శాస్త్రవేత్తలు కరవును ముందుగానే ఎలా అంచనా వేస్తారు

ఫొటో సోర్స్, FAO Colombia
- రచయిత, మరియా పాలో రూబియానో
- హోదా, బీబీసీ ఫ్యూచర్
కొలంబియాలో నివసించే యదీరా మార్టినెజ్ గొంజాలెజ్ 2018లో అకస్మాత్తుగా 15 మంది పోషణ చూసుకోవాల్సి వచ్చింది. కొన్ని దశాబ్దాల క్రితం వెనిజ్వులాకు వలస వెళ్లిన ఆమె భర్త తరఫు బంధువులు కొలంబియాకు తిరిగి రావడంతో వారి పోషణ బాధ్యత ఆమెపై పడింది.
వెనిజ్వెలాలో అవినీతి, ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం 860 శాతం పెరిగిందని అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఆ దేశాధ్యక్షుడు మాత్రం ఈ అంచనాలను ఖండిస్తున్నారు.
మార్టినెజ్ గొంజాలెజ్ కళా రూపాలను రోడ్డు పక్కన విక్రయించేవారు. ఆమె సంపాదించే డబ్బుతో ఇంట్లో 40 మందికి తిండిని సమకూర్చడం కష్టమయ్యేది. "మేం సరిగ్గా తినేవాళ్లం కాదు. ఒక్కోసారి రోజుకొకసారే తినేవాళ్లం" అని ఆమె చెప్పారు.
గొంజాలెజ్ ఇంటికి వచ్చినట్లే... కొలంబియాలో చాలామంది ఇళ్లకు వెనెజ్వెలా నుంచి బంధువులు వచ్చారు.
తినడానికి సరిపడా ఆహారం ఉండేది కాదు, మరోవైపు పశువులు కూడా మాయమైపోతుండేవి. వీరంతా కొలంబియాలో స్థానిక జాతులవారు.
దేశంలో వర్షాలు పడే సూచనలు లేవని వాతావరణ విభాగం చెప్పేది. దీంతో పంటలు పండే అవకాశమే లేదు. కరవు తప్పదని ఆందోళన చెందారు.
కానీ, మార్టినెజ్ గోంజాలెజ్ తెగతో పాటు లా గువాజిరా ప్రాంతంలో ఉన్న 7,000 మంది జనాభాపై కరవు ప్రభావం పడలేదు.
2018 జూన్‌లో ఆహార వ్యవసాయ సంస్థ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, యాక్షన్ ఎగెనెస్ట్ హంగర్‌కు చెందిన బృందాలు ఈ ప్రాంతాన్ని సందర్శించాయి.
వెనిజ్వెలా నుంచి తరలి వచ్చిన జనాభాతో అక్కడి కుటుంబాల సంఖ్య పెరిగిందని తెలుసుకున్నారు.
మరో వైపు కొనసాగుతున్న కరవు వల్ల పంటలు, పాలు, మాంసం ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. ఉద్యోగాల కోసం పోటీ పెరిగి, వేతనాలు తగ్గిపోయాయి. విత్తనాలు కొనుక్కునేందుకు చాలా కుటుంబాలు అప్పులు పాలవుతూ ఉండేవారు.
వర్షాలు లేకపోవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో, ఈ పరిస్థితి మరింత విషమించక ముందే చర్యలు చేపట్టాలని ఈ సంస్థలు భావించాయి. ఈ సంస్థలు సెప్టెంబరు 2018 నాటికి ర్యాపిడ్ యాక్షన్ ప్రోగ్రాంను మొదలుపెట్టాయి.
ఈ సమాజాలకు సహాయం చేసేందుకు నాలుగంచెల వ్యూహాన్ని తయారు చేశారు.
8 నెలల్లో 18 బావులను పునరుద్ధరించారు. విత్తనాల పంపిణీ చేసి సామూహిక వ్యవసాయ భూములను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరికరాలు, మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు సుమారు 12,500 పశువులు, గొర్రెలు. మేకలకు చికిత్స చేసి వ్యాక్సినేషన్ చేసేందుకు పశువైద్య నిపుణులను పంపించారు.
400,000 డాలర్ల విలువైన ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజాలను పూర్తిగా మార్చారు.
9 నెలల్లో 17 సామాజిక వ్యవసాయ భూములను ఏర్పాటు చేసి కూరగాయల ఉత్పత్తిని పెంచినట్లు ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది.
మొత్తం మీద 5 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 1000 కుటుంబాలు కలిసి ఐదు రకాల పంటలను వేసి సుమారు ప్రతి కుటుంబం 115 కేజీల ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోని కుటుంబాలు కూడా 35 కేజీల పంటలను పండించారు.
