పుట్టగానే ఆసుపత్రిలో తారుమారయ్యారు.. ఇరవై ఏళ్ల తరువాత వాళ్లిద్దరే పెళ్లి చేసుకున్నారు

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని కొందరి నమ్మకం. జీవిత భాగస్వామిగా ఎవరు వస్తారో విధి రాతలో ఉంటుందని కొందరు విశ్వసిస్తారు. లానర్క్‌షైర్‌కు చెందిన జిమ్, మార్గరెట్ మిచెల్‌లలు విధిని నమ్మడానికి బలమైన కారణాలే ఉన్నాయి.
పుట్టిన వెంటనే వీరిద్దరికీ తల్లులు మారిపోయారు. కొద్దిసేపటికే వీరిద్దరూ ఎవరి తల్లి దగ్గరకు వారు చేరుకున్నారు.
ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ అనుకోకుండా కలిశారు. ప్రేమలో పడ్డారు. ఆ బంధాన్ని జీవితాంతం ముడివేసుకున్నారు.
వాళ్లిద్దరి వివాహ జీవితానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. వాళ్లు ముందే ఒకరికొకరు రాసి పెట్టి ఉన్నారనట్టుగా, పుట్టినప్పటి నుంచి అనుకోకుండా పలుమార్లు ఒకరికొకరు ఎదురయ్యారు.
ఏమిటి వీళ్ల కథ?
జిమ్, మార్గరెట్ ఇద్దరూ 1952లో సెప్టెంబర్ 15, 17 తేదీలలో లెనాక్స్‌టౌన్‌లోని లెనాక్స్ కాసల్ హాస్పిటల్‌లో పుట్టారు.
మెటర్నిటీ వార్డులో పిల్లలిద్దరూ వారి తల్లుల నుంచి తారుమారైపోయారు. పొరపాటున నర్సులు జిమ్‌ను మార్గరెట్ తల్లికి, మార్గరెట్‌ను జిమ్ తల్లికి అప్పగించారు. దాంతో, ఇద్దరికీ తల్లులు మారిపోయారు. అప్పట్లో పుట్టగానే చేతికి నేమ్ ట్యాగు కట్టే పద్ధతి లేదు.
"మా ఇద్దరి తల్లులనూ మార్గరెట్ అనే పిలిచేవారు. దాంతో, నర్సులు తికమకపడ్డారు. బిడ్డల్ని మార్చి ఇచ్చేశారు" అని చెప్పారు మార్గరెట్. ఈ ఏడాది సెప్టెంబర్ 15తో ఆమెకు 70 ఏళ్లు పూర్తయ్యాయి.
అయితే, బిడ్డలు మారిపోయిన కొన్ని నిమిషాలకే తల్లులు తేడా గమనించారు. వెంటనే నర్సులకు చెప్పడంతో ఎవరి బిడ్డని వారికి అప్పగించారు.
తరువాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. జిమ్ గ్లాస్గోకు దక్షిణాన ఉన్న ఆర్డెన్‌లో పెరిగారు. మార్గరెట్ గ్లాస్గోకు వాయువ్యం వైపున్న నైట్స్‌వుడ్‌లో పెరిగారు.
ఆ తరువాత, కొద్ది రోజులకు మార్గరెట్ తల్లిదండ్రులు రెన్‌ఫ్రూషైర్‌లోని ఈస్ట్‌వుడ్‌లో సొంతిల్లు కొనుక్కుని అక్కడికి మారిపోయారు. అది, జిమ్ వాళ్ల ఇంటికి కేవలం 30 నిమిషాల నడక దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, MARGARET MITCHELL
విధి మళ్లీ కలిపింది
జిమ్, మార్గరెట్‌లకు 18 ఏళ్ల వయసులో మళ్లీ అనుకోకుండా కలిశారు.
"నా స్నేహితుడు డేవిడ్‌కి పెళ్లయింది. గ్లాస్గోలోని క్వీన్స్ పార్క్‌లో వాళ్ల ఇంట్లో రిసెప్షన్ ఇచ్చాడు. డేవిడ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పాట్‌కి మార్గరెట్ ఫ్రెండు. అలా వాళ్ల రిసెప్షన్‌లో మేమిద్దరం కలిశాం. మాటలు కలిశాయి. ఆరోజు ఆమె చాలా అందంగా ఉంది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని బయటికి వెళదామని అడిగాను. ఆమె వెంటనే ఒప్పుకుంది. నేను సంతోషం పట్టలేకపోయాను. అక్కడున్న వారందరిలో అందగత్తె నాతో డేటింగ్‌కు ఒప్పుకుంది" అని చెప్పారు జిమ్.
వాళ్లిద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. ఓ రెండు నెలల తరువాత ఇద్దరి తల్లులకూ అనుమానమొచ్చింది.. వీళ్లద్దరి మధ్య ఏదో పాత బంధం ఉన్నట్టు అనిపించింది.
"ముఖ్యంగా జిమ్ వాళ్ల అమ్మ. మా ఇద్దరి పుట్టినరోజులూ దగ్గర దగ్గరగా ఉన్నాయి. నా పేరు . మా నాన్న పోలీసు. ఇవన్నీ చూసి ఆమెకు ఏదో గుర్తొచ్చింది" అని చెప్పారు మార్గరెట్.
చివరికి, ఇద్దరి తల్లులూ కలుసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం మెటర్నిటీ వార్డులో కలిశారు. మళ్లీ ఇప్పుడు. వీరి ప్రేమ కథను చూసి ఆశ్చర్యపోయారు. లక్షల్లో ఒకరికి ఎదురయే అనుభవమిదని సంతోషపడ్డారు.

