వొడాఫోన్ ఇండియా: మూడు నెలల్లో రూ. 51,000 కోట్ల నష్టం.. కారణాలేమిటి? టెలికాం రంగంలో పరిణామాలెలా ఉంటాయి?

ఒడాఫోన్

ఫొటో సోర్స్, Reuters

భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా.. రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 5,1000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు ప్రకటించింది. దీంతో టెలికాం రంగం పరిస్థితులపై భయాలు మరింత పెరిగాయి. ఆర్థికనిపుణుడు వివేక్‌కౌల్ విశ్లేషణ.

ఇంత పెద్ద మార్కెట్‌లో ఇంత భారీ నష్టాలకు కారణమేమిటి?

ప్రపంచంలోని అతి పెద్ద టెలికాం మార్కెట్లలో భారతదేశం ఒకటి. దేశంలో 100 కోట్ల మందికి పైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

అయితే, టెలికాం సంస్థలు భారీ నష్టాలు చవిచూడటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.

ఒకటి... చాలా ఏళ్లుగా టెలిఫోన్ కాల్స్ ధరలు పడిపోతే, డాటా ధరలు అధికంగానే కొనసాగాయి.

మూడేళ్ల కిందట రిలయన్స్ జియో ఈ రంగంలోకి దిగటంతో ఇదంతా పూర్తిగా మారిపోయింది. ఆ సంస్థ డాటా ధరలను అమాంతం నేలకు దించేసింది. ఈ ప్రక్రియలో.. అప్పటివరకూ వాయిస్ మార్కెట్‌గా ఉన్న రంగాన్ని డాటా మార్కెట్‌గా మార్చేసింది. ఫలితంగా భారతదేశంలో మొబైల్ డాటా ప్రపంచంలో అత్యంత చౌకగా మారింది.

రిలయన్స్ జియో

ఫొటో సోర్స్, Getty Images

ఇది.. అప్పటికే మార్కెట్‌లో ఉన్న టెలికాం సంస్థల మీద భారీ ఒత్తిడి తెచ్చింది. వాళ్లు రిలయన్స్‌తో పోటీపడాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో వారి లాభాలు దారుణంగా పడిపోవటమో.. నష్టాల్లోకి వెళ్లటమో జరిగింది.

కానీ.. రెండోది, తక్షణ కారణం.. స్థూల ఆదాయం సర్దుబాటు (అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ) మీద యుద్ధం. సాధారణ మాటల్లో చెప్తే దీని అర్థం.. టెలికాం కంపెనీలు ఆర్జించిన ఆదాయాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ టెలికాం విభాగంతో పంచుకోవాల్సి ఉంటుంది.

అయితే.. స్థూల ఆదాయం సర్దుబాటు అనే దానికి నిర్వచనం మీద టెలికాం సంస్థలు, ప్రభుత్వం మధ్య 2005 నుంచీ ఏకాభిప్రాయం లేదు.

టెలికాం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఈ సంఖ్యలో లెక్కించాలని టెలికాం కంపెనీలు చెప్తున్నాయి. కానీ.. మరింత విస్తృత నిర్వచనం ఉండాలని - ఆస్తుల విక్రయం, డిపాజిట్ల మీద ఆర్జించిన వడ్డీ వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా కలపాలని - ప్రభుత్వం పట్టుపడుతోంది.

ఇటీవల.. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అంటే.. టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో ఒక్క వొడాఫోన్ ఇండియా వాటానే రూ. 39,000 కోట్లు.

ఈ కొత్త చార్జీల వల్ల నష్టాలు నాటకీయంగా పెరిగిపోయాయి.

వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశం నుంచి తమ సంస్థ నిష్క్రమించాల్సి రావచ్చునని వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ ఇంతకుముందు పేర్కొన్నారు

వొడాఫోన్ నిజంగా భారత్ నుంచి వెళ్లిపోతుందా?

ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? - టెలికాం కంపెనీలన్నీ అడుగుతున్న ప్రశ్న ఇది.