"ఇలా చేయడం వల్ల మా పూర్వీకులు తిండి కోసం కష్టపడే విధానాన్ని తిరిగి బయటకు తీసుకొచ్చింది. మాకు తిండి దొరకడం మాత్రమే కాకుండా పిల్లలకు, యువతకు మా భూమికి విలువను ఇవ్వాలని నేర్పేందుకు అవకాశాన్ని కల్పించింది" అని మార్టినెజ్ గోంజాలెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, FAO/Colombia
తీవ్రమైన కరవును ఎదుర్కొనేందుకు ముందుగానే ఈ సంస్థలు తీసుకున్న చొరవ మానవీయ చర్య అని చెప్పవచ్చు.
"ఆహారం అందించేందుకు అత్యవసర సహాయం చేయడం కంటే కరవును తట్టుకునేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య విశేషం" అని కొలంబియాలో ఆహార వ్యవసాయ సంస్థ ప్రతినిధి అలన్ బొజానిక్ చెప్పారు.
"ఆహార పంపిణీ, విరాళాలు ఇవ్వడం పై దృష్టి పెట్టకుండా ఇటువంటి చర్యలు ప్రజలు వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడే విధంగా సిద్ధం చేస్తాయి" అని టెక్సస్ యూనివర్సిటీలో ఆహార భద్రతపై పరిశోధన చేస్తున్న ఎరిన్ లెంట్జ్ చెప్పారు.
అయితే, మార్టినెజ్ గ్రామంలో ఈ విధమైన చొరవ తీసుకోవడానికి 40 సంవత్సరాల ముందు 1980లలో ఇథియోపియాలో ఏర్పడిన దారుణమైన కరవు సుమారు 10 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది.
దీని తర్వాత కొంత మంది భూగర్భ శాస్త్రజ్ఞులు, వాతావరణ పరిశోధకులు, వ్యవసాయ నిపుణులు కలిసి కరవు ప్రపంచానికి మరో షాక్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
వీరంతా కరవును అంచనా వేసే నిపుణులుగా మారారు. ఈ మిషన్‌లో వారు చాలా వరకు విజయవంతమయ్యారు.
"ఇటీవల కాలంలో ఏర్పడిన కరవు గురించి ముందుగానే హెచ్చరికలను జారీ చేశారు" అని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ సైన్స్ ప్రొఫెసర్ డ్యాన్ మ్యాక్స్ వెల్ అన్నారు.
వర్షపాతం, గాలివాటు, మట్టిలో తేమ శాతం, నదీ జలాలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఆహార ధాన్యాల ధరలు, వాతావరణ మార్పులు, పంట భూముల గురించి శాటిలైట్ సమాచారం, మానవతా సంక్షోభానికిసంబంధించిన సమాచారం లాంటి విశ్లేషణలను పరిగణనలోకి తీసుకుని ఈ నిపుణులు కరవు ఏర్పడటానికి కొన్ని నెలల ముందే అంచనా వేయగలుగుతారు.
దీంతో పాటు, స్థానిక ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేందుకు, అంతర్జాతీయ నిధులను అందచేసేందుకు చూస్తారు.
దీంతో, ఆహార భద్రత లేని ప్రాంతాల్లో ఏర్పడే దారుణమైన పరిస్థితులను అరికడతారు.
2016లో ఫెమైన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ నెట్ వర్క్ (ఫ్యూయ్స్ నెట్) హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో తలెత్తబోయే తీవ్రమైన కరవును ముందుగానే అంచనా వేసింది.
దీంతో, సుమారు 2.7 కోట్ల జనాభా ఆహార భద్రతకు దూరం కాకుండా చూసింది. వీరు చేసిన హెచ్చరికతో సొమాలియాలో 20లక్షల మంది ప్రజలకు ఆహార సరఫరా జరిగేందుకు తోడ్పడింది.
2011లో ఏర్పడిన కరవుతో పోలిస్తే, 2016లో కరవు వల్ల తిండి లేకుండా బాధపడ్డవారి సంఖ్యను 10లక్షలకు పైగా తగ్గించినట్లు ఒక నివేదిక తెలిపింది.
"ప్రపంచంలో విచారించేందుకు చాలా విషయాలున్నాయి" అని సాంటా బార్బరా లో క్లైమేట్ హజార్డ్స్ సెంటర్ డైరెక్టర్ క్రిస్ ఫంక్ అన్నారు. "కానీ, మనుషులే ఉత్తమంగా ప్రవర్తించగలరని గ్రహించగలగాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, FAO/Colombia
1903లో భారత వాతావరణ శాఖకు అధికారిగా ఉన్న గిల్బర్ట్ వాకర్.. ఫంక్‌కు హీరో లాంటివారు.
