BBC EXCLUSIVE: రిజర్వేషన్లపై అఖిలేశ్ నయా ఫార్ములా

అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, Twitter@yadavakhilesh

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు రావాలో, అంత రావాల్సిందే అంటున్నారు.

ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి? ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలని ఆయన కోరుకుంటున్నారు? అనే అంశాలపై అఖిలేశ్ బీబీసీతో మాట్లాడారు.

''రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం కలిగిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని కొందరు అంటున్నారు. వెనుకబడిన కులాలు, దళితులకు రిజర్వేషన్లను 50 శాతం కన్నా తక్కువకే పరిమితం చేసినా, వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు'' అన్నారు.

అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, Twitter@yadavakhilesh

రిజర్వేషన్లపై అఖిలేష్ ఫార్ములా

ప్రస్తుత రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వెనుకబడిన కులాల వారికి 27 శాతం, షెడ్యూల్డ్ కులాల వారికి 15 శాతం, షెడ్యూల్డ్ తెగలవారికి 7 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.

దీని స్థానంలో అఖిలేశ్ కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తున్నారు.

''ప్రతి వర్గానికి చెందిన జనాభాను లెక్కించి, జానాభాలో నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విధంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తి ప్రకారం, అందరికీ రిజర్వేషన్ కోటా ఉండాలి'' అని అఖిలేశ్ అన్నారు.

రిజర్వేషన్ల కారణంగా నైపుణ్యం కలిగిన వారికి అవకాశం దక్కలేదన్న దానిపై అఖిలేశ్.. ''దీనికి మా ఫార్ములా ఏంటంటే.. నైపుణ్యం కలిగిన వారి కోసం 20 శాతం సీట్లను పక్కన పెట్టాలి. మెరిట్ లిస్ట్‌లో టాపర్లను - వారు ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ, టాలెంట్ పూల్‌లో చేర్చాలి'' అన్నారు.

''ఒకవేళ మన వద్ద నైపుణ్యం ఉన్న వాళ్లు 20 శాతం మంది లేనందువల్ల ఆ కోటాను భర్తీ చేయడం కష్టమైతే.. దానిని 10-15 శాతానికి పరిమితం చేయొచ్చు. నైపుణ్యం కలిగిన వాళ్లందరినీ ఈ విభాగంలో చేర్చాలి'' అని సూచించారు.

అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, Twitter@yadavakhilesh

కులం ఆధారంగా జనగణన

సమాజ్‌వాదీ చీఫ్ చెబుతున్న దాని ప్రకారం.. నైపుణ్యం కలిగిన వాళ్లెవరూ దేశంలో ఉండడం లేదు. ఐఐటీ, ఐఐఎమ్‌ల నుంచి బయటకు వస్తున్న వాళ్లలో చాలా మంది విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లిపోతున్నారు.

అందువల్ల ఈ నయా ఫార్ములాతో ఏ వర్గానికీ అన్యాయం జరగదు అనేది అఖిలేశ్ అభిప్రాయం.

అయితే ఇంతవరకు దేశంలో కులం ఆధారంగా జనగణన జరగలేదు. దామాషా ప్రకారం రిజర్వేషన్లకు ఇది పెద్ద ఆటంకంగా నిలుస్తుంది. కానీ అది పెద్ద సమస్య కాదంటున్నారు అఖిలేశ్.

''ప్రభుత్వం ప్రజలందరినీ ఆధార్‌తో ఎలా అనుసంధానించింది? ఇవాళ టెక్నాలజీతో మీరు కేవలం మొబైల్ ఫోన్లతో ప్రజల కులం గురించి తెలుసుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు'' అన్నారు.

అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, Twitter@yadavakhilesh

రిజర్వేషన్ సమస్యలు

భారతీయ జనతా పార్టీ అత్యంత వెనుకబడిన వారు, అత్యంత దళితులు అన్న పేరిట ప్రజలను, సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోందని, ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య అని అఖిలేశ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఫార్ములాను అమలు చేస్తామని తెలిపారు.

ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు.

అఖిలేశ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న రోజుల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను రద్దు చేశారు. అంతే కాదు, రిజర్వేషన్లపై మాట్లాడడానికి కూడా ఆయన వెనకాడలేదు.

''వెనుకబడిన వారిని అలా పిలవడం నాకు ఇష్టం ఉండదు. అది వినడానికి బాగుండదు. నేను ఫార్వార్డ్, బ్యాక్‌వర్డ్‌ల మధ్య ఉన్న అంతరాలను తొలగించాలనుకుంటున్నాను'' అని అఖిలేశ్ అన్నారు.

''గతంలో నన్ను నేను ఫార్వర్డ్‌గా భావించుకునే వాణ్ని. కానీ బీజేపీ నేను కూడా బ్యాక్‌వర్డ్ అని గుర్తు చేసింది. అందుకు ఆ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)