మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?

ఫొటో సోర్స్, SHARAD BADHE / BBC
- రచయిత, మయూరేశ్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలో గుర్తు తెలియని నాగరికతకు సంబంధించిన అనేక కళాకృతులు బయటపడుతున్నాయి. తాజాగా చరిత్ర పూర్వయుగానికి చెందిన మానవులు నివసించిన గుహ, అందులో ఆనాటి మానవుల జీవితాన్ని వెల్లడించే అనేక కళాకృతులు, వస్తువులు బయటి ప్రపంచానికి తెలిశాయి.
పశ్చిమ మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఉన్న కొలోషి అనే గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహను గత ఏడాది కొందరు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన తవ్వకాలలో కొన్నివేల సంవత్సరాల కిందట జీవించిన మానవులు వాడిన రాతి పరికరాలు బయటపడ్డాయి.
''ఇలాంటి రాతి పరికరాలు ప్రపంచంలో మరెక్కడా దొరకలేదు''అని మహారాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ గా పని చేస్తున్న డాక్టర్ తేజాస్ జార్జ్ అన్నారు. ఈ వస్తువులను పరిశోధించడం ద్వారా ప్రాచీన మానవుల గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
పురాతన మానవులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం రీసెర్చర్లు పరిశోధన చేస్తున్న సమయంలో ఈ గుహలు బయటపడ్డాయి. సింధుదుర్గ్ అడవుల్లోని మారుమూల ప్రాంతంలో ఇవి ఉన్నాయి. ఈ గుహల్లో రెండు దఫాలుగా తవ్వకాలు నిర్వహించారు. మెసోలిథిక్ (మధ్య రాతి యుగం) కాలానికి చెందిన కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి అయిన రాతి పరికరాలు లభించాయి.

ఫొటో సోర్స్, PARTH CHAUHAN / BBC
''ఇందులో లభించిన చిన్న పరికరాలు 10 వేల సంవత్సరాల కిందటివి. పెద్ద పరికరాలు 20 వేల సంవత్సరాల కిందటివి'' అని కొంకణ్ పెట్రోగ్లిఫ్స్(రాతి మీద గీసిన బొమ్మలు) మీద పరిశోధన చేస్తున్న రుత్విజ్ ఆప్టే అన్నారు. ఆయన కూడా ఈ తవ్వకాలలో పాలు పంచుకున్నారు.
ఈ వస్తువులను దేనికోసం ఉపయోగించారో తెలుసుకోవడానికి రసాయన పరీక్షలు నిర్వహించినట్లు ఆర్కియాలజిస్ట్ డాక్టర్ పార్థ్ చౌహాన్ వెల్లడించారు.
''ఇవి ఏనాటి కాలానికి చెందినవి, ఎందుకు ఉపయోగించేవారు అన్న విషయం తేలడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇప్పటి వరకు మాకున్న అవగాహన ప్రకారం ఇవి 10వేల నుంచి 48 వేల సంవత్సరాల కిందటివి'' అని డాక్టర్ పార్థ్ చౌహాన్ అన్నారు.
లేటరైట్ గనులకు నెలవైన కొంకణ్ ప్రాంతం చరిత్ర పూర్వయుగపు కళాకృతులకు కూడా నిలయం. ఇంతకు ముందు ఇక్కడ నిర్వహించిన తవ్వకాలలో జంతువులు, పక్షులు, మనుషుల ఆకారాలతో ఉన్న బొమ్మలు బయటపడ్డాయి.
ఇప్పటి వరకు సింధ్‌దుర్గ్, సమీపంలోని రత్నగిరి జిల్లాలో 76 గ్రామాలు, 132 ప్రదేశాలలో దాదాపు 1700 పెట్రోగ్లిఫ్స్ ను గుర్తించారు.
చరిత్ర పూర్వయుగం గురించి తెలుసుకోవడానికి ఈ బొమ్మలు ఎంతగానో ఉపయోగపడతాయని పుణెకు చెందిన చరిత్రకారిణి శైలి పలాండె దాతార్ అభిప్రాయాపడ్డారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE / BBC
రత్నగిరి సమీపంలోని బర్సు గ్రామం దగ్గర బయటపడ్డ బొమ్మలను ఆమె ఉదహరించారు.
ఈ చెక్కడం ఒక రాయిపై కనిపిస్తుంది. ఒక మగ వ్యక్తి రెండు చేతులలో పులులను, ఇతర అడవి జంతువులను పట్టుకున్నట్లు ఇందులో కనిపిస్తుంది.
"ఈ శిల్పంలో అద్భుతమైన సమరూపత ఉంది. దీన్ని నిపుణులైన వ్యక్తులు చిత్రించారని అర్ధమవుతుంది. మనుషులు, జంతువులకున్న బంధాన్ని ఈ బొమ్మలో చూపించారు'' అని దాతార్ చెప్పారు.

ఫొటో సోర్స్, RUTVIJ APTE / BBC
హరప్పా నాగరికత భారత ఉపఖండంలో వర్ధిల్లిన పురాతన నాగరికతలలో ఒకటి. అక్కడ బయటపడ్డ బొమ్మలలో కూడా మనుషులు, జంతువుల మధ్య బంధాన్ని చిత్రించారు.
"అక్కడ దొరికిన ముద్రలలో పులులు, గేదెల వంటి పెద్ద జంతువులతోపాటు, మనిషి వేటాడే జంతువుల బొమ్మలు కూడా చిత్రించి ఉన్నాయి" అని దాతార్ అన్నారు.
ఈ చరిత్ర పూర్వయుగపు ఆనవాళ్లలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని, కానీ అవి పరిశోధనకు దూరంగా ఉన్నాయని దాతార్ అన్నారు. అయితే, యునెస్కో గుర్తింపు కారణంగా వీటి ప్రాధాన్యత చెక్కుచెదరకుండా, తరతరాలుగా సంరక్షించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
కొంకణ్ ప్రాంతంలోని ఎనిమిది శిలా గుహలను యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో పెట్టింది. భవిష్యత్తులో ఇది సంపూర్ణంగా గుర్తింపు పొందడానికి ఒక ముందడుగు అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- వరంగల్: ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ఎందుకు తెరిచారు, ఇది ఎలా నడుస్తోంది?
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