గిల్బర్ట్‌పై వర్షపాత సూచనను ముందుగానే తెలియచేసే బాధ్యతను పెట్టారు. అంతకు 26 ఏళ్ల ముందు భారతదేశంలో తీవ్రమైన కరవు ఏర్పడింది.
ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో కరవు లేదా అధిక వర్షపాతం ఏర్పడేందుకు దారి తీసే పసిఫిక్ సముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రత మార్పులైన ఎల్ నీనో, లా నీనా లాంటి వాటిని అర్థం చేసుకోవడానికి గిల్బర్ట్ డాటా నమూనాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
"మేమింకా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. ఆయన చేయాలనుకున్న పనినే మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఫంక్ అన్నారు.
కరవుకు సంబంధించి మెరుగైన డేటా సేకరించేందుకు ఫంక్ బృందం రెండంచెల వ్యూహాన్ని రూపొందించింది.
1980లనుంచి ఆఫ్రికా, యూరప్ లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను యూరోపియన్ శాటిలైట్ల ద్వారా సేకరించడం ప్రారంభించారు.
ఈ శాటిలైట్లు మబ్బుల ఉష్ణోగ్రతల ద్వారా వర్షపాతాన్ని అంచనా వేస్తాయి. దీని ద్వారా సేకరించిన డేటాతో ఆఫ్రికాలో వర్షపాతం తీరును పోల్చి చూశారు.
స్థానిక వాతావరణ కేంద్రాల నుంచి కూడా వాతావరణ సమాచారాన్ని సేకరించారు.
వీరు అమెరికా, గ్వాటెమల, కెన్యా, బోట్స్వానా. నైజర్, ఇథియోపియా లాంటి దేశాల్లో స్థానిక అధ్యయనకారులు, ఫీల్డ్ సైంటిస్టులు, ప్రభుత్వ సంస్థలతో కలిసి భాగస్వామ్యం అయ్యారు. వీళ్ళు ప్రస్తుతం 17 దేశాల్లో ఉన్న 2000 వాతవరణ కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచారం ప్రతీ రెండు రోజులకొకసారి అప్‌డేట్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రానున్న కరవును అంచనా వేసే సామర్ధ్యంతో క్లైమేట్ హజార్డ్ సెంటర్ అమెరికా ప్రభుత్వంలో, మానవతా సంస్థలు, ఎఫ్‌ఏఓ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఉన్న తమ భాగస్వాములకు ఐదు రోజులకొకసారి నివేదికలు పంపిస్తుంది.
ఈ నివేదికలో ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికాలో ఉన్న హాట్ స్పాట్స్‌ను సూచిస్తుంది.
రానున్న 15, 30, 60 రోజుల్లో కురవనున్న వర్షపాతాన్ని అంచనా వేస్తుంది. వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తుంది.
ఈ మ్యాప్‌లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అమెరికా ప్రభుత్వ సంస్థలు, ఆహార భద్రతా నిపుణులు 35కు పైగా దేశాల్లో ఆహార ధాన్యాల ధరల్లో మార్పులు, స్థానిక ఆర్ధిక వ్యవస్థల్లో ఏర్పడే ఆర్ధిక విపత్తులు, సాయుధ పోరాటాలను లెక్కలోకి తీసుకుని కరవును అంచనా వేస్తారు. ఈ అంచనా యూఎస్ఎయిడ్ 4 బిలియన్ డాలర్ల నిధులను వెచ్చించేందుకు, వార్షిక ఆహార బడ్జెట్ కు మార్గదర్శకత్వం వహించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
"కరవు గురించి ముందుగానే హెచ్చరించడం వల్ల విపత్తు బారిన పడకుండా ప్రజలను సంరక్షించే వీలు కలుగుతుంది" అని లెంట్జ్ అన్నారు.
ఫ్యూస్ నెట్ అందించే సమాచారం ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు సత్వరమే చర్యలు తీసుకుంటారని చెప్పలేం.
ఒకేసారి దిగ్భ్రాంతికి లోను కాకుండా ఈ హెచ్చరికలు పని చేస్తాయి. "కానీ, కరవు పూర్తిగా ఏర్పడేవరకు నిధులను వెచ్చించేందుకు ముందుకు రారు. ఏమి జరుగుతుందో అర్ధం చేసుకునేటప్పటికే ఆలస్యం అయిపోతుంది" అని అని మ్యాక్స్ వెల్ అన్నారు.
