స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...

స్వాతి రెడ్డి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన దురంతో ఎక్స్‌ప్రెస్ వేగంగా కదులుతోంది. రాజమండ్రి దాటేసరికి అర్ధరాత్రి దాటి మూడున్నర గంటలైంది. అందులో సత్యవతి అనే మహిళ పురిటినొప్పులు పడుతున్నారు. అవి పురిటినొప్పులని ఆమె భర్త గుర్తించలేకపోయారు. అప్పటికే బిడ్డ తల సగం బయటకు వచ్చేసింది.

ఈ సంఘటన ఈ నెల 13వ తేదీన జరిగింది. ప్రసవం కోసం సొంతూరైన విజయనగరం జిల్లా చీపురుపల్లి బయలుదేరారు సత్యవతి, సత్యనారాయణ దంపతులు. సత్యవతికి అప్పటికే నెలలు నిండటంతో రైలు ప్రయాణంలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి.

అదే రైలులో గీతం మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ చేస్తున్న స్వాతి రెడ్డి కూడా ఉన్నారు. అసలు ఆ రోజు ట్రైన్‌లో ఏం జరిగింది? స్వాతి రెడ్డి ఏం చేశారో ఆమె మాటల్లోనే...

స్వాతి రెడ్డి

'పురిటి నొప్పులొస్తే వెన్నునొప్పి అనుకున్నారు'

ఆ రోజు తేదీ సెప్టెంబర్ 13. నేను రాత్రి ఒంటి గంటకు విజయవాడలో ట్రైన్ ఎక్కి, వెంటనే నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుజామున 3.30 గంటలకు సత్యవతి పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్నారు. అయితే, అవి పురిటినొప్పులని ఆమెతో పాటు ఉన్న భర్త సత్యనారాయణ గుర్తించలేదు. ఎందుకంటే ఆమెకు వెన్ను నొప్పి ఉంది. ఆ నొప్పితోనే బాధపడుతుందని ఆయన అనుకున్నారు.

కానీ గంటన్నర తర్వాత పరిస్థితి అత్యవసర స్థితికి మారింది. దాంతో సత్యనారాయణ ప్రయాణీకుల్లో ఉన్న ఆడవాళ్లందరినీ సహాయం అడగటం మొదలుపెట్టారు. అలాగే నిద్రలో ఉన్న నన్ను కూడా లేపి సాయం కోరారు. ఆ సమయానికి నేను మెడిసిన్ విద్యార్థినని ఆయనకి తెలియదు, అక్కడ ఎవ్వరికీ తెలియదు.

సహాయం చేద్దామని సత్యవతి వద్దకు వెళ్లాను. అప్పుడే అర్థమైంది సత్యవతికి బ్యాక్ పెయిన్ ఉండటంతో, పురిటినొప్పులని కూడా వెన్నునొప్పి అనుకున్నారని. అయితే, అప్పటికే బిడ్డ తల సగం బయటకు వచ్చేసింది. అప్పటికి రైలు రాజమండ్రి దాటింది.

స్వాతి రెడ్డి

'ముందు తల్లి నన్ను నమ్మాలి, అందుకే...'

నిజానికి తన భార్యకి పురిటి నొప్పులు వచ్చాయనే విషయాన్ని సత్యనారాయణ ఆలస్యంగా గుర్తించారు. ఆమెకు పురిటి నొప్పులు మొదలై, బిడ్డ కూడా సగం బయటకు వచ్చేసింది. కానీ తల్లి ఆ బిడ్డను బయటకు తోయలేకపోతోంది (పుష్ చేయడం). సాధారణంగా ప్రసవ సమయంలో తల్లులే బిడ్డను వీలైనంత మేర బయటకు తోస్తుంటారు. కానీ ఆమెకున్న వెన్నునొప్పి కారణంగా ఆ పని చేయలేకపోయిందని నేను అనుకుంటున్నాను. ఆ విషయం, ఆమె పరిస్థితి చూసిన తర్వాత నాకు అర్థమైంది.

