ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘‘నా పేరు డాక్టర్ రమేష్. ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్‌లో వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. 2003లో ఇంగ్లాండ్ వచ్చాను. అప్పుడు చాలా సమస్య అయ్యింది. మెడిసిన్ సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం జరిగింది. నా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ మీద ఏపీ హెల్త్ యూనివర్సిటీ అని ఉంది. పీజీ సర్టిఫికెట్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటుంది. రెండు యూనివర్సిటీలు ఉన్నాయా అని అడిగారు. ఒకే యూనివర్సిటీ.. పేరు మారిందని చెప్పాను. దానికి యూనివర్సిటీ నుంచి లెటర్ కావాలని అడిగారు. అది తీసుకొచ్చి, సమర్పించేసరికి ఆరు నెలలు పట్టింది. అంతకుమించిన శ్రమ, ఒత్తిడి తప్పలేదు."
ఇదీ ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్లినప్పుడు ఒకరు ఎదుర్కొన్న ఇబ్బంది. ఇది కేవలం రమేష్ ఒక్కరికే కాదు..ఇలాంటి అనుభవాలు చాలామందికే ఉన్నాయి. వివిధ దేశాలకు వెళ్లిన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వీటికి ప్రధాన కారణం విద్యాసంస్థల పేర్ల విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలేనన్నది అలాంటి వారి వాదన. తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మరోసారి మారుస్తున్నారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ పేరు మూడుసార్లు మారింది. ఇప్పుడు నాలుగోసారి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీ పేర్లు ఎలా మారాయి..
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో వైద్య విద్యలో అన్ని రంగాలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 1986లో నిర్ణయం తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నేతృత్వంలో ఈ యూనివర్సిటీ స్థాపనకు చర్యలు చేపట్టారు. నాటి సీఎం తొలి వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించారు.
ఏపీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యాక్ట్, 1986 అనే పేరుతో నాడు అసెంబ్లీ ఆమోదంతో యూనివర్సిటీ తెరమీదకు వచ్చింది. అప్పట్లో 27 అనుబంధ కళాశాలలతో ప్రారంభమయ్యింది. మెడికల్, డెంటల్, ఆయుష్, పారామెడికల్ విద్యలో ప్రమాణాలు పెంచేందుకంటూ ఈ యూనివర్సిటీని ఆరంభించారు.
ఆ తర్వాత 1996లో ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన స్థాపించిన యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. "ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్AP చట్టం, 1986"గా సవరణ చేస్తూ 1998న మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి అనుగుణంగా జీవో ఎంస్ నెం. 24 తో 1998 ఫిబ్రవరి 2 నుంచి యూనివర్సిటీ పేరుని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పరిగణించడం మొదలయ్యింది.
ఆ 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మరోసారి యూనివర్సిటీ పేరు మారింది. ఈసారి 2006 జనవరి 16నాడు విడుదల చేసిన ఏపీ గెజిట్ ద్వారా డాక్టర్ అనే పేరు జోడించారు. దాంతో అప్పటి నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మనుగడలో ఉంది.

వైఎస్సార్ పేరు ఎప్పటి నుంచి..
ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల సంఖ్య 282కి పెరిగింది. డెంటల్, యూనానీ, హోమియోపతి, నేచురోపతి, ఫిజియోథెరపీ వంటి విభాగాల కోర్సులను కూడా యూనివర్సిటీ పర్యవేక్షిస్తోంది.
గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ, పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్, డాక్టరేట్ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నాడు ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం దక్కింది. ఉభయ సభల ఆమోదం లభించడంతో గవర్నర్ ఆమోదం ద్వారా అది చట్టంగా మారుతుంది. గెజిట్ విడుదల కాగానే యూనివర్సిటీ పేరు మార్చే అవకాశం ఉంది.
అయితే యూనివర్సిటీ పేరు మార్చేందుకు యూజీసీ అనుమతి ఉండాలని, దానికి కాలయపన పడుతుందని కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై యూనివర్సిటీ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది.
"డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న క్యాంపస్ పేరు మార్చాలంటే ఏపీ ప్రభుత్వం చట్టం చేస్తే సరిపోతుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లో కొంత ప్రక్రియ జరగాల్సి ఉంది. అది పెద్ద సమస్య కాదు. దానికి సమయం కూడా పట్టదు. ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ రాజముద్ర వేసిన తర్వాత గెజిట్ విడుదల కాగానే అధికారిక వ్యవహారాలన్నీ డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పరిగణించడానికి వీలవుతుది. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి వివిధ విభాగాల్లో జరగాల్సిన ప్రక్రియకు కాలయాపన తప్పదనే ప్రచారం వాస్తవం కాదు" అని యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రంగారావు తెలిపారు.
హెల్త్ యూనివర్సిటీకి యూజీసీ సంబంధం లేదని డాక్టర్ రంగారావు అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది కాబట్టి పేరు మార్పునకు ఏపీ ప్రభుత్వ నిర్ణయమే కీలకం అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
అభ్యంతరాలు ఎందుకు?
