బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - ఇదంతా ఎన్నికల కోసమేనా

పెడ్రో చక్రవర్తి గుండె

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, వెనెస్సా బుష్‌ష్లూటర్
    • హోదా, బీబీసీ న్యూస్

బంగారు జాడీలో రసాయనాలలో భద్రపరిచిన ఒక గుండెను సోమవారం పోర్చుగల్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో బ్రెజిల్ రాజధాని బ్రసీలియాకు తీసుకొచ్చారు.

అది బ్రెజిల్‌ను పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి మొదటి డామ్ పెడ్రో గుండె. బ్రెజిల్ చారిత్రక, రాజకీయ, భౌగోళిక నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చక్రవర్తి ఆయన.

బ్రెజిల్ స్వాతంత్ర్యం సాధించి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా.. చక్రవర్తి పెడ్రో-1 గుండెను సైనిక విమానంలో బ్రసీలియాకు తెప్పించారు.

అక్కడి సైనిక స్థావరంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఈ గుండెకు స్వాగతం పలికారు. జాడీలో ఫార్మాల్డిహైడ్‌ ద్రావణంలో భద్రపరిచి ఉంచిన ఈ గుండెను ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ప్రజల సందర్శన కోసం ప్రదర్శిస్తారు. దానికి ముందు ఈ గుండెకు సైనిక వందనం సమర్పిస్తారు.

వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 7వ తేదీన బ్రెజిల్ స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత.. మొదటి పెడ్రో గుండెను తిరిగి పోర్చుగల్‌కు తిరిగి పంపిస్తారు.

జాడీలో పెడ్రో గుండె

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పోర్చుగల్‌లోని పోర్టో నగరంలో గల అవర్ లేడీ ఆఫ్ లాపా చర్చిలో పెడ్రో గుండెను ఉంచారు

బ్రెజిల్ స్వాతంత్ర్య ద్విశతాబ్ది ఉత్సవాల కోసం మొదటి పెడ్రో గుండెను పోర్చుగల్ లోని పోర్టో నగరం నుంచి బ్రసీలియాకు తరలించటానికి పోర్చుగీసు అధికారులు అనుమతి ఇచ్చారు.

పోర్టో నగర మేయర్ రుయి మొరియేరా కూడా బ్రెజిల్ వైమానిక దళ విమానంలో పెడ్రో గుండె వెంట వచ్చారు. ఆయన స్వయంగా తన చేతుల్లో ఈ గుండెను పట్టుకుని తెచ్చారు.

మొదటి పెడ్రో గుండె ''బ్రెజిల్ ప్రజల అభిమానంలో మునిగితేలిన తర్వాత'' మళ్లీ పోర్చుగల్ తిరిగివస్తుందని మేయర్ మోరియేరా పేర్కొన్నారు.

బ్రసీలియాలో పెడ్రో గుండెకు సైనిక లాంఛనాలతో స్వాగతం పలికారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి పెడ్రో గుండెకు బ్రసీలియాలో సైనిక లాంఛనాలతో స్వాగతం పలికారు

''ఈ గుండెకు రాజ్యాధినేత హోదాతో స్వాగతం లభిస్తుంది. మొదటి డోమ్ పెడ్రో ఇంకా మన మధ్య సజీవంగా ఉన్నట్లుగానే ఈ గుండెను పరిగణిస్తారు'' అని బ్రెజిల్ విదేశాంగ మంత్రత్వశాఖ ప్రొటోకాల్ చీఫ్ అలాన్ కొయెలో డి సీలోస్ చెప్పారు.

ఆ గుండెకు తుపాకీ వందనం, సైనిక వందనం సహా పూర్తి సైనిక లాంఛనాలతో గౌరవం లభిస్తుంది.

''జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. మొదటి డోమ్ పెడ్రో స్వయంగా స్వరపరిచన స్వాతంత్ర్య గీతాన్ని కూడా ఆలపిస్తారు. డోమ్ పెడ్రో చక్రవర్తి మాత్రమే కాదు.. ఖాళీ సమయంలో మంతి సంగీతకారుడు కూడా'' అని సీలోస్ తెలిపారు.

చక్రవర్తి మొదటి పెడ్రో

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE

ఫొటో క్యాప్షన్, చక్రవర్తి మొదటి పెడ్రో సంగీత విద్వాంసుడు కూడా

ఎవరీ డోమ్ పెడ్రో చక్రవర్తి?

డోమ్ పెడ్రో 1798లో పోర్చుగల్ రాచకుటుంబంలో జన్మించాడు. ఆ కాలంలో బ్రెజిల్ కూడా ఆ రాచకుటుంబ వలస పాలనలో ఉండేది.

ఆ కాలంలో పోర్చుగల్ మీద దండెత్తి వచ్చిన ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ బోనపార్టీ సైన్యం నుంచి తప్పించుకోవటానికి పెడ్రో రాచకుటుంబం.. లిస్బన్ నుంచి నాటి పోర్చుగీసు వలస పాలనలో ఉన్న బ్రెజిల్‌కు పారిపోయి వచ్చింది.

రాచకుటుంబం హడావుడిగా బయలు దేరినపుడు.. ఓడరేవుకు వెళ్లే దారిలో వీరి కాన్వాయ్ మీద జనం రాళ్లతో దాడి చేసినట్లు చరిత్రకారులు చెప్తారు.

యూరప్‌ నుంచి ఒక రాచకుటుంబం నాటి 'నూతన ప్రపంచం' (అమెరికా ఖండాలు)లో అడుగు పెట్టటం అదే తొలిసారి.

