చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు

ఆర్కడీ వోర్కోవిచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్కడీ వోర్కోవిచ్
    • రచయిత, సుశాన్ నినాన్
    • హోదా, స్పోర్ట్స్ రైటర్

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులోని మహాబలిపురం.. రష్యా-యుక్రెయిన్ మధ్య పోరుకు వేదికకానుంది.

త్వరలో ఇక్కడ జరుగబోయే చెస్ ఒలింపియాడ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ చీఫ్ (ఫ్రెంచ్ సంక్షిప్త నామం FIDE)ను కూడా ఎన్నుకోబోతున్నారు. దీని కోసం 180 దేశాలు ఓటింగ్‌లో పాలుపంచుకోబోతున్నాయి.

ఈ రేసులో ఆర్కడీ వోర్కోవిచ్ ముందంజలో ఉన్నారు. రష్యా ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆర్కడీ ప్రస్తుతం ఎఫ్ఐడీఈగా కొనసాగుతున్నారు. ఆయన మరోసారి ఈ పదవికి ఎన్నికయ్యేందుకు పోటీ చేస్తున్నారు.

ఆయనపై పోటీ చేయబోతున్నట్లు యుక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రేయీ బరీష్‌పోలెట్స్ గత మే నెలలో ప్రకటించారు.

ప్రస్తుతం ఈ రేసులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుత ఎఫ్ఐడీఈ ఉపాధ్యక్షుడు బఛర్ కౌట్లీ (సిరియా), ఇనాల్‌బెక్ చెరిపోవ్ (బెల్జియం) కూడా ఈ పదవికి పోటీ చేస్తున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి ఇప్పటికే నాలుగు నెలలు గడిచింది. ఆ తర్వాత చాలా అంతర్జాతీయ వేదికలపై రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి నడుమ కష్ట సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, చెస్ క్యాలెండర్‌లో అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకోవడం లాంటి చర్యలతో మళ్లీ తాను గెలుస్తానని ఆర్కడీ భావిస్తున్నారు.

అయితే, ఎప్పటి నుంచో చెస్‌ను రష్యా నియంత్రిస్తోందని, ఇప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు సమయం వచ్చిందని ఆయన ప్రత్యర్థులు చెబుతున్నారు.

విశ్వనాథన్ ఆనంద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశ్వనాథన్ ఆనంద్

భారత్‌ కూడా..

రష్యా-యుక్రెయిన్‌ల మధ్య పోటీతోపాటు మరో ఆసక్తికర ఘట్టానికి ఆగస్టు 7 వేదిక కానుంది.

తనతోపాటు, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచిన, భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్‌ను ఆర్కడీ డిప్యూటీ ప్రెసిడెంట్‌ పదవికి ఎంచుకున్నారు.

విశ్వనాథన్ ఆనంద్‌కు పోటీగా యుక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ మాజీ కోచ్ పీటర్ హీన్ నీల్సన్ ఉన్నారు.

ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు నీల్సన్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2007 నుంచి 2012 మధ్య ఆనంద్‌కు కూడా నీల్సన్ ట్రైనింగ్ ఇచ్చారు.

ఎఫ్ఐడీఈని తీవ్రంగా విమర్శించేవారిలో నీల్సన్ ఒకరు. ఎఫ్ఐడీఈ నిధుల్లో పారదర్శకత, రష్యా చెస్ ఫెడరేషన్‌లో ప్రభుత్వ అధికారుల జోక్యం తదితర అంశాలపై ఆయన తరచూ మాట్లాడుతుంటారు.

‘‘మా పోరాటం ఆర్కడీ మీద కాదు. ఎఫ్ఐడీఈపై రష్యా ప్రభుత్వ పట్టును మేం వ్యతిరేకిస్తున్నాం’’అని బీబీసీతో నీల్సన్ చెప్పారు. గత నాలుగేళ్లలో 20 ప్రధాన చెస్ ఛాంపియన్‌షిప్‌లలో 11 రష్యాలోనే జరిగాయని ఆయన వివరించారు.

‘‘రష్యా నుంచి దూరం జరగాలని చెస్ నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ ఛాంపియన్‌షిప్‌లపై రష్యా ప్రభావం ఉండకూడదు. తాజా ఎన్నికలతో దీనిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నాం. మేం చాలా ఆశాభావంతో ఉన్నాం’’అని ఆయన అన్నారు.

యుక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రేయీ బరీష్‌పోలెట్స్

ఫొటో సోర్స్, Andrii Baryshpolets/Facebook

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రేయీ బరీష్‌పోలెట్స్

ఆర్కడీకి ముందుగా రష్యా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కిర్సాన్ ఇల్యుమ్‌హినోవ్.. ఎఫ్ఐడీఈ అధ్యక్షుడిగా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంపూర్ణ మద్దతు ఉండేది. కిర్సాన్ హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఆర్కడీ హయాంలో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని ఆనంద్ భావిస్తున్నారు.

