Chandigarh: యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్‌రూమ్ వీడియోలు లీక్, 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం నిజమేనా?


ఈ కేసులో ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..
- పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ సమీపంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూం వీడియోలు లీకయ్యాయన్న ఆరోపణలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
- క్యాంపస్‌లోని చాలామంది అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల వీడియోలు అదే క్యాంపస్‌కు చెందిన మరో విద్యార్థిని రికార్డ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
- అలా రికార్డ్ చేసిన వీడియోలను ఆమె సిమ్లాలోని ఓ యువకుడిగా పంపించగా ఆయన వాటిని వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
- ఆరోపణలు ఎదుర్కొంటున్నవిద్యార్థినిని అరెస్ట్ చేసినట్లు మొహలీ ఎస్ఎస్‌పీ తెలిపారు.
- వీడియోలు లీకయ్యాయన్న ఆరోపణలు తరువాత అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అలాంటిదేమీ లేదని పోలీసులు చెప్పారు. వాళ్లలో కొందరు పానిక్ అటాక్‌కు గురయ్యారని, కొందరు స్పృహ తప్పి పడిపోయారని పోలీసులు ప్రకటించారు.
- విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారన్నది కేవలం వదంతి అని, అయితే, ఓ విద్యార్థిని మాత్రం ఈ సమాచారం తెలిసిన తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లారని యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఏ ఒక్క విద్యార్థినీ ఆత్మహత్యకు ప్రయత్నించలేదని, ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరలేదని యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ఒక ప్రకటనలో తెలిపారు.
- బాత్‌రూమ్‌లో వీడియోల చిత్రీకరణను నిందితురాలైన యువతి అంగీకరించిందని, అయితే ఆ వీడియోల్లో ఉన్నది తానేనని, ఇతర విద్యార్థినులను తాను చిత్రీకరించలేదని చెప్పిందని చండీగఢ్ యూనివర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
- పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

చండీగఢ్ సమీపంలోని మొహలీలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 8 మంది అమ్మాయిలు ఆత్మహత్యకు యత్నించారని బీబీసీ కోసం పనిచేస్తున్న గుర్మిందర్ సింగ్ గ్రేవాల్ చెప్పారు. ఆ తరువాత విద్యార్థులు ఆందోళనలకు దిగారని గ్రేవాల్ చెప్పారు.
అయితే, విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారనడం నిజం కాదని.. అవన్నీ వదంతులని యాజమాన్యం చెబుతోంది.
మరోవైపు.. ఇతర విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తాను చేసిన పనిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ కూడా ఒకటి షేర్ అవుతోంది.
ఆ అమ్మాయి ఇతర విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వాటిని సిమ్లాలోని తన స్నేహితుడికి పంపించగా ఆయన వాటిని ఆన్‌లైన్‌లో వైరల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.
విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు ఆధారాలు లేవని ఆదివారం వేకువన 3 గంటల ప్రాంతంలో మొహలీ ఎస్ఎస్‌పీ వివేక్ సోని మీడియాకు చెప్పారు.
కొందరు విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అయితే, వారు ఆత్మహత్యకు యత్నించినట్లు వైద్య నివేదికలలో లేదని చెప్పారు.
ఈ కేసులో ఎవరూ మరణించలేదని, వదంతులను నమ్మొద్దని వివేక్ సోనీ ప్రజలను కోరారు.
ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఆయన చెప్పారు.
పంజాబ్ 'మహిళల అభివృద్ధి, సామాజిక న్యాయ' శాఖ మంత్రి బల్జీత్ కౌర్ దీనిపై మాట్లాడుతూ దీన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.
బాధిత విద్యార్థినులను తాను వ్యక్తిగతంగా కలుస్తానని... దీనంతటికీ కారణమైన విద్యార్థినికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విద్యార్థులంతా శాంతియుతంగా ఉండాలని, దోషులకు శిక్ష పడుతుందని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైంస్ అన్నారు.
ఎస్ఎస్‌పీ, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నానని.. యూనివర్సిటీకి వెళ్లి బాధిత విద్యార్థినులతో మాట్లాడుతానని పంజాబ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీశా గులాఠీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బాధిత విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి తన సహచర విద్యార్థినులకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను చిత్రీకరించారని.. ఇది తీవ్రమైన, సిగ్గుపడాల్సిన పని అని, ఈ దారుణ ఘటనలో ప్రమేయం ఉన్న అందరినీ కఠినంగా శిక్షించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Gurminder/BBC
ఎంతమంది విద్యార్థినుల వీడియోలు ఉన్నాయి?
తొలుత నలుగురు విద్యార్థినులకు సంబంధించిన స్నానాల వీడియోలు ఉన్నట్లుగా చెప్పారు. అయితే, యూనివర్సిటీ విద్యార్థి ఒకరు మాట్లాడిన ఆడియో మెసేజ్ ఒకటి షేర్ అవుతోంది.. దాని ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది విద్యార్థినుల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా శనివారం రాత్రి నుంచి యూనివర్సిటీలో గందరగోళం ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Gurmindar/BBC
విద్యార్థులు నిరసన తెలుపుతున్న వీడియోలు, పోలీసులు వారికి సర్దిచెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
కాగా కొందరు విద్యార్థినులు అపస్మారక స్థితిలో ఉండగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియోలూ సోషల్ మీడియాలో కనిపించాయి.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం విద్యార్థులు శాంతించారు. అనంతరం యాజమాన్యం క్యాంపస్ గేట్లన్నీ మూసివేసింది. మీడియాను లోనికి అనుమతించలేదు.
‘నేనే ఆ వీడియోలు తీశాను’
ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని హాస్టల్ వార్డెన్ విచారిస్తున్నవీడియో బయటకువచ్చింది. అందులో ఆ అమ్మాయి.. తానే ఈ వీడియోలు తీసి సిమ్లాలోని యువకుడికి పంపించినట్లు తెలిపారు.
ఇదంతా ఎందుకు చేశావని వార్డెన్ అడగ్గా... ఆ అమ్మాయి మౌనం వహించడం వీడియోలో కనిపించింది.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















