ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ: 5జీ సేవలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న భారతీయ కుబేరులు

ఈ ఏడాది చివరికల్లా భారత్ లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయిని ప్రభుత్వం చెబుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది చివరికల్లా భారత్ లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయిని ప్రభుత్వం చెబుతోంది
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

5జీ స్పెక్ట్రమ్ కోసం ఏడు రోజుల పాటు సాగిన అతిపెద్ద వేలం ముగిసింది. ఈ వేలంలో ఆసియాలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు వ్యక్తులు 5జీ ఫ్రీక్వెన్సీలను సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు.

ఇందులో ఎవరిది పైచేయి అయితే, వారే భవిష్యత్తులో డిజిటల్ రంగంలో కూడా ముందుంటారన్న భావన ప్రస్తుతం నెలకొని ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు, గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ.

ఇటీవల ముగిసిన 5జీ వేలంలో 72 గిగాహెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్ ను వేలానికి పెట్టారు. ఇందులో 71శాతం స్పెక్ట్రమ్ వేలంలో అమ్ముడైనట్లు టెలీకాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

సుమారు రూ.1,50,000 కోట్ల (1900 కోట్ల డాలర్లు) విలువైన స్పెక్ట్రమ్‌ అమ్మకానికి ముగ్గురు ప్రధాన పోటీ దారులైన అంబానీ రిలయన్స్-జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్‌తో పాటు కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న అదాని డాటా నెట్‌వర్క్స్ నుంచి ప్రభుత్వానికి బిడ్‌లు వచ్చాయి.

ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ

క్రిసిల్ రీసెర్చ్ అభిప్రాయం ప్రకారం గత ఏడాది మార్చి లో జరిగిన వేలం తర్వాత జరుగుతున్న ఈ వేలంలో బిడ్‌ల విలువ రెట్టింపు అయ్యింది.

సుమారు రూ. 86,513 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడం ద్వారా రిలయన్స్ జియో సంస్థ ఈ బిడ్డింగ్‌లో అత్యధిక స్పెక్ట్రమ్‌ను పొందగలిగింది. ఇక అదాని గ్రూప్ సుమారు రూ. 2,04 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను, మిగిలిన స్పెక్ట్రమ్‌ను భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు పొందాయి.

రిలయన్స్, ఎయిర్‌టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా స్పెక్ట్రమ్ కొనుగోలుకు ముందుకు రాగా, వోడాఫోన్ ఐడియా కొన్ని ప్రాంతాల పైనే దృష్టిపెట్టింది.

''దేశవ్యాప్తంగా తనకు ఉన్న ఫైబర్ నెట్‌వర్క్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాగస్వామ్యాల కారణంగా వీలయినంత త్వరగా జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రిలయిన్స్ సిద్ధంగా ఉంది'' అని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వంటి కొన్ని అవసరాలకు మాత్రమే అంటే ప్రైవేటుగా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది అదానీ గ్రూప్. ఆయా రంగాలలో ఆ సంస్థ ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.

5జీ సర్వీసుల వల్ల ఇంటర్నెట్ డేటా వేగం పెరుగుతుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 5జీ సర్వీసుల వల్ల ఇంటర్నెట్ డేటా వేగం పెరుగుతుంది

ఇండియన్ ఇంటర్నెట్ మార్కెట్‌లో రిలయన్స్ పేరు తెలియని వారుండరు. అయితే టెలీకాం రంగంలోకి అదాని అనూహ్యంగా అడుగుపెట్టారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇటీవలే అదాని, బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో నాలుగో వ్యక్తిగా నిలిచారు.

అయితే, ప్రైవేట్ స్పెక్ట్రమ్‌ను దాటి, పూర్తిస్థాయిలో టెలీకాం రంగంలోకి అడుగుపెట్టడం, ఇప్పటికే ఆ రంగంలో ఉన్న సంస్థలతో పోటీ పడటంపై తమకు ఆసక్తి లేదని అదానీ సంస్థ ప్రకటించింది. అయితే, ఇది ఆ సంస్థ వేసిన తొలి అడుగని, మున్ముందు పోటీలోకి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''అదాని గ్రూపు ఈ వేలంలో పాల్గొంటే, పోటీ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాక, రాబోయే కాలంలో అదానీ గ్రూప్ ఈ రంగంలో అడుగుపెట్టడానికి ద్వారాలు తెరిచినట్లవుతుంది'' అని గోల్డ్‌మాన్ శాచ్స్ ఇంతకు ముందు వ్యాఖ్యానించింది.

అదానీ గ్రూప్ ఈ రంగంలో పోటీ పడటం భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఈ రెండు సంస్థలు రిలయన్స్ తో ధరల పోటీ నుంచి తట్టుకోవడానికి సతమతమవుతున్నాయి. ఇప్పుడు అదానీ రాకతో ఈ పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు అదానీల రాక అంబానీలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

భారత్‌లోని 13 నగరాలలో 5జీ సేవలకు మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని 13 నగరాలలో 5జీ సేవలకు మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి

భారతదేశంలోకి 5జీ రాకతో ఇంటర్నెట్ రంగంలో మరింత వేగవంతమైన సిగ్నల్స్ అందుబాటులోకి వస్తాయి. సెకండ్ల వ్యవధిలో వీడియోలు డౌన్‌లోడ్ అవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఈ నెట్‌వర్క్ బాగా ఉపయోగపడుతుంది.

అధిక వేగవంతమైన నెట్‌వర్క్‌ పేరుతో అధిక చార్జీల వసూలుకు కూడా ఇండియన్ టెలీకాం కంపెనీలు ప్రయత్నించవచ్చు. గతంలో 2జీ, 3జీ సర్వీసులతో పోలిస్తే, 4జీ సర్వీసులు ప్రవేశ పెట్టినప్పుడు చార్జీలు పెంచడంలో టెలీకాం కంపెనీలు కొంత సంయమనం పాటించాయి.

5జీ సర్వీసులు టెలీకాం కంపెనీల లాభాలను పెంచవచ్చు. అయితే, ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా, అంతే వేగంగా వినియోగించుకునే పరిస్థితి లేదు. దేశంలో 7శాతం మొబైల్ ఫోన్లలోనే 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది.

ప్రస్తుత వేలాన్ని పరిశీలించినట్లయితే, 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఇదే అతి పెద్దది. ప్రస్తుత ద్రవ్యలోటు 6.4 శాతానికి చేరుకుంటున్న తరుణంలో, ఈ ఆదాయం ప్రభుత్వ ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఈ వేలం భారత టెలీకమ్యూనికేషన్ శాఖకు రాబోయే 20 సంవత్సరాలలో సుమారు రూ.12,581 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ఆగస్టు చివరికల్లా ఫ్రీక్వెన్సీ కేటాయింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్ నుంచి 5జీ సేవలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

'' ఈ ఏడాదిలోపలే మనకు 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి'' అని భారత టెలీకాం శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)