'ఘర్ వాపసీ': ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బాగపత్ నుంచి బీబీసీ కరెస్పాండెంట్

ముస్లిం నుంచి హిందువులుగా మారిన వారికి ఎదురైన సమస్యలు
- 2018లో బాగపత్‌లోని ఒక ముస్లిం కుటుంబానికి చెందిన 13 మంది హిందువులుగా మారారు.
- హిందువులుగా మారిన తర్వాత వీరు కులపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
- ముస్లిం నుంచి హిందువుగా మారిన యూపీ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వీ కూడా ఆందోళనలో ఉన్నారు.
- ఒకవేళ ముస్లింలు, హిందువులుగా మారితే వారికి తమ పూర్వీకుల కులం వర్తిస్తుందని విశ్వ హిందు పరిషత్ చెప్పింది.

నాలుగేళ్ల బాలికకు మతం గురించి ఏం తెలుస్తుంది? తన తల్లిదండ్రులు ముస్లింలు అయినందునే తనకు జోయా అనే పేరు పెట్టారనే విషయం ఆమెకు అర్థం అవుతుందా?
పిల్లల మతం ఏంటి? తమ ఇష్టప్రకారం పిల్లలు మతాన్ని ఎంపిక చేసుకోలేరు. తమ పిల్లల మతాన్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు మత మార్పిడి చేసుకుంటే , ఆ మతాన్ని స్వీకరించాలనే ఒత్తిడి పిల్లలపై కూడా ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బాగపత్ జిల్లోలోని బదర్ఖా గ్రామంలో ఒక నాలుగేళ్ల బాలికను తన పేరు అడగగా, జోయా అని చెప్పింది.
ఆమె పక్కనే కూర్చున్న తన అక్క వెంటనే నీ పేరు 'గుడియా' అని జోయాతో అంది. దానితో జోయా మళ్లీ నా పేరు గుడియా అని చెప్పింది.
అదే సమయంలో జోయా అన్నను పొరుగింటి పిల్లాడు 'అనస్' అని పిలిచాడు. అప్పుడు ఏడేళ్ల అనస్ వెంటనే తన తండ్రి దిల్‌షాద్ వైపు చూశాడు.
స్కూల్లో ఇతని పేరు 'అమర్ సింగ్'. కాబట్టి అతన్ని అమర్ సింగ్ అనే పిలవండి అంటూ దిల్‌షాద్, ఆ పొరుగింటి పిల్లాడికి చెప్పారు. దిల్‌షాద్ సమాధానం విన్న ఆ పిల్లాడు అయోమయంగా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

హిందువులుగా ఎందుకు మారారంటే...
దిల్‌షాద్ కుటుంబంలోని 13 మంది 2018లో ముస్లిం నుంచి హిందువులుగా మారారు. ఇందులో నౌషాద్, దిల్‌షాద్, ఇర్షాద్ అనేవారు ముగ్గురు అన్నదమ్ములు. వీరి భార్య, పిల్లలు కూడా హిందువులుగా మత మార్పిడి చేసుకున్నారు.
వారి తండ్రి అఖ్తర్ అలీ కూడా తన భార్యతో కలిసి హిందువుగా మారిపోయారు. తాము క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ముస్లిం సమాజం తమకు అండగా నిలవలేదని, అందుకే ఇస్లాంను వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నామంటూ వారు చెప్పారు.
ఈ కుటుంబం హిందువులుగా మారినప్పుడు జోయా వయస్సు 6 నెలలు మాత్రమే.
కుటుంబసభ్యులు అంతా రోజూవారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నౌషాద్ రాజ్, మేస్త్రీ పని చేస్తారు. దిల్‌షాద్, ఊరూఊరూ తిరుగుతూ దుస్తులు అమ్ముతారు. ఇర్షాద్ కూడా వీధుల్లో అరుస్తూ తిరుగుతూ దుస్తులు విక్రయిస్తారు. వారి తండ్రి అఖ్తర్ అలీ కూడా ఇదే పని చేస్తుండేవారు. వృద్ధాప్యం కారణంగా ఇప్పుడు ఆయన చేయట్లేదు.
అఖ్తర్ అలీ చిన్న కుమారుడు గుల్షాన్ మృతదేహం, 2018లో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గుల్షాన్‌ను ఎవరో హత్య చేసినట్లు ఆయన భావించారు. కానీ, అప్పుడు తమ కమ్యూనిటీ నుంచి వారికి మద్దతు లభించలేదు.
