లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన

ఫొటో సోర్స్, PRASHANT PANDEY/BBC
- రచయిత, ప్రశాంత్ పాండే
- హోదా, బీబీసీ కోసం
"నా కూతుళ్లని ఎందుకు చంపారు? పిల్లలూ.. ఎక్కడికి వెళ్లిపోయారు మీరు?" అంటూ కన్నీరుమున్నీరవుతోంది ఆ తల్లి. బంధువులు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా, తన ఇద్దరు కూతుళ్లు ఇలా హత్యకు గురవడం ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.
"అరే, చంపకుండా ఉండొచ్చు కదా", "బిడ్డల ప్రాణాలు ఎందుకు తీశారు", "అందరినీ ఉరితీయాలి", "ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల హస్తం కూడా ఉంది".. ఇలా అంటూనే ఆ తల్లి స్పృహ తప్పిపడిపోయింది.
గురువారం రోజంతా ఆ కుటుంబం పరిస్థితి ఇదే. కూలి పని చేసుకునే తండ్రి పోస్టుమార్టం కోసం అటూ ఇటూ పరుగులు పెడుతున్నాడు. తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.
పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం, గొంతుకోసి హత్య చేసినట్లు నిర్ధరించారు.

లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య- ఫ్యాక్ట్స్

- ఇద్దరూ సొంత అక్కచెల్లెళ్లు
- బాలికల వయసు 15, 17 ఏళ్లు
- బుధవారం ఇద్దరి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
- పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం, గొంతుకోసి హత్య చేసినట్లు నిర్ధరణ
- పోలీసులు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పోస్టుమార్టం తరువాత మృతదేహాలను అప్పగించారు

గురువారం సాయంత్రం ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఇద్దరు బాలికల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో (వీడియోగ్రఫీ) తీశారు. తరువాత, భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మృతదేహాలను లఖీంపుర్ ఖీరీ నుంచి వారి గ్రామానికి తీసుకువచ్చారు.
కానీ, కుటుంబ సభ్యులు వెంటనే అంత్యక్రియలకు ఒప్పుకోలేదు. స్థానిక ప్రభుత్వం, కుటుంబ సభ్యుల మధ్య రాతపూర్వక ఒప్పందం కుదిరేవరకు మృతదేహాలను దహనం చేయనివ్వలేదు.
నిఘాసన్ ఎస్‌డీఎం రాజేష్ కుమార్ సింగ్, లఖీంపుర్ ఖీరీ ఏఎస్‌పీ అరుణ్ కుమార్ సింగ్ మృతుల తండ్రికి లిఖితపూర్వక హామీ పత్రాన్ని అందజేశారు.
ఈ హామీ పత్రంలో (ఎస్సీఎస్టీ చట్టం ప్రకారం), ఇద్దరు అమ్మాయిలకు రూ. 8 లక్షల చొప్పున అంటే మొత్తం రూ. 16 లక్షలు సెప్టెంబర్ 16లోగా అంటే రేపు (శుక్రవారం) బ్యాంకులో బదిలీ చేస్తారని రాసి ఇచ్చారు.
దీంతో పాటు, రాణి లక్ష్మీబాయి యోజన ద్వారా ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి ఆవాస్ కింద ఇల్లు కేటాయించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తారు. ఇది కాకుండా, దోషులకు ఉరిశిక్ష, త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారిస్తారు.
ఇదంతా అయిన తరువాత, స్థానిక ఎస్‌డీఎం కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడారు. ఆపై భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, PRASHANT PANDEY/BBC
ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది?

