'పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు కాకపోవడంతో ఎంతో ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యాను' -బుల్లితెర సీత దేబినా

ఫొటో సోర్స్, Instagram/Debina Bonnerjee
''బుల్లితెర సీత'' దేబినా బెనర్జీ గురించి హిందీ టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. గత 15 ఏళ్లుగా ఆమె టీవీ సీరియల్స్, రియాలిటీ షోలలో కనిపిస్తున్నారు.
కెరియర్ మొదట్లోనే ఆమెకు రామాయణ్ ధారావాహికలో సీతగా నటించే అవకాశం దక్కింది. అదే సీరియల్‌లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌధరిని 2011లో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
గత ఏప్రిల్‌లో తొలిసారి దేబినా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఆమె పాప పేరు లియానా. ఇప్పుడు మరోసారి ఆమె గర్భంతో ఉన్నారు. అయితే, తొలి బిడ్డ కోసం ఆమె ఎంతో ఎదురుచూడాల్సి వచ్చింది.
మొదటి బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే మరోసారి దేబినా గర్భం దాల్చడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఆమె అడగకుండానే చాలా సూచనలు కూడా ఇస్తున్నారు.
నిజానికి తల్లిగా దేబినా ప్రయాణం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. పెళ్లైన పదేళ్ల వరకు ఆమె పిల్లల కోసం ఎంతగానో ఎదురుచూడాల్సి వచ్చింది. సమాజం, కుటుంబం, స్నేహితుల నుంచి ఆమె ఎంతో ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నారు.
మరోవైపు ఆరోగ్యపరంగానూ దేబినాకు కొన్ని సమస్యలున్నాయి. ఒక పసిపాప చేతిలో ఉండగానే మరోసారి తల్లి కావడంపై తన అనుభవాలను ఆమె ప్రజలతో పంచుకున్నారు.
దేబినా బెనర్జీని బీబీసీ కోసం నయన్‌దీప్ రక్షిత్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.

ఫొటో సోర్స్, Instagram/Debina Bonnerjee
''ఇది చాలా ప్రత్యేకం''
''చిన్నప్పటి నుంచి ఇది చేయకూడదు, అది చేయకూడదని అందరూ చెబుతుంటారు. కానీ, కొన్ని పనులు అనుకున్న సమయంలో జరగకపోతే ఏం అవుతుందో, ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయో మనకు ఎవరూ చెప్పరు''అని దేబినా అన్నారు.
కెరియర్ కోసం దేబినా కోల్‌కాతా నుంచి ముంబయికి వచ్చారు. అప్పట్లో ఆమెకు కెరియరే తొలి ప్రాధాన్యంగా ఉండేది.
''కెరియర్‌లో మనం విరామం తీసుకుంటే.. మళ్లీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా? అని ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పనిచేస్తున్నట్లే మళ్లీ పని చేయగలమా? అసలు మనకు పని ఎవరైనా ఇస్తారా? లాంటి ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి. అయితే, నేటి తరం ఈ విషయంలో స్పష్టంగా ఆలోచించగలుగుతోంది. ఇదివరకు ఒకసారి పెళ్లి చేసుకుంటే కెరియర్ ముగిసిపోతుందనే భ్రమ చాలా మందిలో ఉండేది''అని ఆమె వివరించారు.
''మొదట్లో పిల్లలను కనాలని అనుకున్న తరువాత చాలా కాలం మాకు పిల్లలు పుట్టలేదు. దాంతో వైద్యులను కలవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నా శరీరం గురించి నాకు ఇంత తక్కువ తెలుసా? అని అనిపించింది''అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Instagram/Debina Bonnerjee
శరీరం గురించి ఏం తెలుసుకోవాలి?
పిల్లలు పుట్టకపోవడం వెనుక కారణాలపై వైద్యులతో మాట్లాడనని దేబినా వివరించారు. ''నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడే తెలిసింది. నిజానికి వీటి గురించి నాకు అసలు తెలియదు. నేను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నానని అనుకునే దాన్ని. కానీ, సమస్యలు ఎదురైన తర్వాతే, దాని వెనుక కారణాలను అన్వేషించడం మొదలుపెట్టాను''అని ఆమె అన్నారు.
''నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను. చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాను. అసలు నాకు ఎందుకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనుకునేదాన్ని. నిజానికి ఎండోమెట్రియోసిస్, ఎడెనోమాయోసిస్ లాంటి వ్యాధుల పేర్లు ఇదివరకు నేను అసలు వినలేదు''అని ఆమె వివరించారు.
అసలు చాలా మంది మహిళలకు తమ శరీరం గురించి అవగాహన ఉండటంలేదని దేబినా వివరించారు. ''నిజానికి రుతుస్రావ సమయంలో వచ్చే నొప్పిని సగం మంది మహిళలు పెద్దగా పట్టించుకోరు. నాకు మొదట్లో అసలు ఎలాంటి నొప్పీ ఉండేది కాదు. తర్వాత రుతుస్రావ నొప్పి క్రమంగా పెరిగింది. అయితే, ఎండోమెట్రియోసిస్, అడెనోమాయోసిస్ లాంటి సమస్యల వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువైంది''అని ఆమె చెప్పారు.
రుతుస్రావ సమయంలో స్వల్ప స్థాయిలో కడుపునొప్పి రావడం సహజమని ఆమె అన్నారు. ''కానీ, నొప్పి విపరీతంగా ఉంటే అదే సహజం కాదని గుర్తుంచుకోవాలి. దీనికి కారణం ఎండోమెట్రియోసిస్ లేదా ఇంకేదైనా అయ్యుండొచ్చని మనం గుర్తించాలి''అని ఆమె తెలిపారు.
