సోనాలీ ఫోగట్: టిక్‌టాక్ స్టార్ నుంచి గోవాలో అనుమానాస్పద మరణం వరకు...ఆమె జీవితంలో ఎన్ని మలుపులో...

ఫొటో సోర్స్, FB/SONALI
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించారు. సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లారని, అక్కడ గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఆమె మృతికి కచ్చితమైన కారణాలు తెలియవు.
ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఫొటోను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనాలి ఫోగట్ వార్తల్లోకి వచ్చారు. అయితే, ఆమె జీవితంలో ఇంకా ఎన్నో మలుపులు ఉన్నాయి.
టిక్‌టాక్, బీజేపీ, ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించడం, బిగ్‌బాస్ షో, ఆమె భర్త మరణానికి సంబంధించిన ప్రశ్నలు.. ఇలా ఎన్నో ఉన్నాయి.

ఫొటో సోర్స్, FB/SONALI
ఎవరీ సోనాలీ ఫోగట్?
హరియాణాకు చెందిన సోనాలీ 1979లో హిసార్‌లోని హరిత్తా గ్రామంలో పుట్టారు. 1995లో 10వ తరగతి పాసయ్యారు.
ఆమె కుటుంబం నాలుగు తరాలుగా హరిత్తా గ్రామంలోనే నివసిస్తోంది. ఆమెకు అత్తగారు, ఆడపడుచు, మరిది, ఒక కూతురు ఉన్నారు.
సోనాలీ, హరియాణా దూరదర్శన్ టీవీ సహా అనేక షోలలో, కొన్ని హరియాణ్వి చిత్రాలలో కూడా నటించారు.
2008లో తొలిసారిగా బీజేపీతో జతకట్టారు. బీజేపీ మహిళా మోర్చాలో సభ్యురాలిగా కొనసాగారు.
2019 వరకు ఆమెకు హరియాణా, పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2019 నాటికి సోనాలీకి టిక్‌టాక్‌లో దాదాపు లక్షా 25 వేల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఆమె వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి.
ఆమెకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చుకునే ఉద్దేశంతో బీజేపీ ఆమెకు హిసార్‌లోని ఆదంపుర్ టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 2 కోట్ల 74 లక్షల ఆస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించారు.
అటు వైపు కాంగ్రెస్ అభ్యర్థిగా కుల్దీప్ సింగ్ బిష్ణోయ్ పోటీ చేశారు. ఆయనకు సోనాలీ గట్టి పోటీ ఇస్తారని ఎన్నికల ముందు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ ఎన్నికల్లో సోనాలీ ఓడిపోయారు.
కుల్దీప్ సింగ్ బిష్ణోయ్ దాదాపు 29,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఆ తరువాత కుల్దీప్ సింగ్ బిష్ణోయ్ కూడా కాంగ్రెస్‌ను వదిలిపెట్టి బీజేపీలో చేరారు.
కొద్ది రోజుల క్రితం సోనాలి, కుల్దీప్ సింగ్ బిష్ణోయ్‌తో కలిసి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఫొటో సోర్స్, FB/SONAL
ప్రభుత్వ అధికారితో గొడవ
ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా సోనాలి ఫోగట్ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.
2020లో అనాజ్ మండికి చెందిన ఒక అధికారితో సోనాలి గొడవ పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఆమె ఆ అధికారితో వాదిస్తూ, దాడికి దిగినట్టు కనిపించింది.
వీడియోలో, "సోనాలి ఏం చేయమంటే అదే చేస్తున్నారు" అని ఆ అధికారి అనడం వినవచ్చు.
"ఆయన నాతో అసభ్యంగా మాట్లాడుతున్నారు" అని సోనాలీ అన్నారు.
ఈ వీడియో వైరల్ అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ, హరియాణా బీజేపీని విమర్శలతో చుట్టుముట్టింది. తరువాత, సోనాలీ వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, FB/SONALI
బిగ్‌బాస్, భర్త చనిపోవడం
సోనాలి భర్త మృతిపై సోషల్ మీడియాలో పలు వాదనలు, వదంతులు చక్కర్లు కొట్టాయి.
ఒక వీడియోలో ఆమె ఈ అంశం గురించి మాట్లాడారు.
"నా భర్త ఆత్మహత్య చేసుకున్నా లేదా నేనే ఆయన్ను చంపేసినా.. ఇలా ఇంట్లో ఉంటానా? అయినా, నా భర్త ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆయనకు జీవితంలో ఏం లోటు? ఏం బాధలు ఉన్నాయి? నా భర్త చాలా ఉల్లాసమైన వ్యక్తి. నా భర్త వల్లే నేను ఈ రోజు ఈ స్థితికి ఎదిగాను. నా భర్త మరణించిన రోజు నేను ముంబైలో ఉన్నాను. హిసార్ నుంచి 7-8 కిమీ దూరంలో మా పొలాలు ఉన్నాయి. అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాం. మా పెద్ద తోటికోడలు అక్కడే ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు వాళ్లంతా అక్కడే ఉన్నారు. రాత్రి ఆయన హార్ట్ ఫెయిల్ అయింది. పొద్దున్నే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా కుటుంబం అంతా ఆయన పక్కనే ఉంది. ఆ రోజు రాత్రికి నేను అక్కడకు చేరుకున్నాను" అని ఆమె చెప్పారు.
2020-2021లో సోనాలి ఫోగట్ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. ఆ షోలో కూడా సోనాలీ తన భర్త మరణం గురించి, తరువాతి పరిణామాల గురించి మాట్లాడారు.
"మీ భర్త చనిపోయాక మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా?" అని బిగ్‌బాస్ షోలో రాహుల్ వైద్య, సోనాలీని అడిగారు.
దానికి జావాబిస్తూ, "రెండేళ్ల క్రితం నాకు ఒకరిపై మనసు కలిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల విషయం ముందుకు సాగలేదు. నాకెందుకో ఆ వ్యవహారం సరిగ్గా అనిపించలేదు" అన్నారామె.
అదే షోలో సోనాలీ, మరొక కంటెస్టెంట్ అలీ పట్ల కూడా తన ప్రేమను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్లో ఏం జరుగుతోంది
- కశ్మీర్ లోయలో హిందువులను ఎందుకు చంపేస్తున్నారు, 1980 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ జట్లు తలపడేదెప్పుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