యువ హిందూ వాహినిని చెందిన కొందరు అప్పుడు ఈ కుటుంబానికి సహాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆయన, ఇస్లాంను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. హిందువులుగా మారిన తర్వాత వారు నివసించడం కోసం అదే గ్రామానికి చెందిన జగ్‌బీర్ సింగ్ తన ఇంటిని ఇచ్చారు. జగ్‌బీర్ సింగ్ కుటుంబం అంతా మీరట్‌లో నివసిస్తుండటంతో గ్రామంలోని ఇళ్లు ఖాళీగా ఉంది.
అయితే, ఇస్లాం నుంచి హిందువులుగా... వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వారి ఇంట్లోని మహిళలకు హిందువులుగా మారే ఉద్దేశం లేదు.
కుటుంబం హిందుత్వంలోకి వచ్చిన తర్వాత నౌషాద్ భార్య రూకైయ్యా, తన పుట్టింటికి వెళ్లిపోయారు. హిందువుగా మారడంతో తమ వివాహ బంధం ముక్కలైందని, ఇక తానెప్పుడూ తిరిగి రానని నౌషాద్‌కు ఆమె తేల్చి చెప్పారు.
ఆమె, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా అనిపించిందని నౌషాద్ తెలిపారు.

హిందువులుగా మారడంతో ఏం ప్రయోజనం కలిగింది?
నౌషాద్, రెండు నెలల్లోనే మళ్లీ ఇస్లాంలోకి మారిపోయారు. తన భార్యను మరోసారి నిఖా చేసుకున్నారు. న్యాయం కోసం హిందువులుగా మారామని, కానీ ఇక్కడ కూడా తాము అనుకున్నది ఏదీ జరగలేదని ఇర్షాద్ చెప్పారు. హిందువుగా మారిన తర్వాత తన పేరును 'కవి' అని పెట్టుకున్నారు ఇర్షాద్.
''మేం హిందువులుగా మారాం. కానీ, మా బంధువులు అంతా ముస్లింలే. హిందువులుగా మారిన తర్వాత వారంతా ముఖం తిప్పుకున్నారు. ఎవరూ మాతో మాట్లాడలేదు. ఎవరూ కనీసం ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. మాటలతో బాధపెట్టేవారు. మరోవైపు, హిందువుల్లో కుల వ్యవస్థ ఉంది. మేం హిందువులుగా అయితే మారిపోయాం, కానీ మాకు కులం ఎలా? కులం లేకుంటే పెళ్లి కూడా కాదు. ఇదంతా చూశాక మన కాలును మనమే నరుక్కోవడంలా అనిపించింది'' అని ఇర్షాద్ చెప్పుకొచ్చారు.
అఖ్తర్ అలీ పెద్ద కోడలు షాబ్రా ఖాతూన్ కూడా దీని గురించి మాట్లాడారు. ''హిందువులు ఎవరూ మమ్మల్ని స్వీకరించరనే విషయం నాకు తెలుసు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హిందువుగా మారకూడదని నేను నిర్ణయించుకున్నా. హిందువుగా మారితే నా పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? హిందువుగా మారిన తర్వాత కూడా మేం చేరాల్సింది దళితుల్లోనే కానీ, బ్రాహ్మణులం అయితే కాలేం కదా. ఆ మతంలోకి మారి మేమెందుకు అంటరానివారిగా బతకాలి. చూడండి, మళ్లీ ముస్లింలుగా మారడం చాలా సులభం. కానీ, హిందువులయ్యాక కూడా తర్వాత ఎదురయ్యే కష్టాల నుంచి తప్పించుకోలేం'' అని ఆమె వివరించారు.
అఖ్తర్ అలీ కుటుంబ సభ్యులు అందరూ మళ్లీ ఇస్లాంలోకి మారిపోయారు. కానీ, ఆయన మూడో కుమారుడు దిల్‌షాద్ మాత్రం ఇప్పటికీ హిందువుగానే జీవిస్తున్నారు.
2018లో ఆయన పేరును దిలేర్ సింగ్ అని మార్చుకున్నారు. దిలేర్ సింగ్ తన అయిదుగురు సంతానానికి హిందూ పేర్లే పెట్టారు. ఆయన పిల్లల వయస్సు 4 నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆయన భార్య పేరును మంజు అని మార్చారు.
దిలేర్ సింగ్, గత నాలుగేళ్లుగా హిందువుగానే ఉన్నారు. అయితే, దీనివల్ల ఆయనకు ఏదైనా ప్రయోజనం దక్కిందా? ఈ ప్రశ్న అడగ్గానే ఆయన కాసేపు నిశ్శబ్ధంగా మారిపోయారు.