రుతుస్రావానికి ముందు గర్భాశయ పరిసరాలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కొన్ని ఫెలోపియన్ నాళాలు, పేగులు, గర్భసంచిలోనూ రక్త ప్రసరణ ఎక్కువవుతుంది. అరుదుగా ఊపిరితిత్తులు, కళ్లు, మెదడు, వెన్నెముక లాంటి ప్రాంతాలకూ రక్త ప్రసరణ పెరుగుతుంది.
అయితే, ఎండోమెట్రియోసిస్ వల్ల రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా శరీరం నుంచి బయటకు పోతుంది. ఫలితంగా నీరసం, అలసట లాంటివి వస్తాయి. ముఖ్యంగా వెన్నెముక దిగువన, కటి ప్రాంతాల్లో నొప్పిగా అనిపిస్తుంది.
మళ్లీ మళ్లీ ప్రయత్నం... ఫలితం?
సరిగ్గా ఏడేళ్ల క్రితం పిల్లలను కనాలని దేబినా, గుర్మీత్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రయత్నాల తర్వాత, ఆరేళ్ల క్రితం వీరు వైద్యులను సంప్రదించారు.
గత ఆరేళ్లలో నాలుగుసార్లు ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ), మూడుసార్లు ఇన్ విర్టో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)లను ఆమె ప్రయత్నించారు. అయితే, ఎట్టకేలకు నాలుగో ఐవీఎఫ్ ఫలించి, ఆమె గర్భం దాల్చారు.
''ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే.. కుటుంబం, స్నేహితులు, అభిమానుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మరోవైపు ట్రోల్స్ కూడా చేస్తారు. అన్నింటిని కలిపి చూసినప్పుడు మనకు చాలా ఆందోళనగా ఉంటుంది''అని ఆమె వివరించారు.
''ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, నేను తల్లిని కాలేకపోయాను. దీంతో నా మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమైంది''అని ఆమె చెప్పారు.
ఇలాంటి సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు మనకు చాలా కీలకమని దేబినా చెప్పారు. తల్లి కావడంలో తను ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మొదట తన భర్త, తర్వాత తన తల్లితోనే చెప్పుకునే దాన్నని ఆమె వివరించారు.
''గుర్మీత్ చాలా బిజీగా ఉండేవారు. అసలు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దని చెప్పేవారు. జీవిత భాగస్వామి ఇలా అండగా నిలవడం చాలా ముఖ్యం. ఇంతలా అర్థం చేసుకునే భర్త ఉన్నప్పటికీ, ఒక్కోసారి నేను ఏడ్చేసేదాన్ని. మా అమ్మ, గుర్మీత్‌ల ముందు అసలు ఏడుపు ఆపుకోలేకపోయేదాన్ని. కానీ, నా బాధను బయటవారి ముందు బయటపెట్టేదాన్ని కాదు''అని ఆమె తెలిపారు.
మాతృత్వ భావన ఎలా ఉంటుంది?
నిజానికి మాతృత్వ భావన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందని దేబినా వివరించారు. మొదట్లో తను గర్భం దాల్చానని తెలుసుకున్నప్పుడు, అసలు తనను తాను నమ్మలేకపోయానని ఆమె చెప్పారు.
''అప్పటికే నాలో సంకేతాలు కనిపించాయి. అయితే, మేం పెద్దగా వేడుకలు చేసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు గర్భం దాల్చడంలో నేను విఫలం అయ్యాను. అందుకే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాం. సాధారణంగా తల్లి అయ్యానని తెలిసిన వెంటనే, కుటుంబాల్లో వేడుకలు మొదలవుతాయి. కానీ, మా విషయంలో అలా జరగలేదు. మేం సంతోషంగానే ఉన్నాం. కానీ, కొంత సమయం తీసుకోవాలని అనుకున్నాం. 3-4 నెలల తర్వాత అన్ని సవ్యంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, మేం సంతృప్తి చెందాం''అని దేబినా వివరించారు.
ట్రోలింగ్‌ను దేబినా ఎలా చూస్తారు?
దేబినా బెనర్జీ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను భరించాల్సి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
''లియానా పుట్టిన వెంటనే మళ్లీ అవీఇవీ చెప్పడం మొదలుపెట్టారు. పాపను ఒడిలో కూర్చోపెట్టుకుని నేను ఒక వీడియో చేశాను. అయితే, అసలు పాపను ఎలా ఎత్తుకోవాలో నీకు తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. నేను ఒక తల్లిని నా బిడ్డను నేను ఎత్తుకోలేనా?''అని ఆమె ప్రశ్నించారు.
ఇంత తక్కువ వ్యవధిలో మరో బిడ్డకు కూడా జన్మనిస్తే ఇద్దరు పిల్లలను ఎలా చూసుకోగలరు? అని కూడా చాలా మంది అడుగుతున్నారని ఆమె వివరించారు.
''లియానాపై చూపించే ప్రేమ తగ్గుతుందా? అసలు ఇది ఎలా జరుగుతుంది? కవల పిల్లలు పుట్టేటప్పుడు ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువగా చూస్తామా? అసలు పిల్లల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే తేడానే ఉండదు''అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సైరస్ మిస్త్రీ మరణానికి బాధ్యులెవరు?
- కాలా నమక్: ఈ బియ్యం నుంచి వచ్చే సువాసనకు బుద్ధుడితో సంబంధం ఏమిటి?
- ప్రేమిస్తే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలి, పెళ్లికి 6 నెలలు ఆగాలి.. పెళ్లయ్యాక 27 నెలలు అక్కడే గడపాలి..
- తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?
- ‘హిందువులు, సిక్కులను మిషనరీలు క్రైస్తవులుగా మారుస్తున్నాయ్’ అంటూ పంజాబ్‌లో వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















