తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఖమ్మం నుంచి అశ్వారావు పేట వెళ్లే దారిలో రోడ్డుకు రెండు వైపులా ఆయిల్ పామ్ చెట్లు పెద్దయెత్తున కనిపిస్తుంటాయి.
ఆయిల్ పామ్ మొక్కలను తన వ్యవసాయ భూమిలో నాటడంలో నాగార్జున బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల ఈ పంటకు మళ్లారు. తనకు తెలిసిన సుమారు 50 మంది రైతులు వరి నుంచి ఆయిల్ పామ్‌కు మారారని ఆయన చెబుతున్నారు.
నాలుగో సంవత్సరం వరకు ఆయిల్ పామ్ కోతకు రాదు. కనుక అప్పటివరకు అంతర పంట ఏమన్నా వేయాలన్నది ఆయన ఆలోచన. తనకున్న 4 ఎకరాల భూమిలో వరితో తీవ్ర నష్టాన్ని చవిచూశానని, అయితే ఆయిల్ పామ్ పంట తమకు లాభాలు తెచ్చి పెడుతుందనే ఆశతో ఉన్నానని చెప్పారు నాగార్జున.

నాగార్జున ఈ పంట ఎంచుకోవడానికి కారణం తనకు వరిలో వచ్చిన నష్టం మాత్రమే కాదు. కొంతకాలంగా ఆయిల్ పామ్ ద్వారా తనకు తెలిసిన చాలా మంది రైతులు ఆర్జించిన భారీ లాభాలు కూడా. ఇలాంటి వారిలో నారాయణరావు కూడా ఒకరు.
"నేను మామిడి నుండి ఆయిల్ పామ్‌కు మారి 8 సంవత్సరాలకు పైగా అయ్యింది. ఈ సంవత్సరం నా 30 ఎకరాల భూమిలో, జనవరి నుంచి ఇప్పటివరకు రూ.40 లక్షలకు పైగా లాభాలను ఆర్జించాను. ఈ పంట జీవితకాలం సుమారు 30ఏళ్లు. నాకు ఇప్పుడు 72ఏళ్లు. నా జీవిత కాలంలో ఈ చెట్లను నేలమట్టం చేయబోను"అని రైతు నారాయణ రావు అంటున్నారు.

ప్రభుత్వ లక్ష్యం..
ఇది రైతుల ఆలోచన మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి గట్టి మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం 6,500 మంది రైతులు ఈ సాగులో ఉండగా ఈ సంఖ్యను దాదాపు 30 వేల నుంచి 35 వేల దాకా పెంచాలని ప్రయత్నిస్తున్నారు అధికారులు .
2014లో 34,000 ఎకరాల నుండి ప్రస్తుతం 74,000 ఎకరాల వరకు విస్తరించిన ఈ పంటను, వచ్చే నాలుగేళ్లలో 2 మిలియన్ల అదనపు ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు వరికి చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వేగంగా, పంట మార్పిడిపై దృష్టి పెడుతోంది. మరోవైపు రైతులకు అవగాహన కల్పించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఇంతకూ ఆయిల్ పామ్ అంటే ఏంటి? దీని ద్వారా వచ్చే నూనెలను ఎందులో వాడతాం? ఈ పంటలో లాభనష్టాలు ఏమిటి? ఈ పంట సాగు దిగుమతుల బిల్లును తగ్గించగలదా?

ఆయిల్ పామ్‌తో దేశానికి ఉపయోగం ఎంత?
ఆయిల్ పామ్ అనేది ఒక చెట్టు. ఆయిల్ పామ్ చెట్ల నుంచి వచ్చే తాజా పండ్ల( ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) ప్రాసెసింగ్ ద్వారా నూనె తీస్తారు. ఈ నూనెను ఎడిబుల్ ఆయిల్ లేక్ వంట నూనెలా వాడుకుంటారు.
దాదాపు 70 శాతం పామాయిల్ చాక్లెట్, ఐస్ క్రీం, బ్రెడ్, పొటాటో చిప్స్ లాంటి ఆహార పదార్థాల్లో, బయో ఫ్యూయల్స్, సౌందర్య సాధనాల ఉత్పత్తి సహా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు.
ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి ఇచ్చే నూనె గింజల పంటలలో ఆయిల్ పామ్ ఒకటని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.

భారత ప్రభుత్వం పామాయిల్ మిషన్ 2020-2028ని ప్రవేశపెట్టింది. 11 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి, 17 రాష్ట్రాల్లో 15-16 లక్షల ఎకరాలలో ఈ పంటను విస్తరించాలి అని భావిస్తోంది, తద్వారా విదేశాల నుంచి వచ్చే దిగుమతులను తగ్గించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే దీనిని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. "ఆయిల్ పామ్ సాగులో వచ్చే 3-4 ఏళ్లలో తెలంగాణ 5వ స్థానాన్ని ఆక్రమించబోతోంది. మలేసియా, ఇండోనేసియా నుంచి జరిగే 30 నుంచి 40 % దిగుమతులను తగ్గించగలిగే రాష్ట్రంగా ఉండాలన్నదే మా లక్ష్యం" అని ఆయన అన్నారు.

