రోజర్ ఫెదరర్: 20 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ దిగ్గజం క్రీడాయాత్ర ఎలా సాగిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పారు. టెన్నిస్ క్రీడా దిగ్గజాల్లో ఒకరైన ఫెదరర్ టెన్నిస్ క్రీడ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ నెలలో లండన్‌లో జరిగే లేవర్ కప్ ఆయన ఆడే చివరి టోర్నమెంట్ అవుతుంది.
20 సార్లు గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్ 2021 వింబుల్డన్ తరువాత మళ్లీ ఆడలేదు. మోకాలికి ఆపరేషన్ చేయించుకోవాల్సి రావడం వల్లే ఆయన అప్పటి నుంచి టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టలేకపోయారు.
"నా శరీరం నాకు ఇచ్చిన సందేశం స్పష్టంగా తెలిసింది" అని 41 ఏళ్ళ ఫెదరర్ ఒక ప్రకటనలో అన్నారు.
"గత 24 ఏళ్ళలో నేను 1,500 మ్యాచులకు పైగా ఆడాను. ఇక, ఈ పోటీల నుంచి నిష్క్రమించాల్సిన సమయం వచ్చిందని నేను తప్పనిసరిగా గుర్తించాలి" అని అన్నారు.
ఇక టెన్నిస్ ఆట పట్ల తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ పెదరర్, " ఐ లవ్ యూ టెన్నిస్. నిన్ను నేను ఎప్పటికీ వదలను" అని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
గత మూడేళ్ళుగా ఆయన మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. దానివల్లే 2020 నుంచి జరిగిన 11 గ్రాండ్‌శ్లామ్స్‌లో ఆయన మూడింటిలోనే పాల్గొనగలిగారు.
గత వేసవి వింబుల్డన్‌లో హ్యూబర్ట్ హర్కాక్జ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పటివరకు అదే ఆయన టోర్నమెంట్లలో ఆడిన చివరి మ్యాచ్.
ఆ తరువాత ఆయన తన మోకాలికి మరికొన్ని శస్త్రచికిత్సలు అవసరమయ్యాయని చెప్పారు. 2020లోనే ఫెదరర్ రెండుసార్లు మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫెదరర్‌తో పోల్చితే ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్‌కు చెందిన రఫేల్ నాడల్, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌లు మాత్రమే ఎక్కువ గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెల్చుకున్నారు. నాడల్ 22, జకోవిచ్ 21 గ్రాండ్‌శ్లామ్ చాంపియన్‌షిప్స్ గెల్చుకున్నారు.
"ఇది తీపి-చేదు కలగలిసిన నిర్ణయం. ఈ ఆట నాకు ఇచ్చిన అన్నింటికీ ఇక నుంచి నేను దూరమవుతున్నాను" అని ఫెదరర్ అన్నారు.
రిటైర్మెంట్ ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలో, వీడియోలో ఆయన ఇంకా ఇలా అన్నారు:
"అయితే, అదే సమయంలో ఇదొక వేడుక లాంటి సందర్భం కూడా. ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళలో నేను చాలా అదృష్టవంతుడిని అనుకుంటాను. టెన్నిస్ ఆడడంలో ప్రత్యేక నైపుణ్యం నాకు దక్కింది. ఇంత సుదీర్ఘ కాలం నేను ఈ రంగంలో రాణిస్తానని ఊహించలేదు.
పురుషుల టెన్నిస్ స్వర్ణయుగంలో నాతో ఆడిన ప్రత్యర్థులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే, నా కుటుంబ సభ్యులకు, నాకు మద్దతు ఇచ్చిన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
నాతో పోటీపడిన వాళ్ళతో కలిసి నేను ఆటలో మరొక దశకు వెళ్ళాను. మేమందరం టెన్నిస్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాం."
