అండాశయ కేన్సర్ ఎందుకొస్తుంది.. ఎలా గుర్తించాలి.. చికిత్స ఏమిటి.. ఎన్నాళ్లు బతుకుతారు

ఫొటో సోర్స్, BSIP/gettyimages
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
"మీ వదిన గారికి కేన్సరేమిటి? పోయిన వారం గుడిలో చూశాను. చక్కగా పాడుతున్నారు కూడా. రిపోర్ట్ ఏమైనా పొరపాటు పడుతున్నారేమో."
"వాళ్ల తమ్ముడు డాక్టరే. మొదట్లో ఆయనకూ అదే అనుమానం వచ్చిందట. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారట కూడా. కేన్సర్ చివరి స్టేజిలో ఉందని చెప్పారు."
"అదెలా సాధ్యం? నిన్న మొన్నటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన మనిషికి హఠాత్తుగా కేన్సర్ రావడమేమిటి? అది కూడా లాస్ట్ స్టేజిలో ఉండడం"
" కొద్దికాలంగా చిన్న చిన్న ఇబ్బందులొస్తున్నాయట. ఆహారం అరగకపోవడం, పొట్టలో అసౌకర్యం, ఉబ్బరించినట్లుండడం వంటివి. తన వయసుకు అవన్నీ సహజమే కదా అనుకుని, చిట్కా వైద్యాలు చేసుకుంటున్నారు. తగ్గకపోవడంతో మందులేమైనా రాసిస్తారని గాస్ట్రో డాక్టర్ దగ్గరకు వెళ్లారట. ఆయనకు అనుమానం వచ్చి స్కానింగ్ చేయిస్తే ఓవరీకి కేన్సర్ అన్న విషయం బయట పడింది."
అండాశయ కేన్సర్‌కు ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు
అండాశయ కేన్సర్ (Ovarian cancer) కి ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. అస్పష్టమైన లక్షణాలు కనిపించినా, అవి మెనోపాజ్ వల్ల కలిగే లక్షణాలనీ, లేదా వయసు వల్ల కలిగే మార్పులనీ స్త్రీలు సరిపెట్టుకుంటారు.
వ్యాధి ప్రారంభ దశలో అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవి జీర్ణ కోశ వ్యాధి లక్షణాల వలె ఉండడం వల్ల, రోగ నిర్ధరణని తప్పుదోవ పట్టిస్తాయి. దీంతో గైనకాలజీకి సంబంధించిన నిపుణులను సంప్రదించడంలో ఆలస్యం జరుగుతుంది. అందుకే ఒవేరియన్ కేన్సర్ ని 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు.
భారతీయ మహిళలకు వచ్చే కేన్సర్లలో మొదటి, రెండు స్థానాలు రొమ్ము కాన్సర్ మరియు జననేంద్రియాల కేన్సర్‌లవి కాగా అండాశయ కేన్సర్‌ది మూడో స్థానం. ఒవేరియన్ కేన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ చేరే వరకూ వ్యాధిని గుర్తించడం కష్టం.

ఫొటో సోర్స్, BSIP
అండాశయాలు (Ovaries)
ప్రతి స్త్రీకి, గర్భాశయానికి రెండువైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. అండాశయాల పని ఏమిటంటే గర్భం కోసం ప్రతి నెలా గుడ్లు(Ovum), ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం.
అండాశయ క్యాన్సర్ సంభవించే రేటు 5.4 - 8/100000 మధ్య ఉంటుంది. ఈ కేన్సర్ వచ్చే రిస్క్ 35 సంవత్సరాల వయసునుండీ పెరుగుతూ , 55 - 64 సంవత్సరాల మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
అండాశయ కేన్సర్‌కు కారణమేమిటి?
చాలా సందర్భాలలో, అండాశయ కేన్సర్‌కు కారణం తెలియదు.
అండాశయ కేన్సర్ వచ్చే రిస్క్‌ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి.
* వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ అండాశయ కేన్సర్ రిస్క్ ఎక్కువ.
* అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఒక మహిళ తన జీవితకాలంలో ఎక్కువ సార్లు అండాలను విడుదల చేయడం వల్ల ఈ అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంటుంది.
గర్భం దాల్చినపుడు ( 9 నెలల పాటు) మరియు పాలిచ్చే స్త్రీలలో అండం విడుదల జరగదు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే, ఆమెకు అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ.
గర్భనిరోధక మాత్ర తీసుకోవడం, గర్భవతిగా ఉండటం లేదా తల్లి పాలివ్వడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించగలం.
పిల్లలు లేని స్త్రీలలో, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళల్లో కేన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
జన్యుపరమైన కారణాలు
* కుటుంబంలో ఎవరికైనా ఒవేరియన్ కేన్సర్ వచ్చినట్లయితే, మిగిలిన సభ్యులకు చ్చే అవకాశం ఉంది.
* BRCA1 మరియు BRCA2 జన్యువులు కలిగిన స్త్రీలలో అండాశయం (Ovary) మరియు రొమ్ము కేన్సర్ ప్రమాదం ఉంది.
* LYNCH II సిండ్రోమ్ ఉన్న కుటుంబాలు కూడా అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంది.
రొమ్ము కేన్సర్ ఉన్న మహిళలకు అండాశయ కేన్సర్ ప్రమాదం ఎక్కువ.
Hormone Replacement Therapy
రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలు కొందరు హార్మోన్ చికిత్స తీసుకుంటారు.
హార్మోన్ చికిత్స తీసుకోని స్త్రీలతో పోల్చి చూస్తే, తీసుకునే వారిలో అండాశయ కేన్సర్ రిస్క్ అధికం.
అండాశయ కేన్సర్ లక్షణాలు ఏమిటి?
అండాశయపు కేన్సర్ తొలి దశలో నిర్దిష్టమైన లక్షణాలుండవు. అజీర్ణం, అలసట, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జీర్ణ క్రియలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అండాశయ కేన్సర్ ఎలా నిర్ధరణ అవుతుంది?
అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అండాశయం అసాధారణంగా కనిపిస్తే కేన్సర్ అనుమానించవచ్చు.
రక్తంలో CA125 అనే ప్రోటీన్ యొక్క స్థాయి పెరగడం కూడా కేన్సర్‌ని సూచిస్తుంది.
అండాశయ కణాలను బయాప్సీ పరీక్ష చేయడం ద్వారా వ్యాధిని నిర్ధరిస్తారు.
అండాశయ కేన్సర్ రిస్క్‌ని తగ్గించుకోవడం ఎలా?
ఎవరైనా స్త్రీ, 26 సంవత్సరాలకు మునుపే గర్భం దాల్చి, అది తొమ్మిది నెలలు నిండేవరకూ కొనసాగితే ఆమెకు అండాశయ కేన్సర్ రిస్క్ తగ్గుతుంది.
బిడ్డలకు తల్లిపాలనివ్వడం ద్వారా ఈ రిస్క్ తగ్గుతుంది.
గర్భ నిరోధక మాత్రల వాడడం (3 - 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) వల్ల ఈ రిస్క్ తగ్గుతుంది.
ఫామిలీ ప్లానింగ్ (ట్యూబెక్టమీ) ఆపరేషన్, గర్భ కోశాన్ని తొలగించే హిస్టిరెక్టమీ ఆపరేషన్, తర్వాత కూడా ఈ రిస్క్ తగ్గుతుంది.
హార్మోన్ రీప్లేస్ మెంట్ వాడని స్త్రీలలోను, పొగ త్రాగని వారికీ, సరైన బరువు మెయింటైన్ చేసే స్త్రీలలో ఈ రిస్క్ తక్కువగా వుంటుంది.