దేశంలో పామాయిల్ వినియోగం ఎంత?
భారత దేశంలో వంట నూనె డిమాండ్‌లో మూడింట రెండో వంతుకు దిగుమతులే ఆధారం. తెలంగాణ తాజా ప్రణాళికతో రైతులతోపాటు కోట్ల మంది భారతీయ కుటుంబాల ఇంటి బడ్జెట్ భారాన్ని కూడా తగ్గించగలదు అన్నది విశ్లేషకుల మాట. గణాంకాలు చుస్తే :
- 2017-18 నుండి 2020-21 వరకు గత 4 సంవత్సరాలలో ప్రపంచ ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తి 4.87% పెరిగి 199.33 మిలియన్ మెట్రిక్ టన్నులుగా మారింది.
- ముడి చమురు తర్వాత ఇది ఎక్కువగా దిగుమతి చేసుకునేది ఆయిల్ పామ్.
- ప్రపంచ వ్యాప్తంగా దీనిని 33% మంది వంట నూనెగా ఉపయోగించుకుంటున్నారు. భారత్ వంట నూనెల్లో దీని వాటా 60% వరకు ఉంది.
- ఇండియా, మలేసియా, ఇండోనేసియా నుంచి సుమారు. రూ.80,000 కోట్ల విలువైన 1 కోటి మెట్రిక్ టన్నుల ముడి పామాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది.
- భారతదేశం తన వంట నూనె డిమాండ్‌లో మూడింట రెండు వంతులను దిగుమతుల ద్వారా మాత్రమే పూర్తి చేస్తుంది.
- భారత్ ప్రస్తుతం 300,000 టన్నుల కంటే తక్కువ పామాయిల్ ఉత్పత్తి చేస్తుంది. దీని అవసరాలను తీర్చడానికి ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుండి దిగుమతులపై ఆధారపడుతోంది.
ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అధికంగా ఉన్న ఆయిల్ పామ్ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. దీనిని త్వరలో తెలంగాణలోని 27 జిల్లాలకూ విస్తరించేలా చేయాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక.

ఎందుకు ఇంత వేగంగా?
కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ పంటపై ఎందుకు దృష్టిపెట్టింది? దేశ విదేశాల్లో డిమాండ్‌తోపాటు స్థానిక పరిస్థితులు కూడా దీనికి కారణం అని చెప్పుకోవాలి.
- అత్యధిక దిగుబడినిచ్చే పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
- ప్రపంచంలో విరివిగా వాడుకలో ఉండే నూనెగింజల పంట ఇది.
- వరి సేకరణపై 25 లక్షల మెట్రిక్ టన్నుల భారాన్ని తగ్గించడం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది.
- వరితో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు కేవలం 25% నుండి ౩౦ % నీరు మాత్రమే అవసరమవుతుంది. దీంతో వార్షిక విద్యుత్ సబ్సిడీ భారాన్ని సంవత్సరానికి రూ. 1500 కోట్ల మేర తగ్గించవచ్చు.
- రాష్ట్ర వ్యవసాయ జీవీఏ (స్థూల విలువ జోడింపు ) ని 10% పెంచవచ్చు అన్నది మరో ఆలోచన.

