అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు

సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కు వద్దకు అత్యవసర సేవల బృందాలు చేరుకున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కు వద్దకు అత్యవసర సేవల బృందాలు చేరుకున్నాయి
    • రచయిత, ఏంజెలికా కాసస్, లియో సాండ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

టెక్సస్, శాన్ ఆంటోనియో శివార్లలోని ఒక ట్రక్కులో 46 మృతదేహాలను కనుగొన్నారు. నలుగురు పిల్లలు సహా 16 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు.

ఇందులో నుంచి ప్రాణాలతో బయటపడినవారు వడదెబ్బ, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారని తెలిపారు.

అమెరికా-మెక్సికో సరిహద్దుకు 250 కి.మీ దూరంలో ఉండే శాన్ ఆంటోనియా మార్గాన్ని వలసదారులను అక్రమంగా తరలించడానికి సిండికేట్ ముఠాలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.

సరైన ధ్రువపత్రాలు లేని వలసదారులను తరలించడానికి అక్రమ రవాణాదారులు తరచుగా ట్రక్కులను ఉపయోగిస్తుంటారు. వలసదారులు, అమెరికా సరిహద్దులకు చేరుకున్న తర్వాత స్మగ్లర్లు వారిని మారుమూల ప్రాంతాల్లో కలుసుకుంటారు. ట్రక్కుల ద్వారా వారిని అమెరికాలోకి తీసుకొస్తారు.

''వారికి కుటుంబాలు ఉన్నాయి. మెరుగైన జీవితం కోసం వారు ప్రయత్నించినట్లుగా అనిపిస్తోంది. ఇదొక భయంకరమైన మానవ విషాదం'' అని శాన్ ఆంటోనియో మేయర్ రాన్ నిరెన్ అన్నారు.

ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తును సెంట్రల్ ఏజెంట్స్‌కు అప్పగించారు.

ఒక మృతదేహం లభ్యమైందనే నివేదికలు అందడంతో అత్యవసర సేవల బృందాలు అప్రమత్తం అయ్యాయి
ఫొటో క్యాప్షన్, ఒక మృతదేహం లభ్యమైందనే నివేదికలు అందడంతో అత్యవసర సేవల బృందాలు అప్రమత్తం అయ్యాయి

ట్రక్కు వివరాలు తెలియలేదు

ఒక మృతదేహం లభ్యమైందనే నివేదికలు అందడంతో అత్యవసర సేవల బృందాలు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నాయని విలేఖరులతో శాన్ ఆంటోనియో అగ్నిమాపక విభాగం చీఫ్ చార్లెస్ హుడ్ చెప్పారు.

''ట్రక్కు తెరిచి చూడగా లోపల మృతదేహాలు కనిపించాయి. ఇలా జరిగి ఉండకూడదు. మాలో ఎవరూ కూడా దీన్ని ఊహించలేదు'' అని ఆయన అన్నారు.

ట్రక్కును డ్రైవర్ వదిలేసి వెళ్లిపోయారని, ట్రక్కులోని ఏసీ పనిచేయడం లేదని లోపల తాగడానికి మంచి నీరు కూడా లేదని ఆయన తెలిపారు.

వేసవి కాలంలో శాన్ ఆంటోనియాలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. సోమవారం అక్కడ 39.4 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆసుపత్రికి తరలించిన వారిలో ఇద్దరు గ్వాటెమాలాకు చెందిన వారు ఉన్నారని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ చెప్పారు. మిగతా వారు ఏ దేశాలకు చెందినవారో ఇంకా తెలియలేదు.

మెక్సికో కాన్సుల్ జనరల్ రూబెన్ మినుటీ కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వారిలో మెక్సికో పౌరులు ఉన్నట్లు తేలితే, ఈ విషయంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తామని శాన్ ఆంటోనియాలోని మెక్సికో కాన్సులేట్ తెలిపింది.

