లైగర్ రివ్యూ: బాక్సాఫీసు బరిలో ’బాక్సర్’ గెలిచాడా... లేదా?

ఫొటో సోర్స్, @TheDeverakonda
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
దర్శకుడిగా, కథకుడిగా పూరి జగన్నాథ్ స్టామినా ఏమిటో తెలుగు చిత్రసీమకు తెలుసు. తనదైన రోజున అద్భుతాలు సృష్టించగలడన్న నమ్మకం ఇప్పటికీ ఉంది. విజయ్ దేవరకొండ కూడా అంతే. కొడితే కుంభస్థలం బద్దలవ్వాల్సిందే అనుకునే టైపు. రావడమే సునామీలా విరుచుకుపడిన కెరీర్ విజయ్ దేవరకొండది.
హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. నార్త్ మొత్తం విజయ్ పేరు మంత్రంలా జపిస్తోంది. అలాంటి పూరి... విజయ్‌ల కాంబినేషన్‌లో `లైగర్` వస్తోందంటే.. ఆ సినిమాపై అంచనాలు, ఆశలూ పెట్టుకోవడం సహజం. నిన్నటి వరకూ `లైగర్` ఫీవర్‌తో దక్షిణాదితో పాటు బాలీవుడ్ కూడా ఊగిపోయింది.
`లైగర్`తో మరో భారీ పాన్ ఇండియా హిట్ ఖాయం అని అంచనాలు వేసుకొన్నారంతా. అలాంటి లైగర్ ఇప్పుడు వచ్చింది. మరి.. పూరి, విజయ్‌లు తమపై పెట్టుకొన్న అంచనాల్ని అందుకొన్నారా, లేదా? `లైగర్`లో ఉన్న దమ్మెంత..? ఈ సినిమాతో ఇండియా షేక్ అవుతుంది.. అన్న విజయ్ దేవరకొండ మాటలు నిజమయ్యాయా..?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరీంనగర్ టూ ముంబై
బాలామణి (రమ్యకృష్ణ)ది కరీంనగర్. తన కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ)తో కలిసి ముంబై వస్తుంది. లైగర్‌కి నత్తి. కానీ తన తండ్రిలా ఫైటర్ కావాలని అనుకుంటుంటాడు. ఎం.ఎం.ఏలో శిక్షణ ఇప్పించి.. తన కొడుకుని ఛాంపియన్‌గా చూడాలన్నది బాలామణి ఆశ... ఆశయం. టీ కొట్టు పెట్టుకొని... లైగర్‌ని పోషిస్తుంటుంది.
`పక్కదారులు పట్టొద్దు.. ఫోకస్ అంతా.. ఆట మీదే ఉండాలి` అని చెబుతున్నా.. తాన్య (అనన్య పాండే) ప్రేమలో పడిపోతాడు లైగర్. తాన్యకు లైగర్ అంటే చాలా ఇష్టం. మెల్లగా... ఎం.ఎం.ఐలో శిక్షణ తీసుకొని... బాక్సింగ్ రింగ్‌లోకి దిగాలని ప్రయత్నాలు చేస్తుంటాడు లైగర్. అయితే... లైగర్‌కి నత్తి ఉందన్న సంగతి తెలిసి.. తనని వదిలి వెళ్లిపోతుంది తాన్య.
ప్రేమలో విఫలమైన లైగర్.. తన ఆటలో గెలిచాడా, లేదా? లైగర్ ఛాంపియన్ గా మారడానికి ఏం చేశాడు? అనేది `లైగర్` కథ.
కథేది.. పూరీ..?
కథకెప్పుడూ ప్రాధాన్యం ఇవ్వడు పూరి. తన హిట్ సినిమాల్లో కూడా కథ కంటే క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంటుంది. అయితే ఆ క్యారెక్టరైజేషన్ లో ఓ ఫైర్ ఉంటుంది. అది... సినిమాని పరుగులు పెట్టిస్తుంటుంది. పూరి సినిమాల్లో హీరో ఎప్పుడూ కొత్తగా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంటాడు.
`నా సినిమాకి అవి చాల్లే` అనుకొని `లైగర్` విషయంలో సైతం కథని పక్కన పెట్టేశాడు పూరి. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా. అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన ఓ ఫైటర్.. ఛాంపియన్‌గా ఎలా మారాడన్నదే కథ. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలానే చూశారు జనాలు.
కాకపోతే... ఇందులో పూరి నమ్ముకొన్నది, పూరి విషయంలో ప్రేక్షకులు నమ్మింది ఏమైనా ఉందా అంటే.. అది కేవలం పూరి స్టైల్ ఆఫ్ హీరోయిజం.
అయితే... అది బెడసికొట్టేసింది. హీరోకి ఎప్పుడైతే `నత్తి` అప్లయ్ చేశాడో.. అప్పుడే హీరోయిజంపై ముసుగేయాల్సివచ్చింది. హీరోకి నత్తి ఎందుకు...? అనే విషయంలో పూరి దగ్గర సమాధానం లేదు.
