చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?

స్కిన్‌తో చికెన్‌ను తినడం మంచిదేనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో చాలా మంది మాంసాహారులు చికెన్‌ను విపరీతంగా ఇష్టపడతారు.

ప్రపంచవ్యాప్తంగా అధికంగా వినియోగించే మాంసం చికెన్. 2021లో ప్రపంచవ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల చికెన్ మాంసాన్ని వినియోగించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) అంచనా వేసింది. భారతదేశంలో ఈ వినియోగం 41 లక్షల టన్నుల కన్నా ఎక్కువగానే ఉంది.

2019లో లాటిన్ అమెరికాలో ఒక్కో వ్యక్తి సగటున 32.7 కిలోల చికెన్‌ను తినగా... బ్రెజిల్‌లో 40.6 కిలోలు, అర్జెంటీనాలో ఇది 40.4 కిలోలుగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) వివరాల ప్రకారం భారత్‌లో చికెన్ తలసరి వినియోగం ఏడాదికి 3.1 కిలోలు. ప్రపంచ సగటు అయిన 17 కిలోలతో పోల్చితే ఇది ఇప్పటికీ చాలా తక్కువే.

అందుబాటు ధరల్లో దొరకడం, తక్కువ కొవ్వు ఉండటంతో చికెన్‌కు ఎక్కువగా ప్రజాదరణ దక్కింది. మతపరమైన, సాంస్కృతిక అడ్డంకులు కూడా తక్కువే.

వీటితో పాటు ప్రోటీన్లు సమృద్ధిగా లభించడం, విటమిన్లు, మినరల్స్ కూడా ఈ మాంసంలో ఎక్కువగా దొరుకుతాయి. శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కూడా ఇందులో గణనీయంగా ఉంటాయి. ఈ కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

అయితే, చికెన్ తినడంపై కొన్ని అనుమానాలు, తప్పుడు నమ్మకాలు ఏర్పడినట్లు కనిపిస్తుంది.

ఉదాహరణకు, చికెన్ స్కిన్‌లో అధిక స్థాయిలో కొవ్వు ఉంటుంది. కాబట్టి చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా? లేక వండేటప్పుడే చికెన్ స్కిన్‌ను తొలగించాలా?

చికెన్

ఫొటో సోర్స్, Getty Images

''చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే మనం 100 గ్రాముల చికెన్ స్కిన్‌ను తింటే అందులో 32 గ్రాముల కొవ్వు ఉంటుంది'' అని అర్జెంటీనాలో మీట్ న్యూట్రీషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు మరియా డోలోర్స్ ఫెర్నాండేజ్ పజోస్ అన్నారు.

చికెన్ స్కిన్‌లో ఉండే ఈ కొవ్వుల్లో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటినే మంచి కొవ్వు అని పిలుస్తారు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడటంలో సహాయపడుతుంది.

మూడో వంతు సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీన్ని 'చెడు కొవ్వు'గా పిలుస్తారు. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేలా చేస్తుంది అని మరియా చెప్పారు.

''ఒకవేళ చికెన్‌ను స్కిన్‌తో కలిపి తింటే, దాదాపు 50 శాతం కెలోరీలను పెంచుతున్నట్లే'' అని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు, ఒకవేళ మనం 170 గ్రాముల స్కిన్‌లెస్ చికెన్‌ను తింటే 284 కెలోరీలు శరీరంలోకి చేరతాయని అమెరికా అగ్రికల్చర్, న్యూట్రీషియన్ డిపార్ట్‌మెంట్ డేటా తెలిపింది. ఈ కెలోరీల్లో 80 శాతం ప్రొటీన్ల నుంచి 20 శాతం కొవ్వు నుంచి అందుతాయి.

ఒకవేళ స్కిన్‌తో కలిపి చికెన్‌ను తింటే శరీరంలోకి చేరే కెలోరీల సంఖ్య 386‌కు చేరుతుంది. ఇందులో 50 శాతం కెలోరీలు ప్రోటీన్ల నుంచి, 50 శాతం కొవ్వుల నుంచి వస్తాయి.

అదనపు కెలోరీలు, కొవ్వు చేరకూడదు అనుకుంటే తినేముందు చికెన్‌ నుంచి స్కిన్‌ను వేరుచేయడం మంచిదని మరియా చెప్పారు.

