శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?

ఇసకలపేట
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"మా పేట మీద చీమలు దాడి చేస్తున్నాయి. కాపాడండి. ఇప్పటికే చీమలు కుట్టడంతో పది మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. ఇలాగైతే మా పేట ఖాళీ చేసి పోవాల్సి వస్తుందనే భయంగా ఉంది"అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తమ గోడు చెప్పుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇసకలపేట గ్రామ వాసులు.

స్పీకర్ భార్య వాణియే ఈ గ్రామ సర్పంచ్. చీమల నుంచి కాపాడండి అంటూ అంతకు ముందు జిల్లా కలెక్టరుకు కూడా స్థానికులు విజ్ఞప్తులు చేశారు.

ఇంత భయపడే విధంగా చీమలు దాడి చేస్తాయా? వీటి దాడి ఎంత ప్రమాదకరం? ఇసకలపేటలోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశాలపై ఆ గ్రామస్థులతో, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, జూవాలజీ ప్రొఫెసర్లతో బీబీసీ మాట్లాడింది.

ఇసకలపేట

'చీమలు కుడితే ఆసుపత్రిలో చేరుతున్నాం... నవ్వుతున్నారు'

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండలం ఇసకలపేట గ్రామంలో చీమలు గత రెండు వారాలుగా దాడి చేస్తున్నాయంటూ ఆ గ్రామస్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. చీమల నుంచి తమని కాపాడాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

"ఊర్లలో సాధారణంగా కుక్కలు దాడి చేస్తుంటాయి. కొన్నిచోట్ల కోతులు దాడి చేస్తాయి. కానీ మా గ్రామంలో చీమలు దాడి చేస్తున్నాయి’’ అని ఇసకల పేట గ్రామ వాసి ఈశ్వరరావు బీబీసీతో చెప్పారు.

‘‘చీమలు కుట్టడంవల్ల 8 మంది ఇప్పటికే ఆసుపత్రిలో చేరారు. అందులో ఇద్దరు షుగర్ పేషెంట్లు ఉన్నారు. వారింకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. చీమలు కుడితే ఆసుపత్రిలో చేరామంటే ఎవరూ నమ్మడం లేదు. పైగా 'చీమలు కుట్టడమేంటి, ఆసుపత్రిలో చేరడమేంటి' అని నవ్వుతున్నారు. కానీ మా గ్రామం వచ్చి చూస్తే తెలుస్తుంది మా బాధేంటో’’ అని ఈశ్వరరావు వాపోయారు.

ఇసకలపేట

"చీమలపై 'స్పందన'లో ఫిర్యాదు చేశాం"

నాలుగు నెలల క్రితం కొద్దికొద్దిగా మొదలైన చీమల రాక ఇప్పుడు ఉధృతమైంది. ఆ గ్రామంలో లక్షల్లో అన్నీ వైపులా చీమలే కనిపిస్తున్నాయి. దారిలో, పొలంలో, ఇంట్లో, బడిలో అన్నీ చోట్ల చీమలే ఉండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

"ఇంటి నుంచి నాలుగు అడుగులు వేస్తే చీమలు కుడుతున్నాయి. టీ, కాఫీ తాగుతుంటే వాటిపై చీమలు పడుతున్నాయి. తినే అన్నంలో కూడా అంతే. ఇలాంటి కష్టం మేమెప్పుడూ పడలేదు. చీమలు కుట్టడంతో కొంత మందికి శరీరమంతా దద్దుర్లు ఎక్కేస్తున్నాయి. కొత్త రోగాలు వస్తున్నాయోమోనని భయంగా ఉంది. పిల్లలను ఆడుకోడానికి బయటకు పంపలేకపోతున్నాం. అందుకే ఊరోళ్లమంతా కలిసి కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమానికి వెళ్లి చీమల నుంచి మా గ్రామాన్ని కాపాడాలంటూ మా గోడు చెప్పుకున్నాం" అని చీమలతో ఇబ్బందులు పడ్డ ఇసకలపేట గ్రామవాసి వనజ బీబీసీతో చెప్పారు.

