాతం (5,69,886 మంది), ఎస్‌టీలు 8.47 శాతం (2,76,007 మంది), ఓబీసీలు 21.57 శాతం ఉన్నారని గత డిసెంబర్‌లో లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా చెప్పింది.
ఇక రిజర్వేషన్ కోటాల్లో భర్తీ కాకుండా మొత్తం ఎన్ని ఉద్యోగాలు మిగిలిపోయాయన్న (బ్యాక్‌ల్యాగ్ పోస్టులు) గణాంకాలు అందుబాటులో లేవని ఈ అంశం మీద గత డిసెంబర్‌లోనే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే, పది ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో 90 శాతం మంది పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కాబట్టి.. ఆయా శాఖల్లో రిజర్వేషన్లలో బ్యాక్‌ల్యాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయటానికి అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని 2014 డిసెంబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసినట్లు తన సమాధానంలో వివరించింది.
ఈ పది మంత్రిత్వశాఖలు అందించిన వివరాల ప్రకారం.. ఆయా శాఖల పరిధిలో మొత్తం 92,589 బ్యాక్‌ల్యాగ్ రిజర్వుడు ఖాళీలు ఉండగా.. 2012 ఏప్రిల్ ఒకటో లేదీ నుంచి 2016 డిసెంబర్ 31వ తేదీ వరకూ 63,876 పోస్టులు భర్తీ చేయటం జరిగిందని పేర్కొంది. ఇక 2017 జనవరి ఒకటో తేదీ నాటికి ఇంకా 28,713 బ్యాక్‌ల్యాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. ఈ బ్యాక్‌ల్యాగ్ ఖాళీల్లో 8,223 ఎస్‌సీ పోస్టులు, 6,955 ఎస్‌టీ పోస్టులు, 13,535 ఓబీసీ పోస్టులు ఉన్నాయని వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయా, లేదా? : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
- సంక్రాంతి సినిమాలు... థియేటర్లు ఎందుకు దొరకడం లేదు
- తెలంగాణలో రిజర్వేషన్ల చిచ్చు : గోండులు వర్సెస్ లంబాడాలు
- ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
- BBC EXCLUSIVE: రిజర్వేషన్లపై అఖిలేశ్ నయా ఫార్ములా
- రాజ్యాంగం చెబుతున్నా IIMలు రిజర్వేషన్లు పాటించవా?
- ‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








