Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ జట్లు తలపడేదెప్పుడు

ఆసియా కప్

ఫొటో సోర్స్, NurPhoto/getty images

ఆగస్ట్-సెప్టెంబర్ నెలలు ఆసియాలో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైనవి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌లలోని క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ త్వరలో మొదలు కాబోతోంది.

ఆగస్టు 27 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ గత సారి ఈ కప్ నిర్వహించలేదు.

ఇది ఆసియా కప్ 15వ సీజన్. దీన్ని శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది. అయితే, సంక్షోభ పరిస్థితుల నడుమ దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చారు. అయితే, అతిథ్యం ఇస్తోంది మాత్రం శ్రీలంకనే.

ఈ టోర్నీ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆసియా కప్

ఫొటో సోర్స్, Tharaka Basnayaka/NurPhoto via Getty Images

ఎన్ని జట్లు ఆసియా కప్‌లో తలపడబోతున్నాయి?

ఈ టోర్నమెంట్‌లో మొత్తంగా ఆరు జట్లు తలపడుతున్నాయి.

ఈ ఆరు జట్లలో ఐదు శాశ్వత జట్లు ఉన్నాయి.

వీటిలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. మరోవైపు ఆరో జట్టుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/సింగపూర్/హాంకాంగ్/కువైట్‌ క్రీడాకారులు బరిలోకి దిగబోతున్నారు.

లైన్

ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఏ

  • బంగ్లాదేశ్
  • శ్రీలంక
  • అఫ్గానిస్తాన్

గ్రూప్-బీ

  • భారత్
  • పాకిస్తాన్
  • క్వాలిఫైయర్ టీమ్ (యూఏఈ/సింగపూర్/హాంకాంగ్/కువైట్)
లైన్
ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్-పాకిస్తాన్‌ల మ్యాచ్ ఎప్పుడు?

భారత్-పాకిస్తాన్‌ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్‌లకు ఈ టోర్నమెంట్ పెట్టింది పేరు. ఈ మ్యాచ్‌లను ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య తొలి మ్యాచ్‌ దుబాయ్ వేదికగా ఆగస్టు 28న జరుగనుంది. మరోవైపు సూపర్-4లో భాగంగా మరోసారి రెండు జట్లు తలపడే అవకాశముంది.

ఆగస్టు 27న మొదలయ్యే ఈ టోర్నమెంటు సెప్టెంబరు 11 వరకు కొనసాగుతుంది. ఈ జట్లు ఎప్పుడు తలపడతాయో ఇప్పుడు చూద్దాం.

ఆగస్టు 27: తొలి మ్యాచ్: శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్

ఆగస్టు 28: రెండో మ్యాచ్: భారత్ వర్సెస్ పాకిస్తాన్

ఆగస్టు 30: మూడో మ్యాచ్: బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్తాన్

ఆగస్టు 31: నాలుగో మ్యాచ్: భారత్ వర్సెస్ ఆరో జట్టు (ఈ జట్టు ఏదో తెలియాల్సి ఉంది)

సెప్టెంబరు 01: ఐదో మ్యాచ్: శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

ఈ తొలి మ్యాచ్‌ల తర్వాత, రెండు గ్రూపుల్లోని టాప్ జట్లు సూపర్-4కు వెళ్తాయి.

గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్-4కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో సెప్టెంబరు 4న మళ్లీ ఈ రెండు జట్లు తలపడే అవకాశముంది.

సూపర్-4లోని టాప్ రెండు జట్లు సెప్టెంబరు 11న ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది.

మొత్తం అన్ని మ్యాచ్‌లు అయితే దుబాయ్ లేదా షార్జాలో జరుగుతాయి.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఆసియా కప్‌లో భాగంగా 14 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 8 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ డ్రా అయ్యింది.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

ఈ ఫార్మాట్‌లో ఆసియా కప్ ఉంటుంది?

ఇది టీ-20 వరల్డ్ కప్ సంవత్సరం. దీంతో ఆసియా కప్ కూడా టీ-20 ఫార్మాట్‌లోనే నిర్వహిస్తున్నారు. 2016లోనూ టీ-20 ఫార్మాట్‌లోనే ఆసియా కప్ నిర్వహించారు. దీంతో టీ-20 ఫార్మాట్‌లో ఆసియా కప్ ఆడటం ఇది రెండోసారి.

వరల్డ్ కప్ ఫార్మాట్‌లోనే ప్రస్తుత ఆసియా కప్‌ను నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది.

ఎవరు ఎన్నిసార్లు గెలిచారు?

ఆసియా కప్‌లో భారత్ సత్తా చాటుతూ వస్తోంది. గత 14 సీజన్లలో భారత్ ఏడు సార్లు టైటిల్ గెలుచుకుంది. మరోవైపు శ్రీలంక కూడా ఐదుసార్లు ఈ కప్ గెలిచింది. మరో రెండు సార్లు పాకిస్తాన్ కూడా టైటిల్ దక్కించుకుంది.

బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ సంపాదించలేదు.

వీడియో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి
లైన్

విజేతలు వీరే

  • 1984 ఆసియా కప్ - భారత్
  • 1986 ఆసియా కప్ - శ్రీలంక
  • 1988 ఆసియా కప్ - భారత్
  • 1990/91 ఆసియా కప్ - భారత్
  • 1995 ఆసియా కప్ - భారత్
  • 1997 ఆసియా కప్ - శ్రీలంక
  • 2000 ఆసియా కప్ - పాకిస్తాన్
  • 2004 ఆసియా కప్ - శ్రీలంక
  • 2008 ఆసియా కప్ - శ్రీలంక
  • 2010 ఆసియా కప్ - భారత్
  • 2012 ఆసియా కప్ - పాకిస్తాన్
  • 2014 ఆసియా కప్ - శ్రీలంక
  • 2016 ఆసియా కప్ - భారత్
  • 2018 ఆసియా కప్ – భారత్
లైన్
ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టులో ఎవరెవరు ఉన్నారు?

ఈ టోర్నమెంట్ కోసం 15 మంది క్రీడాకారులను భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. విరామం తర్వాత విరాట్ కోహ్లీ, గాయం తర్వాత కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు గాయాల వల్ల ఈ కప్‌కు ఆడటం లేదు.

యువ వికెట్-కీపర్ బాట్స్‌మన్లు ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లకు కూడా జట్టులో చోటు దక్కలేదు. అయితే, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్‌లు సెలెక్టెర్లను మెప్పించగలిగారు.

జట్టులో సభ్యులు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)