ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటన సమయంలో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులను ఎందుకు నిర్బంధిస్తున్నారు? ఇది చట్టబద్ధమేనా?

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, షేక్ పద్మ (ముందు నిలబడిన మహిళ)
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఈమె పేరు షేక్ పద్మ. కార్మిక సంఘం నాయకురాలు. జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేసే వారి సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తారు. ఇతర కార్మిక సంఘాలకు కూడా సంఘీభావంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈమె కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉంటారు.

ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట పర్యటనకు వెళ్లారు. అందుకోసం తునిలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం ప్రత్యేక బస్సులో పాయకరావుపేట వెళ్లి తమ పార్టీ నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఇంట్లో వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

సీఎం వస్తున్నారనే కారణంతో షేక్ పద్మ ఇంటికి ముందస్తుగా పోలీసులు వెళ్లారు. సీఎం రాక సందర్భంగా ఏదైనా ఆందోళనలకు ప్రయత్నిస్తున్నారా అని ఆరా తీశారు. పెళ్లికి హాజరవటానికి సీఎం వస్తుంటే తామెందుకు నిరసనలు తెలుపుతామని ఆమె చెప్పినా పోలీసులకు నమ్మకం కలగలేదు.

చివరకు సీఎం పర్యటన సందర్భంగా ఆమె ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. తన కార్యకలాపాలపై ఆంక్షలు విధించినట్టు కార్మిక నేత షేక్ పద్మ బీబీసీకి తెలిపారు.

ఇది కేవలం ఆమె ఒక్కరి అనుభవమే కాదు. సరిగ్గా అదే రోజు తుని పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే కాకినాడలో సీఐటీయూ నాయకుడు దువ్వ శేషబాబ్జీని కూడా గృహనిర్బంధంలో ఉంచారు. ఆయనకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

తునికి సమీపంలోని తాండవ షుగర్ పరిశ్రమ సమస్యల మీద పోరాడుతున్న వారికి ఆయన నాయకత్వం వహిస్తుండడంతో.. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయన్ను నియంత్రించినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

కాకినాడ జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సీఎం పర్యటన సందర్భంగా ఇలాంటి ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. చివరకు ఆయన శుభకార్యాలకు హాజరవుతున్న సమయంలోనూ ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.

వివిధ ఉద్యమాలకు పిలుపునిచ్చిన సమయంలోనూ విస్తృతంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ ముందస్తు అరెస్టుల విషయంపై చాలా విమర్శలు వస్తున్నాయి.

పాయకరావుపేటలో పెళ్లికి సీఎం హాజరవుతున్న సమయంలో శేషబాబ్జీ గృహ నిర్బంధం
ఫొటో క్యాప్షన్, పాయకరావుపేటలో పెళ్లికి సీఎం హాజరవుతున్న సమయంలో శేషబాబ్జీ గృహ నిర్బంధం

కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి..

ముందస్తు అరెస్టుల పరంపర కొంతకాలంగా పెరుగుతోంది. గతంలో వివిధ ఉద్యమాలకు పిలుపునిచ్చిన సమయంలో నిరసనలు హద్దు మీరితేనే అరెస్టులు చేసేవారు. ఆందోళనలు అదుపు తప్పకుండా నియంత్రించేవారు. అందుకు తగ్గట్టుగా వివిధ ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేసేది. కానీ ఇటీవల ముందస్తు అరెస్టులతో భారీ జన సమీకరణలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గతంలో చలో హైదరాబాద్ పేరుతో రైళ్లలో టికెట్లు కూడా కొనకుండానే అనేక మంది తరలివెళ్లే వారు. కానీ ప్రస్తుతం చలో విజయవాడ పిలుపునిస్తే.. ఆయా సంఘాల నాయకులు, సభ్యులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.

నిరసనల్లో పాల్గొనే వారిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు పీఆర్సీ కోసం చలో విజయవాడకు పిలుపునిస్తే స్కూల్లో పాఠాలు చెబుతున్న టీచర్లకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అనుభవం ఉంది.

"గత ప్రభుత్వం కూడా చాలా మందిని ముందస్తు అరెస్టులు చేసేది. రోడ్డెక్కి నిరసన తెలియజేయాలంటే అవకాశం లేకుండా చేసేది. ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నిరసన తెలియజేసే హక్కులను కట్టడి చేస్తున్నారు" అని సీఐటీయూ నాయకుడు శేషబాబ్జీ అన్నారు.