ఇసకలపేట

'ఇసకలపేటలోనే ఈ పరిస్థితి ఎందుకు?'

ఏ ఊర్లోనైనా, ఇంటిలోనైనా చీమలు కొద్దోగొప్పో కనిపిస్తుంటాయి. కానీ ఇలా ఊరంతా చీమలు నిండిపోయే పరిస్థితి ఇసకలపేట గ్రామంలో వచ్చింది. దీనికి కారణాలపై కాకతీయ యూనివర్సీటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారితో బీబీసీ మాట్లాడింది.

"చీమలు ఇంతలా దాడి చేయడం అరుదు. కానీ చీమల్లో ఉన్న అనేక రకాల్లో రెడ్ యాంట్స్‌కు మిగతా చీమల కంటే దాడి చేసే స్వభావం ఎక్కువ. ఎర్ర చీమలు ప్రమాదకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇసకలపేట పరిస్థితికి ప్రాథమికంగా ఆ గ్రామ సమీపంలో భారీగా ఉన్న చీమల గూళ్లు, పుట్టలను కదిలించడం కారణం కావచ్చు. అందువలన అవి గ్రామంలోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ నాగావళి నది పక్కన ఉండటంతో ఆ గ్రామ పరిసరాల్లో చెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంది. మా కాకతీయ యూనివర్సీటీ ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ కూడా ఎర్ర చీమలు చాలా ఎక్కువగా కనపడతాయి. తరుచూ పెస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కరం లభించవచ్చు" అని ప్రొఫెసర్ ఇస్తారి అన్నారు.

ఇసకలపేట

'ఇటుక బట్టీల కోసం ఊర్లోకి మట్టి తెస్తున్నారు'

''ఎరుపు రంగులో ఉండే ఈ చీమలు కుడుతున్నాయో, లేదో తెలియడం లేదు. కానీ శరీరంపైకి ఎగబాకిన తర్వాత, ఎగబాకిన చోట్ల ఎర్రగా మారిపోయి కందిపోయినట్లు అవుతోంది. వాటిని రుద్దినా, గీరినా ఉంటే రంధ్రాలు పడి పుళ్లు అయిపోతున్నాయి''అని ఇసకలపేట గ్రామ వాసులు చెప్పారు.

"ఊర్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో మట్టిని తీసుకుని వచ్చి ఊర్లో వేస్తున్నారు. ఆ మట్టితోనే చీమలు వస్తున్నాయి. కొద్ది కొద్దిగా వచ్చి అవి ఒకటికి రెండు జతైపోయి వందల్లో, వేలల్లోకి మారిపోతున్నాయి. దీంతో ఊర్లో పొలానికి కూడా వెళ్లడానికి జంకుతున్నాం. చీమలు కుట్టడంతోనే చిన్న చిన్న పొక్కులు ఏర్పడటం, వాటిని గోకితే పెద్దగా పుళ్లు అవ్వడం, ఆ తర్వాత కొన్ని సార్లు జ్వరాలు రావడం కూడా జరిగింది"అని రమణి చెప్పారు.

ఇసకలపేట

'చీమల దాడితో గ్రామంలో హెల్త్ క్యాంప్'

"చీమలు దాడి చేయడంతో గ్రామంలో 8 మంది ఆసుపత్రిలో చేరారు. అందులో నేను ఒక్కడిని. ఆరుగురు వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాం. మరో ఇద్దరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర స్పీకర్ నుంచి కలెక్టర్ వరకు అందరికి చెప్పాం. ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టారు" అని ఆసుపత్రిలో చికిత్స పొందిన గ్రామస్థుడు రాము చెప్పారు.

ఈ గ్రామం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం తొగరాం పంచాయతీ కిందకు వస్తుంది. స్పీకర్ భార్య వాణి ఈ గ్రామ సర్పంచ్. చీమల దాడి విషయంపై ఫిర్యాదు అందడంతో పంచాయితీ రాజ్ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి, ఊరంతా బ్లీచింగ్ చల్లి, చీమలను చంపే రసాయనాలను స్ప్రే చేశారు.