నేను వెళ్లి పుష్ చేస్తే ఆమె ప్రసవానికి కొంచెం సాయం చేసినట్లు అవుతుందని భావించి, నేను పుష్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే ముందు నన్ను ఆమె (సత్యవతి) నమ్మాలి. అలాగే చుట్టూ ఉన్న ప్రయాణీకులు నమ్మాలి. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి కఠినంగా మారే అవకాశం ఉంది. అందుకే వెంటనే నేను మెడికల్ స్టూడెంట్‌నని సత్యవతితో పాటు అక్కడున్న వాళ్లందరికి చెప్పాను.

దాంతో నాపై కాస్త నమ్మకం వచ్చింది. సత్యవతి భర్త నా దగ్గరకు వచ్చి 'ఏదైనా చేసి నా భార్య, బిడ్డను రక్షించండి' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

స్వాతి రెడ్డి

'కనీసం కత్తెర కూడా లేదు'

ఏదైనా చేసి ఆమెకు సజావుగా ప్రసవం అయ్యే విధంగా చూడాలి. ఆమె దగ్గరకు వెళ్లి బిడ్డను బయటకు పుష్ చేయడం ప్రారంభించాను. కానీ భయంగానే ఉంది. సాధారణంగా ప్రసవ సమయంలో బిడ్డ తల ఇరుక్కుపోయే పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. అప్పటికే సగం తల బయటకు వచ్చేసి ఉండటంతో, పుష్ చేస్తే ప్రసవం జరిగిపోతుందని తెలుసు కానీ, తల ఇరుక్కుపోవడం వలనే బిడ్డ బయటకు రాలేక ఆగిపోయిందా అనే అనుమానం కూడా మొదలైంది.

సత్యవతికి ధైర్యం చెబుతూనే, నా పని నేను చేస్తున్నాను. సత్యవతి నా వైపు చూస్తూనే ఉంది. ఆమె చూపులు మాత్రం నన్ను భయపెట్టాయి. ఎందుకంటే ఏదైనా తేడా జరిగితే ? నేను డాక్టరుని కాదు, మెడికోను మాత్రమే. పైగా బిడ్డ బొడ్డు కోసేందుకు కనీసం మా దగ్గర కత్తెర కూడా లేదు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంతా నన్ను ఎలా తిడతారో? అసలు సత్యవతి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని చాలా భయపడ్డాను.

మూడు, నాలుగు నిమిషాల్లోనే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. ఓవైపు ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పటికీ, నేను మాత్రం బిడ్డను పుష్ చేయడం పైనే దృష్టి సారించాను.

స్వాతి రెడ్డి

'బయట వర్షం, లోపల ఏసీతో మరో సమస్య'

అయిదు నిముషాలు గడిచేసరికి బిడ్డ ఏడుపు వినిపించింది. ఆడపిల్ల పుట్టింది. దీంతో రైలులోని ప్రయాణికులు అందరూ సంతోషించారు. అప్పుడు సమయం ఉదయం 5.35 గంటలు అయింది. రైలు, అనకాపల్లి చేరుకుంటోంది. మా వద్ద ఎటువంటి వైద్య పరికరాలు లేకపోవడంతో బొడ్డు తాడును కట్టేసి కవర్లో ఉంచేశాను. కానీ, మరో సమస్య వచ్చింది.

మేం ప్రయాణం చేస్తున్నది థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్. సాధారణంగా పిల్లలు పుట్టగానే వారిని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచాలి. లేదంటే వారి రంగు మారిపోయి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మేం ఉన్న పరిస్థితుల్లో వెచ్చని వాతావరణం కల్పించలేం. పైగా అప్పటికే మూడు రోజులుగా భారీ వర్షాలు. బయట కూడా చల్లని వాతావరణమే ఉంది.

ఉన్నంతలోనే వెచ్చదనం కల్పించాలని నిర్ణయించుకుని, రైల్వే సిబ్బందిని వాడని బెడ్ షీట్స్ అడిగి వాటిని పాపకు చుట్టాం. ఇంతలో మిగతా ప్యాసింజర్లు, అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించి ట్రైన్‌ను అనకాపల్లిలో ఆపమని కోరారు. దురంతోకి రాజమండ్రి తర్వాత మళ్లీ విశాఖపట్నమే హాల్ట్. అనకాపల్లి టీటీఈ వెంటనే స్పందించి, రైలు ఆగే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, స్టేషన్ బయట 108 వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు.

