కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్‌కౌంటర్లకు వాడుతోందా?

కశ్మీర్
    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత వారం కూడా అజాద్ అహ్మద్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లుగా ఆయన తన కారు పత్రాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇప్పటివరకు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్లానో లెక్కేలేదని ఆయన అన్నారు.

శ్రీనగర్‌కు 50 కి.మీ. దూరాన దక్షిణ కశ్మీర్‌లో మిలిటెంట్లకు కంచుకోటగా భావించే షోపియాన్ జిల్లా ఉంటుంది. రేశినగరీ గ్రామం ఈ జిల్లాలోనే ఉంటుంది.

ఈ గ్రామానికి చెందిన 39ఏళ్ల అజాజ్ అహ్మద్ ఒక రైతు. రెండేళ్ల క్రితం ఆయనకు చెందిన మారుతి కారు పత్రాలను కోర్టు స్వాధీనం చేసుకుంది.

ఒక ఎన్‌కౌంటర్‌లో అజాజ్ కారును సైన్యం ఉపయోగించుకొంది. ఆ తర్వాత కారు పత్రాలను కోర్టు స్వాధీనం చేసుకుంది. ఆ ఎన్‌కౌంటర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే, ఇలా పౌరుల వాహనాలను కశ్మీర్‌లో భద్రతా బలగాలు తరచూ తీసుకుంటున్నాయనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

కశ్మీర్

దక్షిణ కశ్మీర్‌లో అజాజ్‌లా కోర్టుల చుట్టూ తిరిగేవారు చాలా మందే ఉన్నారు. వీరిలో కొందరు సైన్యం బలవంతంగా తమ వాహనాలను తీసుకుందని ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై సైన్యానికి చెందిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌వో)కు బీబీసీ ఒక ఈ-మెయిల్ పంపించింది.

ఆ మెయిల్‌కు స్పందిస్తూ.. ‘‘ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా సైనికులను ఒక చోటు నుంచి వేరొక చోటుకు తరలించేందుకు కొన్నిసార్లు సైన్యం ప్రజల వాహనాలను తీసుకుంటుంది. అయితే, ఈ విషయాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ సైన్యంపై ఆరోపణలు చేయడం తగదు. దశాబ్దాల నుంచి ప్రజలకు సైన్యం సేవలు అందిస్తోంది. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే, నేరుగా సైన్యం లేదా పోలీసుల హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించొచ్చు’’అని సైన్యం వెల్లడించింది.

సామాన్య పౌరుల నుంచి సైన్యం వాహనాలు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న షోపియాన్, పుల్వామా, కుల్గామ్‌లలో 15 గ్రామాలను బీబీసీ సందర్శించింది. సైన్యం కార్లను అడిగేటప్పుడు తాము తిరస్కరించబోమని స్థానికులు వివరించారు.కొందరు మాత్రం బలవంతంగా కార్లను తీసుకెళ్తున్నారని చెప్పారు.

సైన్యం స్పందన

ఫేక్ ఎన్‌కౌంటర్ ఎలా?

2020లో షోపియాన్ అమిశిపురాలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు జమ్మూ కార్మికులను ప్రమాదకరమైన మిలిటెంట్లుగా పేర్కొంటూ సైన్యం కాల్పులు జరిపింది. ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చ జరిగిన ఫేక్ ఎన్‌కౌంటర్లలో ఇది కూడా ఒకటి.

దీనిపై 18, జులై 2020న సైన్యం స్పందించింది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లను 62 రాష్ట్రీయ రైఫిల్స్ మట్టుపెట్టిందని వెల్లడించింది. అయితే, రాజౌరీ, జమ్మూలకు చెందిన ఆ ముగ్గురూ కనిపించడంలేదని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా జులై 17న వారితో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, దీనికి ఒక రోజు తర్వాతే ఎన్‌కౌంటర్ జరిగింది.

అనంతర దర్యాప్తులో ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అని తేలింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్న సైన్యాధికారులపై కోర్టు మార్షల్ విచారణ కూడా మొదలైంది.

ఈ కేసు చార్జిషీటును బీబీసీ పరిశీలించింది. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో అజాజ్ అహ్మద్ కారును ఉపయోగించినట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్ పూర్తై రెండేళ్లు గడిచినా అజాజ్ కారు పత్రాలు ఇంకా కోర్టులో ఉన్నాయి.

కశ్మీర్

ఇది సాధారణం..

