Periods : నెలసరి సమయంలో నొప్పిపై ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు అవసరం లేదు?

నెలసరి నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ న్యూస్
    • హోదా, ముండో

మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది.

సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు.

పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు. లేదంటే తీవ్రంగా, బాధాకరంగా తెరలు తెరలుగా వచ్చి పోతుండవచ్చు.

ఈ సమయంలో మహిళలకు తలనొప్పి, వాంతులు అవుతున్నట్లుగా ఉండటం, విరేచనాలు కూడా రావచ్చు.

వాస్తవమేమిటంటే.. పీరియడ్ సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటుంది. చాలా తేడాలు ఉంటాయి. శరీరంలో నొప్పి కచ్చితంగా ఎక్కడ పుడుతోంది అనే దగ్గరి నుంచి.. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అనే దాని వరకూ ఈ తేడాలు ఉంటాయి.

రుతుస్రావం

ఫొటో సోర్స్, iStock

నెలసరి సమయంలో నొప్పి ఎందుకు పుడుతుంది?

''మహిళల్లో 30 నుంచి 50 శాతం మంది వరకూ పీరియడ్లు నొప్పిగా, బాధాకరంగా ఉంటాయి. కొందరికి నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. అది వారి జీవితాల మీద కూడా ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ కేటీ విన్సెంట్ బీబీసీతో చెప్పారు.

ఆమె ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన నుఫీల్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్‌ విభాగంలో.. నొప్పి మీద పరిశోధన చేస్తున్నారు.

''నెలసరి వచ్చినపుడు.. రక్తం బయటకు వెళ్లటానికి వీలుగా గర్భసంచి కుచించుకుపోతుంది'' అని ఆమె తెలిపారు.

నెలసరి సమయంలో చాలా మంట, వాపు కూడా ఉంటుంది.

గర్భసంచి కణజాలం నొప్పిని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. అదే సమయంలో శరీరం ప్రొస్టాగ్లాండైన్లను ఉత్పత్తి చేస్తుంది. పీరియడ్ సమయంలో వీటి ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది.

శరీర కణాల్లో ఉత్పత్తయ్యే ప్రోస్టాగ్లాండైన్లు కొవ్వు సమ్మేళనాలు. ఇవి శరీరంలో అనేక రకాల పనులు చేస్తాయి.

ఉదాహరణకు.. నెలసరి సమయంలో గర్భసంచి కండరాలు సంకోచించేలా చేస్తాయి. దానికి ప్రతిస్పందనగా కలిగే నొప్పి వెనుకా వీటి పాత్ర ఉంటుంది.

వీడియో క్యాప్షన్, శరీరానికి తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి?

ప్రొస్టోగ్లాండైన్లు అనేవి హార్మోన్లు కావు. అయితే అవి పని చేసే తీరును బట్టి హార్మోన్లతో వీటికి సంబంధం ఉంటుంది.

''నెలసరి సమయంలో మంట, నొప్పి పెరగటానికి కారణాల్లో ప్రొస్టోగ్లాండైన్ల పాత్ర కూడా ఉంటుందని మేం కచ్చితంగా భావిస్తున్నాం'' అని డాక్టర్ కేటీ పేర్కొన్నారు.

అయితే.. ఈ మంట వల్ల, అది కలిగించే నొప్పి వల్ల ప్రయోజనం ఏమిటి?

''ఈ మంటలో సానుకూలమైన అంశం కూడా ఉంది. మనకు గాయమైనప్పుడు కణజాలం బాగయ్యే ప్రక్రియ మొదలై అది మంట పుడుతుంది. ఆ గాయం నొప్పిని పుట్టిస్తోందంటే, అది నయమయ్యే వరకూ ఆ కణజాలాన్ని రక్షించాలని మనకు తెలియజేయటం'' అని డాక్టర్ కేటీ వివరించారు.