స్వాతి రెడ్డి

'తల్లిని డాక్టర్లకు అప్పగించి...బిడ్డను నేను తీసుకెళ్లాను'

వర్షం జోరుగా కురుస్తుండటంతో ప్యాసింజర్లంతా తల్లి, బిడ్డపై వర్షం పడకుండా రెయిన్ కోట్స్, బెడ్స్ షీట్లతో అంబులెన్స్ వరకు రక్షణ కల్పించారు. 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి, బిడ్డను తీసుకు వెళ్లాం. నేను వైజాగ్‌లో దిగాల్సి ఉన్నా అనకాపల్లిలోనే దిగిపోయాను. వారితో పాటు ఆసుపత్రికి వెళ్లాను.

అక్కడికి చేరుకోగానే తల్లిని గైనిక్ విభాగంలోని వైద్యులకు అప్పగించి బిడ్డను తీసుకుని నేను పిల్లల వార్డుకు వెళ్లాను. బిడ్డకు పల్స్, హార్ట్ బీట్, వెయిట్ వంటివి సాధారణంగానే ఉన్నాయో లేదో పరీక్షించిన తర్వాత పాపను తండ్రికి అప్పగించి నేను వైజాగ్ బయలు దేరాను. అప్పుడు సమయం ఉదయం 7 గంటలు.

సత్యవతి, సత్యనారాయణల ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. నేను ఇంటికి వచ్చి నిద్రపోయాను. సాయంత్రం 6 గంటల సమయంలో నా ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే కొత్త నెంబర్. నేను ఎత్తలేదు. ఆ తర్వాత మరో కొత్త నంబరు నుంచి వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే రైల్వే అధికారులమని చెప్పారు. ట్రైన్‌లో నేను సత్యవతి ప్రసవం విషయంలో చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పారు.

ఆ తర్వాత మంచి పని చేశావంటూ పొగుడుతూ స్నేహితులు, తెలిసిన వాళ్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. మీడియా వాళ్లు రావడంతో విషయం అర్థమైంది. మంచి పని చేశానంటూ నా ఇంటర్వ్యూలు తీసుకున్నారు.

కుటుంబ సభ్యులతో స్వాతిరెడ్డి
ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యులతో స్వాతిరెడ్డి

'మాకు అనుమతి ఉండదు, కానీ తప్పలేదు'

మాకు ఇప్పుడే ఏదైనా వైద్యపరమైన సలహా ఇవ్వడానికి లేదా సహాయం చేయడానికి అనుమతి ఉండదు. కానీ రైలులో సత్యవతి ప్రసవం విషయంలో నేను మెడికోనని చెప్పి వైద్యసహాయం చేశాను. ఎందుకంటే అక్కడ నేను ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత కఠినమైపోతుంది. పైగా ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అందుకే, నేను వైద్య విద్యార్థినినే అయినా సత్యవతి విషయంలో డాక్టరుగా మారాను.

హౌస్ సర్జన్‌గా మా గీతం మెడికల్ కాలేజ్‌లోని గైనిక్ విభాగంలో నెలన్నర పాటు నేను శిక్షణ పొందాను. ఆ శిక్షణ నాకు ఇక్కడ ఉపయోగపడింది. నేను శిక్షణ పొందే సమయంలో రోజూ సిజేరియన్ ఆపరేషన్లు, సాధారణ ప్రసవాలకు డాక్టర్లతో పాటు సహాయకురాలిగా వెళ్లేదాన్ని. ఆ అనుభవంతోనే రైలులో సత్యవతికి ప్రసవం విషయంలో సహాయం చేయగలిగాను.

ఎవరికైనా సహాయం చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ మనలో చాలా మంది ఏదైనా తేడా వస్తే చెడు ఎదురవుతుందనే భయంతో వెనకడుగు వేస్తారు. కానీ, అలా వెనక్కి తగ్గకూడదని నేను నమ్ముతాను. తేడాలు వస్తే కెరియర్ కూడా పోతుంది. మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగులు వేయాలి. కానీ, నిర్లక్ష్యంగా ఉండకూడదు.