కశ్మీర్ ప్రజలు టాటా సుమోలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఈ కార్లు కనిపిస్తుంటాయి. వీటి కోసం సుమో స్టాండ్లుగా ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిలో కొన్ని వాహనాలను సైన్యం కోసం పంపిస్తారు. దీన్ని ‘‘ఆన్ డ్యూటీ’’గా చెబుతారు.

ఎన్‌కౌంటర్లతోపాటు కొన్నిసార్లు రాత్రిపూట గస్తీ కాసేందుకూ ఈ వాహనాలను ఉపయోగిస్తుంటారు.

‘’17, జులై 2020 రాత్రి ఎనిమిది గంటలకు మా ఇంటి తలుపును కొందరు కొట్టారు. తలుపు తీయగానే సైనికులు కనిపించారు. కారు తాళం ఇవ్వాలని అడిగారు. రేపు ఉదయం శిబిరానికి వచ్చి కారు తీసుకోవాలని సూచించారు. మరుసటి రోజు కారు కోసం వెళ్లాను. అయితే, మీ కారును ఎన్‌కౌంటర్ కోసం తీసుకెళ్లారని చెప్పారు. దీంతో సాయంత్రం కూడా వెళ్లాను. అప్పుడు మరుసటి రోజు ఉదయం రావాలని సూచించారు. అలానే ఉదయం వెళ్లాను. అప్పుడు తాళం ఇచ్చారు. కానీ, కారు మాత్రం ఎన్‌కౌంటర్ స్థలంలో ఉందని చెప్పారు. వేరే కారులో అక్కడికి వెళ్లి నా కారును తెచ్చుకున్నాను’’అని ఆయన వివరించారు.

షోపియాన్
ఫొటో క్యాప్షన్, షోపియన్‌లో సైనిక శిబిరం

మరోవైపు అజాజ్ అహ్మద్ సన్నిహితుడు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఆ ఎన్‌కౌంటర్‌కు మూడున్నర నెలల తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చారు. అప్పుడు రాత్రి 11.30 అయ్యింది. మేం నిద్రపోతున్నాం. షోపియాన్ ఎస్పీ తలుపుకొట్టారు. అప్పుడే ఆ ఎన్‌కౌంటర్ ఫేక్ అనే వార్త వైరల్ అయింది. ఆ ఎన్‌కౌంటర్ కోసం ఉపయోగించిన వాహనం కావాలని పోలీసులు అడిగారు. దీంతో నా వాహనాన్ని ఇవ్వాల్సి వచ్చింది. నాలుగు నెలలపాటు హీర్‌పురా స్టేషన్‌లోనే దాన్ని ఉంచారు. నాలుగు నెలల తర్వాత ఆ కారు మాకు ఇచ్చినప్పటికి అది పూర్తిగా దెబ్బందింది. మరోవైపు కారు పత్రాలు వచ్చి తర్వాత తీసుకోమని మాకు సూచించారు’’అని ఆయన చెప్పారు.

ఈ విషయంపై మాట్లాడేందుకు హీర్‌పురా ఎస్‌హెచ్‌వోతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.

‘‘నేటికీ కారు పత్రాల కోసం అజాజ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కారు బాగా దెబ్బతింది. దాన్ని అమ్మాలంటే ఆర్‌సీ ఉండాలి. అది లేకుండా అమ్మలేం. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆర్‌సీ ఇవ్వకపోవచ్చు’’అని అజాజ్ సన్నిహితుడు అన్నారు.

‘‘కారును విడిపించుకోవడానికి ఆ లాయర్‌కు పది నుంచి 12 వేల వరకు కట్టాం. అయితే, ఇప్పుడు ఆ లాయర్ లేరు. కొత్తవారు ఎవరూ కేసును వాదించేందుకు రావడం లేదు’’అని ఆయన వివరించారు.

కశ్మీర్
ఫొటో క్యాప్షన్, షౌకత్ మీర్ కారు

కారు పేలుడులో..

ఇది రెండో ఘటన. ఇది కూడా షోపియాన్‌లోనే జరిగింది.

20 ఏళ్ల మిన్హాజ్‌వుల్లా మాతో మాట్లాడేటప్పుడు రెండు చేతులూ నోటికి అడ్డంగా పెట్టుకున్నారు. చాలా చిన్న స్వరంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో ఎనిమిది రోజులపాటు ఆయన్ను స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) కస్టడీలో ఉంచారు.

జూన్ 2న షోపియాన్‌లోని ఒక ప్రైవేటు వాహనంలో ఐఈడీ పేలుడు జరిగింది. దీనిలో ఒక జవాను మరణించారు. ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. ఈ వాహనాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి అద్దెకు తీసుకున్నట్లు షోపియాన్ పోలీసులు వెల్లడించారు.