శరీరం తనకు తాను మరమ్మతు చేసుకోవటానికి వీలు కల్పించే ప్రక్రియ అది.

అలాగే.. నెలసరి సమయంలో కూడా గర్భసంచి లోపలి పొర సక్రమంగా నయమయ్యేలా సాయపడటానికి, రుతుస్రావాలు గర్భసంచి నుంచి పూర్తిగా బయటకు వెళ్లిపోయేలా చూడటానికి ప్రొస్టాగ్లాండైన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రొస్టాగ్లాండైన్ల వల్ల కండరాలు బిగుసుకుపోవటం, నొప్పి పుట్టటం జరుగుతుంది.

అయితే.. ఈ ప్రక్రియ అధిక మోతాదులో జరిగినపుడు సమస్య తలెత్తుతుంది.

నెలసరి నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

నెలసరి నొప్పి గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి?

నెలసరి సమయంలో నొప్పిని చవిచూసే మహిళలు చాలా మందికి.. పెయిన్ రిలీవర్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీలు వంటి ఔషధాల ద్వారా ఉపశమనం లభిస్తుంది.

అయితే కొన్ని కేసుల్లో.. అంతర్లీనంగా ఉన్న అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా ఈ నొప్పి కలుగవచ్చు.

అలాంటి ఒక అనారోగ్య పరిస్థితి 'యుటెరిన్ ఫైబ్రాయిడ్స్'. అంటే గర్భాశయంలో కణుతులు లేదా గడ్డలు.

గర్భసంచి లోపల కానీ, దాని చుట్టూ కానీ పెరిగే ఈ కణుతులు క్యాన్సర్‌ను కలిగించవు. కానీ వీటివల్ల నెలసరి తీవ్రంగా, బాధాకరంగా ఉండొచ్చు.

నెలసరి నొప్పి.. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) వల్ల కూడా కలగవచ్చు. గర్భసంచి, అండవాహక నాళాలు, బీజకోశాలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవటానని పీఐడీ అంటారు.

క్లమీడియా, గనేరియా వంటి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల వల్ల సోకిన బ్యాక్టీరియా సాధారణంగా ఈ పీఐడీకి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లు ఉన్న వారితో అసురక్షిత లైంగిక చర్య వల్ల కూడా పీఐడీ సంక్రమించవచ్చు.

గర్భనిరోధం కోసం ఉపయోగించే ఇంట్రాయుటెరైన్ డివైజ్ (గర్భసంచి లోపల ఉంచిన పరికరం) వల్ల కూడా నెలసరి నొప్పి రావచ్చు.

అయితే.. నెలసరి నొప్పికి అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఎండోమెట్రియోసిస్.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

నెలసరి సమయంలో నొప్పికి కారణాలు

  • ఎండోమెట్రియోసిస్
  • మయోమాస్
  • కాపర్‌తో చేసిన ఇంట్రాయుటెరైన్ డివైజ్
  • పెల్విక్ ఇన్‌ప్లమేటరీ డిసీజ్ (పీఐడీ)
  • ప్రిమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్)
  • లైంగికంగా సంక్రిమించిన ఇన్‌ఫెక్షన్

ఆధారం: యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)

line
ఎండోమెట్రయోసిస్

ఫొటో సోర్స్, Getty Images

ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?

''గర్భసంచి లోపలి పొరను ఎండోమెట్రియం అంటారు. ఆ లోపలి పొరకు సంబంధించిన కణజాలం.. గర్భసంచి వెలుపల ఉండటం.. అంటే అండాశయం మీద, ట్యూబుల మీద, మూత్రసంచి మీద, పేగుల మీద ఎక్కడైనా ఉండటాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు'' అని ప్రొఫెసర్ ఆండ్రూ హోర్న్ బీబీసీకి వివరించారు.

స్కాట్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరోలో గైనకాలజీ అండ్ రీప్రొడక్టవ్ సైన్స్ ప్రొఫెసర్ అయిన ఆండ్రూ.. ఎండోమెట్రియోసిస్ కారణాల మీద పరిశోధన చేస్తున్నారు.