దక్షిణ మడగాస్కర్ లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని ఫ్యూస్ నెట్ లాంటి కొన్ని సాధనాలు మే 2021 నుంచే హెచ్చరించడం మొదలుపెట్టాయి. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరుసగా మూడోసారి కరవు కొనసాగుతుందని చెప్పాయి. ఫంక్ కూడా దీని గురించి చాలా వ్యాసాలు రాశారు.
ప్రస్తుతం ఇక్కడ సుమారు 15లక్షల మంది పురుగులు, ముళ్ల చెట్ల ఆకులు తింటూ ఆకలితో అలమటిస్తున్నారు.
"ఇలాంటి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నా కూడా పరిస్థితి పూర్తిగా చేతులు దాటే వరకూ స్పందించటం లేదు" అని ఫంక్ అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
ఈ అంచనాలు, స్పందనకు మధ్యలో ఉన్న అంతరాన్ని భర్తీ చేసేందుకు.. కరవును అప్పటికప్పుడు ఏర్పడే విపత్తులా కాకుండా, తీవ్రమైన ఆకలితో అలమటించిన తర్వాత ఏర్పడే పరిస్థితిగా చూడాలని కొంతమంది నిపుణులు ప్రతిపాదిస్తున్నారు.
"కరవును, ఆకలిని రెండు వేర్వేరు సమస్యలుగా చూడటం అలవాటుగా మారిపోయింది" అని లెంట్జ్ అన్నారు.
"కరవు ఏర్పడినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, ఆకలి తీర్చే కార్యక్రమాలు చేపట్టడం లాంటి అభివృద్ధి ప్రాజెక్టులను చేపడతారు.
నిజానికి, కరవు, ఆకలి ఒకదానితో ఒకటి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న జనాభాను విపత్తు చుట్టుముట్టినప్పటికే, వారు ఆహార అభద్రత అంచులను తాకుతూ ఉంటారు" అని లెంట్జ్ అన్నారు.
మార్టినెజ్ గోంజాలెజ్ ఇలాంటి పరిస్థితినే అనుభవించారు. ఒక దశాబ్దం ముందు నుంచే వారికి తిండి కరవు ఏర్పడింది.
వారు ఇళ్లల్లో పంటలు పండించుకునేవారు. వెనిజ్వెలాకు వెళ్లి చవకగా సరకులు కొనుక్కునేవారు.
కానీ, 2013లో లా గువాజిరా తీవ్రమైన కరవుకు లోనైంది. బావులు ఎండిపోయాయి.
పశువులు చనిపోయాయి. బీన్స్, పుచ్చ కాయలు, గుమ్మడి, కంద, జొన్న లాంటి పంటలు అరకొరగా పండేవి.
దీంతో 2014లో ఆహార ఎగుమతులను నిషేధించింది. తమ కుటుంబాల కోసం ఇంటికి తెస్తున్న పిండి, బియ్యం, నూనె లాంటి వస్తువులను దొంగిలించేందుకు సరిహద్దు గస్తీదారులు మహిళలను వివస్త్రలను కూడా చేసేవారు.
కరవు తిండిని కూడా విలాసవంతమైన వస్తువు చేయడంతో కొన్ని వేల మంది వలసదారులు కొలంబియా, ఇతర లాటిన్ అమెరికా దేశాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. నవంబరు 2018 నాటికీ సుమారు 12లక్షల మంది కొలంబియాలో స్థిరపడ్డారు.
తాజా అంచనాల ప్రకారం సుమారు 60 లక్షల మంది వెనిజ్వెలాలో ప్రజలు వలస వెళ్లారు. అందులో 18లక్షల మంది కొలంబియాలో ఉండగా, 106,000 మంది లా గువాజిరాలో ఉండిపోయినట్లు కొలంబియా ప్రభుత్వ సమాచారం చెబుతోంది.
"ఈ దేశంలో మానవతా సంస్థలు, ప్రభుత్వాలు చేస్తున్న సహాయ చర్యలు స్వల్పకాలికంగా ఉంటున్నాయి" అని ఆంత్రోపాలజిస్ట్ క్లాడియా పూవెర్ట సిల్వా అన్నారు.ఆమె ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. "ఈ కరవును తట్టుకునే సామర్ధ్యాన్ని పెంచకపోతే వారు మరింత విషవలయం లోకి కూరుకుపోయే అవకాశం ఉంది" అని అన్నారు.
ఆహార పంపిణీ చాలా వరకూ 10 దేశాల్లోనే జరుగుతోందని హ్యూమానిటేరియన్ పాలసీ గ్రూప్ నివేదిక చెప్పింది.