నిపుణులు పంట మార్పిడిని ఎలా చూస్తున్నారు ?
పామాయిల్ ఉత్పత్తి పెరగడం వల్ల తెలంగాణ తన నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని జాతీయ ఆయిల్ పామ్ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రెడ్డి అన్నారు.
అయన అందిస్తున్న వివరాల ప్రకారం, వరి పంటతో పోలిస్తే పామాయిల్‌తో 30% నీటిని వినియోగం తగ్గించుకోవచ్చు.
“ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతోంది. గత సంవత్సరం అంటే 2021-2022లో ఈ ఒక్క రాష్ట్రం నుండి 3 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మొత్తం భారతదేశం ఉత్పత్తి చేసే దానిలో 83.32% ఆంధ్ర ప్రదేశ్ ఉత్పత్తి చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం నుండి కనీస మద్దతు ధర లేదు. దీంతో చాలా మంది రైతులు ఈ పంటల్ని తీసేశారు కూడా. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధమైన వ్యూహాలను రూపొందించగలిగితే, చిన్న, మధ్యస్థ రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆయన అన్నారు.
ఏడాది పొడవునా నీరు అవసరం ఉన్న పంట కనుక, ఖరీదైన లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడకుండా ఇన్ని ఎకరాలలో ఏడాది పొడవునా నీరు ఎలా అందిస్తారో చెప్పాలి అని రైతు సంక్షేమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
“మొదటగా ఈ పంట ఎలా ఉపయోగపడుతుంది? రాబోయే సంవత్సరాల్లో ఎలా ఆదుకోబోతోంది? లాంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివరించాలి. రెండవది, రాష్ట్రంలోని వ్యవసాయ భూమి ఆయిల్ పామ్ సాగుకు ఎలా అనుకూలంగా ఉంటుందో కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి ఉష్ణోగ్రతలు ఆయిల్ పామ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. మరోవైపు ఏడాది పొడవునా లక్షల ఎకరాల్లో ఈ పంటకు లిఫ్ట్ ఇరిగేషన్‌తో నీరు ఇవ్వడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం"అని రైతు స్వరాజ్య వేదిక ప్రధాన కార్యదర్శి రవి కన్నెగంటి అభిప్రాయపడ్డారు.
మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ పామ్ మేలు చేస్తుందని వ్యాపార రంగ విశ్లేషకులు అంటున్నారు.
“దిగుబడిని గమనిస్తే , మిగితా నూనె గింజలకంటే పామ్ ఆయిల్ నుంచి అధికంగా నూనె వస్తుంది. హెక్టారుకు సుమారు 5000 కేజీ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రధానంగా దిగుమతుల బిల్లును తగ్గించుకోవచ్చు. ఫారీన్ ఎక్స్‌చేంజ్‌లో ముడి చమురు తర్వాత ఎక్కువ ఖర్చు అవుతోంది పామ్ ఆయిల్‌కే. మన రూపాయి బలహీన పడటానికి ఇదొక కారణం. ఈ పంటతో నుంచి నూనె తీసే ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి”అని వ్యాపార నిపుణులు నర్సింహ మూర్తి చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు రైతులకు అందిస్తోంది ?
ఆయిల్ పామ్ దిగుబడి 4 ఏళ్ల తరువాత ప్రారంభo అవుతుంది. కాబట్టి, ఈ నాలుగు ఏళ్లకుగాను, ఎకరానికి రూ.50,918ను ప్రభుత్వం సహాయం కింద అందిస్తోంది. మొక్కలకు, అంతర పంటకు, డ్రిప్ ఇరిగేషన్‌కు ఈ సహాయం అందిస్తోంది.
మొదటి ఏడాది ఎకరానికి రూ.38,318, ఆ తరువాత మిగిలిన మూడు ఏళ్లకుగాను ఎకరానికి రూ.4,200 చొప్పున సహాయం అందిస్తుంది. ఇందులో రాష్ట్రం వాటా రూ.27,570. కేంద్రం వాటా రూ.23,348.
ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ₹1,000 కోట్లు కేటాయించామని మంత్రి టి.హరీశ్‌రావు ఈ ఏడాది ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్‌లో తెలిపారు.
బయట మార్కెట్‌లో రూ.240 నుంచి రూ.250 చొప్పున ఒక్కో మొక్క అమ్ముతుంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీలలో వీటిని రూ.25కే అందిస్తున్నారని రైతులు చెబుతున్నారు.
సవాళ్లు ఏమిటి?
ఆయిల్ పామ్ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొన్ని అంశాలపైనా కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అవి ఏమిటంటే :
- ఈ పంట జీవిత కాలం 30ఏళ్లు. అందుకే రైతుకి మొదటి 4ఏళ్లు ఆర్థిక మద్దతు అవసరం. ఈ సమయంలో సరైన అంతర పంటల్లో ఏది వేయాలో దానికి తగిన సమాచారం, ఇతర సహాయం రైతులకు అందించాల్సి ఉంటుంది.
- మొక్కల లభ్యతపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని పంటకు సిద్ధం చేయడం అనేది సుదీర్ఘ ప్రక్రియ.
- ఆయిల్ పామ్ పంట కోసిన 24 గంటలలోపు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే పొలాలకు సమీపంలో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లను పెంచడం కూడా చాలా ముఖ్యం.
‘‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పామాయిల్ ప్రణాళికను అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఎందుకంటే, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కనీస మద్దతు ధరను ప్రకటిస్తేనే రైతులు ఈ పంట వేయడానికి ముందుకువస్తారు’’అని విశ్లేషకులు అంటున్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్‌పై దృష్టి సారించిన తరువాత, ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున రైతులు పంట వైపు మొగ్గు చూపారు. అయితే, గిట్టుబాటు ధర లేకపోవడంతో, పంట మార్పిడి చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో వరి పంటతో తీవ్ర నష్టాలు చూస్తున్న రైతులు.. ఆయిల్ పామ్‌లోకి దిగి మరోసారి నష్టాలు చవిచూసే పరిస్థితిలో లేరనేది రాష్ట్రం ప్రభుత్వం గుర్తించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్కౌంటర్లకు వాడుతోందా?
- బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?
- బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
- ఆసియా కప్: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా భారత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














