లిబియా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన చిన్నారులు, మహిళల శవాలు

ఫొటో సోర్స్, Getty Images
లిబియా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన చిన్నారులు, మహిళల శవాల ఫొటోలను ‘ప్రో యాక్టివా ఓపెన్ ఆర్మ్స్’ అనే స్పానిష్ స్వచ్చంద సంస్థ షేర్ చేసింది. ఈ ఫోటోలు లిబియా నుంచి వచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఆ శవాలు మధ్యధరా తీరం దాటి యూరప్ రావడానికి ప్రయత్నించినవారివని ఆ స్వచ్చంద సంస్థ తెలిపింది.
నీళ్ళల్లో నానడం వల్ల ఉబ్బి, ఇసుకలో సగం కప్పుడైపోయి, అర్ధనగ్నంగా ఉన్న పిల్లలు, మహిళల శవాలు ఆ ఫొటోలలో కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఇంతవరకు మధ్యధరా సముద్రంలో కనీసం 743 మంది వలసదారులు మరణించినట్లు అంచనా.
సెంట్రల్ మెడిటరేనియన్ ప్రాంతంలోనే 2020లో 289 మరణాలు చోటుచేసుకోగా, ఒక్క 2021లోనే 630 మరణాలు నమోదైనట్లు యూఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్ ఫర్ మైగ్రేషన్ డేటా చెబుతోంది.
"లిబియా నుంచి ఎవరైనా పారిపోదామని అనుకున్నప్పుడు వారిని వెనక్కి తీసుకుని వెళ్లడం గాని, లేదా సముద్రం మధ్యలో వదిలేయడం గానీ చేయకూడదు. సముద్రంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించడానికి వారిని వెతికి పట్టుకునే ప్రయత్నాలు జరగాలి" అని ఓపెన్ ఆర్మ్స్ కమ్యూనికేషన్స్ హెడ్ లారా లనూజా అన్నారు.
"ప్రపంచంలోనే మధ్యధరా సముద్రం అతి పెద్ద స్మశానం. అది అలా ఉండి ఉండకూడదు" అని ఆమె అన్నారు.
లిబియా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఈ పిల్లల, మహిళల చిత్రాలు బాధాకరం" అని ఇటలీ ప్రధాన మంత్రి మారియో అన్నారు.
ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ఒక చిత్రంలో ఒక చిన్నారి చుక్కల డిజైన్ ఉన్న నైట్ డ్రెస్ ధరించి ఉన్నారు. శరీరం అంతా సగం ఇసుకతో కప్పి ఉంది.
ఆకుపచ్చని ట్రౌజర్ ధరించిన మహిళ ఇసుకలో పడి ఉన్నట్లు మరో ఫొటోలో కనిపిస్తోంది. ఆమె ఒంటిపై వస్త్రం తల పైకి చెదిరిపోయింది.
"వీరంతా జీవించాలనే ఆశలు, కలలు ఉన్న చిన్నారులు, మహిళలు" అంటూ ప్రో యాక్టివా ఆర్మ్స్ వ్యవస్థాపకులు ఆస్కార్ క్యాంప్స్ ఈ ఫోటోలను సోమవారం ట్వీట్ చేశారు. ఆ శవాలను మూడు రోజుల పాటు అలాగే వదిలేసినట్లు చెప్పారు.
ఫ్రీలాన్స్ విలేఖరి నాన్సీ పోర్సియాకు పరిచితులైన ఒక వ్యక్తి ఆ శవాలను గుర్తించి అధికారులకు తెలియజేయగానే వాటిని అబూ ఖమాష్ సమాధి దగ్గర ఖననం చేసినట్లు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు.
మెడిటరేనియన్ తీరం నుంచి వస్తున్న వలసదారులతో యూరప్ సతమతమవుతోంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,000 మంది ఇటలీకి చేరారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో మరింత మంది తీరం దాటే ప్రయత్నం చేయొచ్చని భయపడుతున్నారు.
గత వారంలో పశ్చిమ మెడిటరేనియన్‌లో మొరాకో నుంచి సుమారు 8000 మంది సరిహద్దుల దగ్గర ఉన్న కంచె చుట్టూ ఈది స్పానిష్ ప్రాంతం క్యూటా రావడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అధికారులు కొన్ని వేల మందిని వెనక్కి పంపారు.
2015లో సముద్రంలో మునిగిన మూడేళ్ల అలన్ కుర్దీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆవేదన కలిగించింది.
ఇసుకలో కూరుకుపోయిన ఆ సిరియా చిన్నారి ఫోటోను టర్కీలో తీశారు. ఆ చిన్నారి కుటుంబం యూరప్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లి, తోబుట్టువుతో పాటు కుర్దీ సముద్రంలో చనిపోయాడు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