ఈ జబ్బు దాదాపు 6 శాతం నుంచి 10 శాతం మహిళల మీద ప్రభావం చూపుతోంది. నెలసరి సమయంలో నొప్పిని కలిగించటంతో పాటు.. గర్భధారణ సమస్యలు, గర్భం పూర్తి కాలం కొనసాగటంలో సమస్యలను కూడా కలిగించవచ్చు.

వీడియో క్యాప్షన్, ఎండోమెట్రియాసిస్

ఎండోమెట్రియోసిస్‌కు కారణం ఏమిటనేది ఇంకా కచ్చితంగా తెలీదు. కానీ ఈ సమస్యతో బాధపడే మహిళల మీద ఇది తీవ్ర ప్రభావం చూపగలదు.

''ఎండోమెట్రియోసిస్ చూపగల ప్రభావాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఈ జబ్బు ఉన్న వాళ్లకి అది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. కానీ ఈ జబ్బు ఎందుకు నొప్పి కలిగిస్తుంది అనే దానిపై మనకు తెలిసింది చాలా పరిమితమే'' అంటారు ఆండ్రూ హోర్న్.

ఈ జబ్బుతో బాధపడే మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి.. ఈ జబ్బును వైద్య పరీక్షల్లో గుర్తించటమని ఆమె వివరించారు.

''ఎండోమెట్రియోసిస్ లక్షణాలను.. మామూలు నెలసరి నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు'' అని చెప్పారామె.

''అంతేకాదు.. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, మూత్రాశయ నొప్పి వంటి ఇతర జబ్బుల లక్షణాలు కూడా.. ఎండోమెడ్రియోసిస్ లక్షణాల్లాగే ఉంటాయి. కాబట్టి ఈ జబ్బును గుర్తించటం అంత సులభం కాదు'' అని వివరించారు.

నెలసరి నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు..

నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి అనేది ప్రధాన లక్షణం. అయితే.. నెలసరి లేని సమయంలో కూడా ఈ నొప్పి రావచ్చు. అంటే.. మలవిసర్జన సమయంలో, మూత్ర విసర్జన సమయంలో, లైంగిక చర్య సమయంలో కూడా పొత్తి కడుపు నొప్పి రావచ్చు.

అలాగే.. స్కాన్ చేయటం ద్వారా కానీ, రక్త పరీక్ష ద్వారా కానీ ఎండోమెట్రియోసిస్‌ను గుర్తించలేరు. ఈ జబ్బు ఉందని నిర్ధారించుకోవటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది లాప్రోస్కోపీ.

నిపుణుడైన సర్జన్ ఒక చిన్న సర్జరీ ద్వారా.. రోగి పొత్తికడుపు మీద చిన్న గాటు పెట్టి దానిద్వారా లాప్రోస్కోపును పంపించి ఎండోమెట్రియోసిస్ ఉన్నదేమో పరీక్షిస్తారు.

ఎండోమెట్రియోసిస్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. ఈ జబ్బు లక్షణాల నుంచి ఉపశమనం కలిగించటానికి మాత్రమే చికిత్సలు అందిస్తారు.

ఎండోమెట్రియల్ పెరుగుదలను సర్జరీ ద్వారా తొలగించవచ్చు. లేదంటే మొత్తం గర్భసంచిని తొలగించటానికి హిస్టరెక్టమీ చేయవచ్చు. అలాగే హార్మోన్ల చికిత్స కూడా ఉంది.

అయితే.. ఈ జబ్బుకు ఒక చికిత్సను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎండోమెట్రియోసిస్ పరిశోధన జరుగుతోంది. ఈ జబ్బును నయం చేసి, మహిళలకు నొప్పి నుంచి విముక్తి కలిగించే ఒక మందును లేదా చికిత్సను తయారు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)