నత్తి లేకపోయినా... కథలో వచ్చే ఇంపాక్ట్ లేదు. నిజం చెప్పాలంటే నత్తి అనేదే ఈ కథకు మైనస్ అయిపోయింది. పూరి బలం.. మాటలు. హీరో మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. విజయ్ బలం కూడా అదే. తెలంగాణ భాషలో విజయ్ మాట్లాడుతుంటే.. థియేటర్ పగిలిపోతుంది. అలాంటిది.. రెండు బలాలనీ `నత్తి` మింగేసింది.
హీరో పాత్రకు ఓ లోపం పెట్టడంలో తప్పు లేదు. కొత్త క్యారెక్టర్లని పట్టుకోవాలన్నా, హీరో పాత్రని కొత్తగా డిజైన్ చేయాలన్నా అది ఉపయోగపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. లోపం పెట్టడానికి ఓ కారణం ఉండాలి.
`రంగస్థలం`లో రామ్ చరణ్‌కి చెవుడుంది. అది కేవలం పెట్టాలని పెట్టిన లోపం కాదు. ఆ చెవుడు... ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు దర్శకుడు. కథని మలుపు తిప్పే సన్నివేశంలో హీరో లోపం బాగా ఉపయోగపడింది.
ఇక్కడ అలా కాదు.. హీరో నత్తి నత్తిగా మాట్లాడుతుంటే ప్రేక్షకులకు ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. అందుకే హీరోకి పూరి ఎక్కువ డైలాగులు రాకలేకపోయాడు. ఆ డైలాగులన్నీ రమ్యకృష్ణ పాత్రతో చెప్పించాడు. దాంతో... తల్లి పాత్ర అవసరమైనదానికంటే ఎక్కువ మాట్లాడేసి ఇంకాస్త కంగాళీ సృష్టించేస్తుంది.

ఫొటో సోర్స్, @ananyapandayy
ఎమోషన్ లేని ప్రేమకథ
తల్లీ కొడుకులు కరీంనగర్ నుంచి ముంబై వచ్చినట్టు చూపించారు. ఓకే.. కానీ... వాళ్లెందుకు ఈ ఆటలో గెలవాలి? ప్రేక్షకులు ఎందుకు వాళ్ల పక్షం ఉండాలి? అనే దానికి రీజన్ లేదు. లైగర్ తండ్రి పాత్రని సృష్టించి, బలమైన ఫ్లాష్ బ్యాక్ రాసుకుని ఉంటే బాగుండేది.
తండ్రి ఆశయాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత లైగర్‌కి ఉందని ప్రేక్షకుడు కూడా భావించాలి. అది జరగలేదు. దాంతో లేని పాత్ర కోసం, రాని ఎమోషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
స్పోర్ట్స్ డ్రామాలో ఎప్పుడైనా ఎమోషన్ చాలా ముఖ్యం. హీరో గెలుస్తాడని తెలుసు. కానీ ఎప్పుడు ఎలుస్తాడో, ఎలా గెలుస్తాడో, ఈలోగా వచ్చే అడ్డంకులేంటో అని తెలుసుకోవాలని ఉంటుంది. ఆ సన్నివేశాల్ని బాగా డిజైన్ చేస్తే తప్ప ప్రేక్షకుల్ని మెప్పించలేం. ఈ కథలో అది కూడా జరగలేదు.
తాన్యతో లవ్ ట్రాక్ మరీ నీరసంగా ఉంది. ఆమె అపర కోటీశ్వరురాలు. అలాంటి అమ్మాయి చాయ్ వాలాని ప్రేమించడం అనేది లాజిక్ లేదు.
పోనీ.. ఇది సినిమా కాబట్టి అలాంటి లాజిక్‌లు పట్టించుకోకూడదు అనుకొందాం. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడానికీ, అది బలపడానికీ కారణాలు ఉండాలి కదా? హీరోయిన్ హీరోని అవమానించి, వదిలేసి వెళ్లిపోతున్నప్పుడు కాస్త ఎమోషన్ రావాలి కదా..? అవేం రావు.
పాటలు ఎందుకు వస్తాయో తెలీదు. ఫైట్లు ఎందుకు పెట్టారో అర్థం కాదు.
అండర్ డాగ్ - ఛాంపియన్‌గా మారడం నిజంగా కదిలించే విషయమే. ఎన్నిసార్లు చూసినా ఈ కథ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఓ అనామకుడు ఛాంపియన్ అయితే ప్రేక్షకుల ఈగో సంతృప్తి పడుతుంది. లైగర్ అదే పాయింట్.
కానీ.. హీరో గెలవాలని కానీ, ఓడిపోతే.. అయ్యో అని గానీ అనిపించదు. అంటే.. పూర్తిగా క్యారెక్టర్‌లు రాసుకోవడంలో, సన్నివేశాల్ని తీర్చిదిద్దుకోవడంలో దర్శకుడి వైఫల్యం అనుకోవాలి.