లఖీంపుర్ జిల్లా కేంద్రానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో గురువారం బాలికల ఇంటి ముందు దూరపు బంధువులు, పోలీసులు, మీడియా సిబ్బంది గుమిగూడారు. ఇంటి నుంది ఏడుపులు, పెడబొబ్బలు, మధ్య మధ్యలో వాహనాల సైరన్ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి.
గ్రామానికి ఉత్తరాన చెరకు పొలాలకు సమీపంలో వాళ్ల ఇల్లు ఉంది. ఈ చెరకు తోటల్లోనే బుధవారం మైనర్ బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
"ఆరోజు సాయంత్రం 4.30 నుంచి ఆ పిల్లల కోసం వెతికారు. మొదట నలుగురైదుగురు వెతకడం ప్రారంభించారు. ఎంతసేపటికీ కనిపించకపోవడంతో 15-20 మంది కలిసి వెతికారు. అప్పుడు చెరుకు తోటల్లో అమ్మాయిలిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు" అని అదే గ్రామానికి చెందిన రాజు చెప్పారు.
బాలికల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, పోక్సో చట్టం కింద నిఘాసన్ కొత్వాలిలో కేసు నమోదు చేశారు.
"బుధవారం బైక్‌పై వచ్చిన ముగ్గురు అబ్బాయిలు మా అమ్మాయిలను బలవంతంగా తీసుకెళ్లారు" అని మృతుల తల్లి చెప్పారు. కేసు నమోదు చేసిన తరువాత ఐజీ లక్ష్మీ సింగ్ స్వయంగా గ్రామానికి వచ్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన చోటును పరిశీలించారు.
గురువారం ఖీరీ ఎస్పీ సంజీవ్ సుమన్ విలేఖరులతో మాట్లాడుతూ, "సమీపంలోని లాల్‌పూర్ గ్రామం నుంచి మరో కమ్యూనిటీకి చెందిన అయిదుగురు అబ్బాయిలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ గ్రామానికి చెందిన ఒక అబ్బాయి వాళ్లకు సహకరించాడు" అని చెప్పారు.
పోలీసుల వాదనలపై సందేహాలు

చనిపోయిన బాలికల కుటుంబం సాధారణ కార్మికుల కుటుంబం. వారికి పొలాలు, భూములు ఏమీ లేవు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో లోహియా ఆవాస్ యోజన కింద వారికి రెండు గదుల పక్కా ఇల్లు లభించింది.
గ్రామ జనాభా సుమారు రెండు వేలు. ఇందులో దళితులు అత్యధికంగా 500 మందికి పైగా ఉన్నారు. చాలా కుటుంబాలు భూములు లేని కూలీలు. రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
చనిపోయిన బాలికలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. అన్నలు దిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అక్కకు పక్క ఊరి అబ్బాయితో పెళ్లయింది.
బుధవారం తండ్రి పనికి వెళ్లారు. తల్లి ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలోనే ముగ్గురు అబ్బాయిలు వచ్చి తన కూతుళ్లను బలవంతంగా తీసుకెళ్లారని తల్లి ఫిర్యాదు చేశారు.
లాల్‌పుర్ గ్రామం వైపు ప్రధాన అద్బానీ రహదారి లోపల చెరకు తోటలో బాలికల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు.
లఖీంపుర్ ఖీరీ పోలీసులు లాల్‌పుర్ గ్రామానికి చెందిన అయిదుగురు నిందితులను, మృతుల గ్రామానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌గా గుర్తించినట్టు ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు.
"జునైద్, అతడి సహచరులతో, చనిపోయిన బాలికలకు ఇటీవలే స్నేహం కుదిరింది. నిందితులు మైనర్ బాలికలను ప్రలోభపెట్టి తీసుకెళ్లారు. ముందు అత్యాచారం చేశారు. తరువాత వారి గొంతు నులిమి చంపేశారు. వారి చున్నీలతోనే వారిని చెట్టుకు వేలాడదీశారు. ఆ తరువాత మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ని పిలిచారు. ప్రాథమిక విచారణలో తేలిన విషయాలివి. నిందితుల దుస్తులను ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతున్నారు" అని ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు.
ఈ ఘటన జరిగినప్పుడు బాలికల అన్నలు ఇద్దరూ దిల్లీలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే బయలుదేరి సొంతూరికి వచ్చారు. పోలీసుల వాదనను వీరు సందేహిస్తున్నారు.
"మా చెల్లెళ్లిద్దరనీ బలవంతంగా తీసుకెళ్లలేదని, అంగీకారంతోనే వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ అబ్బాయిలు వాళ్లను ఎందుకు చంపుతారు? మాకేం అర్థం కావట్లేదు" అన్నారు.
"దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి" అని అక్కడున్న వారిని వేడుకున్నారు.