అది టాటా 207 పికప్ వాహనం. దాని యజమాని పేరు మొహమ్మద్ అల్తాఫ్. దీన్ని ఆయన కుమారుడైన 20 ఏళ్ల మిన్హాజ్‌వుల్లా నడిపేవారు.

జూన్ 1న మధ్యాహ్నం 3.30కు ఆ వాహనంలో ఒక ఐఈడీ పేలింది. ఇలాంటి బాంబులను మిలిటెంట సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి.

ఇళ్లపై సైన్యం రాస్తున్న నంబర్లు
ఫొటో క్యాప్షన్, ఇళ్లపై సైన్యం రాస్తున్న నంబర్లు

సాయంత్రం 5 గంటలకు అల్తాఫ్ ఇంటికి సైన్యం వచ్చి మిన్హాజువుల్లా, రాఖీబ్, బిలాల్, సయ్యార్, మిలాయత్‌లను తీసుకెళ్లారు.

ఆ వాహనానికి మిన్హాజ్ డ్రైవర్ కావడంతో అతడిని ఎనిమిది రోజులపాటు ఎస్‌వోజీ క్యాంపులో పెట్టి విచారించారు. దాదాపు నెల రోజులపాటు మిన్హాజ్‌ను విచారించారని అతడి సోదరుడు బీబీసీతో చెప్పారు.

జూన్ 2న ఈ పేలుడుపై షోపియాన్ ఎస్సీ తనుశ్రీ ఒక విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. ‘‘సైన్యం అద్దెకు తీసుకున్న ఒక ప్రైవేటు వాహనంలో బాంబు పేలింది’’అని చెప్పారు.

అయితే, అసలు తమ వాహనాన్ని అద్దెకు తీసుకోలేదని మిన్హాజ్, అల్తాఫ్‌లు అంటున్నారు. తమ వాహనాన్ని ఇవ్వాలని అడిగారని, అందరిలానే తాము కూడా ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే వాహనాన్ని ఇచ్చామని వారు చెబుతున్నారు.

పూర్తిగా ధ్వంసమైన ఆ వాహనం ఇప్పటికీ హీర్‌పుర్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంది. ఆ కారు విషయంలో తనకు ఎలాంటి డబ్బులు లేదా ఆర్థిక సాయం చేయలేదని అల్తాఫ్ అంటున్నారు.

మరోవైపు అల్తాఫ్ కూడా ఈ విషయంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ‘‘వారు మా ఇంట్లో ఐదుగురిని విచారణ కోసం తీసుకెళ్లారు. నేను, వృద్ధుడైన మా నాన్న మాత్రమే మిగిలాం. మీరే చెప్పండి.. నేను ఎక్కడికి వెళ్లి ఏం సాయం చేయాలని అడగాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ వైఖరి పట్ల నిరాశను వెలిబుచ్చిన బాధిత కుటుంబాలు

‘‘అద్దె కారు’’

మేం ప్రస్తావించిన రెండు కేసుల్లోనూ తాము ప్రజల వాహనాలను తీసుకున్నామని భద్రతా బలగాలు అంగీకరించాయి.

సాధారణ ప్రజల వాహనాలను సైన్యం ఉపయోగించిందని కోర్టు పత్రాలు, చార్జిషీట్లు, పత్రికా ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, అన్ని చోట్లా ఈ వాహనాలను అద్దెకి తీసుకున్నట్లుగా ప్రస్తావిస్తున్నారు. కానీ, ఆ వాహనాలను అద్దెకి తీసుకోలేదని స్థానికులు అంటున్నారు.

ఈ విషయంపై దక్షిణ కశ్మీర్‌లోని సీనియర్ పోలీసు అధికారితో బీబీసీ మాట్లాడింది. ‘‘సైన్యం ప్రజల వాహనాలను తీసుకుంటుందని పోలీసులకు తెలుసా?’’అని మేం ఆయన్ను ప్రశ్నించాం. ‘‘హా, మాకు తెలుసు. ఎప్పటి నుంచో ఇలా జరుగుతుంది. అయితే, ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ఇలా తీసుకోవడం తగ్గింది. కానీ, పూర్తిగా లేదని చెప్పలేం’’అని ఆయన అన్నారు.