ద్వితీయార్థం మొత్తం... ఎం.ఎం.ఏ ఫైట్లే. అసలు భారతదేశంలో ఏమాత్రం ఆదరణ లేని ఆట అది. దాని చుట్టూ కథ నడపాలనుకోవడం నిజంగా సాహసమే. అలాంటి అలవాటు లేని ఆటని పరిచయం చేస్తున్నప్పుడు ఎమోషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విషయంలో పూరి విఫలమయ్యాడు.
చివర్లో మైక్ టైసన్‌ని రంగంలోకి దించేటప్పటికే ఈ సినిమా ఫలితంపై ప్రేక్షకులలో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు టైసన్ కాదు కదా, మార్షల్ ఆర్ట్స్‌లో ఉద్దండుల్ని రంగంలోకి దించినా ఫలితం ఉండదు. ఇక్కడా అదే జరిగింది.
అంతటి ఎం.ఎం.ఏ అకాడమీ నడుపుతున్న కోచ్ దగ్గర.. హీరోని టోర్నమెంట్‌కు పంపడానికి 20 లక్షలు లేవని చెప్పడం, చివర్లో డబ్బుల కోసం హీరోయిన్‌ని కిడ్నాప్ చేయడం.. ఇవన్నీ కేవలం కథని లాగడానికి చేసిన ప్రయత్నాలు.
పాటలు ఉన్నా - వాటి ప్లేస్‌మెంట్‌కి చోటు లేకపోవడం చూస్తుంటే, పూరి ఎంత వీక్ స్క్రిప్టు రాసుకొన్నాడో అర్థమైపోతుంది.

ఫొటో సోర్స్, @TheDeverakonda
ఒక్కడే.. ఒంటిచేత్తో
ఈ సినిమాలో చూడదగ్గ విషయం ఉందంటే అది కేవలం విజయ్ నటనే. తన వల్లే లైగర్‌ని కాసేపు భరించొచ్చు, కాకపోతే విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి ప్రతిభని ఈ సినిమాలో బయటపెట్టలేకపోయాడు. దానికి కారణం... హీరో క్యారెక్టరైజేషన్‌లో లోపమే.
ఈ సినిమా మొత్తం పట్టుమని పది పేజీల డైలాగులు కూడా విజయ్ కోసం రాయలేకపోయాడు పూరి. స్క్రిప్టులో ఉన్న సగం డైలాగుల్ని రమ్యకృష్ణతో పలికించేసినా.. వాటిలో ఎలాంటి ఇంపాక్ట్ లేదు. పైగా... రమ్య పాత్ర, ఆమె డైలాగులూ మరీ ఓవర్ ది బోర్డ్‌లా అనిపిస్తాయి.
అనన్య పాండేకి ఇదే తొలి సినిమా. అమె లిప్ సింక్ అస్సలు కుదర్లేదు. బహుశా.. తను హిందీలో డైలాగులు చెబుతుంటే, తెలుగులో డబ్బింగ్ చెప్పి ఉంటారు. దాంతో.. ఆమె క్లోజ్ పెట్టినప్పుడల్లా, ఆ పాత్రతో డిస్‌కనెక్ట్ అయిపోతాడు ప్రేక్షకుడు. లవ్ ట్రాక్ తేలిపోవడంతో అనన్య పాత్ర కూడా సైడ్ అయిపోయింది.
టైసన్‌ని చివర్లో తీసుకొచ్చారు కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పైగా.. టైసన్ లాంటి ఓ ప్రపంచ ఛాంపియన్‌ని మన హీరో పరుగులు పెట్టించడం చూస్తే ఆ యాక్షన్ సీన్ కాస్త సిల్లీగా మారిపోయినట్టు అనిపిస్తుంది.
ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. దాంతో సెట్లూ, కెమెరా వర్క్ బాగా కుదిరాయి. బాక్సింగ్ నేపథ్యంలోని సన్నివేశాల్ని బాగా ఎడిట్ చేశారు. ఓ ఇంటర్నేషన్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తాయి.
ఇల్లు ఎంత అందంగా ఉన్నా, పునాదులు బలంగా లేకపోతే.. వృథానే. సినిమాకి కథే పునాది. దాన్ని బలహీనంగా రాసుకొన్నాడు పూరి.
ఈ సినిమాని చాలామంది అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాతో పోల్చారు. నిజానికి ఆ కథే మళ్లీ తీసినా బాగుండేదేమో..? `లైగర్`లో ఆ పోలికలు కొంతమందికి కనిపించొచ్చు కూడా. అలా కనిపిస్తే లైగర్‌ని `అమ్మా నాన్న తమిళ అమ్మాయి` సినిమాకి వీకెస్ట్ వెర్షన్ అనుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















