'ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీలో ఉన్న ఫొటోలు పెట్టినందుకు నాతో ఉద్యోగానికి రాజీనామా చేయించారు'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
కలకత్తాలోని ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఇటీవల వివాదంలో చిక్కుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ధరించివున్న ఫొటోలను షేర్ చేసినందుకు గాను.. తన ఉద్యోగానికి రాజీనామా చేయించారని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు బీబీసీకి చెప్పారు. ఈ ఆరోపణను ఆ యూనివర్సిటీ తోసిపుచ్చింది.
ఆ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తన పేరు వెల్లడించవద్దని బీబీసీని కోరారు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న ఆ మహిళ.. యూనివర్సిటీ అధికారులను తనను 'లైంగికంగా వేధించార'ని ఆరోపించారు. ''నన్ను బెదిరించారు. గద్దించారు. నా మీద మోరల్ పోలీసింగ్‌కు పాల్పడ్డారు'' అని చెప్పారు.
ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి లీగల్ నోటీసు పంపించారు. అయితే యూనివర్సిటీ ప్రతిస్పందిస్తూ.. ఆమె వర్సిటీ పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ 99 కోట్ల రూపాయలు పరిహారం డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
''నన్ను ఇంటరాగేషన్ రూమ్‌కు తీసుకెళ్లారు''
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతుల్లో ఇంగ్లిష్ బోధించటానికి తాను 2021 ఆగస్టు 9వ తేదీన యూనివర్సిటీ అధ్యాపక సిబ్బందిలో చేరినట్లు సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు.
రెండు నెలల తర్వాత తనను వైస్-చాన్సలర్ కార్యాలయానికి సమావేశం కోసం పిలిపించారని చెప్పారు.
అక్కడి నుంచి తనను ''ఒక ఇంటరాగేషన్ రూమ్‌కు తీసుకెళ్లార''ని, అక్కడ వైస్-చాన్సలర్ ఫెలిక్స్ రాజ్, రిజిస్ట్రార్ ఆశిష్ మిత్రాలతో పాటు ఐదుగురు మహిళలతో కూడిన ఒక కమిటీ తనను ప్రశ్నించిందని వివరించారు.
ఆమె మీద అండర్ గ్రాడ్యుయేట్ తొలి సంవత్సరం చదువుతున్న ఒక పురుష విద్యార్థి తండ్రి నుంచి తమకు ఫిర్యాదు అందిందని వారు ఆమెతో చెప్పారు.
''ఇన్‌స్టాగ్రామ్‌లో నేను కేవలం లోదుస్తులు ధరించి ఉన్న ఫొటోలను తన కొడుకు చూస్తుండగా తాను గమనించానని సదరు విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేసినట్లు వైస్-చాన్సలర్ చెప్పారు. ఆ ఫొటోలు లైంగికంగా ప్రేరేపించేవిగా ఉన్నాయని, అటువంటి అసభ్యత నుంచి తన కొడుకును దూరంగా ఉంచాలని ఆ తండ్రి యూనివర్సిటీకి విజ్ఞప్తి చేసినట్లు వీసీ చెప్పారు'' అని ఆమె వివరించారు.
'ఐదారు ఫొటోల'తో ఒక కాగితాన్ని బోర్డు సభ్యులకు పంచారని, ఆ ఫొటోలు తనవేననే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా తనను అడిగారని ఆమె తెలిపారు.
ఆమె టు-పీస్ స్విమ్‌సూట్ ధరించి ఉన్న ఆ ఫొటోలు తన గదిలో తాను తీసుకున్న సెల్ఫీలని, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో 'స్టోరీ'గా తాను షేర్ చేశానని, అంటే అవి 24 గంటలలో కనిపించకుండా పోతాయని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ వివరించారు.
ఆ ఫొటోలు.. తాను యూనివర్సిటీలో చేరటానికి దాదాపు రెండు నెలల ముందు 2021 జూన్ 13వ తేదీన పోస్ట్ చేసిన ఫొటోలని, తన ప్రైవేటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఫాలో అవటానికి తన విద్యార్థుల నుంచి వచ్చిన రిక్వెస్టులను తాను ఆమోదించటానికి ముందు పోస్ట్ చేసిన ఫొటోలని ఆమె ఇచ్చిన వివరణను సదరు కమిటీ తిరస్కరించింది.
''నేను షాక్ తిన్నాను. ఆ ఫొటోలు చూశాక నాకు పానిక్ అటాక్ వచ్చింది. నా వ్యక్తిగత ఫొటోలను నా అనుమతి లేకుండా షేర్ చేసుకుంటుండటంతో నాకు మతిపోయినట్లయింది'' అని ఆమె చెప్పారు.