ఫొటో సోర్స్, MARGARET MITCHELL
హ్యాపీ మ్యారీడ్ లైఫ్
1972లో జిమ్, మార్గరెట్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు కిల్‌బ్రైడ్‌లో నివాసముంటున్నారు. జిమ్ ఇంజినీరుగా, మార్గరెట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక మనుమడు, మనుమరాలు ఉన్నారు.
సెప్టెంబర్ 16న అంటే ఇద్దరి పుట్టినరోజులకు నడుమ, వాళ్లు తమ 50వ పెళ్లిరోజు జరుపుకొన్నారు.
"ఆరోజు ఏదో కాకతాళీయంగా జరిగింది, లేదంటే జిమ్‌తో డేట్‌కు వెళ్లేందుకు నేను సిద్ధపడి ఉండేదాన్ని కాదు" అని మార్గరెట్ అన్నారు.

ఫొటో సోర్స్, MARGARET MITCHELL
"నా మగ స్నేహితుల్లో అతడు భిన్నంగా కనిపించాడు. పొడుగ్గా జుట్టు ఉండేది. చాలా మంచివాడు, బాగా ఆలోచిస్తాడు. మిగతావారితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేవాడు" అని చెప్పారామె.
జిమ్, మార్గరెట్ కలిసి బీబీసీ రేడియో 'గుడ్ మార్నింగ్ స్కాట్లాండ్' ప్రోగ్రాంలో మాట్లాడుతూ, తమ సుదీర్ఘమైన, సంతోషకరమైన వైవాహిక జీవితం వెనుక రహస్యమేమిటో చెప్పారు.
"ఒకరికొకరు ఎంత సన్నిహితంగా ఉన్నారన్నది ముఖ్యం. ఏరోజుకారోజే ముఖ్యం" అని మార్గరెట్ చెప్పారు.
"ఒడిదుడుకులు అందరికీ ఉంటాయి. దారి మళ్లడంలో గొప్పతనమేమిటంటే మళ్లీ దారిలోకి రాగలగడమే" అన్నారు జిమ్.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?
- తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?
- లండన్ సమీపంలోని లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు.
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఫరీద్కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