తర్వాత కాసేపటికి ఆయన మాట్లాడుతూ.... ''ఏం దొరుకుతుంది? ఏదైనా కష్టపడితేనే దొరుకుతుంది. మతం వల్ల పేరు మారుతుంది. ఏం దొరికిందంటే, ఈ గ్రామంలోని హిందువుల మద్దతు లభించింది. మేం ఉండటం కోసం జగ్‌బీర్ తన ఇల్లు ఇచ్చారు. ఇప్పటికీ అది ఉంది. నా సోదరులు మళ్లీ ఇస్లాంలోకి వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు కూడా వారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వారిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేదు'' అని చెప్పారు.

హిందువులు ఏం అంటున్నారు?
జగ్‌బీర్ సింగ్ కుటుంబ సభ్యుడు సుఖ్‌బీర్ సింగ్. ఆయన బీబీసీతో మాట్లాడారు. ''హిందు మతంలోకి మారారనే కారణంతో వారికి ఇల్లు ఇవ్వలేదు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. వారు అందులో నివసిస్తే, ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. కాబట్టి వారికి ఇల్లును ఇచ్చాం. వారు ఏ మతాన్నైనా అనుసరించొచ్చు. అది వారి ఇష్టం. దానితో మాకేం సంబంధం లేదు.
చూడండి. హిందువు నుంచి ముస్లింలుగా మారడం చాలా సులభం. కానీ, ముస్లిం నుంచి హిందువుగా మారడం చాలా కష్టం. హిందూ సమాజంలో ఇప్పటికీ కులానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికీ పెళ్లిళ్లు, కులాల వారీగానే జరుగుతాయి. ఒకవేళ ఎవరైనా ముస్లింలు, హిందువులుగా మారితే వారు ఏ కులాన్ని స్వీకరించాలి? కులం అనేది పుట్టుకతో వస్తుంది. మన ఇష్ట ప్రకారం కులాన్ని ఎంపిక చేసుకోలేం. ఒకవేళ వారు జాట్ కులంలోకి రావాలని ఆశిస్తున్నారు అనుకోండి. కానీ, జాట్లు స్వీకరిస్తారా? అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని జాధ్‌వర్‌పుర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అబ్దుల్ మతీన్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు. భారత్‌లో ఇచ్చిన 'ఘర్ వాపసీ' నినాదం... సామాజికంగా, రాజకీయ పరంగా ఒక బూటకం అని అన్నారు.
''ఇంటికి తిరిగి రండి (ఘర్ వాపసీ) అనే నినాదాన్ని ఇస్తున్నారు. కానీ, ఎవరి ఇంటికి? ఆహ్వానిస్తున్నారు. వచ్చి బాల్కనీలో ఉండమంటున్నారా? లేదా పెరడులో ఉండమంటున్నారా? లేదా గ్యారేజ్‌కి ఆహ్వానిస్తున్నారా? నాకు తెలిసి ఇంటికి వెళ్లి తలుపు కొట్టినా కూడా ఎవరూ దర్వాజా తెరవరు. చూడండి, హిందూ ధర్మంలో ఉన్న కులవ్యవస్థ గొలుసును తెంచడం అంత సులభం కాదు. దాన్ని అంబేడ్కర్ కూడా తెంచలేకపోయారు. దాని ముందు ఓడిపోయి ఆయన బౌద్ధంలోకి మారిపోయారు. బ్రాహ్మణేతర మతాలు.. అంటే ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి మాట్లాడుకుంటే వాటిలో ఒక రకమైన సమష్టితత్వం అనే భావన ఉంటుంది. అంటే మీరు కూడా మాలో భాగమే అనే భావన వాటిలో ఉంటుంది. ప్రజలు, హిందు ధర్మంలోకి మారితే, సామాజిక గుర్తింపు దక్కదు'' అని ఆయన వివరించారు.

'ఘర్ వాపసీ'లో ఇల్లు ఎక్కడ?