''నా సొంత ఫొటోలను నేను చూడలేకపోయాను. వాటిని నా ముందు ఉంచిన తీరు, వాటి చుట్టూ సంభాషణ.. అన్నీ నన్ను నేను చౌకబారు మనిషిగా భావించుకునేలా చేసింది. నన్ను మానసికంగా దెబ్బతీస్తున్నారని నాకు అర్థమైంది. నన్ను వెన్నుపోటు పొడిచారనే భావన నాలో మొదలైంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'నీ ఫొటోలను మీ తల్లిదండ్రులు చూశారా?'
''నువ్వు ఆ పని ఎందుకు చేశావు? ఒక మహిళగా అది అభ్యంతరకరమని నీవు ఆలోచించలేదా? ఒక ప్రొఫెసర్‌గా నీకు నువ్వు సభ్యతగా మెలగటం సమాజానికి నీ బాధ్యత కాదా? మహిళలకు వస్త్రధారణ నియమావళి ఉంటుందని నీకు తెలీదా? అని నన్ను ప్రశ్నించారు.''
''యూనివర్సిటీకి నేను అప్రతిష్ట, అవమానం కలిగిస్తున్నానని వారు నాతో అన్నారు. నా తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారా? ఆ ఫొటోలను వారు చూశారా? అని నన్ను అడిగారు. నాకు చాలా వేదన కలిగింది. కళ్లు తిరిగి కడుపులో దేవినట్లయింది'' అని ఆమె వెల్లడించారు.
దీనిపై మరుసటి రోజు లిఖిత పూర్వకంగా వివరణ రాసి తీసుకురావాలని ఆమెకు చెప్పారు.
ఆ టీచర్ మరుసటి రోజు వైస్-చాన్సలర్ ఆపీసుకు వెళ్లి, లిఖితపూర్వకంగా క్షమాపణ అందించారు. ''జెండర్ సెల్ అధినేత్రి సహా అధ్యాపక బృందంలోని కొందరు సభ్యుల సలహా మేరకు'' ఆమె ఆ లేఖ రాశారు. సదరు జెండర్ సెల్ అధినేత్రి ఈ టీచర్‌కు మాజీ క్లాస్‌మేట్, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ టీచర్‌ను ప్రశ్నించిన కమిటీలో కూడా ఉన్నారు.
''నా ఫొటోలు యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించాయని భావించినట్లయితే అందుకు క్షమాపణ కోరుతున్నా'' అని ఈ టీచర్ తన క్షమాపణ పత్రంలో రాశారు.
''అది చాలా అసహ్యకరమైన అనుభవం'' అని చెప్పారామె. కానీ ఆ విషయం అంతటితో ముగుస్తుందని ఆమె భావించారు.
''కానీ నన్ను డిస్మిస్ చేయాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించిందని వైస్-చాన్సలర్ నాతో చెప్పారు. 'నీ ఫొటోలు వైరల్ అయ్యాయి, చాలా మంది విద్యార్థులు వాటిని చూశారు, నిన్ను వాళ్లు సీరియస్‌గా తీసుకోరు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు' అన్నారాయన. 'నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయటం మంచిది' అని చెప్పారు'' అని ఆమె తెలిపారు.
ఒకవేళ ఆమె రాజీనామా చేయకపోతే ఆమె ''జైలుకు వెళ్లాల్సి వస్తుంది'' అని ఆయన చెప్పారు. ''ఎందుకంటే తన మీద పోలీస్ కంప్లైంట్ నమోదు చేయాలని సదరు పేరెంట్ కోరుతున్నారని, అలా జరిగితే నిన్ను అరెస్ట్ చేస్తార''ని ఆయన పేర్కొన్నట్లు ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
''నన్ను ఒక మూలకు నెట్టేసి చుట్టుముట్టినట్లు అనిపించి, నేను రాజీనామా చేశాను'' అన్నారామె.
''కానీ నాకు చాలా కోపం కూడా వచ్చింది. న్యాయ సలహా తీసుకున్నాను. ఎందుకంటే నా ఫొటోగ్రాఫ్‌లు డౌన్‌లోడ్ చేశారు, స్క్రీన్‌షాట్స్ తీసుకున్నారు. నా అనుమతి లేకుండా షేర్ చేశారు. సైబర్-క్రైమ్ పోలీసులకు.. లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయాలని నా లాయర్ సూచించారు'' అని ఆమె తెలిపారు.
ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని కమిటీ సిఫారసు చేసిందా అన్న అంశంపై వ్యాఖ్యానించటానికి ఫాదర్ ఫెలిక్స్ రాజ్ నిరాకరించారు. అయితే యూనివర్సిటీ మీద, తన మీద ఆమె చేసిన ఆరోపణలన్నిటినీ ఆయన తిరస్కరించారు.
''మాది పవిత్రమైన విద్యా, విజ్ఞాన సంస్థ. ఆమెకు సీనియర్‌ని గా, యూనివర్సిటీ అధిపతిగా.. ఆమె ఆ ఫొటోలను పెట్టి ఉండాల్సింది కాదని ఆమెకు చెప్పాను'' అని స్పందించారు.