సత్యవతి, సత్యనారాయణలకు రోజుకు రెండు, మూడు సార్లు ఫోన్ చేస్తున్నా. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నా. నేను ఫోన్ చేసినప్పుడల్లా నేను, రైలులోని ప్రయాణీకులంతా కలిసి తమ బిడ్డకు ప్రాణం పోశామంటూ వారు చెబుతూనే ఉన్నారు.

స్వాతి రెడ్డి

'ప్రసవం సహజ ప్రక్రియ, కానీ కొన్ని సమయాల్లో...'

స్వాతిరెడ్డికి గీతం కళాశాల యాజమాన్యం, రైల్వేశాఖ, స్నేహితులు, వైద్యులు నుంచి అభినందనలు అందుతున్నాయి. రైలులో స్వాతిరెడ్డి స్పందించిన తీరుపై విశాఖపట్నానికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ తనుజా స్పందించారు.

"ప్రసవం అనేది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ప్రయాణాల్లో ఉన్నప్పుడు డెలివరీ చేయాల్సి వస్తే ఏం చేయాలో పాలుపోదు. ఆ సమయంలోనే చురుగ్గా ఆలోచించాలి. మెడికో స్వాతి ఆ సమయంలో సరిగ్గా స్పందించారు. అన్నింటికంటే ముఖ్యంగా బిడ్డను ఆసుపత్రిలో చేర్చేవరకు తల్లిదండ్రులతో ఉండి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యం కంటే మనతో పాటు ఉన్నవాళ్ల వల్ల కలిగే ధైర్యమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. మెడికోలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం అందించవచ్చు" అని డాక్టర్ తనుజా అన్నారు.

"రైల్లో ప్రసవం జరిగిందని ఫోన్ రాగానే వెంటనే దగ్గర్లో ఉన్న స్టేషన్‌లో ఆపుదామని ప్రయత్నించాను. అనకాపల్లిలో రైలును ఆపి తల్లీబిడ్డలను వెంటనే దించేసి, అప్పటికే సిద్దం చేసిన అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాను. అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రసవం, గుండె నొప్పి, ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా ట్రైన్‌ను ఆపి వారికి కావలసిన సహాయం అందించవచ్చు" అని అనకాపల్లి టీటీఈ వెంకటేశ్వరావు చెప్పారు.

స్వాతి రెడ్డి

'ఆమె స్పందనతోనే మాకు పాప దక్కింది'

''నా భార్య నొప్పులతో అల్లాడిపోతుంటే అందర్నీ సహాయం అడిగాను. అందరూ దగ్గరకు వచ్చి చూసినా ఏం చేయాలో వాళ్లకి తెలియలేదు. కానీ, స్వాతిరెడ్డి వచ్చి తాను మెడికోనని చెప్పి ప్రసవం చేయడానికి సిద్ధం కావడంతో కాస్త ధైర్యం వచ్చింది. ప్రసవం తర్వాత తోటి ప్రయాణీకులు కూడా సహాయం చేశారు '' అని సత్యవతి భర్త సత్యనారాయణ చెప్పారు.

"రైల్లోనే పురిటి నొప్పులు మొదలవుతాయని మేం అనుకోలేదు. స్వాతి ముందుకు వచ్చి ప్రసవం చేయడంతో మా బిడ్డ ప్రాణాలు దక్కాలు. ప్రసవం జరిగిన తర్వాత నుంచి రోజూ ఆమె మాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ (16.09.22) ఉదయం కూడా స్వాతి గారు ఫోన్ చేసి పాప కోసం అడిగారు. మా బిడ్డను కాపాడినందుకు మేం ఆమెకు రుణపడి ఉంటాం. మేం ఎవరిమో తెలియదు కానీ, ఆమె మా కోసం చేసిన సాయం మాత్రం మర్చిపోలేం" అని స్వాతి రెడ్డికి సత్యవతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో క్యాప్షన్, తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇదీ..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)