గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి, అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లడం లేదు?

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FACEBOOK
- రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్రలో గుజరాత్ లేదు. 150 రోజుల పాటు సాగే భారత్ జోడో యాత్రలో గుజరాత్ కూడా ఉండి ఉంటే ఎలా ఉండేదనే ప్రశ్నలు పుడుతున్నాయి.
అయితే, గుజరాత్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రను మధ్యలో వదిలిపెట్టి రాహుల్ ఒకటి రెండు రోజుల కోసం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం కోసం రావచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ పర్యటనలో గుజరాత్ పై ఎంత వరకు దృష్టి సారించగలరన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర జనవరి చివరి నాటికి శ్రీ నగర్ చేరుతుంది.
గుజరాత్‌తో పాటు ఎన్నికలకు సిద్ధమవుతున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా రాహుల్ పర్యటించడం లేదు.
మరోవైపు, గుజరాత్‌లో కొత్తగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 182 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపుతోంది. గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కనిపించటం లేదని పలువురు అంటున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం గుజరాత్‌కు తరచుగా విచ్చేస్తూ, ఎన్నికల హామీలు కూడా చేస్తున్నారు.
మరోవైపు గుజరాత్ కాంగ్రెస్ నాయకుల జాడ ఎక్కడా కనిపించడం లేదు. వారెటువంటి బహిరంగ సమావేశాలు కూడా నిర్వహించడం లేదు.
భారత్ జోడో యాత్ర మాదిరిగా వచ్చే ఏడాది గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరొక యాత్రను నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ, అప్పటికి గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి.

ఫొటో సోర్స్, INC India
అవకాశాన్ని విడిచిపెట్టిన కాంగ్రెస్
"ప్రజలతో సంబంధాలు ఏర్పర్చుకునేందుకు ఇలాంటి యాత్రలు చాలా అవసరం. దేశంలో ఇలాంటి చాలా యాత్రలు విజయవంతంగా జరిగాయి. రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర కూడా మంచి ఫలితాలను ఇవ్వొచ్చు" అని ‘ది హిందూ’ సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్త అన్నారు.
గుజరాత్ ను ఈ యాత్రలో చేర్చకపోవడం గురించి మాట్లాడుతూ, "గుజరాత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల పై ఆసక్తిని కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, ప్రజలతో మమేకమయ్యే పనిని 2017 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మొదలుపెట్టాల్సింది. కానీ, అటువంటి పనులను చేస్తున్నట్లు కనిపించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించేలా కనిపించటం లేదు. ఇందుకు రాహుల్ గాంధీని ఒక్కరినే బాధ్యులను చేయలేం" అని అన్నారు.
2022 గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఇప్పటి వరకు గుజరాత్ లో మూడు కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయన సోమ్‌నాథ్ లో ఉద్యమకారులతో సమావేశం, దహోద్‌లోని ఆదివాసీలతో, అహ్మదాబాద్‌లోని నదీ తీరం దగ్గర బూత్ స్థాయి కార్యకర్తలతో బహిరంగ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల తర్వాత ఆయన భారత్ జోడో యాత్ర పై దృష్టి సారించారు.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ సవాలు విసురుతోంది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వెనక్కి తగ్గితే ఆ ఓట్లను ఆప్ చేజిక్కించుకునే అవకాశముంది.

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FACEBOOK
"యాత్ర ఎన్నికలకు సంబంధించింది కాదు"
భారత్ జోడో యాత్రలో గుజరాత్‌ను చేర్చకపోవడం గురించి రాజకీయ విశ్లేషకుడు, ఎం.ఎస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా బీబీసీతో మాట్లాడారు.
"గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ యాత్రలో గుజరాత్ ను కూడా చేర్చి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చి ఉండేది. కానీ, భారీ సంఖ్యలో జనాలను సమీకరించడం గుజరాత్ కాంగ్రెస్ వర్గాలకు ఎప్పుడూ చాలా కష్టమైన పనే.
ఇదొక పెద్ద సవాలుతో కూడుకున్న పని. తమిళనాడు, కేరళలో ఈ యాత్రకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. గుజరాత్ లో యాత్రలకు వచ్చే వారి సంఖ్య తగ్గితే, అది ఓటర్లకు తప్పుడు సందేశాలను పంపిస్తుంది. అందుకే కాంగ్రెస్ ఈ యాత్రలో గుజరాత్ ను చేర్చి ఉండదు" అని అన్నారు.
చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. భారత్ జోడో యాత్రలో గుజరాత్‌ను చేర్చి ఉంటే ఎలా ఉండేది?
ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగించేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు బీబీసీ కొంత మంది కాంగ్రెస్ నేతలతో మాట్లాడింది.

జోడో యాత్ర ప్రయాణ మార్గంలో గుజరాత్‌ను చేర్చేందుకు వీలుగా లేదు. భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ప్రజలను కలిసి వారితో మాట్లాడటం అని సీనియర్ కాంగ్రెస్ నేత దీపక్ బాబరీయా చెప్పారు.
ఈ యాత్రలో గుజరాత్ నుంచి కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోయల్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కానీ, గుజరాత్ నుంచి వేరే నాయకులెవరూ ఈ యాత్రలో పాల్గొనడం లేదు.
"ఈ యాత్రకు ఎన్నికల ప్రచారానికి సంబంధం లేదని మేం ముందుగానే స్పష్టం చేసాం. అలా చేస్తే, ఈ యాత్ర ముఖ్యోద్దేశ్యం నాశనమవుతుంది. ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదు" అని గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ భాయ్ మోద్ వాడియా అన్నారు.
‘‘ఈ యాత్ర ఉద్దేశ్యం ప్రజల మధ్య చర్చలు జరిగేలా చూడటం కానీ, ఎన్నికలు కాదు. ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ దగ్గర మరో ప్రణాళిక ఉంటుంది. దానిని కూడా అమలు చేస్తాం" అని గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిజే చావ్డా చెప్పారు.
భారత్ జోడో యాత్ర తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా సాగి ఉత్తరభారతం చేరుతుంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో కూడా యాత్ర సాగుతుంది.
జనవరిలో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