ఫెదరర్ 1998లో 16 ఏళ్ళ వయసులో తొలిసారిగా ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టారు. 2003లో తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను వింబుల్డన్‌లో గెల్చుకున్నారు.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో రికార్డు స్థాయిలో ఎనిమిది మెన్స్ సింగిల్స్ టైటిల్స్ గెల్చుకుని ఆయన తన కెరీర్‌ను ముగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటనపై వింబుల్డన్ ఆత్మీయంగా స్పందించింది. 'రోజర్, మన ప్రయాణం ఎంత గొప్పగా సాగింది! మీతో సాగించిన ఈ ప్రయాణం మాకు ఎంతో గర్వాన్నిస్తోంది. మీరు చాంపియన్ అన్న పదానికి పరిపూర్ణమైన న్యాయం చేశారు. మేం కూడా మా క్రీడా మైదానాల్లో మిమ్మల్ని మిస్సవుతాం. కానీ, మీరు పంచిన జ్ఞాపకాలకు, ఆనందాలకు సర్వదా కృతజ్ఞతలు' అని వింబుల్డన్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రోజర్ పెదరర్ గెలిచిన చివరి గ్రాండ్ శ్లామ్ 2018 ఆస్ట్రేలియా ఓపెన్. అప్పుడు ఆయన వయసు 36 ఏళ్ళు. ఆ చాంపియన్‌షిప్ గెలిచిన రెండో అతి పెద్ద వయస్కుడు ఫెదరర్. ఆయన 2004లో మొదటిసారి ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఏటీపీ టూర్‌లో లీడింగ్ ప్లేయర్‌గా 310 వారాలు కొనసాగారు. అప్పటికి అదొక రికార్డ్. దాన్ని జకోవిచ్ 2021 ఫిబ్రవరిలో బ్రేక్ చేశారు.
ఫెదరర్ స్విజర్లాండ్ తరఫున స్టాన్ వారింకాతో కలిసి బీజింగ్-2008 ఒలింపిక్ గోల్డ్ గెలిచారు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు.
తొలిసారిగా స్విజర్లాండ్‌కు 2014లో డేవిస్ కప్ సాధించి పెట్టిన టీమ్‌లో ఫెదరర్ ఒకరు. ఆయన మొత్తం ఆరు ఏటీపీ పైనల్ టైటిల్స్ గెల్చుకుని రికార్డ్ సృష్టించారు.
ఫెదరర్ ఆడబోతున్న చివరి టోర్నమెంట్ లేవర్ కప్ పోటీలు సెప్టెంబర్ 23 శుక్రవారం మొదలవుతాయి. మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్‌లో పెదరర్‌తో పాటు ఆండీ ముర్రే, నాడల్, జకోవిచ్, గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్, నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌లు ఈ టోర్నోలీ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్‌ను 2017లో స్థాపించిన బృందంలో ఆయన ఒకరు.
మహిళల టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తన రిటైర్మెంట్ ప్రకటించి ఇంకా రెండు వారాలు కూడా కాకముందే ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. 23 గ్రాండ్‌శ్లామ్ సింగిల్స్ గెలిచిన సెరెనా ఆడిన చివరి మ్యాచ్‌ను యూఎస్ ఓపెన్ ఫైనల్.

ఫొటో సోర్స్, Getty Images
ఫెదరర్ గ్లాండ్‌శ్లామ్ టైటిల్స్ ఇవే...
గ్రాస్ కోర్టు మీద ఫెదరర్ చెలరేగిపోతారు. ఈ విషయంలో పురుషుల టెన్నిస్‌లో ఆయనది తిరుగులేని ఆధిక్యం. వింబుల్డన్ విజయాలలో ఆయనకు సాటి మరొకరు లేరు. 2017లో ఆయన ఇక్కడ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీలో చివరి విజయాన్ని నమోదు చేశారు.
ఈ స్విజర్లాండ్ ఆటగాడు మెల్‌బోర్న్ పార్క్‌లో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ పోటీలలో 2004 నుంచి 2018 మధ్య కాలంలో ఆరు టైటిల్స్ గెలిచారు.
ఇక, యూఎస్ ఓపెన్‌లో ఫెదరరే్ 2004-2008 మధ్య కాలంలో వరసగా అయిదుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ మట్టి మైదానంలో మాత్రం ఆయన ఒకే ఒకసారి 2009లో విజయం సాధించారు.
మొత్తంగా ఫెదరర్ 31 సార్లు గ్రాండ్‌శ్లామ్ పైనల్స్‌లో ఆడారు. చివరిసారిగా 2019లో వింబుల్డన్ పైనల్ ఆడారు. ఆ మ్యాచ్‌లో ఆయన జకోవిచ్ చేతిలో ఓడిపోయారు.
టెన్నిస్ క్రీడాభిమానులకు ఫెదరర్ 237 వారాలు నిరాటంకంగా వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన అరుదైన ఆటగాడిగా గుర్తుండిపోతారు. 20 గ్రాండ్‌శ్లామ్ విజేతగా ఆయనను స్మరించుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా, తాను ఎంతో ప్రేమించే ఆటను ఎంతో హుందాగా, స్టైల్‌గా ఆడిన ప్లేయర్‌గా ఆయన టెన్నిస్ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు.
ఇవి కూడా చదవండి:
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











