Vijayawada: Sri Chaitanya కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని లెక్చరర్ ఒకరు కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. విద్యార్థిని చెంపలపైన, తలపైన కొడుతూ, కాలితో తన్నుతూ లెక్చరర్ దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
విద్యార్థిని లెక్చరర్ విచక్షణారహితంగా కొట్టడాన్ని కొందరు తప్పుబట్టారు. లెక్చరర్ అదుపు తప్పి వ్యవహరించారంటూ విమర్శించారు. అదే సమయంలో కాలేజీలలో విద్యార్థుల తీరు మీద మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. లెక్చరర్లు అదుపు చేయకపోతే ఎలా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు కూడా స్పందించారు. ఫిర్యాదులు లేకపోయినా వీడియో ఆధారంగా విచారణ జరిపారు. లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
కాలేజీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి..
ఇటు ఇంటర్ బోర్డు కూడా స్పందించి విజయవాడ శ్రీ చైతన్య కాలేజీ భాస్కర్ భవన్ క్యాంపస్‌కు నోటీసు పంపింది.
కాలేజీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లో చెప్పాలని ఆ నోటీసులో పేర్కొంది.
దాడి చేసిన లెక్చరర్ వివరాలు సేకరించామని, ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ విద్యామండలి జాయింట్ సెక్రటరీ కృష్ణారావు పేర్కొన్నారు.
మరోవైపు, విద్యార్థిపై దాడి చేసిన కేసులో పటమట పోలీస్ స్టేషన్‌లో లెక్చరర్ పై కేసు నమోదైంది. కాలేజ్ ప్రిన్సిపాల్ శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లెక్చరర్ రవి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వీడియోలో ఏముంది?
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నడుస్తున్న శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి మీద సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నాడు లెక్చరర్ దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు సెప్టెంబర్ 16వ తేదీ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విద్యార్థి రెండు చెంపలపై కొట్టిన లెక్చరర్ ఆ తర్వాత కాలితో తన్నుతున్న కొద్ది సెకన్ల వీడియో చర్చనీయాంశమయ్యింది.
అదే క్లాసులోని మరో విద్యార్థి ఈ వీడియోను రికార్డ్ చేయగా, అది విస్తృతంగా షేర్ అయ్యింది.
ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కాలేజీ వద్ద ఆందోళనలకు సిద్ధమయ్యాయి.

అధికారుల విచారణ
విద్యార్థిపై లెక్చరర్ దాడి దృశ్యాలు తమ దృష్టికి రావడంతో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా చైల్డ్ లైన్ సిబ్బంది కూడా స్పందించారు.
కాలేజీలో శుక్రవారం విచారణ జరిపారు. లెక్చరర్ తో పాటుగా విద్యార్థితోనూ మాట్లాడారు. విద్యార్థి తల్లిదండ్రులను కూడా పిలిచి మాట్లాడారు. అయితే తాము ఫిర్యాదు చేయబోమని తల్లిదండ్రులు చెప్పడంతో అధికారులు కూడా కఠిన చర్యలకు అవకాశం లేదని చెబుతున్నారు.
"వీడియో మా దృష్టికి రాగానే స్పందించాము. కాలేజీకి వెళ్లాము. విచారణ జరిపాము. పరిస్థితులను పరిశీలించాము. లెక్చరర్ తన వాదన వినిపించారు. ప్రతీరోజూ కాలేజీలో క్లాసుల నిర్వహణకు ఆ విద్యార్థి ఆటంకంగా మారుతున్నారని తెలిపారు. దానికి తగిన చర్యలు తీసుకోవాలే గానీ కాలితో తన్నడం వంటివి తగవని స్పష్టం చేశాము. తక్షణం ఆ లెక్చరర్ ని విధుల నుంచి తొలగించాలని కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చాము. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. దాంతో లెక్చరర్ పై చర్యలు తీసుకున్నాము. తదుపరి ఇలాంటి పరిణామాలు పునరావృతమయితే కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాము" అంటూ ఆర్ఐఓ రవి కుమార్ మీడియాకు తెలిపారు.
వరుసగా పలు విద్యాసంస్థల్లో సిబ్బంది సహనం కోల్పోతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమని తెలిపారు.

విద్యార్థులు ఏమంటున్నారు?
అదే క్యాంపస్ కి చెందిన కొందరు విద్యార్థులతో బీబీసీ మాట్లాడింది. వీడియోలో ఉన్న ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"ఆ అబ్బాయి కాలేజీలో క్రమశిక్షణ పాటించడు. ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. దానికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా అదే పని చేశాడు. దాంతో లెక్చరర్ అతిగా స్పందించారు. తన మాట వినడం లేదనే ఆగ్రహంతో రెచ్చిపోయారు" అంటూ ఒక విద్యార్థి తెలిపారు.
కొందరు విద్యార్థులు మాత్రం లెక్చరర్ తీరుని తప్పుబట్టారు.
"ఆయన చాలాసార్లు ఇలానే స్పందిస్తారు. కోపంతో ఊగిపోతారు. ప్రిన్సిపాల్ కి చెప్పినా మార్పురాలేదు. ఇంటర్ రెండో సంవత్సరం పిల్లలతో ఎలా ఉండాలన్నది ఆయనకు అర్థం కాదు. మాలో చాలామందిని ఆయన చిన్న చిన్న కారణాలతోనే తీవ్రంగా దూషించడం, కొట్టడం జరిగింది. అలాంటివి అదుపు చేయాలి" అని మరొక విద్యార్థిని తెలిపింది.
క్రమశిక్షణలో పెట్టేందుకు చేసే ప్రయత్నంలోనే..
వీడియోలో ఉన్న లెక్చరర్ ని ఉన్నతాధికారుల ఆదేశాలతో విధుల నుంచి పక్కన పెట్టినట్టు శ్రీ చైతన్య యాజమాన్యం వెల్లడించింది.
అయితే విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు అదుపు తప్పుతున్నప్పటికీ కఠినంగా లేకపోతే పిల్లలు నిబంధనలు పాటించడం లేదని కాలేజీ అడ్మిన్ విభాగంలో పనిచేసే పి రమేష్ అన్నారు.
"విద్యార్థులను ఎంతగా దారిలో పెట్టాలని ప్రయత్నించినా కొందరు సహకరించరు. పైగా వారి వల్ల మొత్తం క్లాసు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ, పక్క వారిని డిస్టర్బ్ చేస్తున్న ధోరణిని లెక్చరర్ అడ్డుకోవడం ఇంత పెద్ద వివాదానికి కారణం. అయినా లెక్చరర్ సహనం కోల్పోయి ఉండకూడదు. అందుకే విధుల నుంచి తొలగించారు. భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని అందరికీ తెలిపాము" అని ఆయన బీబీసీకి వివరించారు.
కాలేజీలో నిబంధనలకు అనుగుణగా వివిధ కమిటీలు పనిచేస్తున్నాయని రమేష్ చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ పై గతంలోనే ఫిర్యాదు వచ్చినప్పుడు అదుపు చేశామని అన్నారు. విద్యార్థులతో పాటుగా సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించి, కళాశాలలో సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయడం ద్వారానే మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.
ఘటనపై స్పందించేందుకు లెక్చరర్ గానీ, విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపలేదు. జరిగింది మరచిపోయి, మళ్లీ యధావిధిగా కాలేజీకి వెళ్లి చదువుకోవాలని తమ పిల్లాడికి చెప్పినట్టు తల్లిదండ్రులు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?
- నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చీతాలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














