బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషుల విడుదలపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?

ఫొటో సోర్స్, YOUTUBE/PMOINDIA
- రచయిత, మయూరేష్ కొన్నూర్
- హోదా, బీబీసీ న్యూస్
భారత ప్రధాని మోదీ ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం నాడు చేసిన ప్రసంగంలో మహిళల పట్ల అవలంబించే వైఖరి మార్చుకోవాలని గట్టిగా పిలుపునిచ్చారు. భారతదేశం తన కలలను సాకారం చేసుకోవాలంటే మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
భారత్ అభివృద్ధికి మహిళలకు ఇచ్చే గౌరవం ముఖ్యమైన స్తంభంగా నిలుస్తుంది. మహిళా సాధికారతను సమర్ధించాలి" అని దిల్లీలోని ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో గట్టిగా చెప్పారు.
ఆయన చేసిన ప్రకటన మహిళల హక్కులను సమర్ధించే విధంగా ఉంది. ఈ ప్రకటనను అందరూ స్వాగతించారు.
కానీ, అదే రోజు, గుజరాత్ లోని 2002 గోద్రా అల్లర్లలో అరెస్టు అయిన 11 మంది దోషులు జైలు నుంచి విడుదల అయ్యారు.
వీరి క్షమాభిక్ష దరఖాస్తును గుజరాత్ లో ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఆమోదించింది. గుజరాత్ లో2002లో చోటు చేసుకున్న గోద్రా అల్లర్లలో తప్పించుకుని పారిపోతున్న బిల్కిస్ బానో కుటుంబం పై కొంత మంది దాడి చేశారు. ఆమెను సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్ళ బిడ్డతో పాటు కుటుంబంలోని 14 మంది సభ్యులను చంపేశారు.
అప్పటి నుంచి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన దేశానికి ప్రధాన మంత్రి.
బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించినప్పటికీ, బీజేపీ మాత్రం వీరి విడుదలకు సంబంధించి అధికారికంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
జీవిత ఖైదు విధించిన 11 మంది దోషులను విడుదల చేయడం దేశంలో చాలా మందికి వణుకును పుట్టించింది. దీనికి తోడు దోషుల విడుదలను స్వాగతిస్తూ వారికి పూలదండలు వేసి మిఠాయిలు పంచుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీటి పట్ల చాలా విమర్శలు ఎదురయ్యాయి.
ఈ నిర్ణయాన్ని న్యాయ, సామాజిక, రాజకీయ దృష్టితో పరిశీలించిన వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
దోషులను విడుదల చేసిన నిర్ణయాన్నిపరిశీలించేందుకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి 6000 మంది సంతకాలు చేసిన లేఖను రాశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమీషన్ ను కూడా సంప్రదించారు. ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఊహించిన మౌనం
2012లో దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం తర్వాత దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న నిరసనలు అందరికీ గుర్తున్నాయి. కానీ, బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల పట్ల ప్రజల ఆగ్రహం ఆ స్థాయిలో కనిపించడం లేదు.
పాలక పక్షం మౌనం వహించింది.
గుజరాత్ బీజేపీ ప్రతినిధి యజ్ఞేశ్ డేవ్ ను ఈ విషయం గురించి బీబీసీ సంప్రదించగా, "ఈ అంశం పై మేం ఎటువంటి వ్యాఖ్యానం చేయదల్చుకోలేదు" అని సమాధానమిచ్చారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం "దోషులు తమ శిక్షా కాలాన్ని పూర్తి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించే క్షమాభిక్షను ఇచ్చారు. కానీ, దోషులను సత్కరించడం తప్పు. దానిని సమర్ధించలేం" అని శాసనసభలో అన్నారు.
2002 నాటి ఛాయలు
బీజేపీ మౌనంగా ఎందుకుంది? గుజరాత్ ప్రభుత్వ ప్యానెల్ నిర్ణయం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. దీంతో, ఈ అంశం పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అర్థమవుతోందని అనిపిస్తోంది.
బీజేపీకి గుజరాత్‌లోను, దేశవ్యాప్తంగా కూడా మతపరమైన విభజనలు ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో చోటు చేసుకోనున్న ఎన్నికలకు ముందు వీరి విడుదల జరిగింది.
"ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ద్వారా అమలు చేసిన ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ తనని తాను సమర్ధించుకునే ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ అంశం పై ఎటువంటి వైఖరి అవలంబించాలనే విషయంలో అయోమయంలో ఉంది" అని సీనియర్ రాజకీయ విలేఖరి రాధికా రామశేషన్ అన్నారు.
