పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా: భారత్‌లో 23 రాష్ట్రాలకు విస్తరించిన ఈ ముస్లిం సంస్థకు నిషేధిత సిమి తో ఉన్న బంధమేంటి?

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రామ మందిర ఉద్యమం భారతీయ సామాజిక-రాజకీయ రంగాల్లో పెను మార్పులకు కారణమైంది. ముస్లిం రాజకీయాలు దీనికి మినహాయింపు కాదు.

1980లలో మిలిటెంట్ హిందుత్వ వ్యాప్తి, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముస్లింల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ''భారతీయ పరిపాలన, రాజకీయాలపై ముస్లింల వైఖరిలో పెను మార్పు అప్పుడే మొదలైంది'' అని సామాజికవేత్త జావిద్ ఆలం అన్నారు.

దిల్లీ జామా మసీద్ ఇమామ్ అహ్మద్ బుఖారీ స్థాపించిన 'ఆడమ్ సేన' నుంచి బిహార్‌లో 'పస్మాంద ముస్లిం మహాజ్', ముంబయిలో 'ఇండియన్ మైనారిటీ సెక్యూరిటీ ఫెడరేషన్' లాంటి అనేక ఇస్లామిక్ సంస్థలు ఈ కాలంలో ఉనికిలోకి వచ్చాయి.

మూడు సంస్థల విలీనం

దక్షిణాదిలో కేరళలో 'నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్' (ఎన్‌డీఎఫ్), తమిళనాడులో 'మనిత నీతి పసరై', 'కర్ణాటకకు చెందిన ఫోరమ్ ఫర్ డిగ్నిటీ'లాంటి ఆర్గనైజేషన్ల స్థాపన కూడా ఈ కాలపు కథే.

వీటి స్థాపనకు ముస్లింలలో నెలకొన్న అభద్రతా భావమే ప్రధాన కారణమని చెబుతారు.

ఈ మూడు సంస్థలు 2004 నుండి సమన్వయం చేసుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నవంబర్ 22, 2006లో కేరళలోని కోళికోడ్‌లో జరిగి జరిగిన సమావేశంలో, ఈ మూడింటినీ విలీనం చేసి 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' (పీఎఫ్ఐ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికారికంగా పీఎఫ్ఐ ని 2007, ఫిబ్రవరి 17న స్థాపించారు.

ఎన్‌డీఎఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రొఫెసర్ పి.కోయా అభిప్రాయం ప్రకారం "బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా హిందుత్వ శక్తులు భారత గణతంత్ర రాజ్యాన్ని ఆక్రమించాయి. దానివల్ల కేరళ వంటి రాష్ట్రాలలోని ముస్లింలు అంటరానివారుగా మారారు"

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, VISHAL BHATNAGAR/NURPHOTO VIA GETTY IMAGES

ముస్లిం ఆర్గనైజేషన్

తిరువనంతపురంకు చెందిన సామాజిక కార్యకర్త జె.రఘు ఈ సంస్థ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాలను వివరిస్తూ ''ముస్లింలీగ్ లాంటి రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, ముస్లిం వర్గాల భద్రతకు అది భరోసా ఇవ్వలేకపోయింది. దీనివల్ల చాలామంది ముస్లింలు ఎన్‌డీఎఫ్ లాంటి సంస్థలవైపు మళ్లారు'' అన్నారు.

దేశ విభజన విషాదం వల్ల దక్షిణ భారత రాష్ట్రాలు ప్రత్యక్షంగా ప్రభావితం కాలేదు. ఈ కారణంగా ఇక్కడి ముస్లిం సమాజం ఉత్తర భారత ముస్లింల కంటే సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది.

కేరళ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఈ మూడు సంస్థలు విలీనమైన రెండు సంవత్సరాల తర్వాత, పశ్చిమ భారతదేశంలోని గోవా, రాజస్థాన్‌‌లతో పాటు, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తూర్పున పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుండి ఐదు సంస్థలు పీఎఫ్ఐలో విలీనమయ్యాయి.

'భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాడర్ ఆధారిత ప్రజా ఉద్యమం'గా తనను తాను అభివర్ణించుకుంటూ, తాము 23 రాష్ట్రాలలో విస్తరించి, 4 లక్షలమంది సభ్యత్వం కలిగి ఉన్నామని పీఎఫ్ఐ ప్రకటించుకుంది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో కూడా ఈ సంస్థ 23 రాష్ట్రాల్లో విస్తరించినట్లు వెల్లడించింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

నిషేధిత సంస్థ 'సిమి' తో అనుబంధం'

నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి)కి పీఎఫ్ఐ మరో రూపమని ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

'ఉగ్రవాద సంస్థగాగా ప్రకటించి, భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో 'సిమి' ఒకటి. 2001లో దీనిని ప్రభుత్వం నిషేధించింది.

ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'ఇండియన్ ముజాహిదీన్'తో సిమి కి సంబంధాలు ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ అప్పట్లో ఇండియన్ ముజాహిదీన్‌ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

పీఎఫ్ఐ, సిమి మధ్య సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. చాలామంది సిమి సభ్యులు పీఎఫ్ఐలో యాక్టివ్‌గా ఉంటుంటారు. అలాంటి వ్యక్తులలో ప్రొఫెసర్ కోయా ఒకరు.

అయితే, 1981లోనే సిమి తో సంబంధాలు తెగిపోయాయని, 1993లో తాను ఎన్‌డీఎఫ్‌ను స్థాపించానని ప్రొఫెసర్ కోయా అన్నారు. పీఎఫ్ఐ నిర్మాణంలో పాల్గొన్న సంస్థల్లో ఒకటి ఎన్‌డీఎఫ్

ప్రభుత్వం సిమి ని నిషేధించినందున దాని స్థానంలో 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' స్థాపించారని, అందుకే చాలామంది సిమి కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉంటారని చాలామంది నమ్ముతారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పీఎఫ్ఐకి వ్యతిరేకంగా ఆందోళనలు

పీఎఫ్ఐ ఎజెండా ఏంటి?

వివక్ష లేని సమాజాన్ని స్థాపించడం తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతుంటుంది. అందరికీ స్వేచ్ఛ, న్యాయం, భద్రత ఇవ్వవచ్చని, ఇందుకోసం ప్రస్తుత సామాజిక, ఆర్థిక విధానాలలో మార్పులు తీసుకురావాలని ఆ సంస్థ చెబుతుంటుంది. తద్వారా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు హక్కులను అనుభవించవచ్చు.

దేశ సమగ్రత, సమాజ సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యం తమ మొదటి లక్ష్యాలుగా ఆ సంస్థ చెప్పుకుంటుంది. అదే సమయంలో, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయ వ్యవస్థలను కొనసాగించాలని కూడా ఆ సంస్థ చెబుతుంటుంది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL

ఫొటో క్యాప్షన్, వామపక్షాలు, ఆరెస్సెస్ లాగా ఈ సంస్థ వ్యవస్థీకృతమై ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు

ప్రభుత్వ ఆరోపణలు

దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో (UAPA), వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, విదేశీ నిధులతో దేశ సమగ్రతను దెబ్బతీయడం, అశాంతి కలిగించడం వంటి ఆరోపణలు ఆ సంస్థపై ఉన్నాయి.

2021 సంవత్సరంలో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో దళిత మహిళ అత్యాచారం-హత్య కేసులో జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌ సహా 8 మంది వ్యక్తులను పీఎఫ్ఐ సభ్యులుగా పేర్కొన్నారు, 5వేల పేజీల చార్జిషీట్‌లో పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (UAPA), దేశద్రోహ సెక్షన్‌లతోపాటు విదేశీ నిధుల సేకరణ ఆరోపణలు కూడా చేసింది.

జర్నలిస్టు అయిన తాను, దళిత మహిళపై అత్యాచారం హత్య కేసును కవర్ చేయడానికి వెళుతున్నానని, తనకు పీఎఫ్ఐతో ఎలాంటి సంబంధం లేదని సిద్ధిక్ కప్పన్ అన్నారు.

పట్నాలో ఇటీవల జరిగిన ఫుల్వారీ షరీఫ్ కేసు వంటి ఇతర సంఘటనలలో తాను నిర్దోషినని పీఎఫ్ఐ పేర్కొంది.

దళితులు-ముస్లింల మధ్య సంస్థాగత అనుబంధం ఏర్పడే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించడం లేదని సామాజికవేత్త జె.రఘు అభిప్రాయపడ్డారు. దళితులలో ఎక్కువమందిని హిందుత్వ సంస్థలు తమవైపు లాక్కుంటున్నాయని ఆయన అన్నారు.

''ఈ సంస్థ తన అనుచరులలో చట్టపరమైన, హక్కులపరమైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది'' అని అమెరికాకు చెందిన సామాజిక శాస్త్రవేత్త ఆర్ట్ వాల్టర్ ఎమెరిక్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

ఎమెరిక్ తాను రాసిన వ్యాసంలో ''ముస్లిం సంస్థలను ప్రజాస్వామ్యానికి, బహువచనానికి, లౌకికవాదానికి విరుద్ధమైన సంస్థలుగా పరిగణిస్తుంటారు. అల్‌ఖైదాలాంటి సంస్థలకు మద్ధతు ఇవ్వడం వల్ల ఈ భావన మరింత బలపడింది'' అని అభిప్రాయపడ్డారు. అయితే, ముస్లింల వైఖరిలో మార్పు వచ్చినట్లు ఇటీవలి పరిశోధనల్లో తేలిందని ఎమెరిక్ అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌గా 'ఇస్లామిక్ మూవ్‌మెంట్స్ ఇన్ ఇండియా, మోడరేషన్ అండ్ డిస్‌కంటెంట్' పేరుతో భారతీయ ముస్లిం రాజకీయాలపై పుస్తకాన్ని రాసిన వాల్టర్ ఎమెరిక్, ముస్లిం ఆర్గనైజేషన్లపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముస్లిం రాజకీయాలకు ఇప్పటి వరకు ఉత్తర భారతదేశం కేంద్రంగా ఉండేదని, కానీ అది ఇప్పుడు దక్షిణంవైపు కదులుతోందని ఆయన అన్నారు.