‘‘ముందస్తు అరెస్టుల పేరుతో రోజుల తరబడి ఇంట్లోనే బంధిస్తున్నారు. 2022 జనవరి నుంచి నేను ఎనిమిది రోజులు గృహ నిర్బంధంలో ఉన్నాను. జిల్లాలో ఎక్కడికి సీఎం వస్తున్నా మమ్మల్ని గృహ నిర్బంధంలో పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవు. మాట్లాడేవారి గొంతు నొక్కే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాలుగా వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం శేషబాబ్జీకి ఉంది. అయితే, గత ఆరేడేళ్లుగా ముందస్తు అరెస్టులు బాగా పెరిగాయని ఆయన వివరించారు.

అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బేబీ రాణి హౌస్ అరెస్ట్ (ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బేబీ రాణి హౌస్ అరెస్ట్ (ఫైల్ ఫొటో)

టీచర్లు, ఉద్యోగులను కూడా...

ముందస్తు అరెస్టుల విషయంలో కార్మిక సంఘాలు, ఇతర నాయకులు మాత్రమే కాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూడా వదలడం లేదు. స్కూల్ దగ్గరే పోలీసులు పహారా కాస్తున్న అనుభవం మొన్నటి ఫిబ్రవరిలో పీఆర్సీ ఉద్యమం సందర్భంగా కనిపించింది.

ప్రస్తుతం సీపీఎస్ రద్దు కోసం మరోసారి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు 1న చలో సీఎం ఆఫీసుకి పిలుపునిచ్చాయి. సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని వారు ఆందోళన చేపడుతున్నారు. తమకు తిరిగి పాత పింఛను విధానం అమలు చేయాలని కోరుతూ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దాంతో మరోసారి ముందస్తు అరెస్టుల పరంపర ప్రారంభమయ్యింది. అప్పుడే నోటీసులు కూడా జారీ చేస్తున్నారు.

"ఫిబ్రవరిలో పీఆర్సీ కోసం బీఆర్టీఎస్ రోడ్డుకి లక్ష మంది తరలివచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆందోళన ఆగలేదు. అనేక ఆంక్షలు విధించినా, ముందస్తుగా అడ్డుకోవాలని చూసినా ఖాతరు చేయలేదు. కాబట్టే ఇప్పుడు కూడా అలా జరగకూడదని ముందస్తుగా రంగంలో దిగారు. ఇప్పటి నుంచే మా మీద నిఘా పెట్టారు" అని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు సీహెచ్ రవికుమార్ అన్నారు.

‘‘సీపీఎస్ సంఘాలకు నోటీసులు ఇస్తున్నారు. నాయకులను నియంత్రించేందుకు పూనుకుంటున్నారు. మాకు కూడా నోటీసులు ఇస్తూ, దానిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మా సమస్య తీర్చకపోగా, తీర్చాలని కోరుతూ మాకు గొంతెత్తే అవకాశం కూడా లేదని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు. ఇది సమంజసమా?" అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్ రద్దు చేసి ఎవరూ రోడ్డెక్కే అవసరం లేకుండా చేయాలని బీబీసీతో రవికుమార్ అన్నారు. కానీ అందుకు భిన్నంగా, నిరసన తెలిపే హక్కు లేదంంటూ రాజ్యాంగ విరుద్ధంగా కట్టడి చేయడం తగదని అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఒకే వీధి.. రెండు జిల్లాలు

ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతే..

కేవలం వివిధ ఉద్యమ సంఘాలు, నిరసనకారులకు మాత్రమే కాదు. ప్రతిపక్ష పార్టీల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే పద్ధతి అనుసరిస్తోంది. విపక్ష నాయకులనూ గృహ నిర్బంధంలో పెడుతోంది. ఎక్కడ నిరసనలకు సిద్ధమవుతున్నా ఇవి తప్పడం లేదు. చంద్రబాబు సహా ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ పలుమార్లు గృహ నిర్బంధంలో పెట్టారు. ఇక జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కూడా ఇది తప్పలేదు. వామపక్ష నాయకులకు ఇది నిత్యకృత్యమయ్యింది.