ఫొటో సోర్స్, BSIP/gettyimages
జీవన ప్రమాణాన్ని ఇలా అంచనా వేస్తారు
కేన్సర్ సోకిన తర్వాత, లేదా చికిత్స తర్వాత తదుపరి అయిదు సంవత్సరాల రోగి జీవన ప్రమాణం ఎలా వుంటుందో అంచనా వేయడాన్ని 5 year survival rate అంటారు.
తొలి దశలోని అండాశయ కేన్సర్ కు 5 year survival rate 70 శాతం ఉండగా, చివరి దశకు చేరుకున్న కేన్సర్ రోగులకు కేవలం 15 శాతం మాత్రమే వుంటుంది.
అండాశయ కాన్సర్ కు 5 year survival rate తక్కువ. ఎందుకంటే చాలా తరచుగా ఇది స్టేజ్ III లేదా IV లో నిర్ధరణ అవుతుంది.
ప్రారంభ దశలో కచ్చితమైన లక్షణాలు లేకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి.
వ్యాధి రాబోయేముందు అంచనా వేయడానికి, తొలి దశలోనే నిర్ధారించడానికి సమర్థవంతమైన స్క్రీనింగ్ పరీక్షలు లేవు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు.
అండాశయ కేన్సర్ కు చికిత్స ఏమిటి?
కేన్సర్ యొక్క దశననుసరించి, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు.
ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లయితే విజయవంతమైన చికిత్సకు మంచి అవకాశం ఉంది.
ఎక్కువ మంది మహిళలకు శస్త్రచికిత్స అవసరం. శస్త్రచికిత్సలో సాధారణంగా అండాశయాలు మరియు ఫెలోపియన్ ట్యూబులను గర్భాశయాన్ని, మరియు పొత్తికడుపులోని కొవ్వు కణజాల పొరను (omentum) (omentectomy) తొలిగిస్తారు.
కటి లేదా ఉదరం యొక్క ఇతర ప్రాంతాలకు క్యాన్సర్ వ్యాపించి ఉంటే, శస్త్రచికిత్స ద్వారా సాధ్యమైనంతవరకు క్యాన్సర్‌ను తొలగిస్తారు. ఆ తర్వాత కూడా మీ శరీరంలో కేన్సర్ కణాలు మిగిలి ఉంటే, కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు.
అపోహలు, వాస్తవాలు
అపోహ : ఇది బాగా వయసు మీరిన వారికి మాత్రమే వస్తుంది.
వాస్తవం: నిజం కాదు. అండాశయ కేన్సర్ ఉన్న మహిళల్లో 20% మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
అపోహ : గర్భాశయం తీసివేసే సర్జరీ (Hysterectomy) చేయించుకుంటే, అండాశయ కాన్సర్ రాకుండా నివారించవచ్చు.
వాస్తవం: గర్భాశయ గొట్టాలు మరియు అండాశయాలను తొలగించడం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 95% తగ్గిస్తుంది, కాని అండాశయ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి ఇంకా 5% అవకాశం ఉంది. పెరిటోనియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
అపోహ: పాప్ స్మియర్ (Pap smear) అండాశయ క్యాన్సర్‌ను గుర్తించగలదు.
వాస్తవం: తప్పు. అండాశయ క్యాన్సర్‌కు రొటీన్ స్క్రీనింగ్ పరీక్ష లేదు.
(Pap smear: గర్భకోశ కింది భాగం (cervix) నుండి కణాలను సేకరించి కాన్సర్ కణాలను గుర్తించే పరీక్ష )
అపోహ: ఇది ప్రారంభ దశలో సులభంగా కనుగొనబడుతుంది.
వాస్తవం: అండాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో silent disease. ఇప్రారంభ దశలో కడుపు వుబ్బరం, కడుపు నొప్పి, త్వరగా ఆకలి తీరిపోవడం వంటి అస్పష్టమైన లక్షణాలుంటాయి.
(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)
ఇవి కూడా చదవండి:
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








