31,000 ఏళ్ల క్రితమే మనిషి అవయవాలను తొలగించారు.. ఇది శస్త్రచికిత్సా లేదా బలి ఇచ్చారా?

ఫొటో సోర్స్, Tim Maloney
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రాచీన కాలంలోనూ మనుషుల శరీర భాగాలను తొలగించేవారని చెప్పే ఆధారాలు ఇండోనేసియాలోని ఒక గుహలో బయటపడ్డాయి.
31,000 ఏళ్ల క్రితం పాతిపెట్టిన ఓ యువకుడి అస్థి పంజరాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆ యువకుడికి శస్త్రచికిత్సతో అప్పట్లోనే కాలును తొలగించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
దీంతో ముందుగా మనం ఊహించిన దానికంటే 24,000 ఏళ్లకు పూర్వమే ఈ చికిత్స జరిగినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఆ చికిత్స తర్వాత సదరు వ్యక్తిని చనిపోయేవరకు పూర్వీకులు జాగ్రత్తగా చూసుకున్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
''ఆ అస్థి పంజరాన్ని పరిశీలిస్తుంటే, పక్కాగా శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది''అని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ మెలండ్రి వ్లోక్ చెప్పారు.
ఆ అస్థి పంజరాన్ని పరిశోధకులు జాగ్రత్తగా పరిశీలించారు. దీని వివరాలు ''ద జర్నల్ నేచర్''లో ప్రచురితం అయ్యాయి. దీనిలో సదరు వ్యక్తి చిన్నప్పుడే శస్త్రచికిత్స జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు.
''చికిత్స తర్వాత ఆ కాలి ఎముక కోలుకుంది. దానిలో పెరుగుదల కూడా ఉంది. బహుశా ఆ శస్త్రచికిత్స తర్వాత అతడు ఆరు నుంచి తొమ్మిదేళ్లు బతికి ఉండొచ్చు. ఆ తర్వాత టీనేజీ చివర్లో లేదా 20ల ప్రారంభంలో అతడు మరణించి ఉండొచ్చు''అని పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Tim Maloney
ఎక్కడ కనిపించింది?
ఇండోనేసియా బొర్నియో దీవిలోని తూర్పు కాలిమంథన్‌లో లియాంగ్ టెబోగా పిలిచే గుహలో ఈ అస్థి పంజరం పాతిపెట్టిన చోటు ఉంది. ఈ ప్రాంతంలో ప్రాచీన శిల్ప కళాఖండాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ తవ్వకాలు చేపట్టిన వారిలో ఒకరైన, ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టిమ్ మలేనీ మాట్లాడుతూ.. ఆ ఎముకలు చూసినప్పుడు ఉత్సాహంతోపాటు భయం కూడా వేసిందని అన్నారు.
''ఆ ఎముకలపై పేరుకున్న దుమ్మూధూళిని మేం జాగ్రత్తగా తొలగించాం. ఆ తర్వాత ఎడమ పాదం లేదని గుర్తించాం. అయితే, అక్కడ మిగిలిన ఎడమ కాలి ఎముక కూడా చాలా అసాధారణంగా కనిపించింది''అని బీబీసీతో టిమ్ చెప్పారు.
''కాలు ఇలా ఎందుకు ఉందని మేం పరిశోధన చేపట్టాం. శస్త్రచికిత్స ఏదైనా జరుగుంటుందా? అనే కోణంలో ఆలోచించాం''అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Jose Garcia/Griffith University
దీనిపై లోతుగా పరిశోధన చేపట్టే బాధ్యతను సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ వ్లోక్‌కు పురాతత్వ శాస్త్రవేత్తలు అప్పగించారు.
''ఈ పరిశోధన ఉత్సాహంతోపాటు బాధను కూడా కలిగించింది. ఎందుకంటే ఒక మనిషికి కష్టమైన ఆపరేషన్ నిర్వహించారు''అని వ్లోక్ అన్నారు.

ఫొటో సోర్స్, Tim Maloney
''సదరు వ్యక్తి ఒక బాలుడు. తను చికిత్స సమయంలో చాలా బాధపడి ఉంటాడు. 31,000 ఏళ్ల క్రితం అతడు ఎంతో నొప్పి భరించి ఉంటాడు''అని వ్లోక్ వివరించారు. ఆ తర్వాత అతడిని చుట్టుపక్కల వారు జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇది ముమ్మాటికీ ఆపరేషనేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శిక్ష విధించడం లేదా దేవుడికి బలి ఇవ్వడం లాంటి వాటితో దీనికి సంబంధంలేదని అంటున్నారు.
''పర్వత ప్రాంతాల్లో సదరు వ్యక్తి జీవించేవాడు. చుట్టుపక్కల వారు సాయం చేయకపోతే, అతడి మనుగడ చాలా కష్టమయ్యేది''అని వ్లోక్ అన్నారు.
''మానవ చరిత్రలో ఔషధాలు, శస్త్రచికిత్సలు చాలా ఆలస్యంగా వచ్చాయనే వాదనకు ఈ పరిశోధన సవాల్ విసురుతోంది''అని డుర్హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ చార్లెట్ రాబర్ట్‌సన్ చెప్పారు.
''చాలా అవగాహన ఉండాలి''
''పక్కవారిని సంరక్షించడం అనేది మానవతత్వంలో భాగమని ఈ పరిశోధన చెబుతోంది. ఈ విషయంలో మన పూర్వీకలను మనం అసలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు''అని చార్లెట్ అన్నారు.
ఇలాంటి అవయవాల తొలగింపు శస్త్రచికిత్సకు మానవ శరీరంపై పూర్తి అవగాహన ఉండాలి. మరోవైపు శస్త్రచికిత్స సమయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా నైపుణ్యం కూడా ఉండాలి.
ప్రస్తుతం అవయవాల తొలగింపు చికిత్సలు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మొదట సదరు వ్యక్తి మత్తుమందు ఇస్తారు. చికిత్సలో ఉపయోగించే వస్తువులన్నీ స్టెరిలైజ్ చేస్తారు. రక్త ప్రసరణ, నొప్పిలను తగ్గించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
''ఇదే చికిత్సను 31,000 ఏళ్ల క్రితం నిర్వహించారు. అది కూడా విజయవంతంగా పూర్తైంది''అని డాక్టర్ వ్లోక్ అన్నారు.
ఈ ఆపరేషన్‌లో ఎలాంటి వస్తువులను ఉపయోగించారనే కోణంలో ప్రస్తుతం వ్లోక్ బృందం దృష్టి సారిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్కౌంటర్లకు వాడుతోందా?
- బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?
- బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
- ఆసియా కప్: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా భారత్కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













