క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు

బ్రెస్ట్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్, అత్యంత ప్రమాదకర వ్యాధి. అయితే, ఎంతో కొంత మంచి విషయం ఏంటంటే, ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో ఎప్పటికప్పుడు పురోగతి కనిపిస్తోంది.

క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో పుట్టుకొచ్చిన నూతన మార్పులు గురించి పంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు ప్రతీ ఏడాది షికాగో (యూఎస్‌ఏ)లో సమావేశం అవుతారు.

ఈ ఏడాది అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సమావేశంలో చర్చించిన తాజా పురోగతులు మరింత ఆశలు కల్పిస్తున్నాయి. ఈ తాజా మార్పులు, కొన్ని రకాల క్యాన్సర్ ట్యూమర్లతో పోరాడటంలో వ్యక్తుల దృక్కోణాన్ని మార్చుతాయని నిపుణులు అంటున్నారు.

వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంలోని గ్రాహకాలను బంధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంలోని గ్రాహకాలను బంధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

1. బ్రెస్ట్ క్యాన్సర్: చాలా మందికి మేలు చేసే కొత్త మందు

ట్రాస్టుజుమాబ్ అనే రక్తనాళంలోకి ఎక్కించే మందును దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్‌ను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

ఇది బాగా పనిచేస్తుంది. కానీ, దీనికి పరిమితులు ఉన్నాయి. HER2 అనే జన్యువు ఉన్న రోగులకు మాత్రమే ఈ చికిత్సను అందిస్తున్నారు.

ట్రాస్టుజుమాబ్ డిరక్స్‌టేకన్ అనే కొత్త మిశ్రమం ఈ పరిస్థితిలో మార్పు తేవచ్చు.

''ఒక విప్లవాత్మక ఔషధం అందుబాటులోకి వస్తోంది'' అని బ్రసీలియాలోని సిరియన్-లెబనీస్ ఆసుపత్రిలో రీసెర్చ్ కోఆర్డినేటర్‌గా ఉన్న అంకాలజిస్ట్ రోమువాల్డో బరోసో అన్నారు.

ఇది ఒక ట్రోజన్ హార్స్‌ తరహాలో అంటే శరీరంలోకి క్యాన్సర్ కణాలతో సంబంధంలోని పదార్థంలా వెళ్లి వ్యాధి కారకాల మీద దాడి చేస్తుందని ఆయన వివరించారు.

ట్రాస్టుజుమాబ్ ఒక మోనోక్లోనల్ యాంటీబాడీలాగా పనిచేస్తుంది. రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంలోని గ్రాహకాలను బంధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

ఇక డిరక్స్‌టేకన్, క్యాన్సర్ బారిన పడిన కణాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇది లోపలి నుంచి క్యాన్సర్ ట్యూమర్లను నాశనం చేస్తుంది.

తక్కువ అభివృద్ధి చెందిన HER2 జన్యువు ఉన్న రోగుల్లో కూడా ఇది బాగా పని చేస్తుంది. పది మంది రోగుల్లో దాదాపు ఏడుగురు ఈ ఔషధం ద్వారా లబ్ధి పొందుతారని బరొసొ అంచనా వేశారు.

ప్రతీ 21 రోజులకు ఒకసారి ఈ ఇంట్రావీనస్ చికిత్సను చేయాలి. అయితే, ఆసుపత్రిలో ఉపయోగించేందుకు దీనికి ఇంకా అనుమతులు రాలేదు. ఔషధ నియంత్రణ-అనుమతుల మంజూరీ సంస్థలు ఇంకా ఈ చికిత్సకు ఆమోదం తెలపాల్సి ఉంది.

పురీషనాళంలో వచ్చే ట్యూమర్లకు సర్జరీ, రేడియోషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురీషనాళంలో వచ్చే ట్యూమర్లకు సర్జరీ, రేడియోషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు

2. పురీషనాళ క్యాన్సర్: వైద్యులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఔషధం

ఒక ప్రయోగాత్మక ఔషధాన్ని ప్రాథమిక పరీక్షలో భాగంగా కొంతమంది రోగులకు ఇచ్చినప్పుడు వారందరికీ వ్యాధి పూర్తిగా నయమైందని తెలిస్తే ఎలా ఉంటుంది?

రెక్టమ్ క్యాన్సర్ చికిత్స కోసం డోస్టార్‌లిమాబ్‌ అనే ఔషధంపై చేసిన ట్రయల్‌లో ఇదే జరిగింది. ఇప్పటికే ఇతర ట్యూమర్ల చికిత్స కోసం ఈ మందును వాడుతున్నారు. ఇది, ట్యూమర్లపై దాడి చేసేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.

