ఆసియా కప్: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా భారత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. మంగళవారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో టైటిల్‌పై భారత్ ఆశలు సన్నగిల్లాయి. సూపర్-4లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే, టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ, దీనికోసం అద్భుతం జరగాల్సి ఉంటుంది.
సూపర్-4లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఈ జట్లకు రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఇంకా మిగిలి ఉన్నాయి.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు, వాటి ఫలితాల ప్రకారం కొన్ని జట్లు పటిష్ట స్థితిలో నిలవగా, కొన్ని జట్లు వెనుకబడ్డాయి. అయితే ఫైనల్ చేరే అవకాశం ఇంకా అన్ని జట్లకు మిగిలి ఉంది. ఆ సమీకరణాలేంటో ఇక్కడ చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక

సూపర్-4లో శ్రీలంకకు పాకిస్తాన్‌తో మ్యాచ్ మిగిలి ఉంది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌ను ఓడించాలి. లేదా అఫ్గానిస్తాన్ జట్టుకు ఇంకా మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడిపోవాలని కోరుకోవాలి. లేదా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల కంటే మెరుగైన రన్‌రేట్‌ను కొనసాగించాలి.
సూపర్-4లో రెండు మ్యాచ్‌లు నెగ్గిన శ్రీలంక, 4 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. శ్రీలంక ఫైనల్ చేరడం దాదాపు ఖాయమైనట్లే.
శ్రీలంకకు దసున్ షనక కెప్టెన్సీ వహిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్‌రేట్ అన్ని జట్ల కంటే చాలా మెరుగ్గా ఉంది. పాకిస్తాన్ (0.126), అఫ్గానిస్తాన్ (-0.589)తో పోలిస్తే శ్రీలంక (0.351) పటిష్ట స్థితిలో నిలిచింది.

ఫొటో సోర్స్, ANI
పాకిస్తాన్

సూపర్-4లో పాకిస్తాన్ ఇంకా అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఫైనల్‌కు చేరాలంటే పాకిస్తాన్ ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. లేదా, కనీసం ఒక మ్యాచ్‌లోనైనా గెలుపొంది అఫ్గానిస్తాన్, శ్రీలంక కంటే మెరుగైన రన్‌రేట్‌ను సాధించాలి.
ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోతే... అఫ్గానిస్తాన్‌పై భారత్ గెలుపొందాలని పాక్ కోరుకోవాలి. అంతేకాకుండా భారత్, అఫ్గాన్‌ల కంటే మెరుగైన రన్‌రేట్‌ను పాక్ కొనసాగించాలి.
అయితే, ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్‌పై పాక్ సాధించిన గెలుపు, ఆ జట్టును టోర్నీలో పటిష్ట స్థితిలో నిలిపింది. సూపర్-4లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే పాక్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది.
రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ అఫ్గాన్, భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ కొనసాగిస్తే కూడా బాబర్ ఆజమ్ సేనకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, ANI
అఫ్గానిస్తాన్

అఫ్గాన్‌కు పాకిస్తాన్, భారత్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
అఫ్గాన్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. నెట్ రన్ రేట్ విషయంలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల కంటే ఉత్తమ స్థితిలో ఉండాలి. లేదా,
భారత్, పాక్ జట్లలో కనీసం ఏదైనా ఒక జట్టును ఓడించాలి. ఈ నేపథ్యంలో పాక్ జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో పాటు అఫ్గాన్ రన్ రేట్ పాక్, శ్రీలంక కంటే మెరుగ్గా ఉండాలి.
ఒకవేళ అఫ్గాన్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే దాని రన్‌రేట్ మెరుగు కావడంతో పాటు జట్టు ఫైనల్‌కు చేరుతుంది.

ఫొటో సోర్స్, ANI
భారత్

సూపర్-4లో భారత్‌కు ఇంకా ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. అది అఫ్గానిస్తాన్‌తో..
భారత్ ఫైనల్‌కు వెళ్లాలంటే అఫ్గాన్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. దానితో పాటు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఓడిపోవాల్సి ఉంటుంది.
పాక్, శ్రీలంక చేతుల్లో భారత్ ఓడిపోవడంతో ఇప్పుడు టీమిండియా ఫైనల్ ఆశలన్నీ ఇతర జట్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉన్నాయి. అయితే, ఫైనల్ అవకాశాలు ఇంకా మిణుకుమిణుకు అంటున్నాయి.
భారత్, పాక్ జట్లు ఫైనల్ పోరులో తలపడాలని ఇరుదేశాల క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.
ఒకవేళ భారత్, అఫ్గాన్‌ను చిత్తుగా ఓడించినా పాక్ ప్రదర్శనపైనే భారత్ ఫైనల్ అవకాశాలు అధారపడి ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో పాక్ ఓడిపోవాలి. అందుకే ఏదైనా అద్భుతం జరగాలి అని అభిమానులంతా ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
- సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం: ఇండియాలో ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తారా?
- బ్రిటన్ రాణి నియమించిన ప్రధానమంత్రులు వీరే... ఫోటో ఫీచర్
- 'పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు కాకపోవడంతో ఎంతో ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యాను' -బుల్లితెర సీత దేబినా
- ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