''పీఎఫ్ఐ సంస్థ క్యాడర్ ఆధారిత సంస్థగా మారింది. అది వామపక్షాలు, ఆరెస్సెస్ లాగా వ్యవస్థీకృతమై ఉంది. ఇది అసదుద్దీన్ ఒవైసీ లాంటి ఒక వ్యక్తి లేదా ప్రజాకర్షక నాయకత్వంపై ఆధారపడి లేదు'' అన్నారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, SHAHEEN ABDULLA

దేశవ్యాప్త విస్తరణ

ఒక ప్రాంతంలో లేదా కొన్ని రాష్ట్రాల్లోనే ప్రభావం చూపే పాత ముస్లిం సంస్థలకు భిన్నంగా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పీఎఫ్ఐ వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.

పీఎఫ్‌ఐ వంటి సంస్థల్లో సామాన్య ముస్లింలు లేదా మధ్యతరగతి ప్రజలు అగ్రనాయకత్వంలో ఉండడం ప్రత్యేక లక్షణం. వీరిలో చాలామంది కార్మిక ఉద్యమాల నుంచి వచ్చారు. కానీ, గతంలో ఇలాంటి సంస్థలను ముస్లింలలో ఉన్నత వర్గాలకు చెందిన నాయకులు నడిపేవారు.

పీఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రొఫెసర్ కోయా, తాను కాలేజీ రోజుల్లో నాస్తికుడిగా ఉండేవాడని అన్నారు.

అమెరికా నుంచి వెలువడే వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో ఆయనను 'ఉగ్రవాద ప్రొఫెసర్' అని పేర్కొంది. కానీ అమెరికా రక్షణ విధానం, విదేశాంగ విధానం వల్ల ఇరాక్, అఫ్గానిస్తాన్, వియత్నాం వంటి అనేక దేశాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సంక్షోభం తలెత్తిందని కోయా అంటున్నారు.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

''పీఎఫ్ఐ వంటి సంస్థల రాజకీయాలు సమాజానికి హాని కలిగిస్తాయని ఒక ఇమామ్ అనడం నేను విన్నాను'' అని కేరళకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అష్రఫ్ పదన్న అన్నారు.

కేరళలో ముస్లింల బలమైన రాజకీయ సంస్థ ఇండియన్ ముస్లిం లీగ్ దశాబ్దాలుగా ఉనికిలో ఉందని, కేరళ రాజకీయాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అది వామపక్షాలతో, కాంగ్రెస్‌తో పొత్తులను మార్చుకునే ధోరణి గమనించవచ్చని సీనియర్ జర్నలిస్టు కేఏ షాజీ అన్నారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, FACEBOOK@POPULARFRONTOFINDIAOFFICIAL

హిజాబ్ సమస్య

పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోస్టల్ మంగళూరు, దక్షిణ కర్ణాటకలో పీఎఫ్ఐ రాజకీయ విభాగంగా పరిగణించే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) స్థానిక సంస్థల ఎన్నికలలో గణనీయమైన సంఖ్యలో స్థానాలను గెలుచుకుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్‌డీపీఐ కొన్ని స్థానాల్లో గట్టి పోటీనిచ్చింది.

ఇటీవలి కాలంలో కోస్తా కర్ణాటకలో హిజాబ్ సమస్యలాంటివి ఎస్‌డీపీఐ సంస్థలకు లాభం చేకూరుస్తాయని కొందరు భావిస్తున్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా బీజేపీ, పీఎఫ్‌ఐలు పరస్పరం లబ్ధి పొందుతూనే ఉంటాయని జర్నలిస్ట్ అష్రఫ్‌ పదన్న చెప్పారు.

‘‘కానీ, అదే జరిగి ఉంటే మాకు ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చేవి' అని పీఎఫ్ఐకి చెందిన అహ్మద్ కుట్టి మగర్ ప్రశ్నించారు.

''భావజాలం ప్రకారం మిగతా సంస్థలకు భిన్నమైనదిగా పీఎఫ్ఐకి గుర్తింపు లభించవచ్చు. కానీ, ప్రస్తుతానికి దీనిని కూడా ప్రధాన స్రవంతి ముస్లిం ఆర్గనైజేషన్ అని చెప్పడం తప్పు'' అని చరిత్రకారుడు షామ్స్-ఉల్-ఇస్లామ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)