12 మంది రోగులపై 6 నెలల పాటు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ పూర్తయ్యాక పరీక్షిస్తే ఆ 12 మంది శరీరాల్లో కణితి ఉన్న జాడలే లేవు. ఈ రోగులు ట్యూమర్లను తొలిగించుకునేందుకు శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ వంటి మరింత తీవ్రమైన చికిత్స విధానాల వైపు వెళ్లకుండా ఇది చేసింది.

"వైద్యులకు కూడా ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది" అని సావో పాలో ఏసీ కమర్గో క్యాన్సర్ సెంటర్‌లోని క్లినికల్ ఆంకాలజీ విభాగం డైరెక్టర్, అంకాలజిస్ట్ రాచెల్ రీచెల్‌మాన్ చెప్పారు.

ఈ ఔషధాన్ని కనుగొన్నప్పటికీ ఇంకా దీని విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

మొదటగా ఫాలో అప్ టైమ్ 6 నెలలు అనేది చాలా తక్కువ. ''కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాధి మళ్లీ కనిపించవచ్చు'' అని రీచెల్‌మాన్ విశ్లేషించారు.

రెండోది, 'మైక్రోసాటిలైట్ ఇన్‌స్టెబిలిటీ (ఎంఎస్‌ఐ-హెచ్) అనే ట్యూమర్లు ఉన్న రోగుల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. అంటే 1 శాతం పురీషనాళ క్యాన్సర్ కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

సాధారణ ఉపయోగం కోసం దీనికి అనుమతి రాలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్సల్లో లిక్విడ్ బయాప్సీ చాలా సహాయకంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్సల్లో లిక్విడ్ బయాప్సీ చాలా సహాయకంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

3. కొలొరెక్టల్ క్యాన్సర్: అనవసర కీమోథెరపీని నివారించే పరీక్ష

ఈ సమావేశంలో ఆస్ట్రేలియా పరిశోధకులు మరో కొత్త పరిశోధనను సమర్పించారు. రోగి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన చికిత్సల సంఖ్యను కుదించడం గురించి వారు మాట్లాడారు.

వారు ఆవిష్కరించిన 'లిక్విడ్ బయాప్సీ' విధానం ద్వారా ట్యూమర్ డీఎన్ఏ శకలాలను రక్తంలో గుర్తించవచ్చు.

కొలొరెక్టర్ క్యాన్సర్ రోగులు తరచుగా పేగుల్లో ప్రభావిత భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకుంటారు. కోలుకున్న తర్వాత కూడా క్యాన్సర్ కణితి అవశేషాలను తొలగించడం కోసం చాలామందికి కీమోథెరపీ అవసరం అవుతుంది. దీన్ని ఇది తగ్గిస్తుంది.

కానీ, దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

లిక్విడ్ బయాప్సీ కారణంగా కీమోథెరపీ అవసరమా కాదా అనే విషయాన్ని మరింత సులభంగా గుర్తించవచ్చు.

''లిక్విడ్ బయాప్సీకి విప్లవాత్మక సామర్థ్యం ఉంది'' అని సావో పోలో ఆంకోక్లినిక్స్ ప్రెసిషన్ మెడిసిన్ మెడికల్ డైరెక్టర్, ఆంకాలజిస్ట్ రోడ్రిగో అన్నారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

4. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్: విజయవంతమైన చికిత్సపై చిగురిస్తున్న ఆశలు

ప్యాంక్రియాటిక్ అడెనోకార్సినోమా... నిర్ధారించడం చాలా కష్టమైన క్యాన్సర్ రకాల్లో ఇదొకటి.

కీమోథెరపీ చికిత్సల్లో గత పదేళ్లలో కొత్త విధానాలు పరిమితంగానే వచ్చాయి. ఇమ్యూనోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీలు వంటి ఆధునిక చికిత్స వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల్లో ఇంకా సానుకూల ఫలితాలు కనిపించలేదు.

ఇప్పుడు ఈ క్యాన్సర్‌కు చికిత్స కోసం సీఏఆర్-టీ అనే పద్ధతిని ఉపయోగించి కొన్ని చికిత్స విధానాలను రూపొందించారు.

ఈ విధానంలో రోగి శరీరంలోని ఇమ్యూనిటీ కణాలను సంగ్రహించి, వాటిని లేబోరేటరీల్లో మార్పుచేర్పులు చేసి తిరిగి రోగి శరీరంలో ప్రవేశపెడతారు. ఇలా చేయడం ద్వారా రోగనిరోధక కణాలు క్యాన్సర్ ట్యూమర్‌ను గుర్తించి వాటిపై దాడి చేస్తాయి.

''ఈ విధానం చాలా నమ్మకంగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిపై ఇంకా చాలా ప్రయోగాలు జరగాలి. కానీ, ఇప్పటికైతే మేం సరైన దారిలోనే వెళ్తున్నామనే నమ్మకం ఉంది'' అని సావో పాలో యూనివర్సిటీ క్లినికల్ అంకాలజీ ప్రొఫెసర్ పాలో హోఫ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)