టెలికాం ఆపరేటింగ్ సంస్థలను ప్రభుత్వం అధిక పన్నులు, చార్జీలతో బాదటం ఆపకపోతే.. వొడాఫోన్ భారతదేశంలో కొనసాగటం సందేహాస్పదమేనని ఆ సంస్థ సీఈఓ నిక్ రీడ్ ఈ వారం ఆరంభంలో పేర్కొన్నారు.

దేశంలో స్థానిక కంపెనీ ఐడియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన తర్వాత 'వొడాఫోన్-ఐడియా'గా పేరు మార్చుకున్న ఈ సంస్థకు.. టెలికాం మార్కెట్‌ ఆదాయంలో సుమారు 29 శాతం వాటా ఉంది.

''ఇప్పటికే మద్దతివ్వని నియంత్రణ, అధిక పన్నులతో ఆర్థికంగా భారీ భారం ఉంది. ఆ పైన.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది'' అని ఆయన మంగళవారం నాడు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

ఒక రోజు అనంతరం ఆయన ప్రభుత్వానికి క్షమాపణ చెప్పారు. భారతదేశం నుంచి నిష్క్రమించే ప్రణాళికేదీ తమ కంపెనీకి లేదని చెప్పారు.

కానీ.. ఈ క్షమాపణతో నిమిత్తం లేని నిజమేమిటంటే.. వొడాఫోన్ భారతదేశంలో పెట్టుబడులు సున్నాకు దిగజారిపోయాయి. ఇది అతి పెద్ద విషయం. వొడాఫోన్‌కి కానీ, మరో యజమాని ఆదిత్య బిర్లా గ్రూప్‌కి కానీ.. వొడాఫోన్-ఐడియా కంపెనీలోకి కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనేదీ లేదని వినిపిస్తోంది.

కాబట్టి.. ఈ యజమానులు తమ వైఖరిని మార్చుకుని ఇండియాలో మరింత పెట్టుబడులు పెట్టటానికి అంగీకరిస్తే తప్ప.. ఆ సంస్థ నిష్క్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

టెలికాం రంగం

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్యానికి ఇది ఎంత చేటు చేస్తుంది?

వొడాఫోన్ వంటి ఒక సంస్థ నిష్క్రమించాలని నిర్ణయించినట్లయితే.. అది భారతదేశ ప్రతిష్టను మసకబారుస్తుంది.

ఇది కేవలం ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వొడాఫోన్ సంస్థకు, భారత ప్రభుత్వానికి మధ్య గత పది సంవత్సరాలుగా పాత పన్నుల వివాదం ఒకటి కొనసాగుతోంది.

కాబట్టి.. వొడాఫోన్ వంటి ఒక పెద్ద బ్రాండ్ దుకాణం మూసేసి దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే.. అది ఇతర పెట్టుబడిదారులు భారతదేశంలో ప్రవేశించటానికి పునరాలోచించుకునేలా చేస్తుంది.

వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరముందా?

తక్షణమైతే లేదు కానీ.. వొడాఫోన్ భారతదేశం నుంచి వెళ్లిపోతుందా లేదా అనేదానితో సంబంధం లేకుండా - దేశంలో టెలికాం ధరలు పెరగటం మాత్రం ఖాయం.

అయితే.. ధరలు పెరగటమనేది చెడ్డ విషయమే కానవసరం లేదు. నిజానికి ఓ మంచి విషయం కూడా కావచ్చు. ఎందుకంటే.. మార్కెట్‌లో కొంత పోటీ ఉండాలంటే అదొక్కటే దారి.

టెలికాం సంస్థలు - వొడాఫోన్ కూడా - భారతదేశంలో మనుగడ సాగించి ఎదగటానికి ఇది జరగాల్సిన అవసరముంది.

నిజం ఏమిటంటే.. వొడాఫోన్ నిష్క్రమించినట్లయితే.. అప్పుడు కేవలం రెండు పెద్ద సంస్థలే మిగులుతాయి. ఇలాంటి ద్విదాధిపత్యం ఏ మార్కెట్‌కూ మంచిది కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)