86% నిధులు మూడేళ్లకు పైగా సంక్షోభం నెలకొన్న దేశాలకే వెళ్లాయి. "విపత్తు దశాబ్దాల పాటు ఉన్నా కూడా సహాయం మాత్రం వార్షికంగా, లేదా స్వల్పకాలికంగా మాత్రమే అందుతోంది" అని ఈ నివేదిక పేర్కొంది.
కరవును ముందుగానే అంచనా వేసి, రానున్న విపత్తును ఎదుర్కొనేందుకు సమాజాలను సంసిద్ధం చేయడమే దీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటుందని లెంట్జ్ అంటారు.
లా గువాజిరాలో ఎఫ్ ఏ ఓ ఇటువంటి చొరవనే తీసుకుంది. ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తే తీవ్రమైన ఆకలి కొనసాగే అవకాశం ఉంటుంది.
"లా గువాజిరాకు వచ్చే చాలా ప్రాజెక్టులు అత్యవసర ప్రాజెక్టులే ఉంటాయి" అని బొజానిక్ చెప్పారు.
ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆరు నెలలు లేదా ఏడాది పాటు కొనసాగే ప్రాజెక్టులు మాత్రమే ఇక్కడ ఉంటాయి.
"కానీ, ఇలాంటి సంక్లిష్టమైన ప్రాంతాలకు ఇటువంటి స్వల్పకాలిక చర్యలు సమాధానం కాదని మాకు తెలుసు" అని అన్నారు.
కరవును అంచనా వేసే సామర్ధ్యంతో , ఎఫ్ ఏ ఓ, స్థానిక సమాజం తక్కువ కాలంలో దిగుబడి వచ్చే, కరవును తట్టుకునే జొన్న, కసావా, ఇతర బీన్స్ రకాలను పండించటం మొదలుపెట్టారు. వారి ఆర్ధిక కార్యకలాపాలకు కూడా ఈ ప్రాజెక్టు సహకరించింది.
ఇక్కడి ప్రజలు తయారు చేసే హస్తకళలను అమ్మేందుకు ఆన్ లైన్ షాప్ లను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలన్నీ కోవిడ్ సమయంలో వారికి సహకారం అందించేందుకు ఉపయోగపడ్డాయి.

ఫొటో సోర్స్, FAO/Colombia
ఎఫ్‌ఏఓ చేపట్టిన చర్యలు ఫంక్‌కు ఆశను కలుగచేశాయి. కెన్యా, మలావీ లో ప్రభుత్వ సంస్థలు చిన్న రైతులు కరవును తట్టుకునేందుకు వీలుగా ఇన్సూరెన్సు పథకాలను రూపొందిస్తున్నాయి.
రైతులు ముందుగానే తమ పంటలను ప్రణాళిక చేసుకునేందుకు, ఏ విధమైన విత్తనాలను నాటవచ్చో చెప్పేందుకు 20 స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యంతో పని చేస్తున్న ప్లాంట్ విలేజ్ రైతులకు వాట్సాప్, టెక్స్ట్ మెసేజీలు పంపిస్తోంది.
వర్ష సూచనను కూడా తెలియచేస్తోంది. ఇప్పటి వరకు వీరి సేవలు సుమారు 3,50,000 మంది రైతులను చేరాయి.
ఇలా ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల కొన్ని కోట్ల డాలర్ల నిధులను కూడా ఆదా చేసే వీలుంటుంది.
గత రెండేళ్లలో సంక్షోభం, కరవు, సహజ విపత్తులు వాతావరణ మార్పుల వల్ల కరవుకు గురవుతున్న ప్రాంతాలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రెట్టింపు అయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరవును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
"విపత్తును సృష్టించేందుకు కరవు మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది" అని ఫంక్ అన్నారు.
కరవును అంచనా వేసే సాధనాల ద్వారా ప్రజలను ఈ పరిస్థితులను ఎదుర్కోగలిగేలా సంసిద్ధం చేయగలిగితే, వీటి వల్ల ఏర్పడే పరిణామాలు అత్యంత దారుణంగా ఉండకుండా చూడగలం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు
- ఆస్ట్రేలియా విమానంపై నిప్పులు కురిపించిన చైనా విమానం, దక్షిణ చైనా సముద్ర గగనతలంపై ప్రమాదకర విన్యాసం
- అఫ్గాన్ సైన్యానికి భారత్ శిక్షణ ఇవ్వాలని తాలిబాన్లు ఎందుకు కోరుకుంటున్నారు
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