ఫొటో సోర్స్, PRASHANT PANDEY/BBC
నిందితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

లాల్‌పుర్ గ్రామానికి చెందిన అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జునైద్‌ను ఎన్‌కౌంటర్‌లో పట్టుకున్నారని, ఆ సందర్భంలో అతడి కాలికి బుల్లెట్ తగిలిందని అని ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు.
మృతి చెందిన అక్కచెల్లెళ్లిద్దరి గ్రామానికి, లాల్‌పుర్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడు జునైద్ తాత (65) తన ఇంట్లో దుప్పటి కప్పుకుని మౌనంగా కూర్చున్నారు.
"మా మనుమడు హైదరాబాద్‌లో గ్రిల్స్ తయారుచేసే చోట పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అక్కడకు వెళ్లాడు. మొహర్రం కోసం ఊరికి వచ్చాడు. నిన్న, గల్లా తీసుకురావడానికి తమోలీపుర్వా వెళ్లాడు. నాలుగు గంటలకు తిరిగి వచ్చాడు. జునైద్ ముందే దిల్లీకి టికెట్ చేయించుకున్నాడు. అందుకని, వెంటనే బయలుదేరాడు. తరువాత, రాత్రి 11 గంటలకు పోలీసులు వచ్చి జునైద్ తండ్రి ఇజ్రాయెల్‌ను పట్టుకుని తీసుకెళ్లారు. తండ్రితో ఫోన్ చేయించి జునైద్‌ను రప్పించారు. ఆ తరువాతే మాకు ఇలాంటి ఘటన జరిగిందని తెలిసింది" అని జునైద్ తాత చెప్పారు.
జునైద్ తండ్రి కూడా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. జునైద్ తాత మనుమడి ఆధార్ కార్డును చూపిస్తూ, "పోలీసులు ఈ అబ్బాయిలను ఇరికిస్తున్నారు. అందరూ మైనర్లే" అని అన్నారు.
ప్రధాన నిందితుడి ఇంటికి కాస్త దూరంలోనే మిగతా నిందితుల ఇళ్లు ఉన్నాయి. ఈ నిందితుల కుటుంబాలన్నీ కూలి పనిచేసుకుంటున్నవే. నిందితులు గుజరాత్, హైదరాబాద్‌లలో పనిచేస్తున్నారు.
నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు. "ఇద్దరూ ఇంట్లో నిద్రపోతున్నారు. తెల్లవారి పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు" అని వారి నానమ్మ ఏడుస్తూ చెప్పారు.
"నిన్న మా అబ్బాయి గల్లా తీసుకురావడానికి వెళ్లాడు. వెంటనే వచ్చేశాడు. వాడికి జ్వరంగా ఉంది. మా అబ్బాయి ఈ నేరం చేయలేదు. పోలీసులు వాడిని ఇరికిస్తున్నారు" అని మరో నిందితుడి తల్లి చెప్పారు.
ఈ ఘటన తరువాత లాల్‌పుర్ గ్రామంలో వింత నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడప్పుడూ పోలీసు జీపు సైరన్ మాత్రం వినిపిస్తోంది.
"నిన్న ఊళ్లోకి పోలీసుల జీపు వచ్చినప్పుడే మాకు విషయం తెలిసింది. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలీదు. కానీ, దీనివల్ల మా రెండు గ్రామాల మధ్య సంబంధాలు చెడిపోతాయి. జరిగింది చాలా పెద్ద తప్పు. ఇంతకుముందు మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఇప్పుడేం జరుగుతుందో తెలీదు" అని లాల్‌పుర్‌కు చెందిన వృద్ధుడు జమీల్ అన్నారు.
రాజకీయ వేడి.. విపక్షాల విమర్శలు

ఈ ఘటన తరువాత యూపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నలు సంధించాయి.
సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ నేతృత్వంలో ఒక బృందం గ్రామానికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మృతుల కుటుంబ సభ్యులను కలిశారు.
కాగా, స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?
- ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