తన మూడు దశాబ్దాల చెస్ ప్రస్థానంలో చెస్ రాజకీయాలకు ఆనంద్ దూరంగా ఉన్నారు. 1990ల్లో గ్యారీ కస్పారోవ్, నీజెల్ షార్ట్‌లు.. ఎఫ్ఐడీఈపై తిరుబాటుచేసి వేరే సంస్థను పెట్టినప్పుడు కూడా.. ఎఫ్ఐడీఈ వెంటనే ఆనంద్ ఉన్నారు.

తనకు రాజకీయాలు సరిపడవని మొదట్నుంచీ ఆనంద్ భావించేవారు. వాటిలో జోక్యం చేసుకుంటే తన ఆట దెబ్బతింటుందని ఆయన చెప్పేవారు.

అయితే, ఇప్పుడు ఆనంద్‌కు 57ఏళ్లు. చురుగ్గానే చెస్ ఆడుతున్నప్పటికీ, ఇప్పుడు ఆయన చెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు.

పీటర్ నీల్సన్ (కుడి), మాగ్నస్ కార్ల్‌సన్

ఫొటో సోర్స్, Peter Heine Nielsen/Facebook

ఫొటో క్యాప్షన్, పీటర్ నీల్సన్ (కుడి), మాగ్నస్ కార్ల్‌సన్

తెలివైన నిర్ణయం..

ఆనంద్‌ను తన డిప్యూటీగా ఎంచుకొని ఆర్కడీ తెలివైన నిర్ణయం తీసుకున్నారని నిపుణులు అంటున్నారు.

‘‘చెస్‌లో ఆనంద్‌కు మంచి పేరుంది. ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాలుంపచుకోవడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు’’అని నీల్సన్ కూడా అన్నారు.

‘‘ఆయన గేమ్‌ను ప్రోత్సహించడం బావుంది. కానీ, రష్యాతో చేతులు కలపడమే విచారకరం’’అని ఆయన వ్యఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, కిదాంబి శ్రీకాంత్ గురించి ఆయన తల్లిదండ్రులు ఏమన్నారంటే..

ఆర్నడీకి టెక్నోక్రాట్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా మంచి పేరుతంది. 2018‌లో ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిచ్చినప్పుడు ఆర్గనైజింగ్ కమిటీకి ఆయన నేతృత్వం వహించారు.

ఆర్కడీకి మంచి పేరు ఉన్నప్పటికీ, యుక్రెయిన్‌తో యుద్ధం నడుమ ఆయనపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి ఒత్తిడి..

యుద్ధం వల్ల రష్యా ప్రయోజనాలను పరిరక్షించాలని తనపై ఒత్తిడి వస్తున్నట్లు చెస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్కడీ చెప్పారు.

అయితే, యుద్ధం నడుమ ఆయన కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని రష్యన్ సంస్థలతో ఒప్పందాలను ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

‘‘ఆర్కడీ ఇటీవల కాలంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా ప్రభావం తనపై లేకుండా స్వతంత్రంగా ఎలా పనిచేయొచ్చో ఆయన నిరూపించారు’’అని ఆనంద్ చెప్పారు. ‘‘ఒక రష్యన్‌లా కాకుండా ఎఫ్ఐడీఈ అధ్యక్షుడిగా ఆయన నడుచుకున్నారు’’అని ఆనంద్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆర్కడీ మెరుగ్గా పనిచేస్తున్నారని ప్రపంచ ఐదో నంబరు ప్లేయర్ లెవోన్ అరోనియన్ కూడా అంగీకరించారు.

వీడియో క్యాప్షన్, సంప్రదాయ కట్టుబాట్లను ఎదుర్కొని బంగారు పతకాలతో రాణిస్తోన్న రెజ్లర్ సనోఫర్ పఠాన్

‘‘ఇదివరకు ఎఫ్ఐడీఈ అధ్యక్షులు.. ప్లేయర్లు పట్టించుకొనేవారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దీన్ని చాలా మంది ప్లేయర్లు అంగీకరిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నడుమ కూడా చాలా టోర్నమెంట్లు నిర్వహించారు’’అని ఆయన అన్నారు. అయితే, ఆర్థిక విషయాల్లో మరింత పారదర్శకత పాటించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఒలింపియాడ్‌ను మెగా ఈవెంట్‌గా మార్చేందుకు భారత్ చాలా శ్రమిస్తోంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన రిలే టార్చిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్కడీ కూడా హాజరయ్యారు. 75 పట్టణాల్లో తిరిగిన అనంతరం ఈ టార్చ్ చివరగా మహాబలిపురానికి చేరుకుంటుంది.

ఆసియాలో ఒలింపియాడ్ నిర్వహించడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. భారత్‌లోనూ నిర్వహించడం ఇదే తొలిసారి.

(సుశాన్.. బెంగళూరుకు చెందిన ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్టు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)