ప్రొఫెసర్ మతీన్ దీని గురించి మరింతగా మాట్లాడారు. ''మతమార్పిడులు రాజకీయ ప్రేరేపితమైనవి. ఒకవేళ ఎవరైనా ముస్లింలు ఇష్టపూర్వకంగా హిందువులుగా మారాలనుకుంటే, వారిపట్ల హిందు సమాజం మనసు కూడా మారుతుందా? వారిని తమ వారిగా స్వీకరించేంత ఉదారభావం హిందూ సమాజంలో ఉంటుందా? ఇస్లాం నుంచి హిందుత్వంలోకి మారే వారి గుర్తింపు మరింత జఠిలం అవుతుంది. హిందూ సమాజంలో ఇప్పటికే గుర్తింపునకు సంబంధించి అనేక భేదాలు ఉన్నాయి. మతమార్పిడి తర్వాత హిందువుల సొసైటీలోకి చేరడం చాలా కష్టం'' అని అన్నారు.
విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ... ''ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారినప్పుడు 'రోటీ-బేటీ'పై, మనల్ని ఆమోదించడానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దీనికి మేం ఒక సమాధానాన్ని కనుగొన్నాం. మన పూర్వీకుల కులాన్నే మనం కూడా పొందుతున్నాం. ఇక్కడి ముస్లింలందరి పూర్వీకులు కూడా హిందువులే. పూర్వీకుల గురించి ఎవరికి తెలిసి ఉండదు చెప్పండి. షేక్ అబ్దుల్లా పూర్వీకులు కౌల్ బ్రాహ్మణులనే సంగతి ఎవరికి తెలియదో చెప్పండి. అలాగే జిన్నా కుటుంబం గురించి కూడా తెలియని వారుండరు'' అని అన్నారు.
మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకులు గుజరాత్‌లోని లోహనా-ఠక్కర్ కులానికి చెందినవారు. ఈ కులం వారు గుజరాత్‌లో వ్యాపారం చేసే వారు.

హిందువులుగా మారిన తర్వాత కులం సంగతి ఏంటి?
సురేంద్ర జైన్ మాట్లాడుతూ... ''ఇది, హరియాణాలో ప్రారంభమైంది. ఇస్లాం నుంచి హిందూమతంలోకి వచ్చిన వారిని జాట్లు అంగీకరించారు. 'ఘర్ వాపసీ' అనేది కేవలం నినాదమే కాదు. ఇది అమలు కూడా అవుతోంది. ముస్లింలలో కుల వ్యవస్థ లేదని చెప్పే వారికి ఇస్లాం గురించి ఏమీ తెలియదన్నట్లే. షేక్‌లు ఎవరైనా పస్మాందలను పెళ్లి చేసుకుంటారా? షియా, సున్నీల మధ్య ఉన్న శత్రుత్వం గురించి ఎవరికి తెలియదు? ఇస్లాం నుంచి హిందు మతంలోకి వచ్చిన వారు, తమ పూర్వీకుల కులం పొందేలా మేం కృషి చేస్తున్నాం. మేవాత్‌లోని ముస్లింలకు తమ హిందూ గోత్రం గురించి కూడా తెలుసు. కాబట్టి ఇందులో కంగారు పడాల్సిన పనిలేదు'' అని అన్నారు.
గుజరాత్ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్ర ప్రొఫెసర్ గౌరంగ్ జానీ కూడా దీని గురించి బీబీసీతో మాట్లాడారు. ''కుల వివక్ష లేని సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నామని సురేంద్ర జైన్ చెబితే బాగుండేది. కులరహిత వ్యవస్థ వల్లే వ్యక్తుల మధ్య అంతరాలు తగ్గుతాయి. కానీ, ఆయన వర్ణ వ్యవస్థను వదలాలని అనుకోవట్లేదు. అందుకే ఇస్లాం నుంచి హిందువుల్లోకి వచ్చిన తర్వాత కూడా కులాలను కేటాయించాలని కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ముస్లింలు అంటే ఒక రకమైన ఇమేజ్ ఏర్పడింది. ఆ ఇమేజ్ ఆధారంగా ప్రజలు ముస్లింలను స్వీకరిస్తారా? లేదా ద్వేషిస్తారా? ఈ ప్రశ్నను ఆయన స్వయంగా విశ్వ హిందూ పరిషత్‌ను అడగాలి. హిందువులు అంత ఉదారంగా ఉంటే ముస్లింలకు ఇళ్లు ఎందుకు అద్దెకు ఇవ్వరు?'' అని ప్రశ్నించారు.
అఖ్తర్ అలీ కుటుంబం, ఇస్లాం నుంచి హిందుత్వంలోకి మారే ప్రక్రియంలో యువ హిందూ వాహిని బాగ్‌పత్ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర తోమర్ సహాయం చేశారు. ఈ కుటుంబం మళ్లీ ఎందుకు ఇస్లాంలోకి మారిందని అడగగా, ఆయన బదులిచ్చారు.