అయినాసరే రాజీనామా చేయాలని ఆమె మీద తను ఒత్తిడి తేలేదని, ఆమె తనకు తానుగానే వెళ్లిపోయారని ఆయన చెప్తున్నారు.
''ఆమె (2021) అక్టోబర్ 8వ తేదీన క్షమాపణ లేఖ ఇచ్చారు. మేం దానిని అంగీకరించాం. అది మంచి సంకేతమని నేను అనుకున్నా. కానీ పూజా పండుగ సెలవుల తర్వాత యూనివర్సిటీని తిరిగి తెరిచిన రోజు అక్టోబర్ 25వ తేదీన ఆమె రాజీనామా పంపించారు'' అని చెప్పుకొచ్చారు.
''సెలవుల తర్వాత ఆమె విధుల్లోకి తిరిగి వస్తారని నేను భావించాను. ఆ రెండు వారాల్లో ఏం జరిగిందో నాకు తెలీదు. ఆమె మీద మాకు ఎలాంటి కక్షా లేదు. ఆమెతో మేం చాలా మంచిగా ఉన్నాం'' అని ఆయన పేర్కొన్నారు.
యూనివర్సిటీలో తను చేరిన తర్వాత, తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఆ ఫొటోలు ఉండే అవకాశం లేదని ఆమె గట్టిగా చెప్పిన మాటలను, అధ్యాపక సిబ్బందిలో ఒకరు తనను వెన్నుపోటు పొడిచారని ఆమె చేసిన ఆరోపణలను ప్రస్తావించగా.. ''టెక్నాలజీలో నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు'' అని ఫాదర్ ఫెలిక్సీ రాజ్ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఆటవిక మోరల్ పోలీసింగ్ రూపం'
ఈ టీచర్ మీద చేపట్టిన చర్య 'తిరోగమన చర్య' అని చాలా మంది ప్రస్తుత, మాజీ విద్యార్థులు విమర్శించారు.
ఈ యూనివర్సిటీ మాజీ విద్యార్థి గౌరవ్ బెనర్జీ 'చేంజ్.ఆర్గ్'లో ఒక పిటిషన్ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని ఉద్దేశించి రాసిన ఆ పిటిషన్ మీద 25,000 కు పైగా సంతకాలు వచ్చాయి.
ఆ ప్రొఫెసర్‌కు యూనివర్సిటీ క్షమాపణ చెప్పాలని, వర్సిటీ కమిషన్ అహంకారపూరిత ప్రవర్తన మీద ప్రభుత్వం క్రమశిక్షణ చర్య చేపట్టాలని తన డిమాండ్లుగా ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
''యూనివర్సిటీ ఇలాంటి పని చేయటం పట్ల తీవ్రంగా ఆందోళన చెందిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అది హర్షించదగ్గ విషయం'' అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల.. యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది సదరు ప్రొఫెసర్‌కు సంఘీభావంగా.. నల్ల దుస్తులు ధరించి, వర్సిటీలోని క్యాంటీన్ వెలుపల మౌనంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
''మా ప్రొఫెసర్‌లలో ఒకరిని ఈ రకమైన ఆటవిక నైతిక పోలీసింగ్‌కు గురిచేశారన్న విషయం మాకు తెలిసింది. ఇది ఏమాత్రం అంగీకారనీయం కాదు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఏం చేస్తాననేది ఎవరికైనా ఎందుకు అవసరం'' అని ఆ నిరసనలో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరు నాతో అన్నారు.
''ఇది నైతిక పోలీసింగ్ అని.. ఐదుగురు మహిళలు ఉన్న ఆ కమిటీ సభ్యులు ఆలోచించక పోవటం మరింతగా భయం కలిగిస్తోంది'' అని అతడు వ్యాఖ్యానించారు.
'నేను గెలవకపోవచ్చు...'
ఈ వివాదంలో తనకు లభిస్తున్న మద్దతు పట్ల సదరు టీచర్ ఆనందం వ్యక్తం చేశారు.
''వ్యక్తిగత గోప్యత హక్కును, స్వీయ వ్యక్తీకరణ హక్కును ఉల్లంఘించటానికి వీలు లేదు. భారత రాజ్యాంగం వీటిని మనకు ఇచ్చింది'' అని ఆమె పేర్కొన్నారు. కానీ వీటిపై 'నిఘా' పని ప్రదేశాన్ని కూడా దాటి విస్తరించిందన్నారు.
''ఆ సంస్థలో చేరటానికి ముందు నా ప్రవర్తన.. వారి సోషల్ మీడియా ప్రవర్తనా నియమావళిని, మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘిస్తుంది?'' అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
''నేను ఎలాంటి తప్పూ చేయలేదని నేను బలంగా నమ్ముతున్నా. ఈ పోరాటంలో నేను గెలవకపోవచ్చు. కానీ నాకు ఇది చాలా ముఖ్యమైన పోరాటం'' అంటున్నారామె.
ఇవి కూడా చదవండి:
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