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో పేరు మార్పునకు కారణాలపై కొంత వివరణ ఇచ్చింది. బిల్లుని ప్రవేశపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో పాటుగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు చేర్చడం వెనుక కారణాలపై వివరణ ఇచ్చారు.
ప్రభుత్వ తీరుని అసెంబ్లీతో పాటుగా మండలిలో కూడా విపక్షాలు తప్పుబట్టాయి. అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు, మార్షల్స్ కి మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
మండలిలో అయితే టీడీపీకి తోడుగా పీడీఎఫ్, బీజేపీ వంటి పక్షాలు కూడా తోడయ్యాయి. తీవ్ర నిరసనల మధ్యనే ప్రతిపాదిత బిల్లు పాస్ అయినట్టు చైర్మన్ ప్రకటించారు.
"రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీలు అవి ఉన్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యా సంస్ధల క్యాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. అనేక మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది" అంటూ సీనియర్ జర్నలిస్టు నవీన్ పెద్దాడ వివరించారు.
అనేక రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ని వైఎస్సార్ కూడా గుర్తించారని, కానీ జగన్ మాత్రం చరిత్ర చెరిపేసే యత్నం చేయడం తగునా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే వేలమంది సర్టిఫికెట్లు తీసుకుని డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఉన్నారని, ఇప్పుడు యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సమయంలో తమ సర్టిఫికెట్లో ఉన్న యూనివర్సిటీ పేరు జాబితాలో లేకపోతే వారు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అసంమజసంగా ఉందని నవీన్ అభిప్రాపడ్డారు.

మళ్లీ మారుస్తామంటూ ప్రకటనలు..
రాష్ట్రంలో యూనివర్సిటీల పేరు గతంలోనూ మారిన అనుభవాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ యూనివర్సిటీని వైఎస్సార్ హయంలో 2007లో స్థాపించారు. ఆయన మరణం తర్వాత ఆ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీగా మారుస్తూ 2009లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి అది అమలులోకి వచ్చింది.
వ్యవసాయ యూనివర్సిటీకీ అనుబంధంగా బాపట్ల వ్యవసాయ కళాశాలకు ఎన్టీఆర్ పేరు జోడిస్తూ 2018లో నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలుచేసింది.
అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ ఈసారి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మాత్రం వివాదాస్పదం అవుతోంది. పైగా తాము అధికారంలోకి రాగానే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
"ఇలాంటి ప్రయత్నాలు సమంజసం కాదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకునే సంస్కృతిని ప్రజలు హర్షించరు. వైఎస్సార్ పేరు కోసమే అయితే కొత్తగా యూనివర్సిటీ ప్రారంభించి ఆయన పేరు పెట్టినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఒకరి పేరు మరొకరు చెరిపేసుకుంటే చరిత్ర కూడా మిగలదు. వైఎస్సార్ మీద ప్రేమ ఉంటే ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని కోరుకోవాలి. కానీ తాను అధికారంలో ఉన్నంత కాలం ఉంటే చాలనుకునేలా సాగకూడదు. 1997లో గుంటూరు జీజీహెచ్ కి చుండి రంగనాయకులు అనే వారి పేరు పెడితే తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. చివరకు దానిని నాటి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నేటికీ గుంటూరు జీజీహెచ్ గా ఉంది" అని సీనియర్ డాక్టర్ అల వెంకటేశ్వర్లు తెలిపారు.
‘‘ఆ యూనివర్సిటీ నాలాంటి వారికి మాతృసంస్థ, ఎన్టీఆర్ అభిమానిని కాకపోయినా మా సంస్థ పేరు మార్చడం జీర్ణం చేసుకోలేకపోతున్నాను’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
మమ్మల్ని పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది...
ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చడానికి రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో ముడిపడి ఉన్నందున తమ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని ఐఎంఏ ఏపీ విభాగం అధ్యక్షుడు శ్రీనివాసరాజు అన్నారు.
"ప్రభుత్వ నిర్ణయం చాలా సమస్యలకు కారణమవుతుంది. వాటిని గమనంలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. పేరు మార్పు కోసం చట్టం చేసేముందు ఐఎంఏ లాంటి సంస్థల అబిప్రాయాలను తీసుకుని ఉండాల్సింది. ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల నిజంగా సమస్యలను ఎదుర్కోవాల్సిన వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకోలేదని భావించాల్సి వస్తోంది" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.
ఇప్పటికే యూనివర్సిటీ కి హార్వర్డ్ వంటి విదేశీ యూనివర్సిటీలు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ వంటి దేశీయ సంస్థలతోనూ ఒప్పందాలున్న తరుణంలో ఐఎంఏ వంటి సంస్థల భాగస్వామ్యం లేకుండా నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి:
- INDvsAUS హైదరాబాద్ T20 మ్యాచ్: టికెట్ల కోసం తొక్కిసలాట... ఏడుగురు ఆసుపత్రిలో చేరిక
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