సీఎం ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి కీలక నేతల మీద పోలీసులు ఓ కన్నేసి ఉంచడం అలవాటుగా మార్చుకుంటున్నారని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

"ఆందోళనలకు దిగుతూ, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారి మీద ఒకప్పుడు నియంత్రణ ఉండేది. ప్రజా కార్యక్రమాలకు ఎటువంటి సమస్య రాకుండా చూసేందుకు ముందస్తు అరెస్టులు జరిగేవి. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఉంది. అధికార పార్టీ చేసిన తప్పులను ప్రశ్నించడానికి కూడా వీలు లేదంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఎవరు తమ సమస్య వినిపించాలని చూసినా ముందస్తు అరెస్ట్ అంటున్నారు. మహిళలు, సీనియర్ నాయకులు ఎవరినీ లెక్క చేయకుండా ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండా చేస్తున్నారు. ఈ మూడేళ్లలో వేల మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. సీఎం పర్యటనల సమయంలో జిల్లాల్లో చాలామందిని కదలనివ్వకుండా ఇంట్లోనే ఉండాలని నోటీసులు ఇస్తున్నారు’’ అని చెప్పారాయన.

శ్రీకాకుళం జిల్లాలో పలాస వెళ్తుండగా నారా లోకేశ్‌ను అడ్డుకున్నారని, పార్టీ నాయకుడి ఇంట్లో పెళ్లికి వెళుతున్న వారిని కూడా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారని చినరాజప్ప బీబీసీకి చెప్పారు. గతంలో తాను ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

చట్టం ఏం చెబుతోంది?

ఎవరైనా శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తారనే అనుమానం ఉన్నా, లేదా భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందనే సహేతుకమైన ఆధారాలున్నా ముందస్తు అరెస్ట్ చేసేందుకు చట్టంలో అవకాశం ఉంది.

సీఆర్‌పీసీ సెక్షన్ 149-153 ప్రకారం పోలీసులు ముందస్తుగా ప్రజలను అదుపులోకి తీసుకోవచ్చు. ఇటీవల ఎక్కువగా సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

జాతీయ భద్రతా చట్టం-1980లోని సెక్షన్ 5 ప్రకారం గృహ నిర్బంధం విధించేందుకు వీలుంటుంది. సాధారణ నివాస ప్రదేశంలోనే ఈ గృహ నిర్బంధం విధించాల్సి ఉంటుంది. ఇది కూడా జాతీయ భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే స్థాయిలో తీవ్రమైన పరిస్థితి ఉంటే ఆ సెక్షన్ వర్తిస్తుంది.

"చట్టంలో ఉన్న ఆ అవకాశం ఎక్కువ సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. వ్యక్తుల, పార్టీల రాజకీయ స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను కూడా నిరాకరిస్తున్నారు. పోలీసులను ప్రయోగించి, ప్రతీ సందర్భంలోనూ ముందస్తు అరెస్టులకు దిగడం తగదు. సీఎం వ్యక్తిగత పర్యటనలు, వివాహా కార్యక్రమాల సమయంలో కూడా ఆందోళనలకు పూనుకుంటారనే కారణాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజల నుంచి నిరసనలు వస్తాయని అంతగా కలవరపడాల్సిన అవసరం లేదు" అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

‘‘ప్రజాస్వామ్యంలో హద్దులు మీరితే ఎవరినైనా నియంత్రించేందుకు పోలీసులు ఉండాలి. కానీ ప్రజల హక్కులను కట్టడిచేసేందుకు కాదు" అన్నారాయన.

ఏపీలో ముందస్తు అరెస్టుల నిబంధనలకు విరుద్ధంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని, చివరకు అరెస్టులు చేసిన సమయంలోనూ నిబంధనలు పాటించకపోవడంతో హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన బీబీసీకి వివరించారు.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/APCM

అదుపులో ఉంచడం కోసమే...

రాష్ట్రంలో ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ముందస్తు అరెస్టులు గానీ, విపక్షాల నేతలను అదుపులో ఉంచడం కానీ అన్నీ శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నవేనని ఆమె అన్నారు.

"ప్రతిపక్షాలు ప్రతీదీ రాజకీయం చేస్తూ శాంతిభద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి సమయాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం పోలీసుల బాధ్యత. దానికి అనుగుణంగానే చర్యలు ఉంటున్నాయి. చట్టాలకు అనుగుణంగానే నియంత్రణ ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వంలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారు. సమస్యల మీద నిరసన తెలపడం వేరు, రాజకీయ అవసరాల కోసం సమస్యలు సృష్టించడం వేరు అన్నది ప్రజలకు అర్థం అవుతోంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని.. ఆయన పర్యటనల సమయంలో కొన్ని చర్యలు అనివార్యం అవుతాయని హోంమంత్రి బీబీసీతో అన్నారు.

ముందస్తు అరెస్టుల విషయంలో ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకుంటోంది. కానీ ప్రతీ సందర్భంలోనూ అలాంటి చర్యలకు దిగేటప్పుడు పునరాలోచన అవసరమనే వాదన ప్రజా సంఘాల నుంచి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)