మేం దక్షిణ కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇళ్లపై నంబర్లు కనిపించాయి. దీని గురించి స్థానికులతో, జర్నలిస్టులతో మాట్లాడాం. ‘‘ఆ నంబర్లను సైనికులు రాస్తారు. అవి ఒక గుర్తింపు సంఖ్య లాంటివి. ఆ ఇంటిలో ఎంత మంది ఉంటారు? ఏ వాహనాలు ఉన్నాయి? లాంటి నంబర్లు రాస్తారు. వీటిని మేం ఆర్మీ సెన్సస్‌గా పిలుస్తాం’’అని స్థానికులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, కొత్త ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మూడేళ్లలో ఏ మేరకు నెరవేరిందా?

ఇలా ఉపయోగించొచ్చా?

ఇలా సామాన్యుల వాహనాలను సైన్యం ఉపయోగించొచ్చా? అనే విషయంపై విశ్రాంత మేజర్ జనరల్‌తో బీబీసీ మాట్లాడింది.

‘‘సామాన్యుల వాహనాలను సైన్యం అద్దెకి తీసుకోవచ్చు. అది ఏ అవసరం కోసమైనా పర్వాలేదు. దీని కోసం 20 ఏళ్ల క్రితమే నిబంధనలు తీసుకొచ్చారు. అయితే, దీనికి తగిన అద్దె తప్పకుండా చెల్లించాలి. ముఖ్యంగా ప్రజలు వాహనాలు ఇవ్వాలని ఎలాంటి ఒత్తిడీ చేయకూడదు’’అని ఆయన అన్నారు.

‘‘చాలాసార్లు కశ్మీర్‌లో ప్రైవేటు వాహనాలను సైన్యం తీసుకుంటోంది. ఉదాహరణకు ఒక ఆపరేషన్ చేపట్టేటప్పుడు సైనిక వాహనాల్లో వెళ్తే అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు సామాన్యుల వాహనాలు ఉపయోగపడతాయి’’అని ఆయన అన్నారు.

మరోవైపు ఈ విషయంపై రక్షణ శాఖ వర్గాలతోనూ బీబీసీ మాట్లాడింది. ‘‘పౌరుల వాహనాలు తీసుకునేటప్పటికీ, పెట్రోలు లేదా డీజిల్‌లను మనమే భరించాలి. నెలలో ఏదో ఒకటి రెండుసార్లు మాత్రమే ఇలా తీసుకోవాలి’’అని వారన్నారు.

షౌకత్ మీర్
ఫొటో క్యాప్షన్, షౌకత్ మీర్

చివరగా పర్వతాలను దాటుకుంటూ షోపియాన్‌లో హీర్‌పురా గ్రామానికి చేరుకున్నాం. ఏప్రిల్‌లో ఈ గ్రామానికి చెందిన షౌకత్ అహ్మద్ మీర్ టాటా సుమోను చౌగామ్ సైనిక శిబిరం తీసుకెళ్లింది.

దీనిపై ఏప్రిల్ 14న సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక సుబేదార్ మరణించారని, కారు కూడా పూర్తిగా ధ్వంసమైందని దానిలో పేర్కొన్నారు.

ఈ విషయంపై మాట్లాడేందుకు మేం షౌకత్ ఇంటికి వెళ్లాం. ఆయన కూడా భయంతో చాలా నెమ్మదిగా మాట్లాడారు. ‘‘రెండు నెలల తర్వాత మాకు సైన్యం రూ.2.9 లక్షలు ఇచ్చింది. కానీ, కారు మరమ్మతులకు రూ.3.10 లక్షలు ఖర్చయింది. ఇప్పుడు మా గ్రామం నుంచి సైన్యం కార్లను తీసుకోవడం తగ్గించింది. అయినా, వారు అడిగితే, మేం కార్లు ఇస్తాం’’అని ఆయన అన్నారు.

మేం మాట్లాడిన 14 గ్రామాల ప్రజల్లో షౌకత్ మాత్రమే దెబ్బతిన్న కారుకు సైన్యం నుంచి డబ్బులు వచ్చాయని చెప్పారు. మరోవైపు ఇదివరకు చాలాసార్లు సైన్యం తన వాహనాలను తీసుకుందని ఆయన స్పష్టంచేశారు.

ఇది కేవలం షోపియాన్‌కు మాత్రమే పరిమితం కాదు. పుల్వామా, కుల్గామ్ ఇలా దక్షిణ కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో సామాన్యుల వాహనాలను సైన్యం తీసుకుంటోంది. ఈ విషయం పోలీసులు, సైన్యాధికారులకు కూడా తెలుసు. కానీ, దీనిపై ఎవరూ బహరంగంగా మాట్లాడేందుకు సిద్ధపడటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)