ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విజేత నోవాక్ జొకోవిచ్- Newsreel

నోవాక్ జొకోవిచ్

ఫొటో సోర్స్, EPA/DEAN LEWINS

ఫొటో క్యాప్షన్, నోవాక్ జొకోవిచ్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. 7-5 , 6-2, 6-2 తేడాతో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌‌ను ఓడించాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌‌ను జొకోవిచ్ సాధించడం ఇది తొమ్మిదో సారి. అలాగే, అతడు సాధించిన 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా. ఇప్పటి వరకు అత్యధికంగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రికార్డు నాదల్, ఫెదరర్ పేరిట ఉంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ చెరో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ట్రోఫీలు సాధించారు.

కరోనా మహమ్మారి కారణంగా మ్యాచ్ చూసేందుకు చాలా తక్కువ మంది ప్రేక్షకులు మైదానానికి వస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు మెల్బోర్న్‌లోని స్టేడియానికి ఏడున్నర వేల మంది ప్రేక్షకులు వచ్చారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, PA Media

బర్డ్ ఫ్లూ: మనుషుల్లో తొలి హెచ్5ఎన్8 బర్డ్ ఫ్లూ కేసును గుర్తించిన రష్యా

బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్8 మనుషులకు సోకిన తొలి కేసును రష్యా గుర్తించింది. ఇది పౌల్ట్రీ (పెంపుడు కోళ్లు వంటి పక్షులు) నుంచి మనుషులకు సోకింది.

దేశంలోని దక్షిణ ప్రాంతంలో గల ఒక పౌల్ట్రీ ప్లాంట్‌లో గత డిసెంబర్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని.. అందులో పని చేసే ఏడుగురు కార్మికులకు ఈ బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు చెప్పారు.

''ఆ ఏడుగురూ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు'' అని రష్యా వినియోగదారుల ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ అధినేత అన్నా పొపోవా తెలిపారు.

ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి వేగంగా తగిన చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న సంకేతాలు లేవన్నారు. ఈ బర్డ్ ఫ్లూ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించామని తెలిపారు.

రష్యాకు చెందిన వెక్టార్ లేబరేటరీ.. బర్డ్ ఫ్లూ సోకిన కార్మికుల నుంచి సేకరించిన వైరస్ జన్యు పదార్థాన్ని విజయవంతంగా వేరు చేసిందని అన్నా పొపోవా వెల్లడించారు. ఇది అతి ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణగా అభివర్ణించారు.

''ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే సామర్థ్యాన్ని ఇంకా సంతరించుకోలేదు. ఈ మ్యుటేషన్లను గుర్తించటం.. మున్ముందు రాగల మ్యుటేషన్లను తగినవిధంగా ఎదుర్కోవటానికి, సమయానికి ప్రతిస్పందించటానికి మనందరికీ, ప్రపంచం మొత్తానికీ తగిన సమయాన్ని అందిస్తుంది'' అని ఆమె వివరించారు.

ఈ వైరస్‌ సోకితే గుర్తించటానికి అవసరమైన పరీక్షా వ్యవస్థలను తయారు చేయటంపై రష్యా శాస్త్రవేత్తలు ఇప్పుడు కృషి మొదలు పెట్టగలరని పేర్కొన్నారు.

బర్డ్ ఫ్లూ ఇతర రకాలు అప్పుడప్పుడు మనుషులకు సోకుతుంటాయి. మరణాలకు కూడా దారితీశాయి. అయితే.. హెచ్5ఎన్8 రకం మనుషులకు సోకినట్లు గుర్తించటం ఇదే తొలిసారి.

line

అమెరికాలో డెన్వర్ నుంచి బయలుదేరిన విమానంలో మంటలు

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ యూఏ328 విమానం కుడి వైపు ఇంజన్లో మంటలు

ఫొటో సోర్స్, Hayden Smith/@speedbird5280/Reuters

ఫొటో క్యాప్షన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ యూఏ328 విమానం కుడి వైపు ఇంజన్లో మంటలు

అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి హోనోలులుకు బయలుదేరిన బోయింగ్ జెట్ విమానం గాల్లోకి ఎగరగానే ప్రమాదానికి గురైంది.

విమానం కుడివైపు ఇంజన్ చెడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. ఇంజన్ కేసింగ్ శకలాలు డెన్వర్‌లోని ఒక ఇంటి గార్డెన్‌లో పడ్డాయని బ్రూమ్‌ఫీల్డ్‌ పోలీసులు ఫోటోలు పోస్ట్ చేశారు.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లయిట్-328 బోయింగ్777 విమానం 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న వెంటనే ఈ ప్రమాదం జరిగింది.

డెన్వర్‌లో విమాన శకలాలు

ఫొటో సోర్స్, Broomfield PD

డెన్వర్‌లో విమాన శకలాలు

ఫొటో సోర్స్, Broomfield PD

ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. టేకాఫ్ తీసుకున్న కాసేపటికి విమానంలో పేలుడు శబ్దం వినిపించిందని ప్రయాణికులు చెప్పారు.

డెన్వర్‌లో విమాన శకలాలు

ఫొటో సోర్స్, Broomfield PD via EPA

"విమానం భయంకరంగా ఊగింది. అది పైకి వెళ్లకుండా కిందకు పడిపోవడం మొదలైంది" అని డేవిడ్ డెలూసియా అనే ప్రయాణికుడు చెప్పారు. "నేను, నా భార్య ఐడీ కార్డులను జేబులో పెట్టుకున్నాం. ఏమైనా జరిగితే మమ్మల్ని గుర్తించడానికి వీలుంటుందని అలా చేశాం" అని కూడా ఆయన అన్నారు.

ఆన్‌లైన్లో పోస్ట్ చేసిన ఫోటోల్లో ఇంజన్ నుంచి పొగ రావడం కనిపించింది. విమానం లోపలి నుంచి తీసినట్లుగా భావిస్తున్న ఒక వీడియోలో ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా కనిపించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)