''ఎలాంటి వ్యాధులు లేకుండా, ఎత్తుకు తగినంత బరువు ఉండి, శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులు వండేటప్పుడు చికెన్ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు స్కిన్‌ను తీసేస్తే మంచింది. వండేటప్పుడు చికెన్ స్కిన్ ఉండటం వల్ల కూరకు తగిన రుచి, ఫ్లేవర్ వస్తుందని'' నిపుణులు అంటున్నారు.

చికెన్

ఫొటో సోర్స్, Getty Images

చికెన్‌ను మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?

''ఫ్రిజ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్‌ను మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

''ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం ఫ్రిజ్‌లో ఉంచుతారు. దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తరువాత సూక్ష్మజీవుల మళ్లీ పెరగడం మొదలవుతంది. కాబట్టి, ఒకసారి ఫ్రిజ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన ఆహార పదార్థాలను మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అన్నిరకాల మాంసాలకు ఇది వర్తిస్తుంది. అయితే, మాంసాన్ని వండిన తర్వాత దాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వండిన తర్వాత అందులోని సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి. కాబట్టి రీఫ్రీజ్‌చేయవచ్తు'' అని మరియా చెప్పారు.

కోడి

ఫొటో సోర్స్, Getty Images

గడ్డ కట్టిన చికెన్‌ను మామూలు స్థితికి తేవడం ఎలా?

చికెన్‌ను రీఫ్రిజిరేటర్‌లోనే డీఫ్రాస్ట్ చేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

గడ్డ కట్టిన చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కరిగించడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల ఆహారం పాడవుతుంది.''

ఫ్రిజ్‌లోనే ఉంచి చికెన్‌ను సాధారణ స్థితికి తేవడానికి చాలా సమయం పడుతుంది. మొత్తం చికెన్ మెత్తబడడానికి 24 గంటలు పట్టొచ్చు.

చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి నీటిలో ఉంచి మెత్తబరచకూడదని కూడా నిపుణులు చెబుతున్నారు.

కొన్ని దుకాణాల్లో పసుపు రంగు చికెన్, మరికొందరు గులాబీ రంగులో ఉండే చికెన్ ఉంటుంది? ఇందులో ఏది మంచిది?

చికెన్ మాంసం రంగు కోళ్లు తినే ధాన్యాల్లోని వర్ణద్రవ్యాల మీద ఆధారపడి ఉంటుందని సీఐఎన్‌సీఏపీ నిపుణులు వివరించారు.

మొక్కజొన్న వంటి ధాన్యాల్లో తెల్ల జొన్నలు, గోధుమల కంటే ఎక్కువ వర్ణద్రవ్యం ఉంటుంది.

కానీ, పోషకాహార పరంగా చూసుకుంటే మాత్రం పసుపు రంగులో ఉండే చికెన్‌కు, తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే చికెన్‌కు మధ్య ఎలాంటి తేడాలు ఉండవని మరియా చెప్పారు.

చికెన్

చికెన్ మాంసంతో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన, ప్రజాదరణ పొందిన ఆహారం చికెన్. కానీ దీనివల్ల తరచుగా ఫుడ్ పాయిజన్ అవుతుంటుంది.

పచ్చి మాంసంలో క్యాంపిలోబాక్టర్ బ్యాక్టీరియాతో పాటు సాల్మోనెల్లా, క్లోస్ట్రోడియం పెర్ఫింజెన్స్‌ ఉంటాయి.

అందుకే మీరు సరిగ్గా ఉడకబెట్టని చికెన్‌ను తింటే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇలాంటి చికెన్‌ను ఇతర ఆహారాలు, డ్రింకులతో కలిపి తీసుకుంటే కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.

కలుషితమైన చికెన్‌ను తినడం వల్ల అమెరికాలో ప్రతీ సంవత్సరం దాదాపు 10 లక్షల మంది అనారోగ్యం పాలవుతుంటారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేసింది.

చికెన్

ఫొటో సోర్స్, Getty Images

చికెన్ విషయంలో నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటంటే...

  • పచ్చి చికెన్‌ను తాకినప్పుడు, దాన్ని వండే సమయంలో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
  • చికెన్‌తో పాటు ఇతర పదార్థాలను వండుతున్నప్పుడు వాటిని వేరువేరు పాత్రల్లో ఉంచాలి. చికెన్‌ను తాకిన చేతులతో వండిన ఇతర ఆహారాలను తాకకూడదు.
  • చికెన్‌ను బాగా ఉడికించాలి.
  • మిగిలిపోయిన చికెన్ కర్రీని బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే మరోసారి తినాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)