ఎన్‌డీటీవీలో ఎంత వాటాను అదానీ సొంతం చేసుకున్నారు.. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇవీ 5 ముఖ్యాంశాలు

గౌతం అదానీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గౌతం అదానీ

అదానీ గ్రూపు ఎన్‌డీటీవీలో పెద్ద వాటాను కొనుగోలు చేసింది. మరో 26 శాతం వాటాను కొనటానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ డీల్‌ను అర్థం చేసుకునేందుకు 5 ముఖ్యాంశాలివే.

1. ఈ ప్రకటనకు ముందు ఎన్‌డీటీవీలో ప్రమోటర్ వాటా ఎంత?

ఆగస్టు 23న అదానీ గ్రూపు ప్రకటనకు ముందు ఎన్‌డీటీవీ ప్రమోటర్ల షేర్ల వివరాలు ఇవీ..

ప్రణయ్ రాయ్: 15.94 శాతం (ఆయన పేరు మీద)

రాధికా రాయ్: 16.32 శాతం (ఆమె పేరు మీద)

ఆర్ఆర్‌పీఆర్ (రాధికా రాయ్ ప్రణయ్ రాయ్): 29.18 శాతం

ఎన్‌డీటీవీ ప్రమోటర్లలో మొత్తం ప్రమోటర్ వాటా: 61.45 శాతం

ఆర్ఆర్‌పీఆర్ అనేది రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంస్థ. ఆర్ఆర్‌పీఆర్‌కు 29.18 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఆర్ఆర్‌పీఆర్‌ను అదానీకి అమ్మేశారు.

ప్రమోటర్ వాటా మొత్తం 61.45 శాతం. మిగతా వాటా ఇతర సంస్థలు, ప్రయివేటు సంస్థల యాజమాన్యంలో ఉంది. విదేశీ షేర్‌హోల్డర్లు లేరు.

NDTV

ఫొటో సోర్స్, NDTV

2. 2022 ఆగస్టు 23న ఏం జరిగింది?

ఆగస్టు 23న, అదానీ ఎంటర్‌ప్రైజెస్, దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ద్వారా, విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్)ను కొనుగోలు చేసింది.

2009లో ఎన్‌డీటీవీ, వీసీపీఎల్ నుంచి రూ. 350 కోట్ల అప్పు తీసుకుంది. లోను అగ్రిమెంటు ప్రకారం, వీసీపీఎల్ ఏప్పుడైనా ఆ రుణాన్ని ఆర్ఆర్‌పీఆర్ ఈక్విటీలో 99.99 శాతం వాటాగా మార్చగలదని రిపోర్టులు చెబుతున్నాయి.

2022 ఆగస్టు 23న వీసీపీఎల్ ఈ హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో ఆర్ఆర్‌పీఆర్‌లో 99.99 శాతం వాటను కొనుగోలు చేసింది. అంటే ఎన్‌డీటీవీలో 29 శాతం వాటాపై నియంత్రణ హక్కులు పొందింది.

అంటే, ఇప్పుడు అదానీ గ్రూపుకు ఎన్‌డీటీవీలో 29 శాతంపై నియంత్రణ ఉంటుంది.

3. ఎన్‌డీటీవీ ప్రమోటర్ల స్పందన ఏమిటి?

"ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులతో ఎటువంటి చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండా అదానీ గ్రూపు 29.1 శాతం వాటాను కొనుగోలు చేసింది" అంటూ ఎన్‌డీటీవీ ఒక ప్రకటన విడుదల చేసింది.

4. తరువాత ఏం జరగవచ్చు?

కంపెనీని టేకోవర్ చేసేందుకు అదానీ వేసిన ఎత్తుగడను సవాలు చేసేందుకు చట్టపరమైన, రెగ్యులేటరీ ప్రక్రియలను పరిశీలిస్తున్నామని ఎన్‌డీటీవీ ప్రమోటర్లు సూచించారు.