అలా ఓడల్లో బయలు దేరి 1808లో బ్రెజిల్ చేరుకుంది ఈ రాచకుటుంబం. అప్పుడు మొదటి పెడ్రో వయసు ఎనిమిదేళ్లు.

పోర్చుగీసు రాచకుటుంబం లిస్బన్ నుంచి బ్రెజిల్‌కు పయనమవుతున్న పెయింటిగ్

ఫొటో సోర్స్, NATIONAL COACH MUSEUM

ఫొటో క్యాప్షన్, పోర్చుగీసు రాచకుటుంబం లిస్బన్ నుంచి బ్రెజిల్‌కు పయనమవుతున్న దృశ్యాన్ని ఈ పెయింటిగ్ చూపుతోంది

మొదటి పెడ్రో సంగీతం మీద ఆసక్తితో పలు వాద్యాలు నేర్చుకున్నారు. సంగీత విద్వాంసుడయ్యారు.

రాజకీయవేత్త, కవి ఎవారిస్టో డా వేగా రాసిన బ్రెజిల్ స్వాతంత్య గీతాన్ని స్వరపరిచింది చక్రవర్తి పెడ్రోనే.

డోమ్ పెడ్రో తండ్రి నాలుగో కింగ్ జాన్ 1821లో పోర్చుగల్‌కు తిరిగి వెళ్లేటపుడు.. అప్పటికి 22 ఏళ్ల వయసున్న తన కుమారుడు మొదటి పెడ్రోను తన ప్రతినిధిగా (రీజెంట్) బ్రెజిల్‌ను పరిపాలించటానికి ఉంచి వెళ్లాడు.

ఓ ఏడాది తర్వాత ఆ యువ పాలకుడు.. పోర్చుగీసు పార్లమెంటును ధిక్కరించాడు. బ్రెజిల్‌ను తన వలస రాజ్యంగా ఉంచుకోవాలని పోర్చుగీసు పార్లమెంటు భావించింది. అందుకు మొదటి పెడ్రో తిరస్కరించాడు. పెడ్రో స్వదేశానికి తిరిగి రావాలన్న డిమాండ్‌ను కూడా తిరస్కరించాడు.

బ్రెజిల్ 1822 సెప్టెంబర్ 7వ తేదీన స్వాతంత్ర్యం పొందింది

ఫొటో సోర్స్, NATIONAL LIBRARY

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ 1822 సెప్టెంబర్ 7వ తేదీన స్వాతంత్ర్యం పొందింది

మొదటి పెడ్రో 1822 సెప్టెంబర్ 7వ తేదీన.. బ్రెజిల్ స్వాతంత్ర ప్రకటనను జారీ చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు.

అనంతరం.. తన కూతురు పోర్చుగల్ సింహాసనాన్ని అధిష్టించే హక్కు కోసం పోరాడటానికి మొదటి పెడ్రో పోర్చుగల్ వెళ్లాడు.

అయితే 35 ఏళ్ల వయసులోనే క్షయ వ్యాధి వల్ల చనిపోయాడు.

మరణశయ్యపై ఉన్న పెడ్రో చక్రవర్తి.. తన శరీరం నుంచి గుండెను బయటకు తీసి, పోర్టో నగరానికి తీసుకువెళ్లాలని కోరాడు. అలా ఆయన గుండెను తీసి పోర్టో నగరంలోని అవర్ లేడీ ఆఫ్ లాపా చర్చిలో పూజా వేదిక మీద ఉంచారు.

బ్రెజిల్ 150వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం 1972లో మొదటి పెడ్రో భౌతికకాయాన్ని బ్రెజిల్‌కు తరలించారు. ఆ భౌతికకాయాన్ని సావ్‌పాలో నగరంలో భద్రపరిచారు.

పెడ్రో 1 వివాహ వేడుక పెయింటింగ్

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE

ఫొటో క్యాప్షన్, అమీలియా డి లూచ్టెన్‌బర్గ్‌తో పెడ్రో వివాహ దృశ్యాన్ని చూపుతున్న పెయింటింగ్

ఇప్పుడు మొదటి పెడ్రో గుండెను బ్రెజిల్‌కు తెప్పించటం.. వివాదాన్ని రేకెత్తించింది.

అక్టోబర్ 2న బ్రెజిల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత దేశాధ్యక్షుడు జేర్ బొల్సొనారో ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు.

అయితే.. మాజీ అధ్యక్షుడు లులా డి సిల్వా కన్నా ఆయన వెనుకబడి ఉన్నారని ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో బొల్సొనారో.. చక్రవర్తి పెడ్రో గుండెను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శకులు తప్పుపడుతున్నారు.

''దేశభక్తిని, జాతీయవాదాన్ని పెంపొందించే జాతీయ చిహ్నాల పట్ల.. బొల్సొనారోలో, 2018లో ఆయనను ఎన్నుకున్న మితవాద ప్రజానీకంలో చాలా ఆకర్షణ ఉంది. అందుకే.. బ్రెజిల్ 1889 నుంచి గణతంత్ర దేశంగా ఉన్నప్పటికీ.. నాటి రాచరిక పాలనా కాలపు ప్రతీకలకు ప్రాధాన్యం ఇస్తున్నారు'' అని బీబీసీ బ్రెజిల్ జర్నలిస్ట్ కమిల్లా మోటా పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, అమెజాన్ ఆదివాసీ తెగ: వీరి జనాభా 120 మాత్రమే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)