"బిల్కిస్ బానో కేసు గురించి గుజరాత్ అవతల కూడా స్పందనలు వచ్చాయి. కానీ, గుజరాత్ లో నేను మాట్లాడిన కొంత మంది బీజేపీ సభ్యులు మాత్రం మేం 2002ను వెనక్కి వదిలిపెట్టి ముందుకు సాగాలని అనుకుంటున్నాం అని చెప్పాయి. కానీ, గుజరాత్ లో కానీ, భారత్ లో కానీ, 2002ను పూర్తిగా చెరిపేయడం సాధ్యం కాదు. ఇది ఎలాగో ఒకలా బయటకు వస్తూనే ఉంటుంది" అని అన్నారు.
ఇది తిరిగి తెర పైకి వచ్చింది. బిల్కిస్ న్యాయం కోసం కొన్నేళ్ల పాటు పోరాడారు. రెండు దశాబ్దాల తర్వాత కూడా ఈ అల్లర్లు, మత విభజనలు గుజరాత్ రాజకీయాల పై ప్రభావం చూపిస్తున్నాయి.
"బీజేపీ ఈ అంశం గురించి నోరు విప్పకపోయినా కూడా ఈ 11 మంది దోషులకు లభించిన ఘన స్వాగతాన్ని మాత్రం తిరస్కరించలేదు.ఈ కార్యక్రమం వెనుక బీజేపీ ఉంది. ఇలాంటి పనులను పార్టీ మద్దతు లేకుండా ఎవరూ చేయలేరు. ఈ క్షమాభిక్షతో గుజరాత్ లో హిందుత్వ కార్డును అమలు చేయాలని అనుకుంటోంది".
"కానీ, జాతీయంగా లౌకికవాదాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. దీని గురించి వారు బహిరంగంగా మాట్లాడరు. పార్టీ అధికారులెవరూ మాట్లాడరు" అని దిల్లీ కి చెందిన విలేఖరి అశోక్ వాంఖేడే అన్నారు.

హిందుత్వ మాత్రమేనా? ఇంకేదైనా ఉందా?
ఈ మొత్తం అంశాన్ని కేవలం హిందుత్వ, మత విభజనల కోణం లోంచి మాత్రమే చూస్తామా? గుజరాత్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అహ్మదాబాద్ కు చెందిన విలేఖరి ప్రశాంత్ దయాల్ అభిప్రాయపడ్డారు.
"గుజరాత్‌లో ఆనంది బెన్ పటేల్ (2014) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మహిళల పై జరిగిన నేరాలకు ఎటువంటి క్షమాభిక్ష పెట్టకూడదనే నిర్ణయం తీసుకున్నారు.
ఇలాంటి నేరాల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా క్షమా భిక్ష పెట్టేందుకు లేదు" అని నిర్ణయం తీసుకున్నారు.
కానీ, 1992, 2014లో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బిల్కిస్ బానో కేసులో నిర్ణయం తీసుకున్నారు. మహిళల పై పాల్పడిన నేరాలకు గాను సుమారు 450 మంది దోషులు గుజరాత్ జైళ్లలో ఉన్నారు.
"వీరందరినీ కూడా విడుదల చేయవచ్చు. కానీ, వాళ్ళనెవరినీ చేయకుండా ఈ 11 మందిని మాత్రమే ఎందుకు విడుదల చేశారు" అని దయాల్ ప్రశ్నిస్తున్నారు
అయితే, ఈ నిర్ణయాన్ని హిందుత్వ రాజకీయాలు, లేదా స్థానిక కుల సమీకరణలు ప్రభావితం చేయలేదని ఆయన అంటారు.
"ఈ కేసు గోద్రా ప్రాంతానికి సంబంధించింది. ఇది గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. బీజేపీ గిరిజన తెగల్లో బలహీనంగా ఉందనే భావన ఉంది. గిరిజనుల ఓటు బ్యాంకును సంపాదించుకోవడం కోసం ఈ క్షమాభిక్ష పెట్టి ఉంటారని అనుకుంటున్నాను" అని అన్నారు.