సెబి (SEBI) నియమాల ప్రకారం, ఒక సంస్థలో 15 శాతం కంటే ఎక్కువ షేర్లను కొనుగోలు చేస్తే, ఓపెన్ ఆఫర్ నిబంధన అమలవుతుంది. అంటే, ఎన్‌డీటీవీలో మిగతా వాటాదారులు తమ షేర్లను అదానీకి ముందే నిర్ణయించుకున్న ధరలకు విక్రయించవచ్చు లేదా వాళ్ల షేర్లను కొనసాగించవచ్చు.

ఇప్పుడు ఎన్‌డీటీవీలో 29 శాతాన్ని అదానీ గ్రూపు కొనుగోలు చేసింది కాబట్టి ఓపెన్ ఆఫర్ నిబంధన ముందుకు వచ్చింది. అందుకే 26 శాతం ఓపెన్ ఆఫర్‌ను అదానీ గ్రూపు ప్రకటించింది.

5. అదానీ ఓపెన్ ఆఫర్ ఎంత?

ఓపెన్ ఆఫర్‌లో ఎన్‌డీటీవీ ఒక షేర్ కొనుగోలు ధర రూ. 294 గా నిర్ణయించారు. ఇది ప్రస్తుత ఎన్‌డీటీవీ మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ. కాబట్టి షేర్‌హోల్డర్లు ఓపెన్ ఆఫర్ వద్ద షేర్లను విక్రయించకపోవచ్చు.

ఒకవేళ అదానీ ప్రకటించిన ఓపెన్ ఆఫర్ సఫలమైతే, అదానీకి ఎన్‌డీటీవీలో 55.18 శాతం వాటా వస్తుంది. అంటే సంస్థ నియంత్రణ అదానీ చేతిలో ఉంటుంది.

RRPR

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు ఆర్ఆర్‌పీఆర్‌ను సంయుక్తంగా స్థాపించారు

విశ్లేషణ:

అర్చనా శుక్లా, ఇండియా బిజినెస్ కరెస్పాండెంట్

అంతకంతకూ కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతున్న టెలివిజన్ మార్కెట్‌లో ఎన్‌డీటీవీ స్థిరంగా నిలబడింది.

స్వయంగా జర్నలిస్టులు, మీడియా వ్యాపారవేత్తలయిన రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లు స్థాపించిన ఎన్‌డీటీవీని.. మోదీ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మకంగా పరిశీలించే కొన్ని మీడియా గ్రూపుల్లో ఒకటిగా పరిగణిస్తారు.

అందుకే, మోదీ ప్రభుత్వానికి, అధికార బీజేపీ పార్టీకి ఎన్‌డీటీవీ తరచూ లక్ష్యంగా మారుతుంటుంది.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మనీ లాండరింగ్ మొదలుకుని పన్ను ఎగవేత వరకూ అనేక అభియోగాలను ఎన్‌డీటీవీ ఎదుర్కొంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌డీటీవీ మీద, దాని వ్యవస్థాపకుల మీద పలు కేసులు నమోదు చేశాయి. వాటిలో చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ప్రతిపక్ష రాజకీయ పార్టీ కాంగ్రెస్‌తో ఎన్‌డీటీవీ సన్నిహితంగా మెలుగుతోందనే విమర్శలూ వచ్చాయి.

ఎన్‌డీటీవీ సంపాదక విధానాలకు నిరసనగా ఆ టీవీ నిర్వహించే ఇంటర్వ్యూల్లో, ప్యానల్ చర్చల్లో పాల్గొనటానికి బీజేపీ ప్రతినిధులు చాలాసార్లు తిరస్కరించారు.

ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ విలేఖరుల సమావేశం నిర్వహించని నరేంద్ర మోదీ, కొన్ని మీడియా చానళ్లకు మాత్రం అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఎన్‌డీటీవీలో ఎన్నడూ కనపించలేదు.

అదానీని ప్రధానమంత్రికి, ఆయన పార్టీకి సన్నిహితుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో, ఎన్‌డీటీవీలో కీలక వాటాలను అదానీ కంపెనీ కొనుగోలు చేయటం వెనుక ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటానికి మించిన ప్రణాళికలు ఉన్నాయా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)