''వారి భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ ఇస్లాంలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ, మా ప్రచారం ముగిసిపోలేదు. ముస్లింలందరూ తిరిగి రావాలని (ఘర్ వాపసీ) మేం కోరుకుంటున్నాం'' అని అన్నారు.

హిందువుగా మారడం వల్ల వసీమ్ రిజ్వీకి ఏం దక్కింది?
ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ గతేడాది డిసెంబర్ 5న హిందూ మతంలోకి మారి జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి అయ్యారు. 51 ఏళ్ల జీవితంలో ఆయన 50 సంవత్సరాల రెండు నెలల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించారు. గత 10 నెలలుగా ఆయన హిందువుగా జీవిస్తున్నారు. ఈ పది నెలలు ఆయన ఎలా గడిపారు?
''సనాతన ధర్మంలోకి రావడం వల్ల వచ్చే సవాళ్ల గురించి నాకు ముందే ఒక అంచనా ఉంది. ఇక్కడ ప్రజలు స్వీకరించరు. కులం, సోదరభావానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక కులాన్ని ఎంచుకున్నప్పటికీ, ఆ కులస్థులు నిన్ను స్వీకరించరు. నేను, నా పేరులో 'త్యాగి'ని చేర్చుకున్నా. అంటే ఇప్పుడు త్యాగి సమాజం నా కుటుంబంతో 'రోటీ-బేటీ' సంబంధాన్ని ఆమోదిస్తుందని కాదు. నా గతం వారిని, నాకు దూరంగా ఉంచుతుంది. ఇవి సనాతన ధర్మానికి సంబంధించిన సమస్యలు. ఇక్కడి ప్రజలు, సొంతవారిగా స్వీకరించలేరు.
మీరు ఒకసారి ఇస్లాం స్వీకరించిన తర్వాత, వారికి మీ గతంతో ఎలాంటి పట్టింపు ఉండదు. వైవాహిక సంబంధాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. ఇస్లాంలో కుల పట్టింపులు ఇంతగా ఉండవు. నేను చనిపోయే వరకు ఈ సనాతన ధర్మంలోనే ఉంటాను. అయినప్పటికీ నన్ను స్వీకరించరనే సంగతి నాకు తెలుసు. అలాంటప్పుడు మనం ఎవరికి చెందినవారమనే సందేహం వస్తుంది. ఇస్లాంలో ఉన్నప్పుడు కూడా శాంతి లేదు. ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఒంటరితనాన్నే అనుభవిస్తున్నాను.
హిందు మతంలోకి వచ్చిన తర్వాత నా వివాహ బంధం ముక్కలైంది. నిజం చెప్పాలంటే నేనే నా జీవితాన్ని విషపూరితం చేసుకున్నా. సనాతనంలోని ముందుగా నేను వచ్చి తర్వాత నా కుటుంబాన్ని తీసుకురావాలి అనుకున్నా'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మతం ఎందుకు అంత కీలకం?
ఒక వ్యక్తి జీవితంలో కుటుంబాన్ని, వివాహాన్ని కూడా పణంగా పెట్టాల్సినంత కీలకమైనదా మతం? అని అడగగా త్యాగి సమాధానమిచ్చారు.
''మానవత్వాన్ని మించినది ఏదీ లేదు. కానీ, నేను మతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఒకవేళ 'ఘర్ వాపసీ' కార్యక్రమాన్ని సీరియస్‌గా అమలు చేయాలనుకుంటే మాత్రం, హిందూ సమాజం చేతులు చాచి అందరినీ స్వీకరించాల్సి ఉంటుంది. ఇలా చేయని పక్షంలో అది కేవలం రాజకీయ జిమ్మిక్కులా మారుతుంది'' అని అన్నారు.
త్యాగి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందు పరిషత్ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర జైన్ స్పందించారు.
''వసీమ్ రిజ్వీకి మీడియా ముందుకు రావడం, అదుపు లేకుండా మాట్లాడటం చాలా ఇష్టం. మేం విశ్వ హిందు పరిషత్‌కు చెందినవాళ్లమే. కానీ, ఎప్పుడూ మొహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరంగా మాట్లాడలేదు. మీరు రామ్, కౌసల్య గురించి మాట్లాడటం మానేయకపోతే నేను ప్రవక్త గురించి మాట్లాడటం మొదలు పెడతానని ఓవైసీని నేను హెచ్చరించాను. అది నిజమే. కానీ, అలా ఎప్పుడూ మాట్లాడలేదు. వసీమ్ రిజ్వీ కూడా ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. నియంత్రణ లేకుండా మాట్లాడితే ఎదరయ్యే పర్యావసానాలను ఆయనే భరించాల్సి ఉంటుంది. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే మాతో మాట్లాడి ఉండాల్సింది. అంతేకానీ, మీడియాతో ఇష్టమున్నట్లు మాట్లాడకూడదు. మేం యతి నరసింహానంద వంటి ఆల్ట్రా హిందువులకు మద్దతు ఇవ్వలేం'' అని సురేంద్ర జైన్ అన్నారు.