సెక్యూరిటీ గార్డు ఎడ్వర్డ్ రెయనా
ఫొటో క్యాప్షన్, సెక్యూరిటీ గార్డు ఎడ్వర్డ్ రెయనా

హృదయ విదారక దృశ్యం

लाइन

శాన్ ఆంటోనియో నుంచి ఏంజెలికా కాసస్

लाइन

చాలా చీకటిగా ఉంది. కొన్ని పోలీస్ కార్లు అక్కడికి వచ్చాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు టేపుతో చుట్టారు. ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బాధితులందరినీ వలసదారులుగా భావిస్తున్నారు. తాగడానికి నీరు లేకపోవడం, అధిక వేడి కారణంగా వారు చనిపోయి ఉంటారని చెబుతున్నారు.

ఘటనా స్థలానికి సమీపంలోని ఒక వుడ్ యార్డ్‌కు కాపాలదారుగా ఎడ్వర్డ్ రెయనా పనిచేస్తుంటారు. ఆయన ఈ ఘటన తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.

ఈ ప్రాంతంలో వలసదారులు వేగంగా వెళ్ళే రైళ్ల నుంచి దూకడాన్ని లెక్కలేనన్ని సార్లు చూశానని ఆయన చెప్పారు.

''ఏదో ఒక సమయంలో పెద్ద దుర్ఘటన జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే, ప్రజలను ఇలా రవాణా చేసే ముఠాలు, వారి ఆరోగ్యం గురించి భద్రత గురించి పట్టించుకోవు'' అని ఆయన తెలిపారు.

శాన్ ఆంటోనియోలో గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. కానీ, ఇంత భయంకరంగా ఎప్పుడూ జరగలేదు. 2017లో వాల్‌మార్ట్ స్టోర్ బయట ఇలాంటి ట్రక్కులోనే పది మంది మృతదేహాలు లభించాయి.

శాన్ ఆంటోనియాకు దక్షిణాన రెండు హైవేలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా టెక్సస్ శివార్లకు వెళ్లవచ్చు.

ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు ఉన్నాయి. శాన్ ఆంటోనియో శివార్ల నుంచి ట్రక్కులు రహస్యంగా వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన అమెరికా భద్రతా విభాగానికి చెందిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అలెజాండ్రో మయోర్కాస్ మాట్లాడుతూ.... ''ప్రజలను అక్రమంగా రవాణా చేసేవారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. వారికి వలసదారులంటే గౌరవం ఉండదు. వారి లాభాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడతారు'' అని అన్నారు.

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు

ఈ ఘటనకు అమెరికా అధ్యక్షుడు కారణమని టెక్సస్ గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత గ్రెగ్ అబాట్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న 'ఓపెన్ బోర్డర్ పాలసీ' ఫలితమే ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానవ అక్రమ రవాణా ముఠాలను నిర్వీర్యం చేయడంతో పాటు చట్టబద్ధమైన వలస మార్గాలను తెరవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ పార్టీ నేత బెటో ఓరూర్క్ అన్నారు.

అమెరికాలో వలసలు ఒక సున్నితమైన అంశం. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 2,39,000 మందిని మే నెలలో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది చాలా ప్రమాదకరమైన మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించారు.

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినందుకు గత ఏడాది లక్షలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువమంది సెంట్రల్ అమెరికా దేశాలైన హోండురస్, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్‌లకు చెందినవారు.

సెంట్రల్ అమెరికాలోని పేదరికం, హింస నుంచి తప్పించుకునేందుకు మెరుగైన జీవితాన్ని వెదుక్కుంటూ వీరంతా అమెరికాకు వలస వస్తుంటారు.

వీరిలో ఎక్కువమంది రవాణాదారులకు భారీగా డబ్బులు చెల్లిస్తూ అమెరికా సరిహద్దును దాటుతున్నారు. ఇలాంటి ప్రయత్నంలో గత కొన్నేళ్లలో చాలా మంది చనిపోయారు. అయితే, ఒకేసారి ఇంతస్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు.

''ఇది ఒక మానవ అక్రమ రవాణా ఘటనగా కనిపిస్తుంది. కానీ, ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఘటన'' అని బీబీసీతో స్థానిక రిపోర్టర్ ఒకరు అన్నారు.

వీడియో క్యాప్షన్, భారతీయ సంపన్నులు ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)