"ఈ 11 మంది దోషుల్లో కొందరు గిరిజనులున్నారు. చోటా వసవ పార్టీ, ఆప్ గుజరాత్ లో అడుగు పెడుతున్నాయి. కాంగ్రెస్ కూడా గిరిజన ప్రాంతాల్లో గట్టిగా పని చేస్తోంది. గిరిజనుల ఓట్లను కోల్పోతే రానున్న ఎన్నికల్లో 20-25 ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని బీజేపీ భావించి ఉండొచ్చు. వీరి ఓట్లను పొందేందుకు క్షమాభిక్షను పరిష్కారంగా భావించింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"బీజేపీ గుజరాత్ రాజకీయ రణరంగంలో మతపరమైన విభజన రేఖలను ఎప్పుడో గీసేసింది. బిల్కిస్ కేసు పేరు చెప్పి వాటిని సరిదిద్దాల్సిన అవసరం బీజేపీకి లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ హద్దులు, ఆప్ మౌనం
గుజరాత్ లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్ వైపు కూడా అందరి దృష్టి ఉంది. సోషల్ మీడియాలో బీజేపీ ని కాంగ్రెస్ విరామం లేకుండా విమర్శిస్తోంది.
రాహుల్ గాంధీ ఈ విషయం గురించి ప్రధాని మంత్రిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. "ఉన్నావ్ - బీజేపీ ఎంఎల్ఏ ను రక్షించేందుకు పని చేసింది. కఠువా - రేపిస్టులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. హాథ్‌రస్ - ప్రభుత్వం అత్యాచారం చేసినవారికి మద్దతుగా నిలబడింది.
గుజరాత్ - అత్యాచార దోషుల విడుదల. నేరస్థులకు మద్దతివ్వడం బీజేపీకి మహిళల పట్ల ఉన్న చౌకబారు వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇటువంటి రాజకీయాల పట్ల మీకు సిగ్గుగా లేదా? ప్రధాన మంత్రి గారు" అంటూ ట్వీట్ చేశారు.
కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఆగ్రహాన్ని ప్రదర్శించడం, లేదా పత్రికా సమావేశాలు నిర్వహించడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఎవరినీ కదిలించలేకపోతోంది.
"ఇప్పటికే ఈ విషయాన్ని 2002 తర్వాత విస్తృతంగా చర్చించి ఓటు బ్యాంకును కోల్పోయింది. కానీ, రానున్న ఎన్నికల ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రస్తుతం ఎటువంటి ప్రకటన చేసినా కూడా బీజేపీ హిందుత్వ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. గుజరాత్ రాజకీయాల్లో హిందుత్వ ప్రధాన పాత్ర పోషిస్తుంది" అని రాధికా రామ్ శేషన్ చెప్పారు.
మరో వైపు, గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆప్ కూడా మౌనంగానే ఉంది.
ఈ పార్టీ సాఫ్ట్ హిందుత్వ కార్డును ప్లే చేస్తుందని చాలా మంది విమర్శిస్తారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
"దిల్లీలో 2020లో అల్లర్లు చెలరేగాయి. కానీ, ఈ అల్లర్ల విషయంలో ఆప్ ఎన్నడూ నోరు మెదపలేదు. హిందుత్వ పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శించకుండా జాగ్రత్త పడింది. బిల్కిస్ బానో కేసులో కూడా ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది" అని అన్నారు.
"గుజరాత్‌లో కాంగ్రెస్‌కున్న ప్రతిపక్ష స్థానాన్ని ఆప్ ఆక్రమించింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఓటమి పాలయిందో ఆప్‌కి బాగా తెలుసు. అందుకే వాళ్ళు సంక్షేమ పథకాల పైనే దృష్టి పెడుతున్నారు.
"ఇది స్పష్టంగా రచించిన వ్యూహం. ఆప్ అర్బన్ మధ్య తరగతి నుంచి మద్దతు పొందుతోంది. హిందుత్వ విషయంలో కేజ్రీవాల్ తల దూర్చరు" అని రాధిక అన్నారు.
ఒక్క గుజరాత్‌లో మాత్రమే కాకుండా, బిల్కిస్ బానో క్షమాభిక్ష ప్రాంతీయ, జాతీయ రాజకీయాల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశం పై కూడా దృష్టి పెడతారు.
పౌరసత్వ చట్టం సవరణల నేపథ్యంలో జరిగిన నిరసనలు, నూపుర్ శర్మ వివాదం తర్వాత మత విభజనలను ఒక్క సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వీధుల్లో కూడా కనిపించాయి. గుజరాత్ తర్వాత కర్నాటక కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఏడాది కర్నాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం తర్వాత ఇక్కడ కూడా విభజనలు మొదలయ్యాయి. బిల్కిస్ కేసులో జరుగుతున్న జాతీయ చర్చ ఈ ప్రాంతాల్లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ఈ చర్చ చల్లారిపోవచ్చు కానీ, రాజకీయ వేడి మాత్రం తగ్గదు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
.