ఇసకలపేట

ఆ తర్వాత గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో చీమల సంచారం పెరగటానికి భౌగోళిక పరిస్థితులే అంటే నది పరివాహక ప్రాంతం కారణమన్న ప్రాథమిక అంచనాకు వచ్చారు.

"గ్రామం ద్వారా నాగావళి నది ప్రవహించడం, చెట్లు తుప్పలు తోటలు అధికంగా ఉండటం.. వల్ల చీమలకు ఈ ప్రాంతం అనువుగా ఉంది. దీంతో చీమలు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ఎంటమాలజీ (Entomology) నిపుణులతో మాట్లాడుతున్నాం. వైద్య శిబిరాలను మరికొన్ని రోజులు ఉంచుతాం" అని జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్ చెప్పారు.

"నాలుగు నెలల నుంచి ఈ చీమలు ఊరి బయట పుట్టల్లోనూ, చెట్లు వద్ద ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఇవి గ్రామంలోకి వచ్చేశాయి. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తే చాలు కుట్టే స్థాయిలో పెరిగాయి. చీమలు కుట్టడంతో వాటిని గోకగానే, అక్కడ పుళ్లు ఏర్పడి, రంధ్రాలుగా మారిపోతున్నాయి. అల్సర్ కాయల్లాగా కనిపిస్తున్నాయి. అయితే చీమల దాడి వలన ఇబ్బందే కానీ, ప్రమాదం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి కాస్త ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అంతే. కానీ ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన సమస్య కాదు" అని తొగరాం పీహెచ్‌సీ డాక్టర్ స్రవంతి చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

"చీమలతో పశువులకు కూడా కష్టమొచ్చింది'

ఇసకలపేట

ఈ చీమలను స్థానికులు అడవి చీమలు అని అంటున్నారు. సుమారు రెండేళ్ల నుంచి ఇవి క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు గమనించామని గ్రామానికి చెందిన ఆనందరావు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ఇలానే కొనసాగితే గ్రామాన్ని కూడా ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని అన్నారు.

చీమలతో ఇసకలపేట గ్రామ ప్రజలకే కాదు, పశువులకు కూడా కష్టమొచ్చిది. ఇవి పశువులను కూడా కుడుతున్నాయి. పైగా పశువులు తినే గడ్డిపై కూడా చీమలుండటంతో వాటిని తినడానికి పశువులు ఇష్టపడటం లేదు. దాంతో పశువులు బక్కచిక్కిపోతాయని భయంగా ఉందని గ్రామస్థులు చెప్తున్నారు. ఇల్లు ఊడ్చినా చీమలే వస్తున్నాయని వాపోతున్నారు. ఇంట్లో ఏదీ నిల్వ ఉంచుకోవడానికి వీలు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

వీడియో క్యాప్షన్, మధ్యప్రదేశ్: వీధిలోకి వచ్చి కంగారుపెట్టిన మొసలి

"ఒక్కొ మనిషికి పది లక్షల చీమలు"

ఇసకలపేటలో చీమలను సంహరించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందని ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి. మంజులత బీబీసీతో అన్నారు.

"ప్రపంచంలో 22 వేల రకాల దాకా చీమలున్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో ఉన్న చీమలన్నింటిని పంచితే ఒక్కో మనిషికి పది లక్షలు చీమల వంతున వస్తాయని అంచనా. చీమల్లో ఏదీ కూడా ఇప్పటిదాకా చేసిన పరిశోధనల ప్రకారం ప్రమాదకరం కాదు. అయితే, ఒక్కోసారి ఇసకలపేటలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది’’ అని ఆమె అన్నారు.

ఇసకలపేటలో ఎక్కువ చీమలుండటానికి ప్రత్యేకమైన కారణాలు కచ్చితంగా చెప్పలేకపోయినా, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అందుకు కారణం కావొచ్చని ప్రొఫెసర్ మంజులత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)