ఇస్లాంలోకి మారిన తర్వాత 'రోటీ-బేటీ' సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అక్కడ వివక్ష ఉండదనే విషయంతో తాను ఏకీభవించట్లేదని కోల్‌కతా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హిమాద్రి ఛటర్జీ అన్నారు.
''అష్రఫ్‌లు ఎవరైనా పస్మాంద ముస్లింలను వివాహం చేసుకుంటారా? అక్కడ కూడా దళితుల పరిస్థితిలో తేడా లేదు. ఎవరైనా మతమార్పిడి చేసుకుంటే, వారి సామాజిక గుర్తింపు కూడా వారితోనే వస్తుంది.’’

ఫొటో సోర్స్, Getty Images
అంబేడ్కర్ కూడా నిస్సహాయుడే
మతం మారిన తర్వాత వారి పూర్వీకుల కులాన్ని ఇవ్వడం గురించి సురేంద్ర జైన్ మాట్లాడుతున్నారు.
ఇది అంత సులభమా? ప్రొఫెసర్ హిమాద్రీ చటర్జీ దీని గురించి వివరించారు.
''మత మార్పిడి జరిగిన తర్వాత కులాన్ని కూడా ఆపాదిస్తే, ఆ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అప్పుడు హిందూ మత గ్రంథాలను సవరించాల్సి వస్తుంది. అంబేడ్కర్, హిందూ మతంపై ఎందుకు తిరగబడ్డారు? కులం అనే విష వలయం నుంచి తప్పించడానికి ఆయన అలా చేయాల్సి వచ్చింది. చాలా పరిశోధన చేసిన తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
నేను ప్రొఫెసర్ మతీన్ పాయింట్‌ని ప్రస్తావిస్తున్నాను. 'ఘర్ వాపసీ'లో భాగంగా వెనక్కి వచ్చిన వారికి మాస్టర్ బెడ్‌రూమ్‌లో చోటు ఇస్తారా? తమ పూర్వీకులు దళితులే అయినప్పుడు, మళ్లీ దళితుడిగా మారడం కోసం వారు ఎందుకు హిందు మతంలోకి వస్తారు? ఒకవేళ బ్రాహ్మణ కులాన్ని ఇస్తేనే హిందువుగా మారతానని షరతు పెడితే, వారిని జైన్ సాహెబ్‌లుగా చేస్తారా? 'ఘర్ వాపసీ'లో భాగంగా మళ్లీ గ్యారేజ్‌లో ఉండటం కోసం ఎవరైనా వస్తారా?'' అని ఆయన ప్రశ్నించారు.
దిలేర్ సింగ్, దిల్‌షాద్‌గా ఉన్నప్పుడు గ్రామాలు తిరుగుతూ వస్త్రాలు అమ్మేవారు. హిందువుగా మారిన నాలుగేళ్ల తర్వాత కూడా ఆయన అదే పని చేస్తున్నారు. మన్‌సు నుంచి ముంజుగా మారిన ఆయన భార్య కూడా ప్రతీరోజు తన పిల్లలు, భర్త కోసం ఇంట్లో పని చేయాల్సి ఉంటుంది. మార్పు కేవలం పేరులో మాత్రమే వచ్చింది. కానీ, పేరులో ఏముంది? 'ఘర్ వాపసీ' బదులుగా 'నామ్ వాపసీ' అని పేరు పెట్టి ఉండాల్సింది అని చటర్జీ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అందులో ఇల్లు లేదు కదా.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?
- హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?
- INDvsAUS హైదరాబాద్ T20 మ్యాచ్: టికెట్ల కోసం తొక్కిసలాట... ఏడుగురు ఆసుపత్రిలో చేరిక
- డోనాల్డ్ ట్రంప్, ఆయన పిల్లలపై చీటింగ్ కేసు: ఆస్తుల విలువ ‘వందల కోట్లు పెంచి’ తప్పుడు లెక్కలు చూపించారంటూ దావా
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














